Previous Page
జాలిలేని జాబిలి పేజి 35


    లోతుగా ఆలోచిస్తే మామూలు విషయంలో కూడా గొప్పసత్యాన్ని గ్రహించగలడు మేధావి. స్నేహితుడి పెళ్లికి పోవటంలో, ప్రేమ సాఫల్యంలో ఐదు రూపాయలనోటు జేబులో వుండగా హఠాత్తుగా ఎవడో  స్నేహితుడు  ప్రక్కన  చేరటంలో రిక్షావాడితో బేరం చెయ్యటంలో, తండ్రిమాట వినటంలో, డబ్బు విలువ గ్రహించలేకపోవటంలో, ఒకడిని ఒకడు సహాయం కోరటంలో, పేరు రావటంలో, పేరు పోవటంలో, భార్యతో కాపురం చెయ్యటంలో, తమ్ముడికి జబ్బు చేయటంలో, వదినగారు ముభావంగా వుండటంలో.....వ్యక్తిగత పరిస్థితుల్నిబట్టి తీసుకుంటే ఎంత పరిథి! ఎన్ని విధాలు!! ఎన్ని విపరీతాలు!!!

    ఈ ఆసక్తిలో, ఆకర్షణలో మానసిక సంఘర్షణలో, మనశ్శాంతి లేని స్థితిలో అతని రచనలకు ఒకప్రక్క  ప్రజలు జోతలు అర్పిస్తోంటే "అనుభవంలేదు, ఒట్టి ఉత్సాహం" అని ఎక్కడో ఓ వెకిలి  కంఠం అసహ్యంగా, కీచుగా వినిపిస్తోంది.

    "అనుభవానికి నిర్వచనం ఏమిటి?"

    తిండిలేక మాడటమే, ఉద్యోగాలకోసం వెదుక్కుంటూ కుళ్ళి కృశించటమే! ఆడవాళ్లకు వలలు పన్నుతూ బ్రతకడమే! స్పర్థలతో వైషమ్యాలతో జీవించడమే అనుభవమే?

    ప్రతి అల్పవిషయానికి ప్రాముఖ్యము ఇచ్చి సాహిత్య సృష్టి చేస్తున్నా పాశ్చాత్య సాహిత్యవేత్తలని చూసి అభినందించే మానవుడు అదేపని తెలుగువాడు చేస్తే  యెందుకు ఓర్చలేకపోతున్నాడు? "మనవాళ్ళలో కొత్తదనము లేదు, అభ్యుదయం లేదు" అని ఘోషలు పెట్టే ప్రాణి అది ఎవరన్నా తీసుకువస్తే ఎందుకు సహించలేకపోతున్నాడు?

    ఎవరి జీవితం వారిది. పరిస్థితుల్నిబట్టి, వాతావరణాన్నిబట్టి యీ భూమ్మీద  వందల, వేల, లక్షల అనుభవాల సంపుటాలు.

    తన స్వంత వృత్తితో అతడ్ని అతను స్వేచ్ఛగా పాలించుకుంటూ మలుచుకుంటున్న ఈ దశలో తనకు వచ్చిన కోణంనుంచి సాహిత్యసృష్టి చేస్తున్నాడు.

    అందరూ ఒకేలా  ఎందుకు రాయాలో  అతనికి అర్థంకాదు. అతనికో  దారివుంది. ఆ దారిన నడిచిపోతూ టెక్నిక్ కోసం, కొత్తవిధంగా చెప్పటంకోసం గిలగిల్లాడుతాడు. ఓ కొత్తప్రయోగం చెయ్యని రచనంటూ చెయ్యలేదు.

