Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4

   
    "నువ్వు నెలరోజుల్లో వచ్చి నన్ను తీసుకెళతానని చెప్పి, నన్ను ఓదార్చి వెళ్ళావు. నీ మాటలు నిజమేనని నమ్మాను. ఆ నెలరోజులు నాకు కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ప్రతి నిముషం ఒక యుగంగా గడిపాను. రెండు నెలలు దాటింది. కాని నువ్వు రాలేదు. నాకు నెల తప్పినట్లు తెలుసుకున్నాను. ప్రకృతికి కూడా ఆడదే అలుసు. ఆడదాన్ని ప్రపంచం క్షమించనట్లే తప్పుచేస్తే ప్రకృతి కూడా క్షమించదేమో! నాకు ప్రకృతి వేసిన శిక్ష - దానికి ఎదురు లేదు. మూడో నెలకూడా వచ్చింది. అప్పటికే పనివాళ్ళలో గుసగుసలు ప్రారంభమయాయి. నీవు వస్తావనే నమ్మకం నశించింది. ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమించడు. అమ్మనూ, నన్నూ చంపి, తను చచ్చిపోతాడు. ఆయన ఎంత మంచివారో నీకు తెలుసు. కాని, ఇలాంటి విషయాలను ఆయన క్షమించడం ఎరగను. పైగా, నా పాపిష్టి ముఖాన్ని ఆయనకు చూపించలేక ఒక అర్ధరాత్రి ఇల్లు వదిలి వచ్చేశాను. హైదరాబాదులో నాలాంటివారికి ఆశ్రయం ఇచ్చే సదనాలు ఉన్నాయని నాకు తెలుసు. సరాసరి అక్కడికే వెళ్ళాను. అక్కడ నాకు అనుకున్నట్లే ఆశ్రయం లభించింది. అక్కడే గిరిజ జన్మించింది. ఆ సదనంలో అనేక రకాలవాళ్ళు వుంటారు. ఆ సంవత్సరం అక్కడ ఎలా గడిపానో నాకే తెలియదు. నా బిడ్డను నానుంచి వేరుచేసి మరొక బాలసదన్ కు పంపించాలని ఆర్డరు అయింది. అది నాకు ఇష్టంలేక బిడ్డతో బయటకు వచ్చాను. ఏం చెయ్యాలో, ఎక్కడకు వెళ్ళాలో తెలియలేదు. అంధకారంలో ఆశాకిరణంలా నువ్వే కనిపించావు. గుంటూరువచ్చి అన్ని కాలేజీలూ తిరిగి చివరకు నీ అడ్రసు సంపాదించాను. అలాంటిరోజు ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడదు. ఎంతో ఆశతో, బాధతో, మరోవైపు దెబ్బతిన్న అభిమానంతో నీ ఇంటిగేటు ముందు నిల్చున్నాను. అదురుతున్న గుండెలకు నిద్రపోతున్న బిడ్డను అదుముకుని నిల్చున్నాను. రకరకాల పూలమొక్కలపైగా వరండాలో కూర్చొని పేపరు చదువుతున్న నీవు కనిపించావు. గుండె లయతప్పి కొట్టుకోసాగింది. అడుగు ముందుకు పడలేదు. నీకు ఎదురుగా వున్న కుర్చీలో ఓ నాలుగైదేళ్ళ బిడ్డ కూర్చొని బిస్కట్లు తింటున్నది. మంచి దుస్తుల్లో చక్కగా అలంకరించబడి వున్న ఆ బిడ్డ దూరానికి రబ్బరు బొమ్మలా అందంగా కనిపించింది. ఆ బిడ్డ నీ బిడ్డేమోనని అనుమానం రాగానే నాలోని చైతన్యం క్రమంగా గడ్డకడుతున్నట్లనిపించింది. అలాగే ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు. ఇంతలో నీ దగ్గర వున్నపిల్ల గొల్లున ఏడ్వటంతో ఈ లోకంలోకి వచ్చాను. కిందపడిన బిడ్డను నువ్వు ఎత్తుకున్నావు. ఇంతలో ఓ పాతిక సంవత్సరాల అందమైన యువతి గాబరాగా లోపలినుంచి వచ్చి నీ చంకలోని బిడ్డను లాక్కుంది. నిన్ను ఏదో మందలిస్తున్నట్లు అనిపించింది నాకు. ఆమె వెనకే నీవు చిరునవ్వుతో లోపలకు వెళ్ళావు. ఆ స్త్రీ ఎవరో నాకు అర్థమైపోయింది. నా చేతిలోని బిడ్డవైపు చూసుకున్నాను. తన తల్లి పడుతున్న నరకయాతనను అర్థం చేసుకోలేని ఆ పసిప్రాణం హాయిగా నిద్రపోతోంది. హోమ్ వాళ్ళు ఇచ్చిన గౌనులోవున్న నా బిడ్డను నీ బిడ్డతో పోల్చుకున్నాను. మరుక్షణంలో గిర్రున వెనక్కు తిరిగాను. తెనాలి స్టేషన్ కు వెళ్ళాను. నాలో ఆలోచించే శక్తి లేదు. యంత్రంలా స్టేషన్ కు వెళ్ళి కూర్చున్నాను. నాలాంటి అనాధలకు కన్నతల్లిలా కడుపులో పెట్టుకొని ఆశ్రయం ఇచ్చే ఆ సదనానికే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. పిల్లను అనాధాశ్రమానికి పంపించడానికి నిశ్చయించుకున్నాను. గుండె రాయి చేసుకొన్నాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏది వచ్చినా అనుభవించటానికి నిశ్చయించుకొన్నాను. నామీద నాకే ఏదో పగ సాధించుకోవాలనే కోరిక కలిగింది. హైదరాబాదు బండికోసం ఎదురుచూస్తూ తెనాలి స్టేషన్ లో కూర్చున్నాను..." అనూరాధ వాక్ప్రవాహం ఒక్కసారిగా ఆగింది.

