"కావచ్చు. సైకాలజీ తెలిసిన డాక్టర్లు మీరు. మనదృష్టిలో మాధవే వున్నది కాబట్టి మనముందున్న రిక్షాలో ఆమె ఉన్నదనుకోవడం సహజమే. కాని ఆ సంగతేదో ముందే చెప్తే బాగుండేదికదూ?" గాలితీసేసిన టైర్ లా చప్పబడిపోయాడు విల్సన్ రావు.
"దురదృష్టం అదే సైకాలజీ ఉపయోగపడేది జరిగిపోయినదాన్ని విశ్లేషించి వివరించడంవరకే" డాక్టర్ ఉదయ్ బాధపడుతూ అన్నాడు.
"కనీసం అంతవరకయినా ఉపయోగపడింది. సంతోషించవచ్చు. మిష్టర్స్ విల్సన్ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి డి.యస్.పి. గారూ?" అన్నాడు డాక్టర్ జయంత్ రావు.
"దట్సాల్ రైట్! ఇట్లాటివన్నీ మాకు అలవాటే చూడండి నాతడాఖా ఏమిటో డాక్టర్ జయంత్ " అని పక్కనే నిలబడి వున్న యస్సైని హెచ్చరించాడు విల్సన్.
"అదుగో ఆ రిక్షావాడు తిరిగొస్తున్నాడు. వాడ్నొక పట్టుపట్టు."
"యస్సార్!" యస్సై హమీద్ శరవేగంగా వెళ్ళి రిక్షావాడ్ని పట్టుకున్నాడు.
"డాక్టర్ జయంత్ మనం ఓపని చేద్దాం. ఆ రిక్షావాడు మనచేతుల్లో పడ్డాడు వాడు రాత్రి తాగిన సారాతో సహా కక్కించే పని మా హమీద్ చూసుకొంటాడు. మనం ఆలోపల లాడ్జీమీద రైడ్ చేసి, ఈ రిక్షాలోనుంచి దిగి లోపలకెళ్ళిందెవరో చూద్దాం. ఒకవేళ ఆవిడ మాధవికూడా కావచ్చు ఆఫ్ కోర్స్ డాక్టర్ ఉదయ్ నమ్మకం లేకపోవచ్చు. లెటజ్ ట్రై!" కమాన్ " టకటకా రోడ్డుదాటి లాడ్జిముందుకు నడిచాడు విల్సన్. ఉదయ్, జయంత్. ఇద్దరు కానిస్టేబుల్స్ అతడ్ని అనుసరించారు.
లాడ్జి మెట్లెక్కుతున్న విల్సన్ రావు చెయ్యి పట్టుకొని ఆపాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
"పర్ హప్స్! లాడ్జిలో వున్నది మాధవి కాకపోతే?"
"మనకొచ్చిన నష్టమేముంది బ్రదర్. ఆ రిక్షావాడ్నీ, ఆవిడ్నీ లోపలేసి ఇంటరాగేట్ చేద్దాం. తప్పకుండా కొంత ఇన్ ఫర్ మేషన్ దొరుకుతుందనే నమ్మకం నాకుంది. అసలు వాళ్ళే....అదే మేజిక్కోళ్ళు వీళ్ళను కన్ ప్యూజ్ చేసి మాధవిని ఎత్తుకుపోయారేమో?" అంత బ్రహ్మాండమైన ఆలోచన తట్టినందుకు బ్రహ్మానందపడిపోయాడు విల్సన్ రావు.
"కావచ్చు. లేక యాదృచ్చికమూ కావచ్చు. ఈరిక్షావాడికీ, రిక్షాలో వచ్చినావిడకూ, ఏ సంబంధమూ లేకనూ పోవచ్చు. ఆమె మామూలు వ్యభిచారిణే అయివుండవచ్చు." తనలో తన్నుకొస్తున్న ఆదుర్దాను అణిచి పెట్టుకొంటూ అన్నాడు ఉదయ్ చంద్ర.
