Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 34


    ఆమె అలాగే చూస్తోంది నిర్ఘాంతపోయి.

    "నువ్వు నాకు సన్నిహితంగా వచ్చాక యే ఒక్క అరగంటకూడా నీ స్మృతి లేకుండా గడపలేక, దూరంగా నిన్ను తలచుకుంటూ, వంటరితనంలో అల్లాడిపోతూ, తోడుకోసం తపించిపోతూ నలిగి, నశించిపోయిన నా బ్రతుకు నీకెలా అర్థమౌతుంది పద్మా."

    ఆమె కళ్లలో నీళ్ళు తిరగసాగాయి.

    "నన్నుగురించి నువ్వు ఓ రూపాన్ని నిర్మించుకున్నావు. దాన్ని ఆరాధించావు. ఆ విషయం రాసి నాకెంత క్లేశం కలిగించావో నీకు తెలీదు. నిన్నుగురించి నేను ఓ రూపం చిత్రించుకోలేకపోయాను. రూపంలేని నిన్ను ఆరాధించాను. నా చంచల ప్రవృత్తితో నీకో బాహ్య స్వరూపం వూహించి. అది తలుచుకుని ఉవ్విళ్ళూరటానికి నా అంతరాత్మ అంగీకరించలేదు. నువ్వు యీ రూపంలో కాదు, ఎలావున్నా  యిదే  నిశ్చలచిత్తంతో నీముందు నిల్చుని వుండేవాడ్ని"

    ఆమెకళ్ళు వర్షిస్తున్నాయి.

    "నాకే పెళ్ళయివుండి, నువ్వు అవివాతవై వుంటే యిదే ఉద్రేకంతో నేను రాసివుంటే.... అది నిశ్చలప్రేమగా. నిజాయితీగా నువ్వు హర్షించేదానివా పద్మా! నేను అన్యాయం చేశానని, నమ్మించి మోసం చేశానని నిందించేదానివి కాదా? ఎంత కోపగించుకుని, అసహ్యించుకుని వుండేదానివి! కాని ఆశ్చర్యం! నువ్వంటే నాకీ రెండూ లేవు పద్మా!"

    "అబ్బ! చెప్పకు మధూ! అలాంటి సత్యాలు నాకు చెప్పకు. నేను భరించ లేను." అని ఆమె యిహ ఆపుకోలేక ఏడవసాగింది.

    అతను కదలకుండా, విషాదంగా ఆమెముఖంకేసి చూస్తున్నాడు.

    పద్మజ సిగ్గుపడి, పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుని కుదురుగా కూర్చుంది.

    మధుబాబు హఠాత్తుగా "నువ్వెందుకు పెళ్ళి చేసుకున్నావు పద్మా? ఎందుకలా చేశావు?" అన్నాడు గాద్గదిక కంఠంతో.

    పద్మజకు అంత దుఃఖంలోనూ నవ్వు వచ్చింది. ఆమె పెదిమలు నిర్మల అమాయిక హృదయాన్ని వ్యక్తంచేస్తూ విప్పారినై.

    "చెప్పు పద్మా! నువ్వు చెప్పిందంతా అబద్ధమేననీ, నువ్వు అవివాహితవేననీ చెప్పు" అన్నాడతను ఆవేశంగా.

    "నాకు పెళ్ళయిందని నీకు నమ్మకంలేదా?" అన్నదామె.

    "ఉహుఁ" అన్నాడతను మొండిగా.

    నిజానికి ఆమెకంఠాన మంగళసూత్రం కనబడటంలేదు. అది చూసి అతను అపోహపడలేదు. ఊరికినే మొండిగా అన్నాడు.

    పద్మజ తన పమిట కాస్త ప్రక్కకి తొలగించి, హృదయాన, రవికలోనుండి కనబడుతున్న మంగళసూత్రాన్ని చూపించి " అనుమానం తీరిందా?" అంది.

    "నాకు ముందే తెలుసు పద్మా!" అన్నాడతను నిరాశగా.

   
                                                                  *    *    *


    "నువ్వు పెళ్లి చేసుకో మధూ!  నీ పెళ్ళికి నేను వస్తాను. హడావుడిగా అటూ ఇటూ  తిరిగి, చకచక పనులన్నీ  చేసేస్తూ పెత్తనం  చెలాయిస్తాను. మీ అమ్మగారూ, నాన్నగారూ నన్నుచూసి "యీ పిల్ల మాఇంట్లో వుంటే బాగుండేది" అని అనుకునేట్లు చేస్తాను."