 

    ప్రసాదు ఊపిరి బిగపట్టి వింటున్నాడు.

 

    అనూరాధ ఓసారి నిట్టూర్చి మళ్ళీ ప్రారంభించింది -

 

    "తెనాలి స్టేషన్ లో నిద్రపోతున్న బిడ్డను బెంచీమీద పడుకోబెట్టాను. ఆకలితో కళ్ళు తిరిగినట్లయింది. పక్కనే కూర్చొనివున్న ఓ నడివయస్సు ఆడమనిషితో కొంచెం బిడ్డపడకుండా చూస్తుండమని చెప్పి టీ స్టాలు వైపుకు వెళ్ళాను. టీ స్టాలు చుట్టూ జనం ఒక కప్పు టీ కోసం నిల్చున్నాను. మధ్య మధ్య వెనక్కు తిరిగి బిడ్డవైపు చూస్తూనే వున్నాను. టీ స్టాలు ముందు కొంచెం జనం పల్చబడ్డారు. నేను ముందుకు వెళ్ళి టీ కప్పు అందుకొని కొంచెం పక్కగావచ్చి నిలబడి టీ పెదవుల దగ్గిర పెట్టుకోబోతూ అప్పుడే స్టేషన్ నుంచి బయలుదేరుతున్న ఏదో బండికేసి చూశాను చేతిలో కప్పు కింద పడిపోయింది. ఆ నడికారు ఆడది బయలుదేరుతున్న బండిలో ఒక పెట్టె గేటులో నిల్చునివుంది. ఓ కుర్రాడు నా బిడ్డను దానికి అందించి వాడూ కదులుతున్న రైలు ఎక్కిపోయాడు. క్షణంలో అంతా అయిపోయింది. ఎవరో నెత్తిన బలంగా కొట్టినట్లు కళ్ళు బయర్లుకమ్మాయి. కెవ్వున కేకపెట్టి పడిపోయాను. తెలివివచ్చేటప్పటికి ఏదో మిషనరీ ఆసుపత్రిలో వున్నాను. చెప్పానుగదూ - అప్పటికే నాలో ఏదో కక్షలాంటి భావం బయలుదేరిందని. ఆ కక్ష ఎవరిమీదో తెలియదు కాని, నామీద నాకే కక్షగా వుండేది. ఏడవలేదు. ఒకరికి చెప్పుకోలేదు. నాకు అలాగే కావాలి నాకు తగిన శిక్షే లభించింది అనిపించింది.

