Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 31

    పెరట్లో పూసిన సన్నజాజులు, కనకాంబరాలు, మరువం అవి కోసి మాలకట్టి లత కిద్దామని వచ్చిన నిర్మల దివ్య అన్నమాటలు విని గుమ్మం బయటే ఆగిపోయింది. ఎంత దారుణంగా మాట్లాడుతోంది దివ్య - ఎప్పటికప్పుడు తనని ఏదో అని హర్ట్ చెయ్యకపోతే తోచదు కాబోలు! ఇంట్లో అమ్మా నాన్న వున్నారు కాబట్టి లోపల లోపలే అంటుంది. వాళ్ళే లేకపోతే మాటలతో చిత్రహింస పెట్టేదేమో ఈపాటికి? తండ్రి తనకంతా దోచి పెడ్తాడని కాబోలు భయం. ఈ ఆస్తిలో తనూ వాటా కొచ్చిందని గాబోలు ఆ దుగ్ద. ఈ డబ్బు, ఆస్తి తనకేం అక్కరలేదు. వాళ్ళకే కట్టబెట్టమంటుంది. ఎందుకు గొడవలు అని సహిస్తున్న కొద్దీ అంటూంది దివ్య - వూరుకుంటున్న కొద్దీ అలుసు తీసుకుంటోంది. ఏనాడూ రానంత కోపం వచ్చింది నిర్మలకి గదిలోకి దూసుకు వెళ్ళింది. దివ్య మాటలు సగంలో ఆపేసి గాభరా పడింది. లత నిర్మలని చూసి నవ్వి ఏదో అనబోయింది.
    "వదినా, ఇది నా పుట్టిల్లు - నాకింకా అమ్మా నాన్నా బతికున్నారు. నేను కాపురం వదిలి వచ్చినా, మొగుణ్ణి వదిలి వచ్చినా నాకో పుట్టిల్లు వుంది కనక వచ్చాను. అమ్మా నాన్న లేకపోతే అడుక్కుతిననైనా తింటాను కాని మీ ఇంటికిరానులే! నీ బాబు సొమ్ము తిని పోతున్నట్టు మరి మాట్లాడావంటే మాట దక్కదు. నీకెంత హక్కు వుందో నాకు తెలియదు కాని ఈ ఇంట్లో నాలుగో వంతు భాగం నాదీ అని మర్చిపోకు. ఆస్తి కోసం, డబ్బుకోసం, నేను కక్కుర్తిపడను. నా వంతు కూడా నీ మొగుడికీయమని నాన్నకి చెపుతానులే. బతకటానికి నా సంపాదన చాలు నాకు. అమ్మా నాన్నల మొహాలు చూసి ఇక్కడ ఉంటున్నాను. కాని గతిలేక కాదు - ఈసారి నా గురించి ఒక్కమాట అన్నావంటే మర్యాదదక్కదు జాగ్రత్త!" నిర్మల మొహం ఎర్రబడిపోగా ఆవేశంగా వణికిపోతూ అర్చింది.       
    "చూశావా లతా...... చూశావా ఆ పొగరు..... ఏం వున్నా లేకపోయినా ఆ పొగరు చూడు....." దివ్య ఉక్రోషంగా ఏదో అనబోయింది.
    "ఏం..... మొగుడ్ని వదిలాను కాని మానం, అభిమానం, పౌరుషం అన్నీ వదిలాననుకుంటున్నావా? నీ చేత మాటలు పడేంత పనికిమాలినదాన్ననుకుంటున్నావా. ఆడదానివయివుండి తోటి ఆడదాని ఇబ్బందేమితో, ఎందుకిలా జరిగిందోనన్న ఆలోచన లేకుండా, చదువుండి సంస్కారంలేని నీవు ఓ మనిషిననుకుంటున్నావా? నన్ను అనేటంత, వేలెత్తి చూపేంత గొప్పదానివా?.... ఈసారి నా జోలికి వచ్చావంటే ఈ చెప్పుదెబ్బ రుచి చూపిస్తాను."
    ఏం అంటున్నది తెలియనంత వెర్రి ఆవేశం వచ్చేసింది నిర్మలకి. ఆ గోలకి అందరూ చుట్టూ చేరారు. లత నిర్మలని శాంతపర్చాలని ప్రయత్నిస్తూ.. "నిర్మలా..... ప్లీజ్ స్టాపిట్..... ఏమిటిది అసహ్యంగా? మనం ఇలా దెబ్బలాడుకోకూడదు" అంది.
    "అవును లతా..... మనం అనకు. నీవిలా మాట్లాడకూడదు అని నాకు నీవూ నీతులు బోధించు. తను ఎన్ని మాటలయినా అనచ్చు - ఈ రెండేళ్ళుగా మెత్తని కత్తిలా నన్ను చూపులతో, ఎత్తిపొడుపులతో ఎంత గాయపర్చిందో మీకేం తెలుసు? ఆవిడ చూపులలో హేళన, తిరస్కారం అనుభవించిన వారికి అర్థమవుతాయి. అయినా అంతా సహించాను. నా వల్ల కుటుంబంలో కలతలు రాకూడదని. నేనేం చేసానని నామీద ఇంత కక్ష? తన ఆస్తి, సంపాదన నేను తినిపోతున్నానని దుగ్ద?...... ఎందుకింత లోకువ నేనంటె? మొగుణ్ని వదిలాననా? నా కష్టమేమిటో, బాధయేమిటో ఏమి అర్థం చేసుకోకుండా ఇలా అంటుంటే ఎంతకని సహించను? ఎన్నాళ్ళని సహించను? నేనిక్కడ వుండటమే మీ కంత కష్టంగా ఉంటే ఈ రోజే ఇంట్లోంచి వెళ్ళిపోతా." ఆవేశంగా మొదలుపెట్టి గొంతు పూడుకుపోగా ఇక మాటరాక దుఃఖం ముంచుకు వచ్చింది. ఆమె కేకలకి అందరూ మూగబోవడంతో దివ్య బెదిరిపోయింది. గిల్టీగా, బెరుకుగా చూసింది.
