మానవ స్వభావం ప్రకారం ఆ అమ్మాయి అలా అనడం సహజమే కాని, ఆ టీచర్ కు ఎప్పుడూ సమయానికి వచ్చి, శ్రద్ధగా పాఠాలు వినే ఆ అమ్మాయి అంటే అభిమానం ఆ రోజు ఆలస్యంగా రావడానికి ఏదో ప్రత్యేకమయిన కారణం వుండి వుంటుందనే ఉద్దేశ్యంతో అడిగింది.
విమర్శ అనేది ఒక దర్పణం లాంటిది విమర్శను సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మనల్ని మనం సంస్కరించుకొనే అవకాశం లభిస్తుంది అద్దంలో చూసుకుంటూ ముఖాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్నట్టు, మన లోపాల్ని మనం అర్థం చేసుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. కాని విమర్శ సహృదయంతో చేసేదిగా వుండాలి ప్రెజుడిస్ తో చేసే విమర్శకు విమర్శ అవుతుంది సహృదయంతో చెయ్యని విమర్శను సాహసం ఉంటే ఎదుర్కోవాలి లేదా దాన్ని పట్టించుకోకూడదు.
ఈ మధ్య స్త్రీల రచనల మీద వచ్చే విమర్శలన్నీ ప్రెజుడిస్ తో చేస్తున్నవే సహృదయంతో చేసే విమర్శలు ఎప్పుడూ కన్ స్ట్రక్టివుగా ఉంటాయి స్త్రీలంతా చెత్త రాస్తున్నారు బాబోయ్ అంటూ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు అది చూసి కొందరు 'శభాష్' అంటూ ఉత్తరాలు రాస్తున్నారు.
పురుషులంతా క్లాసిక్స్ రాస్తున్నారట స్త్రీలు ఏ ఒకరిద్దరో (ఎవరో వారు?) తప్ప చెత్త రాసేస్తున్నారట ఎవరు రాసినా ఒకే స్టీరియో టైపుగా రాస్తున్నారు కార్బన్ కాపీల లాంటి విమర్శ రాస్తున్నారు.
సాహసం కావాలి విమర్శించడానికి ఏయే నవలలు చెత్తగా ఉన్నాయో చెబితే పాఠకులకు ఉపయోగపడుతుంది అంతేగాని, ఆడవాళ్ళంతా చెత్త రాస్తున్నారు, మగవాళ్ళందరూ గొప్ప రచనలు చేస్తున్నారు అని చెప్పడం విమర్శ కాదు.
బాగా చదువుకొని, విమర్శనా శక్తిగల మేధావులు కూడా కొందరు తోటి వారితో విరోధం వస్తుందనే భయంతో ఉపయోగపడే విమర్శ చెయ్యడం లేదు.
ప్రెజుడిస్ లేకుండా కన్ స్ట్రక్టివ్ విమర్శ చేసినప్పుడు రచయిత బాధపడడు ఆ విమర్శ గురించి ఆలోచించడం జరుగుతుంది అలా తన లోపాలను తెలుసుకొనే అవకాశం కూడా లభిస్తుంది.
కొందరు విమర్శను బొత్తిగా భరించలేరు అలాంటివారు ఎదగడానికి ప్రయత్నించరన్నమాటా: కొందరు మీతో సాన్నిహిత్యం సంపాదించడానికి, మీ చుట్టూ వారిని విమర్శిస్తారు మీ దగ్గిర మరొకర్ని (వారితో తియ్యగా మాట్లాడుతూనే) విమర్శించే వ్యక్తిని గురించి మీరు బాగా ఆలోచించండి ఆ అలవాటు ఉన్న వాళ్ళు చాటుగా మిమ్మల్ని కూడా విమర్శిస్తారు.
మన గురించి కాని, మనం చేసిన ఒక పని గురించి కానీ, మనం రచించిన పుస్తకం గురించి కానీ విమర్శ వస్తే, మనం సహనంతో దాన్ని గురించి ఆలోచించాలి మనకు అది సహృదయంతో చేసిన విమర్శా లేక దుష్టబుద్ధితో చేసిందా అనే విషయం తెలిసిపోతుంది.