"ఒకవేళ మీరన్నదే నిజమైనా మనకు ముంచుకుపోయిందేమీలేదు. ఇమ్మోరాల్ ట్రాఫిక్ క్రింద ఆవిడ్ని, లాడ్జివాడ్ని బుక్ చెయ్యొచ్చు. లాడ్జిమీద రైడ్ చసిన కేసోకటి మన క్రెడిట్ లో వుంటుంది. డి.యస్.పి. స్వయంగా రైడ్ చేశాడని రేపు పేపర్లలో పెద్ద ప్రచారం వస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు" విల్సన్ ఆనందంగా నవ్వుతుంటే మీసాలు పైకీ కిందకూ కదిలాయి.
"మిస్టర్ విల్సన్. నా వర్రీ అదికాదు. మాధవి మీ ఆపరేషన్ అమావాస్య పథకంకింద మీరు మీ బలగం ఆమె వెనకే, ఉన్నారన్న ధైర్యంతో, రాంబాబు వీరభద్రుడి దృష్టిలో పడడానికి ప్రయత్నించింది అనుకోండి! మీరు చెప్పినట్టే వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దొరికిపోయిందే అనుకోండి....అప్పుడు ఆమెను కాపాడేదెవరూ? మీరు లాడ్జి రైడ్ చేస్తూ ఇక్కడుంటారు. అక్కడ వాళ్ళామెను...." ఉదయ్ గొంతు పూడి పోయింది.
గొంతు సవరించుకొని అన్నాడు...."అదే జరిగితే చేచేతులా మనమే ఆమెను మృత్యువు నోట్లోకి తోసినట్లవుతుంది. మీ పులివేటలో మేకగొంతుకు తాడుకట్టి పులినోట్లోకి అందించినట్టు అవుతుందండి విల్సన్ గారూ?" అతడి కంఠం బాధా, ఉద్వేగం ఒకదాన్నొకటి పరుచుకొన్నాయి.
"అవును! మిస్టర్ విల్సన్ వెళ్దాం పదండి" ఉద్రేకంగా అన్నాడు జయంత్.
"ఒకవేళ ఈమే ఆమైతే, ఏదో సామెత చెప్పినట్టు.....ఉన్నదీ పోయింది....ఉంచు...."
"విల్సన్ సామెతలు తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్పుకోవచ్చు. ఏదో ఒకటి తెల్చిచెప్పు. నువ్వు రాకపోతే మేమైనా వెళ్తాం" అసహనంగా అన్నాడు జయంత్.
"డి.యస్.పి. విల్సన్ రావుకు బుర్రవేడెక్కిపోయింది.
"మీరు చెప్పిందీ పాయింటే. ఒకపని చేద్దాం. నేను, ఇద్దరు కాని స్టేబుల్సూ వుండి, ఈ రిక్షావాడి సంగతీ,లాడ్జి సంగతి చూసుకొనివస్తాం. ఎస్సై హామీద్ నూ, హెడ్ నూ, టూనాట్ ఫోర్ నూ తీసుకొని మీరు బయలుదేరండి. బస్ స్టాండూ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సి.ఐ. కృష్ణయ్యా, అసిస్టెంట్ ఎస్సై ఏడుకొండలూ మఫ్టిలో తిరుగుతూ వుంటారు. నేను వచ్చేలోగా అవసరం అయితే వాళ్ళు మీకు సహాయపడ్తారు. సరేనా?" జయంత్ రావు భుజంతట్టి మరీ చెప్పాడు డి.యస్.పి. విల్సన్ రావు.
డాక్టర్ ఉదయ్, జయంతరావు, గబగబారోడ్డు క్రాస్ చేసి దూరంగా ఆపివున్న కారు దగ్గిరకొచ్చారు. ఎస్సై హమీదూ, హెడ్డు కొండలూ, కానిస్టేబుల్ సహవచ్చి కార్లో కూర్చున్నారు.
డి.యస్.పి విల్సన్ రావు , సావిత్రిలాడ్జి తలుపులు బాడుతూవుండగా కారు బయలుదేరింది.
బస్ స్టాండు కు కొద్దిదూరంలో చెట్టునీడలో కారాపి, ఉదయ్, జయంత్ బస్ స్టాండు కేసి నడిచారు. కొంతదూరంలో వాళ్ళను హమీదూ, కొండలూ అనుసరించారు.