    ప్రపంచంలో ఒకటే గొప్ప సిద్ధాంతం. అది సిద్ధాంతం అంటూ ఏమీ  లేకపోవటం, ఎవడూ మనిషిని శాసించలేడు. బుజ్జగించలేడు. అలా చేసినా అది క్షణికం. ప్రపంచాన్ని ఒకదారికి త్రిప్పటం ఎవరితరమూ కాదు. సూచించు. నీ భావాలని, సృష్టంగా జరుగుతూన్నదాన్ని నీ బాధలో పరు. కాని, ఎవర్నీ నీ దాసుల్ని చేసుకోవటానికి ప్రయత్నించకు. నిన్ను ప్రజలు ఆరాధించవచ్చు. ప్రాణం ఇవ్వవచ్చు. కాని వాళ్ళ వ్యక్తిత్వాలమీద అజమాయిషీ  చెయ్యకు. నువ్వే  తెలివైనవాడవనీ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవటల్లేదనీ కేకలుపెట్టకు. నీ చుట్టూ పరిధులు గీసుకోకు. ఒకే గిరితో ప్రదక్షిణాలు చెయ్యకు.

    తనకు తోచిన విషయాన్ని గురించీ, చూసిన విషయాన్నిగురించీ, అనుభవించిన విషయాన్నిగురించీ.....స్వచ్ఛంగా విశృంఖలంగా రాస్తున్నాడు.

    తను ఏదో  సాధించాలి. ఉన్నత  శిఖరాగ్రాలు చేరుకోవాలి. నిముషాల విలువ తెలుసుకుంటున్నాడు. తను డాక్టరు కావాలి. రచయితగా నిలివాలి. రోగులకు, పాఠకులకు, శక్తి వున్నన్నాళ్ళూ శారీరకంగా, మానసికంగా మంచి మందు ఇస్తూ అలాగే బ్రతకాలి.

    సుఖం! సుఖం!! లేకపోతే పోనియ్యి. అందుకే ఇదంతా, ఈ తపన. అన్వేషణ.

    తన కథలు కొన్ని సినిమాలుగా వస్తున్నాయి. ప్రజలు చూస్తున్నారు. తను అందరకూ సన్నిహితుడు అవుతున్నాడు. రచయితగా ఇంత మధుర....విషాదమైన జీవితం వుందని తెలుసుకుని ఆశ్చర్యపడుతున్నాడు.

    ఇది తన ఆవేదన, ప్రజలకు తన నివేదన.  

       
                                         32

    ఓ రోజు...

    రాత్రి పదిగంటలయింది. శైలజ పడుకుని వున్న గదిలో బెడ్ లైట్ సన్నగా వెలుగుతోంది. గది కిటికీలకు తెరలు కట్టేసి వుండటం వలన ఆమెకు ఆకాశం కనిపించదు.

    "చినబాబూ" అని పిలిచింది ఆమె నీరసకంఠంతో.

    "ఓయ్" అంటూ మధుబాబు లోపలకు వచ్చాడు.

    "ఇంతసేపూ ఏంచేస్తున్నావు?"

    "బయటి వసారాలో నిలబడి వున్నాను."

    "చాలా రాత్రవుతోంది. ఇహ పడుకోకూడదూ"

    అతనేం జవాబు చెప్పలేదు.

    "నాకేం కాదు చినబాబూ! ఇంకా కొన్నాళ్ళపాటు బ్రతుకుతాను. నాకోసం శ్రమపడవద్దు."

    అతనామె ముఖంలోకి చూస్తూ "మీరు పడుకుని నిద్రపోండి. ఆట్టే మాట్లాడటం ఆరోగ్యానికే హాని" అన్నాడు.

    "చాలా అశాంతిగా వుంది చినబాబూ."

    అతను మెదలకుండా ఊరుకున్నాడు.

    "నా జీవితం ఇలా అంతమౌతుందని తెలుసు. ఎన్నో చేశాను. ఎన్నో  మలుపులు, అనుభవాలు. ఎంతో పైకి వచ్చాను. కాని నాకు కావలిసిందేమిటో కనుక్కోలేకపోయాను. ఎంత వెదికానని. అబ్బ! చివరకు అసంతృప్తితోనే వెళ్ళిపోవాల్సి వస్తోంది చినబాబూ. నాకు కావలిసిందేమిటో నువ్వయినా చెప్పవూ."