 

    "కొంచెం తేరుకోగానే నాకు మొదట ఆశ్రయం కలిగించిన హోమ్ కే వెళ్ళాను. పరిస్థితుల ప్రాబల్యంవల్ల ఒకసారి కాలుజారివాళ్ళు పూర్తిగా బజారుపాలు కాకుండా ఇలాంటి ఆశ్రమాలు కాపాడుతున్నాయనే ఒకవిధంగా చెప్పవచ్చును. శ్రద్ధ తీసుకొని ఇలాంటి హోముల్ని విరివిగా స్థాపిస్తే పరిస్థితుల ప్రాబల్యంవల్ల పతితలయ్యేవారి సంఖ్య తగ్గవచ్చును-" చెబుతూ చెబుతూ ఒకక్షణం ఆగిపోయింది అనూరాధ. మళ్ళీ గట్టిగా నిట్టూర్చి మొదలుపెట్టింది:

 

    "నేను ఇంటరు పాసయానని తెలిసి నాకు ఆ హోమ్ లోనే గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. అక్కడే ఒక గదిలో వుంటూ నాకు తోచినరీతిని ఆ అమాయకులకూ, అనాధలకూ తోడ్పడుతూ కాలక్షేపం చెయ్యసాగాను. అది మరో చిన్న ప్రపంచం. మనిషికో గాథ. ఆ గాథల వెనక బాధ. ఇలా పదిహేను సంవత్సరాలు గడిచాయి. పూర్తిగా గత జీవితాన్ని మరిచిపోయాననే అనుకున్నాను-" ఆగి ప్రసాదు ముఖంలోకి చూసింది. ప్రసాదరావు ఆదుర్దాగా 'ఆ తరవాత?' అన్నట్లు చూశాడు.   

 

    "ఆ హోమ్ లోనే ఓ ముసల్ది ఆయాగా కొంతకాలంగా పని చేస్తున్నది ఓ రోజు ఆకస్మాత్తుగా దానికి వళ్ళు పేలిపోయే జ్వరం వచ్చింది. నేను తీసికెళ్ళి ఆసుపత్రిలో చేర్చాను. మూడోరోజు ఆసుపత్రి నుంచి ఆయా బతకదనీ, తీసుకెళ్ళమనీ ఫోన్ వచ్చింది. నేనూ, మేట్రన్ వెళ్ళాం. నేను వెళ్ళి పిలిస్తే అతికష్టంమీద కళ్ళు తెరిచింది నన్ను పక్కనే     కూర్చోమని సైగచేసింది. చనిపోయే ముందు మనస్సులో వున్నది చెప్పటానికి ప్రాణి కొట్టుకొంటుందని విన్నాను. నేను వెంటనే ఆమె తలదగ్గర కూర్చుని దగ్గరగా వంగాను.

 

    "నేను చాలా పాపాలు చేశాను. ఎందరి పిల్లల్నో తల్లుల్నుంచి వేరుచేశాను." అతి కష్టంమీద అన్నది. కళ్ళు మూతలు పడ్డాయి. నాకు గుండెలు పిండినట్లయింది. ఆ పాపిష్టిదాని ముఖంనుంచి కళ్ళు మళ్ళించాను. అక్కడనుంచి లేవబోయాను.