    "ఉహుఁ నేను పెళ్ళి చేసుకోను."

    "ఏం?"

    "నాకు కావల్సిన వ్యక్తి దొరకదు కనుక."

    "ఎందుకు దొరకదు? ఎక్కడ తపస్సు చేస్తోందా పిల్ల?"

    "లేదు. లేదు. అలాంటి పెళ్లికాని పిల్ల లేనేలేదు."

   
                                                                  *    *    *


    మధుబాబు "నిన్ను విడిచి, మళ్లీ ఆ అజ్ఞాతవాసానికి ఎలా వెళ్ళను పద్మా" అన్నాడు దిగులుగా.

    "ఒక విషయం చెప్పనా" అన్నది ఆమె బొటనవేలితో నేలమీద రాస్తూ.

    అతను ప్రశ్నార్థకంగా చూశాడు.

    "నన్ను మరచిపోండి."

    "అలాంటి మాటలు మాట్లాడకు పద్మా."

    "అబ్బా! మధూ! ఈ చుట్టుగీతలలో నిన్ను నేను కలుసుకోలేకుండా వున్నాను. ఈ అవస్థ భరించలేను. నేనిలా వస్తూంటే ఏం జరుగుతుందోకూడా తెలీదు. నా జీవితం  ఏమైనా అయిపోవచ్చు. నేను నశించిపోవటం నీకిష్టమా మధూ?"

    "అబ్బ! ఏంచెయ్యను పద్మా! నన్నిలా ఎందుకు చేశావు? నువ్వు వెళ్ళిపోయిన క్షణంనుంచీ రంపపుకోత. నీదగ్గరకు, మీ  ఇంటికి పరిగెత్తుకు వచ్చెయ్యాలని వుంటుంది. రాత్రిళ్ళు ఊరికినే వచ్చి మీ యింటిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఒక్కడ్నే వెనక్కి ఎలా వెళ్ళిపోయేది నేను."

    "మీరు ఇవాళే వెళ్లిపోండి."

    "పద్మా!"

    "అవును. మీరింకా  ఇక్కడేవుంటే నేను మీతో వచ్చేస్తానేమోనని భయంగా వుంది. వెళ్లిపోండి మధుబాబూ."

   
                                *    *    *


    "ఒక్కసారి కళ్ళు మూసుకోండి మధుబాబూ."

    "ఏమిటి?"

    "ఉహుఁ చెప్పను సిగ్గేస్తోంది. కళ్ళు మూసుకోండి."

    అతను కళ్ళు మూసుకున్నాడు.

    ఆమె తనికెదురుగా వచ్చి నేలమీద మోకాళ్ళపై కూర్చుని అతని పాదాలకు నమస్కారం చేసింది.

    అతను కళ్ళు తెరిచాడు. ఆ దృశ్యంచూసి అతడిహృదయం చలించి పోయింది. శరీరం గగుర్పొడిచింది. "పద్మా" అంటూ ఆవేశంగా ఆమెభూజాలు పట్టుకుని పైకి లేవదీశాడు భయంగా అదోరకంగా వుంది. అదే ఆమెను మొట్టమొదటసారి తాకటం.

    "నా వాగ్దానం గుర్తుందా? ఇలా సెలవు తీసుకుంటున్నాను" అంది పద్మజ కళ్ళు క్రిందకి వాల్చి.

    అతనో చేతితో ఆమె ముఖము పైకెత్తి "ఎన్ని కలలుగన్నాను పద్మా. నేను పురుషుడ్ని. నువ్వు ప్రకృతివీ అనుకున్నాను. నేను పురుషోత్తముడ్ని, నువ్వు  మహాసృష్టివీ అనుకున్నాను. ఆనక తనివి తీరేదాక నిన్ను  నాతో ఎక్కడెక్కడికో తీసుకుని, కబుర్లలో, మహదానందంలో, గొప్పగా వెళ్లిపోదామనుకున్నాను. అంతా....." అతని గొంతు వణికింది. "వట్టి కలే!"

    "అయితే నన్ను తీసుకువెళ్లండి" అన్నది పద్మజ.

    అతనాశ్చర్యంగా చూచాడు.

    "అవును. తీసుకువెళ్లండి. మీ ఇష్టం వచ్చినంత దూరం తీసుకువెళ్లండి. కాని వచ్చేటప్పుడు మాత్రం మీరొక్కరే తిరిగిరావాలి. నన్నక్కడే పడవేసి, పారవేసి. మరి ర్ర్ ప్రపంచం, ఇల్లు, సంసారం నన్ను తిరిగి స్వీకరించరుగా."

    అతడామెను వదిలేసి "పద్మా!" అన్నాడు వెర్రిగా.


                                *    *    *


    "నే పోతున్నాను."

    "మళ్ళా ఎలా, ఎక్కడ, యెప్పుడు?"

    "చెప్పలేను. మనం చచ్చిపోముగా అప్పుడే. జీవితంలో యెన్ని ఇలాంటి మధుర, విషాద సన్నివేశాలు నీకూ నాకూ మధ్య యెదురు కానున్నవో."

    "మీ చివరికోరిక ఏమిటి?"

    "చెప్పేదా? నవ్వవు గదా."

    "ఉహుఁ"

    "ఒక అందమైన అమ్మాయికి, చాలా అందమైన అమ్మాయికి తండ్రిగా వుండాలని. అదేమిటో నాకు ఎప్పుడూ కలిగే చిత్రమైన కోరిక."

    "అయితే నన్ను తీసుకెళ్ళిపోతారా?"

    "ఊఁ"

    "ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారా?"

    "ఊఁ"

    "అబ్బ! నాకెంత యిష్టం! యెంత యిష్టం మీరట్లా మాట్లాడుతోంటే."

    "మరి సెలవు నమస్కారం."

    "ఛీ, మీరు నాకు నమస్కారం చెయ్యొచ్చా? విత్ డ్రా."

    ఆమె అతని చేతుల్ని ఒకదానినుంచి ఒకటి మృదువుగా విడదీసింది. వాటిని  అలాగే పట్టుకుని "ఏమిటి యీ చిత్రమైన బంధము? ఈ తియ్యని, అర్థంకాని, అమృతాను బంధానికి ఈ జీవితంలో ఏమిటి ఫలితం" అనుకుంది.

    అతను వెళ్ళిపోయాడు.


                                                                    31

    అబ్బ! జీవితం ఎంత విశిష్టమైంది!

    "అనుభవించే కొలదీ తరగనిదీ, మనిషిని పాలించేది, వేధించేది, పులకరింపజేసేది, పాలించబడేది, చివరకు అర్థంగాకుండా మిగిలిపోయేది.

    మధుబాబు ఎక్కడినో పోతున్నాడు, చీకటిలో...... దారిని వెదుక్కుంటూ.

    ఎక్కడనో కాంతికిరణం మిణుకు మిణుకుమంటోంది.

    ఎక్కడ అది? ఎంతదూరం ఏనాటికి, ఎంతకాలం యీ గమనం.... విసుగులేకుండా అప్పుడప్పుడూ బిక్కమొహంవేస్తూ మళ్లీ  ఉత్సాహంగా.

    ఎన్ని అనుభవాలో, అనుభూతులో ఇంత చిన్నవయసుకే.

    ఇవన్నీ అన్ని కోణాలనుంచీ పరిశీలించటానికి, సమగ్రమైన దృష్టి అలవర్చు కోటానికీ, వ్రాసుకోవటానికి.... అతను రచయిత అయినందుకు గర్విస్తున్నాడు.

    మళ్ళీ రాస్తున్నాడు కొత్త భావోద్రేకంలో, విలాసమధుర ధ్వనుల్లో, విషాద సంగీతాలాపనలలో.

    తాత్కాలికంగా ఆవరించిన వైరాగ్యంలోంచి అతనిలోని నవలాకారుడు బయటకు వచ్చాడు. చుట్టూ సమస్యలు, జీవితంలోని ప్రతి అణువూ ఓ చిక్కుసమస్య. ఎవడి వ్యక్తిగతమైన బాధ వాడిది. అది పరిశీలించటంలో ఆసక్తి పెరిగింది. ప్రజలబాధల్ని తమబాదగా చేసుకుని కొందరు కవులు ఆలాపిస్తే తమ బాధను ప్రజలముందు ఆలపించారు మరికొందరు. ఇందులో ఉత్తమ సాహిత్యము కానిదేమీ లేదు. స్వంతవిషయాన్ని విశ్వజనీనము చేసిన  వాడే  నిజమైన కళాకారుడు. అప్పుడే అతడి తపస్సు ఫలించినట్లు. ఒక మనిషికోసం తపించినప్పుడే మనుగడ సార్థకత అయినట్లు.

 Previous Page Next Page