"అదిసరే..... కాని.... నీకు తెలియదా, ప్రకాష్ విడాకులకి అంగీకరించడంలేదని."
"ఏడిశాడు. వాడికి ముందేం చెప్పద్దు. పెళ్ళి చేసుకోండి - తెలిస్తే ఏం చేస్తాడో చూద్దాం. కోర్టు కెక్కితే విడిపోయి ఆరేళ్లయింది, పెళ్ళి చేసుకోడానికి కావాలని పర్మిషన్ ఇవ్వడం లేదు, తను మాత్రం ఇంట్లో ఆడదాన్ని పెట్టుకుని సంసారం చేస్తున్నాడు అని వాదించవచ్చు. చూద్దాం..... అసలేం చేస్తాడో?"
లత మాటలతో వాడిపోయిన ఆశ మళ్ళీ చిగిర్చింది. ఆ కొద్ది క్షణాలలోనే - సుధాకర్..... నిజంగా అతనితో పెళ్ళయితే తనకంతకంటే కావాల్సిందేం వుంది? మనిషి చాలా సరదాగా, సౌమ్యంగా ఉన్నాడు. అలాంటి భర్తనే గదా కోరుకుంది తాను - ఒక్కనిమిషంలో ఏదో ఆశ కల్గింది. అప్రయత్నంగానే పెళ్ళికూతురయినట్టు సిగ్గుపడిపోయింది. "ఏమిటో నాకేం తెలియడం లేదు - ఏం చెయ్యాలో? ప్రకాశరావు ఏం చేస్తాడో - తెలిస్తే?" భయంగా అంది.
"అన్నింటికీ భయపడితే ఎలా నిర్మలా? కొంత తెగువ వుండాలి ఇలాంటి పనులకి."
"నాన్న..... నాన్నగారితో చెప్పు..... నాకేం తెలీదు......" అంది ఆఖరికి.
"ఆయనతో మాట్లాడతాను. మాట్లాడే ముందు నీ అభిప్రాయం వినాలని చెప్పాను"
అంది లత.
"కాని వదినా! సుధాకర్ కావాలంటే నా మాత్రం పిల్ల దొరకదా, నన్నెందుకు చేసుకుంటానన్నాడు." బిడియంగా అంది.
"కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు నిర్మలా! కొంతమందిని చూడగానే ఎందుకో మనకి తెలియకుండానే ఇష్టం ఏర్పడుతుంది. ఫలానా అని కారణం చెప్పలేం. సుధాకర్ నిన్ను చూడగానే ఎందుకిష్టపడ్డాడో తనకే తెలియదన్నాడు. నేను మావగారితో మాట్లాడతాను. ఆయన అభిప్రాయం విని సుధాకర్ ని పిలిపిస్తాను..... మాట్లాడవచ్చు" అంది లత.
లత మామగారి గదిలోపలికెళ్ళేసరికి ఆయన అన్యమనస్కంగా ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన మొహం కళ తప్పి వుంది. "మావయ్యా!...." లత పిల్చింది.
శివశంకరంగారు ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూశారు. అంత చనువుగా కోడలు వచ్చి మాట్లాడలేదు ఎప్పుడూ. "ఏమిటమ్మా?" అన్నారు ఆప్యాయంగా.
"నేను నిర్మల పెళ్ళి విషయం మాట్లాడాలని వచ్చాను." సూటిగా విషయంలోకి దిగింది.
శివశంకరంగారు ఆశ్చర్యంగా 'నిర్మల పెళ్ళా.....!' అన్నారు.
"అవునండి - మా కజిన్ బ్రదర్ సుధాకర్ మొన్న వచ్చాడు.... మీరు చూశారుగా! అతను మీరు అంతా ఇష్టపడితే నిర్మలని చేసుకుంటానంటున్నాడు."
శివశంకరంగారి మొహంలో ఒక్కక్షణం ఆనందం మెరిసింది. ఆ కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు తటిల్లతలా మెరిసింది. అంతలోనే మబ్బులు కమ్మినట్టు మొహంలో వెలుగు మాయమయింది. 'కాని..... ఆ దరిద్రుడు వప్పుకోడం లేదు కదమ్మా! వప్పుకుంటే ఏనాడో చేసి వుండేవాడిని. ఎవరో ఒకరు ఈపాటికి దొరికేవారు. డబ్బాశ చూపయినా ఏదో సంబంధం వెతికితెచ్చేవాడిని."
"మీరతనికి ఎందుకంత భయపడటం? గప్ చిప్ గా పెళ్ళి చేసేయండి. కోర్టు కెక్కుతాడా..... చూద్దాం. లేదంటే వాడి మొహాన ఇంత డబ్బు కొట్టి వదిలించుకుందాం వాడిని."
"హు..... అదీ అయిందమ్మా..... ఆ ఆశాపోయింది. చూడు, ఇదుగో..... ఇది చదువు" అంటూ టేబుల్ మీద నుంచి ఓ రిజిష్టరు ఉత్తరం తీసి లత చేతికిచ్చారు. అది ప్రకాశ్ రావు లాయరు శివశంకరంగారు డబ్బు ఇస్తానన్నదానికి జవాబుగా రాసిన ఉత్తరం. దాన్లో - తన క్లయింటు 'అంగీకారం' ఖరీదు మీరిస్తానన్నదానికి పక్కన ఇంకో సున్నా చేర్చండి. అంటే రెండుకి పక్కన సున్నా చేరిస్తే ఇరవై లక్షలు. ఇరవై లక్షలిస్తే వెంటనే అంగీకరిస్తాడు. అతనికి తెలియకుండా, దొంగతనంగా గాని, మోసంచేసిగాని పెళ్ళిచేస్తే దాని పర్యవసానం అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీ సంగతులు మాకు ఎప్పటికప్పుడు అందుతూనే వుంటాయి గనక అలాంటి పిచ్చిపనులు చేసి ఇబ్బందిపడరని ఆశిస్తున్నాం. మా క్లయింట్ మీ అమ్మాయిని ఇప్పటికీ భార్యగానే భావిస్తున్నాడు - ప్రకాశరావు భార్యగానే ఆమె మిగిలేటట్టు చూడటం అతని ధ్యేయం.......!
"చూశావా అమ్మా! వాడెంత సాడిస్టో! లక్ష రెండు లక్షలో అయితే తేలిగ్గా ఇస్తాం అని ఏకంగా ఇరవై లక్షలన్నాడు. నా ఆస్తులు అన్నీ అమ్మినా ఇరవై లక్షలు ఇవ్వలేనని తెలిసే అలా బేరం పెట్టాడు. ప్రకాశరావు భార్యగానే అది మిగలాలి అంటే మరో పెళ్ళికి అతడు అంగీకరించడన్న మాట స్పష్టం చేస్తున్నాడు. లాభం లేదమ్మా..... వాడుత్త దరిద్రుడు - పగపట్టిన పాము అయ్యాడు. మనం ఏదన్నా తొందరపడితే బైగమీకింద లేదా అడల్టరీ కింద కేసు పెట్టడానికి సిద్ధంగా వున్నాడు.
ఇలాంటి స్థితిలో పాపం మీ కజిన్ కూడా ఇరుక్కోడం ఎందుకమ్మా! అతనంత మంచి హృదయంతో దాని చేయి అందుకోడానికి సిద్ధపడ్డా, ఆ చేయి అంది పుచ్చుకునే అదృష్టం దీనికి లేదమ్మా! నేను ఓడిపోయానమ్మా.... నా వైపునుంచి అన్ని ప్రయత్నాలూ చేసి ఓడిపోయాను. ఇంక దానిరాత అంతే - ఇలా ఏకాకిలా బతుకీడవలసిందే. అన్నీ వుండి దాని అదృష్టం అలా వుంటే మనం ఏం చెయ్యగలం తల్లీ! నీవు మంచి మనసుతో సహాయపడాలనుకున్నావుగాని అది జరిగేది కాదమ్మా" బాధగా అన్నారు.
"పోనీ ఒకసారి సుధాకర్ తో కూడా మాట్లాడతాను. అతను రిస్క్ తీసుకోగలనంటే..... ఇంతకీ అతను పర్మిషన్ ఇవ్వకపోతే పెళ్ళి చేసుకుంటే కేసుంటుందా - ఇన్నాళ్ళుగా విడిగా వున్నా" సందేహంగా అడిగింది.
"ఉంటుందమ్మా - బైగమీ కింద. అడల్టరీ కింద కేసు పెట్టవచ్చు. కోర్టు మూలకంగా డైవర్సు తీసుకోకపోయినా కనీసం మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సెపరేషన్ అయినా అయి వుండకపోతే రెండోవారు పెళ్ళి చేసుకోడానికి చట్టం వప్పదు. అది తెలిసే అతను దీనిమీద కక్ష సాధించడానికి విడాకులు ఇవ్వకుండా అల్లరి పెడుతున్నాడు. వాడు మాత్రం ఎవర్తినో తెచ్చి పెట్టుకున్నాడు. ఈ దేశంలో మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. వాడు చేశాడని నిర్మలా అలా చేస్తే లోకం వూరుకుంటుందా?........