ఉదయ్, జయంత్, బస్ స్టేషన్ లో తిరగసాగారు. ప్రయాణీకుల వైటింగ్ స్టాండులు చూశారు. ఆగివున్న బస్సుల, కార్ల వెనక తిరిగిచూశారు. మాధవిజాడ కన్పించలేదు.
హమీద్ టాక్సీ డ్రైవర్లనూ, రిక్షావాళ్ళానూ, "ఒంటరిగా ఓ ఆడకూతురు కన్పించిందా" అంటూ ప్రశ్నించాడు.
"జయంత్! చాలా పొరపాటు చేశాం" నీరసంగా అన్నాడు ఉదయ్.
"నాకూ అలాగే అన్పిస్తుంది. అసలీ పోలీసోళ్ళను నమ్ముకోవడం" జయంత్ అంటూ ఉండగానే హమీద్ "సారీ! సార్" అంటూ దగ్గర కొచ్చాడు.
ఇద్దరూ ఆశగా హమీద్ కేసి చూశారు.
"ఇన్ ఫర్ మేషన్ దొరికింది సార."
ఉదయ్ ముఖం వెలిగిపోయింది. జయంత్ సంతోషంగా ముందుకు దూకి హమీద్ చెయ్యిపట్టుకొన్నాడు.
"వయసులో వున్న ఆ ఆడకూతుర్ని ఇద్దరు మనుషులు వైట్ ఎంబాసిడర్లో....."
"చలో? చలో హమీద్" హమీద్ మాటపూర్తికాకుండానే జయంత్ కారు దగ్గరకు పరుగుతీశాడు.
"ఓ మైగాడ్!" ఉదయ్ , జయంత్ వెనకే పరుగుతీశాడు. అతడి వెనకే ఏడుకొండలూ, హమీదూ ఒక్క పరుగులో కారు దగ్గరకొచ్చి పడ్డారు.
"అరే! ఏంటోయ్? ఏమిటి చూస్తున్నావ్? జల్దెక్కు." కారు ముందు నిలబడి నంబరు ప్లేటుకేసి దీక్షగా చూస్తున్న కానిస్టేబుల్ ను గదమాయించాడు యస్సై హమీద్. వెనకడోర్ తెరిచి కూర్చుంటూ.
కారు ప్రంట్ డోర్స్ తెరుచుకొని ఉదయ్ , జయంత్ ఒకేసారు ఎక్కికూర్చున్నారు.
కానిస్టేబుల్, హెడ్డుకోసం చూస్తూ వెనకడోర్ పట్టుకొని చూస్తూ నిలబడి ఉన్నాడు.
డాక్టర్ జయంత్ ఇంజన్ స్టార్ట్ చేసి, ఇంకా కారూ అడ్డంగా నిలబడివున్న కానిస్టేబుల్ని చూశాడు. వెనక్కు తిరిగి, వెనకసీట్లో కూర్చుని వున్న యస్సైతో "ఏమండీ! ఎస్సైగారూ? మీ హెడ్డుకు అసలు హెడ్డే లేనట్టుంది. సెన్స్ ఆఫ్ అర్జేన్సీ వున్నట్టులేదు. ఇంకా మొద్దులా ఎలా నిలబడ్డాడో చూడండి" కసిగా అన్నాడు.
"వాడొట్టి బేవకూఫ్ సార్! ఆవో! క్యాదేక్కేరే? మీరు పోనీయండి సార్. కాళ్ళు విరిగితే ఇన్ వాలిడ్ పెన్ షన్ ఇచ్చేసి వదిలించుకొంటాం. ఇట్టాంటి వాళ్ళుండబట్టే, మా డిపార్ట్ మెంట్ పరువు ఖతం అయిపోతుంది సార్" మీరుపోనీయండి సార్ అంటూ డోర్ లో నుంచి తల బయటికి పెట్టి కారుకు అడ్డంగా నిల్చునివున్న ఏడుకొండల్ని చురచుర చూశాడు.
"అరే ఏందిబే! దిమాగ్ కరాబయిందా ఏంది?"