    "నీరూ..... నీవెక్కడికీ వెళ్ళనవసరంలేదు. నీవు ఈ ఇంట్లో వుండటం ఇష్టం లేనివారు ఈ ఇంట్లోంచి వెళ్ళచ్చు - నేనున్నన్ని రోజులు నిన్ను వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. ఈ ఇంట్లో మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే నేను సహించను" శివశంకరంగారు చాలా గంభీరంగా అందరి వంకా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
    రఘు బిడియంగా తలదించుకున్నాడు. దివ్య మొహం అవమానంతో నల్లబడింది. లత నెమ్మదిగా నిర్మల చెయ్యిపట్టుకుని గదిలోంచి బయటికి తీసుకొచ్చేసింది. కృష్ణ జరిగిందేం విననట్టు డ్రాయింగ్ రూంలో మొహానికి పుస్తకం అడ్డం పెట్టుకుని చదువుతున్నట్టు కూర్చున్నాడు.
    "నిర్మలా! నీవు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి. నీవు ఊ అంటే ఓ మంచి సంబంధం వుంది చెపుతాను." రెండు రోజుల తరువాత ఓ సాయంకాలం డాబా మీద ఇద్దరూ కూర్చుని వుండగా అంది లత.
    నిర్మల ఒక్కనిమిషం తెల్లపోయి తరువాత విరక్తిగా "చాలు, ఒక పెళ్ళి చేసుకుని అనుభవిస్తున్నాను..... ఇంకో పెళ్ళి కూడానా?" అంది.  
    "అలా అనకు..... అందరూ ప్రకాశరావు లాగానే ఉంటారని ఎందుకనుకోవాలి. మా చిన్నాన్న గారి అబ్బాయి..... మొన్న వచ్చాడు చూడు..... అతను నీవంటే ఇంటరెస్ట్ చూపుతున్నాడు. నిన్ను నా పెళ్ళిలో చూసిందగ్గిరనించి. నీ గురించి చాలాసార్లు అడిగాడు. మొన్న వచ్చినప్పుడు మళ్ళీ అడిగాడు. నేను నవ్వి 'ఎందుకావిడ సంగతులు?' అంటూ హాస్యం ఆడాను. నేను ముందునించి నిన్ను అతను ఇష్టపడుతున్నాడని గ్రహించాను. కాని, నీ ఉద్దేశమేమిటో, అసలు సుధాకర్ ఎందుకు అడుగుతున్నాడో ఆ వివరాలు తెలుసుకోకుండా చెప్పడం ఎందుకని వూరుకున్నాను. అసలిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? ఉత్తరాల ద్వారా కుదరదు. స్వయంగా సుధాకర్ తో మాట్లాడాలని పండుగ వంకబెట్టి వచ్చాను."
    "ఎవరు..... అతను..... మీ చిన్నాన్న కొడుకన్నావు..... అతనా....." అంది ఆశ్చర్యంగా నిర్మల.
    "ఆ.... అతనే! మొన్న డాబామీదకి తీసుకొచ్చి అడిగితే..... నీవు ఇష్టపడితే పెళ్ళిచేసుకుంటానన్నాడు."    
    "అతనికి నా సంగతి తెలుసా? తెలిసీ అన్నాడా?" ఆశ్చర్యంగా అంది.
    "అంతా చెప్పాను. అతనికేం అభ్యంతరం లేదు. సుధాకర్ చాలా మంచివాడు. పర్సనల్ మానేజ్ మెంటు కోర్సు పాసయి పర్సనల్ మేనేజర్ గా ఉన్నాడు ఆలిన్ కంపెనీలో. తండ్రి లేడు, తల్లి వుంది. ఆవిణ్ని తను వప్పిస్తానన్నాడు." లత అంతా చెప్పింది.
    నిర్మల బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. సుధాకర్ పెళ్ళిలో ఒకసారి చూసినా గుర్తులేదు. మొన్న వచ్చినప్పుడు మాత్రం లత పరిచయం చేస్తే చూసి, ఐదు నిమిషాలు మర్యాద మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. సుధాకర్ అంత చక్కగా ఉన్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతనికేం ఖర్మ, రెండో పెళ్ళి దాన్ని తన్ను చేసుకోడానికి? నిర్మల మొహంలో భావాలు చదివినట్టు "ఎంతమంది ఈ రోజుల్లో రెండో పెళ్ళి చేసుకోవడం లేదు నిర్మలా..... నీ ముందు ఎంతో బతుకుంది. ఎన్నాళ్ళిలా వంటరిగా ఈ బతుకు......"    

 Previous Page Next Page