    అతనిగుండె కెలికినట్లయింది. ఈ శైలజ ఒకనాడు తనదగ్గరకు రోగిగా వస్తానని ముందుగానే అడిగింది. మనశ్శాంతికోసం అన్వేషణలోని వక్రచేష్టితాలతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. మంచాన పడి తీసుకుంది. కొన్నాళ్ళు గడిచాక తను వచ్చి తీసుకువెళ్లమని మధుబాబుకు వైర్ ఇచ్చింది. అతను కారులో మద్రాసు  వెళ్ళి ఆమెను  తనతో తీసుకువచ్చాడు. ఆమెభర్త అప్పుడప్పుడూ వచ్చి చూచిపోతున్నాడు.

    "ఆ కుర్చీ యిలా దగ్గరకు లాక్కొని కూర్చో చినబాబూ"

    అతనామె మంచానికి చేరువగా కుర్చీలో కూర్చున్నాడు.

    "జవాబు చెప్పవూ."

    మధుబాబు ఓ నిట్టూర్పు విడిచాడు. "మనకు కావాలిసిందేమిటో తెలుసు కోవటమంటూ ఎప్పుడూ  వుండదు. శైలజాదేవీ. కాని ప్రపంచంలో తృప్తి అనేది ఒకటుంది. అంతకంటే పెద్ద ఆకర్షణ మరొకటిలేదు. మనుషులు ఎక్కడికక్కడ తమ శక్తిసామర్థ్యాల కొలదీ ఏదో ఒకటి సాధించి అదే తమకు కావాలిసిందన్న నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంతేకాదెమోనన్న సంశయము అప్పుడప్పుడు వేధిస్తున్నా ఆ సంశయం నిజమైతే కలిగే ఉద్విగ్నత భరించ లేమేమోనన్న భయంతో ఆ ఆలోచనలను త్రోసిపుచ్చుతారు. ఓ డాక్టరు, ప్లీడరు, నటుడు ఇలా ఎవర్ని  తీసుకున్నా వాళ్లకు సాధించిందానికన్నా ఇంకా  ఏదో కావాలి. డానికి రూపంలేదు. ఒక్కోవ్యక్తికి ఒక్కో ఆకృతిలో వుంటుంది. కొంతమంది మాత్రం ఆ రూపాన్ని తెలుసుకొందామన్న బ్రాంతిలో పడి, ఆ అన్వేషణలో మిగతా జీవితసుఖాన్ని ధారపోస్తారు. చివరకు మిగిలేది కారణం వుండీ లేని అశాంతే."

    శైలజ అతనింక విస్మయంగా చూచింది. "నీవుకూడా...."

    "నేనూ మానవమాత్రుడ్నే శైలజాదేవీ."

    "అయితే మనకది లాభించదంటావా?" అంది నిరాశగా ఆమె.

    మళ్లీ కొంచెం ఆగి ఆమె "నా జీవిత కథ వినవూ" అని అడిగింది జాలిగా.

    "ఉహుఁ, వినను."

    "పోనీ నీ కథ చెప్పు."

    "చెప్పను."

    "ఎందుకని?"

    "కారణం ఓసారి చెప్పాను. పాతదే అయినా ఎప్పటికప్పుడు కొత్త అనిపించే విచిత్రం యీ రజితచరిత్ర. ఆ కొత్తకథ వినకుండా మనిషినిబట్టి గ్రహించినప్పుడే సానుభూతీ, విలువ పెరుగుతాయి."

    "నీకు ఎంత ఆలోచన చినబాబూ?" అంటూ శైలజ నిట్టూర్పు విడిచి మౌనంగా పడుకుంది.