 

    "తెనాలి...." ఆయాసం వచ్చింది. లేవబోయిన నేను ఆదుర్దాగా మళ్ళీ ఆమె దగ్గరగా కూర్చోని ముఖంలోకి చూశాను.

 

    అతికష్టంమీద కళ్ళను తెరుస్తూ, "ఓ పిల్లను తల్లినుంచి వేరుచేశాను, తెనాలి స్టేషన్ లో. ఆ పిల్లను కొంతకాలం పెంచాను-" నాకు తెలియకుండానే నాలోని మాతృత్వం ఒక్కసారి పొంగింది. ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడవుంది? అని అడిగాననుకున్నాను. కాని నా గొంతు పెగిలి ఆ మాటలు బయటకు వచ్చాయో లేదో నేను చెప్పలేను.

 

    "ఆ పిల్ల..... గుంటూరు... అనాధాశ్రమంలో వుంది. నువ్వు తెచ్చి పెంచుకుంటానని మాట ఇవ్వు. నా ప్రాణం పోతుంది" అంటూ కళ్ళుమూసింది.

 

    ఓ క్షణం నేను స్తంభించిపోయాను. తేరుకొని "ఆ పిల్ల పేరు ఏమిటి? ఏ అనాధాశ్రమం?" అన్నాను ఆదుర్దాగా - ఆ ముసలిదాన్ని వూపుతూ. చేతులకు మానవ శరీరానికి బదులుగా ఏదో గట్టిగా తగిలింది.  

 

    "ప్రాణం పోయింది" అంటూ నర్సు శవంమీద గుడ్డ కప్పింది.

 

    "నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, నేను ఆమాత్రం జీవించటం కూడా భగవంతునికి ఇష్టం లేకపోయింది. ప్రతి క్షణం నా బిడ్డను చూడాలనే అశాంతి నన్ను పిచ్చిదాన్ని చేసేసింది. ఈ విషయమంతా మా సూపర్నెంటుతో చెప్పాను. ఆమె గుంటూరు శరణాలయాలన్నింటికీ రాసింది. నాంచారమ్మ అనే ఆవిడ ఎవరూ ఏ పిల్లనూ చేర్పించిన రికార్డులు లేవని జవాబులు వచ్చాయి. బహుశా ఆ ముసల్దాని అసలు పేరు నాంచారమ్మ కాకపోవచ్చును. పాపిష్టిదాన్ని పిల్ల పేరన్నా తెలుసుకోలేకపోయాను.   

 

    నా బిడ్డ నాకు దొరకదు అనే భావాన్ని భరించలేకపోయాను. ఏనాటికైనా నా బిడ్డను చూడగలననే ఆశను పిచ్చిదానిలా పెంచుకున్నాను. ఏదో ఉద్యోగం సంపాదించుకొని గుంటూరు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను. అది తెలిసిన మా సూపర్నెంటు తెలిసిన వాళ్ళద్వారా నాకీ ఉద్యోగాన్ని ఇప్పించింది."  

 

    "ఆ తరవాత గిరిజ ఎక్కడుందో తెలుసుకోలేదా?" ఇంతసేపూ వూపిరి బిగబట్టి వింటున్న ప్రసాదరావు ప్రశ్నించాడు ఆదుర్దాగా.

 

    అనూరాధ నిట్టూర్చింది.

 

    "అన్ని శరణాలయాల్లోనూ వెదికాను. కాని, నా బిడ్డను ఎలా గుర్తించటం? నాకు తెలుసు - వాళ్ళలో నా బిడ్డ వుందని. కాని, కన్నబిడ్డ ఎదురుగా నిల్చొనివున్నా తెలుసుకోలేని అసహాయురాల్ని. గిరిజ పేరుతో ఎవరూ లేరు, కాని, ఏనాటికైనా నా బిడ్డని నేను కలుసుకోగలను అనే ఆశ ఏ మూలో గూడు కట్టుకొని వుంది నా హృదయంలో. ఆ ఆశతోనే జీవిస్తున్నాను."                     

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra