"ఏమిటా వాగుడు? నోరుమూసుకుని నిలబడు. లేకపోతే మీ బాస దగ్గర కెళ్దాంపద. నీ ఏడుపేదో అక్కడే ఏడుద్దువుగాని___పద!"
జయంత్ ఉదయ్ కేసి చూసి "కమాన్ ఉదయ్! లెటజ్ గో" కారెక్కి ధనామని విసురుగా డోరువేశాడు.
ఎస్సై హమీద్ ఏమాలోచించాడో ఏమో కొంచెం తగ్గాడు.
"మీరెందుకు వెళ్ళడం మా బాస దగ్గరికి? మా హెడ్డును పంపింస్తాను. వారొచ్చేదాకా ఆగిండి. కావాలంటే నేనే మిమ్మల్ని అరెస్టు చెయ్యొచ్చు. కాని ఎందుకు ఆగానో మీరే ఆలోంచించుకోండి. మా డ్యూటీ మేము చెయ్యాలిగదా? వదిలేస్తే ఒకచావు. పట్టుకొంటే ఒకచావు. ఇన్ ఫర్ మేషన్ అంతా తెలిశాక దొరికిన అనుమానితుల్ని వదిలేస్తే, ఆ తర్వాత మా పాట్లు ఆ అల్లాకే తెలియాలిసార్!"ఠక్కున హెడ్డువైపు తిరిగి అన్నాడు.
"ఏంరోయ్! నువ్వు తెచ్చిన ఇన్ ఫర్ మేషన్ కరెక్టేనా? అరే! అసలు ఈ సార్లు ఆడపిల్లని ఎందుకు ఎత్తుకుపోతారూ? అంత ఎత్తుకు పోయారు అనుకొందాం. మరి మనకు కంప్లైంటు ఎందుకిస్తారూ? ఈసార్లు ఎవరనుకొన్నావ్? ఏం సంగతి? పెద్దస్టేటస్ వున్న ఫేమస్ డాక్టర్లు. బేహ తరీన్ నర్సింగ్ హొమ్స్ ఉన్నాయ్. నువ్వేదో బేకార్ ఇన్ ఫర్ మేషన్ తెచ్చి అంతా కిరికిరీ పెట్టినావే. అసలు నీకెవడిచ్చాడోయ్ పోలీసు డిపార్టుమెంటులో ఉద్యోగం?" హమీద్ హెడ్డును ఎడా పెడా వాయించేస్తున్నాడు.
ఉదయ్, స్టీరింగుముందు కూర్చునివున్న జయంత్ వైపు తిరిగి___"చూశావా? ఈ ఎస్సైగాడు ఎంతలో ప్లేటుఫిరాయించేశాడో? మనం ఇక్కడ్నుంచి కదిలి వెళ్ళకుండా వుండేందుకు, ఇదొక ఎత్తు. ఎందుకైనా మంచిదని, మనల్ని పైకెత్తేస్తూ, తప్పంతా ఆ హెడ్డుదేనన్నట్టు, అతడ్ని దులిపెస్తున్నాడు. ఇవన్నీ పోలేసువాడి చవకబారు టాక్టిక్స్. విల్సన్ రావు వచ్చి ఏమంటాడోననే భయం పట్టుకుంది ఇప్పుడు వాడికి." అన్నాడు.
"ఏం విల్సన్ రావో ఏమిటో? ఎస్సైకంటే మూర్ఖుడిలా వున్నాడు. ఇంతకీ మాధవి ఏమైనట్టూ? ఆ దుర్మాద్గుల చేతుల్లో పడిందా? లేక ఇంకా వాళ్ళకోసం వెదుకుతూనే వుందా? మనం రైల్వేస్టేషన్ వైపుకు వెళ్ళి వెతకటం మంచిదేమో? ఇంతకూ ఆ విల్సన్ ఏమైనట్టూ? ఇంకా సావిత్రి లాడ్జి కార్యక్రమంలోనే వున్నాడా?" అని దూరంగా కన్పిస్తున్న హెట్ లైట్ కాంతి చూస్తూ అన్నాడు.
"అవి జీప్ లైట్లులా వున్నాయి. విల్సన్ వస్తున్నట్టున్నాడు. రెండు నిముషాలాగి అతడితో మాట్లాడి వెళ్దాం. ఈయనగారి ఆపరేషన్ అమావాస్య మండినట్టే వుంది." భారంగా నిట్టూర్పు విడిచాడు ఉదయ్ చంద్ర.
కార్లో కూర్చున్నవాళ్ళు తాను హెడ్డును దులిపెయ్యడం వినలేదేమో నన్న సందేహంరాగా, గొంతు పెద్దదిచేశాడు హమీద్,
"అసలు నీకీ ఇన్ ఫర్ మేషన్ ఎవడిచ్చాడో య్ ? నేననుకోవడం__ఆఁ ఆలోచిస్తుంటే నాకిప్పుడు అనుమానం వస్తోంది. అసలు నీకు ఆ తప్పుడు ఇన్ ఫర్ మేషన్ ఆ దొంగముండాకొడుకులే ఇచ్చి వుంటారేమో? అరే మనల్ని బలే టోకరా కొట్టించారే కొడుకులు కరెక్ట్! కరెక్ట్! నీకా ఇన్ ఫర్ మేషన్ ఇచ్చిన బాడ్కోవ్ గాడ్ని పట్టుకురా, వాడి బొమికలు లెక్కెట్టి నిజం కక్కిస్తాను. కొండయ్యా! ఇంకా చూస్తా నిలబడతావేం? ముందాడ్ని తీసుకురా! పెద్దమనుషులముందు నా పరువు తీసేశావ్. ఈ సంగతి సార కు తెలిసిందంటే నీ హెడ్డు తీసేసి కానిస్టేబుల్ గా రివర్ట్ చేస్తారు. తెలిసిందా? ఏమనుకుంటున్నావో ఏమో?___"
జయంత్ రావు కార్లోనుంచి వంగి హెడ్డుకేసి చూశాడు. కుడితిలో పడ్డ ఎలుకలా గింజుకొంటున్నాడు. అతడి ముఖం చూస్తుంటే జాలివేసింది జయంత్ కు.
"అవును ఉదయ్ ! హెడ్డు ఏడుకొండలు చెప్పింది?" సాలోచనగా ముఖంపెట్టాడు జయంత్.
"ఇంకా నీకు అనుమానంగా వుందా? అతడి ఇన్ ఫర్ మేషన్ అక్షరాలా నిజం. మనం మాధవిని తీసుకెళ్ళాడం స్టాండులో చాలామంది చూశారు. పైగా మన కారు నంబరుకూడా బాగాగుర్తుండే నంబరు అందుకే నంబరుతో సహా గుర్తుంచుకొని టాక్సీవాళ్ళూ, రిక్షావాళ్ళూ హెడ్డుతో చెప్పివుంటారు. మన కారు నంబరు హెడ్డుకు అనుమానం వచ్చింది. అదే యస్సైకి చెప్పాడు. ఈ మూర్ఖుడేమో....."
"కాని ఉదయ్! హమీద్ ను తప్పుపట్టరేం. మనం మాధవిని తీసు కెళ్ళింది అతడికి తెలియదు కదా? మన పొరపాటుకూడా కొంతవుంది. ఇద్దరు ఓ ఆడకూతుర్ని కార్లో తీసుకుపోయారనగానే వీరభద్రుడూ,రాంబాబే మాధవిని ఎత్తుకుపోయారనుకొన్నాం.....మనసులో ఏది వుంటుందో సాధారణంగా దానికే అన్వయించుకోవడం జరుగుతుంది."
"అవును, జయంత్ మనం చాలా చిన్న విషయమే అయినా పోరాపాటుచేశాం. హెడ్డు చెప్పింది ఎన్ని గంటలకు జరిగిందని మనం అడగలేదు. అప్పుడే అడిగివుంటే ఈ రాద్దాంతం అంతా జరిగివుండేదికాదు. అవునా?"
"కరెక్ట్ ఉదయ్. ఒక్క నిముషం ఉండు" అంటూ జయంత్ కారు దిగాడు.
"మిస్టర్ హమీద్! ఏడీ హెడ్డూ?"
"ఇప్పుడే వెళ్ళాడు. అదిగో అటు వెళుతున్నాడు. ఆ రంగ్ ఇన్ ఫర్ మేషన్ ఇచ్చిన రాస్కెల్ గాడ్ని జుట్టు పట్టుకొని తీసుకురమ్మని పంపించాను" చెయ్యెత్తి దూరంగా వెళ్తున్న ఏడుకొండల్ని చూపిస్తూ చెప్పాడు హమీద్.
"అది రాంగ్ ఇన్ ఫర్ మేషన్ కాదయ్యా, అతడిచ్చిన సమాచారం అంతా కరక్టే . మేమిద్దరం, డాక్టర్ ఉదయ్, నేనూ బస్ స్టాండుకు వచ్చి ఈ కార్లోనే తీసుకెళ్ళాం."
"మరి! మరి! అయితే" ఉంగిడి తిన్నగోడ్డులా అయిపోయాడు హమీద్.
నోరు తెరుచుకొని గుడ్లు మిటకరించి జయంత్ ను చూస్తూ కొద్ది క్షణాలు వుండిపోయాడు.
"అదెప్పుడు జరిగింది? ఆ సంగతి డి.యస్.పి. గారికి చెప్పారా?"
"మీ బాస్ కు తెలుసు. నాలుగు గంటల క్రితం__దాదాపు ఎనిమిది గంటలా ప్రాంతంలో , మేమువచ్చి, ఆ దుర్మార్గులనుంచి తప్పించుకొని, బస్ స్టాండులో తలదాచుకొన్న మాధవిని తీసుకెళ్ళాం. ఆమెకోసంవాళ్ళింకా ఈ ప్రాంతంలోనే తిరుగుతుంటారనే నమ్మకంతోనే, మీ బాస ఈ అమావాస్య ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పుడర్థమైందా?"
"సారీ సారీ! ఈ సంగతి డి. యస్. పి. గారితో అనొద్దు సార" కాళ్ళమీద పడటమే తక్కువ అన్నంతగా ప్రాధేయపడసాగాడు హమీద్.
"ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు మీ హెడ్ ను పిల్చుకురండి. వాడిని ఎవడినో మెడపట్టుకొనే లోపలే వెళ్ళి మీ హెడ్డును వెనక్కు తీసుకురండి." హమీద్ ను తొందరపెట్టాడు జయంత్.
ఎస్సైఅటు వెళ్ళగానే డి. యస్.పి. గారి జీప్ బస్ స్టాండులో నుండి దూసుకొని వచ్చింది. అది చూచి ఎస్సై, హెడ్డూపరుగు పరుగునవచ్చారు.
"ఎప్పుడయ్యా హెడ్డూ? ఎన్ని గంటలకు ఎ.ఐ.ఎ!2000నంబరు తెల్లటి ఎంబాసిడర్ కార్లో ఇద్దరు మనుషులు ఓ ఆడకూతుర్ని ఎత్తుకుపోయింది?" బిక్కముఖంవేసిన ఏడుకొండల్ని అడిగాడు జయంత్.
"ఎనిమిది గంటల సమయంలో అన్నట్టు టాక్సివాడు, జానీ, చెప్పాడు సార్" నీళ్ళు నములుతున్నట్టుగా నసిగాడు ఏడుకొండలు.
"పూల్! ఆ మాటముందే ఎందుకు చెప్పలేదు" గద్దించాడుహమీద్.
"నువ్వడిగావా? ప్రశ్నించాడు జయంత్.
"నేను అడగలేదు. అయినా అతడు చెప్పొద్దూ? ప్రతిదీ అడగాలా సార్? డిపార్టుమెంట్ లో పాతికేళ్ళ సర్వీసుంది. ఆ మాత్రం తెలివి వుండోద్దూ? సగం సగం సమాచారం అందిస్తే ఏంలాభం? ఈ ఏడుకొండల వల్లనేగద సార్ నేను మిస్ లీడ్ అయింది?"
"అతనిదేమీ తప్పులేదులే!నువ్వేకాదు మేముకూడా ఆ పాయింట్ అడగలేదు. ఏడుకొండల్నెండుకు నిందించడం?"
"సార్! సార్! సారోస్తున్నారు. ఈ సంగతి వదిలెయ్యండిసార్.ఏక్స్యూజ్ చెయ్యండి డాక్టర్ సాబ్!" జయంత్ చేతులు పట్టుకొన్నాడు ఎస్సై హమీద్.
"ఓ.కే. ఓ.కే డోన్ట్ వర్రీ!" అభయహస్తం ఇచ్చాడు జయంత్.
"డాక్టర్ జయంత్! హర్రీఅప్! ఊఁ కారెక్కండి" రొప్పుకుంటూ హడావిడిచేస్తూ వచ్చాడు విల్సన్ రావు.
ఉదయ్ కంగారుగా కారుదిగుతూ "ఏమైంది? విల్సన్ రావుగారూ! టైంలేదు. జయంత్ నువ్వు వెనకసీట్లో కూర్చో" అంటూ విల్సన్ రావు స్టీరింగుముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
జయంత్ ఎగిరి కార్లో కూర్చుని డోర్ వేశాడు.
కారు ఫ్రంట్ డోర్ పక్కన నిలబడ్డ యస్సైనీ, హెడ్డూనూ చూసి "మీరు జీప్ లో నన్ను ఫాలోకండి" అని ఆజ్ఞాపించి గేర్ వేసి యాక్సిలెటర్ తొక్కాడు.
క్షణాల్లో కారు శరవేగంతో హైవేమీదకు వచ్చింది. విల్సన్ రావు గంభీరంగా కూర్చొని నూరు కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నాడు.
పక్కనే కూర్చుని అతడ్నే తదేకంగా చూస్తున్న డాక్టర్ ఉదయ్ చంద్ర మనస్సు ప్రమాదాన్ని శకించింది.
ఏదో జరిగివుంటుంది. మాధవి వాళ్ళచేతుల్లోపడి వుండాలి. లేకపోతే విల్సన్ ఇంత సీరియస్ గా వుండడు. ఇదంతా తన తెలివితక్కువ వల్లనే జరిగింది. హంతకుల జారినుండి చాకచక్యంతో తప్పించుకొని సురక్షితంగా నర్సింగ్ హొమ్ కు చేరిన మాధవిని మళ్ళీ వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఈ దారుణానికి బాధ్యత వహించవలసింది తనే!తనే!
అసలు పోలీసోళ్ళను, విల్సన్ లాంటి ఆఫీసర్లను నమ్మడమంతతెలివి తక్కువ మరికటిలేదు. ఆపరేషన్ అమావాస్య.
ఛా!ఛా!,మిగిలింది చీకటే! అమావాస్య చీకటి బాధతో కుమిలిపోతూన్న ఉదయ్ కు విల్సన్ మీద కసీ, అసహ్యం కలిగాయి.
"ఇంతకీ ఏం జరిగింది మిస్టర్ విల్సన్! మాధవిని...." వెనక సీట్లోనుంచి ముందుకువంగి అడిగాడు జయంత్.
"ఇదంతా మా వల్లనే...."
విల్సన్ రావుమాట పూర్తికాకుండానే జయంత్, ఉదయ్ "మీ వల్లనా?" అంటూ తెల్లబోయారు.
"అవును" గొంతు సవరించుకొని అన్నాడు విల్సన్.
"ఇంతకూ ఏమైందో చెప్పండి" అసహనంగా అన్నాడు ఉదయ్. అతడి కంఠంలో ధ్వనించిన తీవ్రతకు విల్సన్ తలపక్కకు తిప్పిచూశాడు.
"కరెక్ట్ మిస్టర్ జయంత్. బ్రిడ్జికింద కాచుకు కూర్చున్న ఆ హంతకుల వలలో పడిపోయింది మాధవి." సిగరెట్ పొగ ఊదుతూ అన్నాడు విల్సన్ రావు.
"అయితే ఇప్పుడు మాధవిని ఎలా రక్షించడం" ఆతృతగా అడిగాడు ఉదయ్.
"డోంట్ వర్రీ బ్రదర్! అంతా చక్రబంధం చేసేశాను. కొడుకులు తప్పించుకొనే ప్రశ్నేలేదు. సి.ఐ. విక్టర్ నలుగుర్ని తీసుకొని వాళ్ళను వెంబడిస్తున్నాడు. ఆ డొంకరోడ్డునపడి వెళ్తే మెటల్ రోడ్డు తగులుతుంది. ఆ మెటల్ రోడ్ ఇప్పుడు మనం వెళ్తున్న హైవేలో కలుస్తుంది. మనం ఈ హైవేను కవర్ చేస్తున్నాం. విక్టర్ వాళ్ళను అటునుంచి చేజ్ చేస్తున్నాడు. ఆడకత్తెర వ్యూహం. వాళ్ళెటూ తప్పించుకోలేరు. డొంకలోనూ, మట్టిరోడ్డు మీదా జీపు వెళ్ళినంత వేగంగా కారు వెళ్ళలేదు. వాళ్ళు విక్టర్ కు అంద కుండా వెళ్ళాలంటే ముందే అడ్డరోడ్డు క్రాస్ ముందుకెళ్తే రైల్వేగేటు దగ్గర వాళ్ళకోసం కాచుకొనివుంటాడు ఎస్సై సీతారాంరెడ్డి. గేటు దాటితే ఆయన జ్యురిస్ డిక్షన్ . మన అదృష్టం బాగాలేకపోతే హంతకుల్ని పట్టిన క్రెడిట్ ఆయన కొట్టేస్తాడు."
"క్రెడిట్ ఎవరికొస్తేనేంలే! మీ డిపార్ట్ మెంటేగా? హంతకులుదొరకడం ముఖ్యం. మాధవి ప్రాణాలుకాపాడటం ప్రధానమండీ డియస్పీ గారూ?"
"అమ్మమ్మ ! మా డిపార్ట్ మెంటు సంగతులు మీకు తెలియదు. పనికిరాని కేసులైతే అది మా జురిస్ డిక్షన్ కాదని అవతలవాళ్ళకు తోసేస్తారు. ఇలాంటి ఘరానా డబల్ మర్డర్ కేసులయితే క్రెడిట్ కొట్టెయ్యడానికి ముందుకొస్తారు. ప్లాను నాది ఆపరేషన్ అమావాస్యనాది. కష్టపడిందినేను. మరొకరు క్రెడిట్ కొట్టెయ్యడం అన్యాయం కదా? మీరే చెప్పండి డాక్టర్ గారూ? ప్రభువు మేలుచేస్తే వాళ్ళు నాకే దొరకాలి."
"ష్యూర్! ష్యూర్! క్రెడిట్ మీకే రావాలి. ఈ దెబ్బతో మీ పేరు ఐ.పి.యస్. లిస్టులోకి ఎక్కేయ్యాలి."
"లెట్ గాడ్ బ్లెస్ అజ్!" విల్సన్ రావు కారువేగాన్ని పెంచాడు.
స్పీడుమీటర్ నూరుదాటినట్టు చూపిస్తున్నాది. అందరూ ఊపిరి బిగపట్టుకొని టెన్ షన్ లో కూర్చున్నారు.
"మిస్టర్ విల్సన్ ! చిన్నడౌటు...."జయంత్ ముందుసీటుమీదకు వంగి అన్నాడు.
"ఊఁ చెప్పండి."
"వాళ్ళు రిక్షావాడ్నేందుకు చంపినట్టు?"
"ఫర్ ఫెక్టు మర్దరర్ ఆ రాంబాబుగాడు. ఒక సాక్షిని ఎలిమినేట్ చేసేశాడు వాడు బతికుంటే మనకు ఇన్ ఫర్ మేషన్ దొరికే అవకాశం వుంది. ఆలోచించే వాడ్ని చంపాడు.
"కరెక్టు మిస్టర్ విల్సన్. ఆ రాంబాబుగాడ్ని కరెక్టుగా ఎసెస్ చేశారు. వాడు ఇంటర్ నేషనల్ క్రూక్. వాడికి కలకత్తాలో మాఫియా గ్యాంగ్ తో కూడా సంబంధాలున్నట్టున్నాయి. ఎలాగయినా వాడ్నిపట్టుకొని మాధవిని రక్షిస్తే రాష్ట్రంలోనేకాదు, దేశంలోనే మీకు పేరువస్తుంది. మీ ఆపరేషన్ అమావాస్య తప్పక సక్సస్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది."
"థాంక్యూ డాక్టర్ ఉదయ్. థాంక్యూ?" విల్సన్ భుజాలెగరేశాడు.
ఉదయ్ లో ఆశలు చిగురించాయి,
అల్పసంతోషి విల్సన్ మంచివాడే. కాకపోతే కాస్త హడావిడి మనిషి. షో ఎక్కువ ముందు అతడి ధోరణిచూసి తను ఏదో అనుకున్నాడు. సమర్థుడే!
ఉదయ్ మనసులో విల్సన్ గురించి ఆలోచిస్తుంటే, క్షణక్షణం అతడి యడల గల గౌరవం పెరగసాగింది.
"డాక్టర్ ఉదయ్! నా మానసులో మరో ముఖ్యమైన అనుమానం బాధిస్తోంది. రాంబాబు మాధవి ప్రాణాలు తియ్యదల్చుకుంతే ఆ పని ఎప్పుడో చేసేవాడు. ఆ అవకాశం అతడికి వుంది. అయినా ఆమెను చంపలేదు. అంటే ఆవిడతో వాళ్ళకు ఇంకా ఏదో అవసరం వుండి వుండాలి. అది ఏమిటంటావ్?" విల్సన్ సాతోచనగా అడిగాడు. అతడి కంఠం మంద్రస్థాయిలో గంభీరంగా వుంది.
ఉదయ్ విల్సన్ కేసి ఆశ్చర్యంగాచూశాడు. అవును నిజమే. తనకు ఆ విషయం ఇంతవరకూ తట్టలేదు. మబ్బులు కమ్మిన అతడి బుర్రలో అకస్మాత్తుగా విద్యుత్ మెరిసినట్టుగా అయింది.
"యు ఆర్ రియల్లీ జీనియస్ మిస్టర్ విల్సన్. ఇంతవరకు నేను ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. మాధవిని చంపదలిస్తే తోటలోనే అడివయ్యతోపాటు చంపి పాతేసి వుండేవాళ్ళు. ఇంతదూరం ఇంత రిస్క్ చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్ళాల్సిన అవసరమే లేదన్న ఆలోచన నాకు రాలేదు. ఆమె అవసరం ఇంకా వాళ్ళకుంది. అందులో సందేహంలేదు. ఆమెనుంచి ఇంకేదో రహస్యాన్ని రాబట్టే ప్రయత్నంలో వాళ్ళున్నారు.ఆ రహస్యం ఏదో నా గురించే అయివుండాలి. ఆ రహస్యం ఏదో నా నుంచి మాధవికి తెలిసిందనే నమ్మకం వాళ్ళకు కలిగివుండాలి. చిత్రహింసలు పెట్టయినా ఆమెనుంచి ఆ రహస్యం ఏదో తెలుసుకోవాలన్నదే వాళ్ళ ప్రయత్నం కావచ్చు."
"ఆ మిస్టరీ ఏమిటంటారూ? మీకు సంబంధించిందయితే మీకు తెలిసే వుండాలిగా?" విల్సన్ సీరియస్ గా ప్రశ్నించాడు.
"అదే తమాషా మిస్టర్ విల్సన్ నా వెనక నాకు సంబంధించిన నాకు తెలియని కథ చాలావుంది. మూడురోజుల క్రితం వరకూ నాగత చరిత్రేమిటో నాకే తెలియదు. ఇప్పటికీ పూర్తిగా తెలిసిందనుకొను. ఊహ తెలియక ముందు చంద్రకిరణ్ గా ఉన్న నేను ఊహ తెలిసే సరికే ఉదయ్ చంద్రను అయ్యాను. నా చరిత్ర అంతా వెలుగులోకి వచ్చినంతవరకు డాక్టర్ జయంత్ రాసిపెట్టాడు. నా గతంలో జరిగిన ఎన్నో సంఘటనలూ, విషయాలూ, మానసి__ఐ మీన్ మాధవి ద్వారానే తెలిశాయి. ఈ మిస్టరీకూడా ఆమె ద్వారానే సాల్వ్ చెయ్యగలనుకొంటున్నాను. ముందామెను రక్షించండి విల్సన్" ఉదయ్ ఉద్విగ్నుడైపోయాడు.