ఆ తిడ్తున్నది ఎవర్నో అన్నట్టుగా హెడ్ ఏడుకొండలు, ముందు రెండడుగులే, వంగి హమీద్ చెవుదగ్గర నోరుపెట్టి ఏదో చెప్పాడు అతి రహస్యంగా.
"అరే! ఐసాకైసా హొతారే?"
కార్లోనుంచి షాక్ తిన్నవాడిలా ఒక్కసారి బయటికి దూకాడు యస్సై హమీద్. వేగంగా కారు ముందుకెళ్ళి వంగి చూశాడు. మళ్ళీ అంత వేగంగానూ వెనక్కువెళ్ళిచూశాడు. యస్సై నీరుకారినట్టయిపోయి, మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ, ముందుసీట్లో కూర్చున్న జయంత్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అతడి కళ్ళల్లో ఏదో అనుమానం ముఖంలో అంతులేని ఆశ్చర్యం.....
నుదురుకు పట్టిన చమట తుడుచుకుంటూ హెడ్డు యస్సై ముఖంలోకి గర్వంగా చూశాడు.
"డాక్టర్ సాబ్! ఇంజను ఆపేయండి" స్టీరింగ్ మీద చెయ్యివేసి, జయంత్ ను ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నాడు హమీద్.
చిరాకూ, కసి, కోపంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ జయంత్ ఇంజన్ ఆపుచేసిఁ స్టీరింగ్ మీదవున్న హమీద్ చేతిని తోసేశాడు. డోర్ తెరుచుకొని కారుదిగాడు. రెండోవైపు డోర్ తెరుచుకొని ఉదయ్ కారుదిగి, వాళ్ళిద్దరి వచ్చి నిలబడ్డాడు.
"ఏమైంది యస్సైగారూ? ఏమిటిగొడవ? మీరేగదా చెప్పారు వైట్ ఎంబాసిడర్ కార్లో...."
"అవునండీ! మేమే చెప్పాం" గంభీరంగా ముఖం పెట్టాడు హమీద్.
"అయితే ఇప్పుడెందుకు అవుతున్నారూ? ఉదయ్ కంఠం తీవ్రంగా వుంది.
"అరే ఏం ? అట్టా చూస్తా నిలబడ్డావేం? చెప్పు?" హెడ్డునుకసురు కొన్నాడు యస్సై.
"ఇద్దరు మనుషులు-వైట్ ఎంబాసిడర్ కారు."
"సో వాట్?"
"ఏ. ఐ.ఏ. 2000!" గారపట్టిన పళ్ళు వెళ్ళబెట్టి అదోలా నవ్వాడు హెడ్డు ఏడుకొండలు.
"వాడ్డూయూమీన్?" ఉదయ్ కు కాళ్ళకింద భూమి కదిలినట్టయింది.
"యూబ్లడీ ఇడియట్స్? మీరుకనుక్కున్న ఇన్ ఫర్ మేషన్ ఇదా?" జయంత్ వళ్ళు తెలియని కోపంతో అరిచాడు.
"మాటలు జాగ్రత్తగా రానీయండి" హమీద్ కళ్ళెర్రజేశాడు.
"రానిస్తాలే. మీ డియస్పీని రానియ్ మీ సంగతేదో తేలుస్తా."
"రానీయండి. మాకేం భయమా? ఇట్టాంటి కేసులు మా సర్వీసులో చాలా చూశాం. మీ ఇద్దరూ ఈ వైట్ ఎంబాసిడర్ ఏ.ఐ.ఏ.2000లో ఆ పిల్లను ఎత్తుకునిపోయి, పైగా మాకు కంప్లైంటుచేసి మమ్మల్ని పరేశాన్ చేస్తారా? మా డిపార్ట్ మెంట్ ను, బదనామ్ చేస్తారా? మీకు మాబాస్ సంగతి సరిగ్గా తెలియదనుకుంటాను. స్నేహం గ్నీహం జాన్తానై! పెద్దా చిన్నా చూసేదిలేదు. ముందు లాకప్ లోకి తోసేసి రోకలిబండ ట్రీట్ మెంట్ ఇస్తాడు. ఎంత రాటుతేలిన క్రిమినల్ అయినా మూడురోజుల్లో నిజాలు కక్కేస్తాడు....."