    మధుబాబు రెండునిముషాలు అలానే మెదలకుండా కూర్చుని, మెల్లిగా లేచి కిటికీదగ్గరకు వచ్చాడు. తెరప్రక్కకు తొలగించి చూశాడు.

    పౌర్ణమి.

    పండు వెన్నెల కాస్తోంది.

    ఆకాశంలో చుక్కల నడుమ నిండుచంద్రుడు నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తూనే ఇందాక అతను వసారాలో నిలబడి వున్నాడు. ఇంతలో శైలజ లోపలికి వచ్చింది.

    ఈ వెన్నెల తన జీవితాన్ని స్పృశించలేదు.

    కథకుడు కావాలని, గొప్ప రచయిత కావాలని ఒకనాడు కలలుగన్నాడు. చిన్నవయసులోనే ఎన్నో పుస్తకాలు రాశాడు. ఎంతోపేరు వచ్చింది. ఇప్పుడు కూడా రాస్తూనే వున్నాడు. ఎన్నో బహుమతులు వచ్చినై. అభినందనలు వచ్చినయి. అనుభవాలు! డాక్టరయాడు. అయినా వెల్తి. పొందబోయే ముందు ఊహించిన ఉత్సాహం, పొందాక వుండటంలేదు. ఈ వయసులోనే రచయితగా నిండుజీవితం అనుభవించాడు. తననెందరో ఆరాధించారు.

    అయినా తనకు కావలసిన వ్యక్తి దొరకలేదు.

    రాజ్యలక్ష్మి.....ఇందిర.... పద్మజ కళ్ళముందు మెదుల్తున్నారు.

    శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది రాజ్యలక్ష్మి. ప్రేమ అంటే అర్థంకాని దశలో తన జీవితంలో ప్రవేశించి, తనని కదిలించి, చివరికి అస్పష్టంగానే మిగిల్చి, తానుమాత్రం తప్పుకొంది రాజ్యలక్ష్మి.

    ఇందిర ఎక్కడవుందో ఇప్పుడు? పెళ్లయ్యాక మళ్ళీ కనబడలేదు. తనని మర్చిపోయిందో, జ్ఞాపకం వుంచుకొందో.... ఎంతమంది పిల్లల్ని కన్నదో?

    ఎప్పటికీ తనని విడిచిపోని పద్మజ. దగ్గరగా.....దూరంగా వుండే తియ్యని ఆశ. పరమేశ్వరుడి అపూర్వసృష్టి యెప్పటికప్పుడు సూతనానందం. తాను ఎదురుచూచే స్వేచ్ఛ ఆమెకి రాదు. అయినా ఆశతో ఎదురుచూస్తూ వుంటుంది. ప్రస్తుతాన్ని ద్వేషించదు. రాజీపడదు. కాని అసహ్యించుకోదు. తెగిన మనసుని అతుకుపెట్టుకోవటంతోనే మెల్లగా ఆమెజీవితం గడిచి పోతుంది.

    అతను నిట్టూర్చాడు.

    ఒక్క స్త్రీతో శాశ్వతంగా జీవించాలన్న తన ఆశ నిష్ఫలమైంది. తనని విడిచిపెట్టి ఒక్కొక్కరూ దూరంగా వెళ్లిపోతున్నారు. తను ఎప్పటికీ బాటసారే. ఎదురుదెబ్బలు తింటూ దారి తెలియక తికమకపడే ప్రయాణికుడే.

    "ఏమిటి చూస్తున్నావు?" శైలజ కంఠం వెనకనుంచి వినపడింది.

    "ఓ జాలిలేని స్వరూపాన్ని."

    "ఏమిటది?"

    "చూడండి" అంటూ తాను అడ్డుతొలగి, తెర మరింత ప్రక్కకి లాగేశాడు.

    శైలజ చూసింది. నీలాభ్ర సరసిలో నిండుజాబిల్లి.


                                 శుభం

 Previous Page