సహృదయంతో చేసిన విమర్శ అయినా సరే, ఒకోసారి మనం ఆ విమర్శలోని అంశాలతో ఏకీభవించకపోవచ్చు అందులో మనకు నచ్చిన పాయింట్సు మీద మనం ఆలోచించవచ్చు అందుకే విమర్శ అనేది ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. అంతేకాని, అస్పష్టంగా మొత్తం సాహిత్యం మీదే జనరల్ రిమార్క్ పారెయ్యకూడదు అందువల్ల రాసిన వాళ్ళకు పత్రికల ద్వారా నాలుగు డబ్బులు రావచ్చు; పేరు అచ్చులో పడవచ్చు. కాని పాఠకులకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడదని చెప్పగలను ఇలాంటివారు ఒక్కొక్క పుస్తకము తీసుకొని లేక ఒక్కొక్క రచయిత్రి రచనల్ని తీసుకొని, వ్యాస పరంపరలు అవి ఎలా,ఎందుకు చెత్తలోకి జమకట్టాలో వివరంగా రాస్తే, ఇటు పాఠకులకి, అటు రచయిత్రులకూ కూడా కనువిప్పుగా ఉండగలదు.
హిందీలో ఒక మంచినవల వస్తే దాని మీద విమర్శనా గ్రంథాలు వస్తాయి కాని మనకు అలాంటి గ్రంథాలు ఏం? మనకు విమర్శకులు -- మంచి విమర్శకులు లేకపోలేదు కాని మంచి విమర్శ రావడం లేదు.
ఏది ఏమైనా, సద్విమర్శను సహనంతో స్వీకరించి ఆలోచించాలి ఆ విమర్శ వ్యక్తిగతమైనదే కావచ్చు లేక సృజనాత్మక ప్రతిభాపరమైనదీ కావచ్చు అందుకే కబీరుదాసు అన్నాడు:
"నిన్ను నీ ముఖం మీద నిందించే వాణ్ణి ఇంటి వాకిలి ముందు కుటీరం నిర్మించి అందులో ఉంచు సబ్బూ, నీళ్లూ లేకుండానే నీ మనసును నిర్మలంగా ఉంచగలడు."
సవతి తల్లి ప్రేమ
"ముసలి కన్నీళ్లు కార్చడం" "సవతి తల్లి ప్రేమ చూపించడం" లాంటి పదాలను మనం తరుచు ఉపయోగించడం వింటూ ఉంటాం మనం కూడా అంటూ ఉంటాం ఏ సందర్భంలో ఎలా అంటామో విడమర్చి చెప్పనవసరం లేదు.
మీ అందరూ అర్థం చేసుకోగలరు "సవతి తల్లి అనగానే కళ్ళముందు ఒక బ్రహ్మ రాక్షసి రూపంలో స్వైరవిహారం చేసే స్త్రీ కనిపిస్తుంది ఒక పసిదాన్ని పట్టుకొని బాదుతున్నట్లు దృశ్యం కళ్ళకు కడుతుంది.
ఆ సవతి తల్లి స్థానంలో ఉన్న స్త్రీకి హృదయం ఉండదు అని ఒక అభిప్రాయం మనమనసులో పాతుకుపోయింది.
ఆ స్త్రీ గురించి ఎవరూ సానుభూతితో ఆలోచించరు? సవతితల్లి స్థానాన్ని అలంకరించిన ఆ యువతి అందరిలాగే పెళ్ళికి ముందు తన భర్త గురించీ, తన సంసారం గురించీ ఎన్నో కలలు కనీ ఉంటుందనే విషయం మరచిపోతాం.
ఆమెలోనూ మాతృమూర్తి ఉందనీ, తనకు కలగబోయే బిడ్డల గురించి ఎన్నెన్నో ఊహించుకుని ఉంటుందని కూడా మరచిపోతాం.
తల్లిదండ్రులు బీదతనం కారణంగానో, మరే కారణంగానో, పెళ్ళి గురించిన తలంపుతోనే బుగ్గలో గులాబీలు వికసించే ముగ్ధను రెండో పెళ్ళి వాడికి ఇచ్చి చేస్తారు ఆ పురుషుడికి పిల్లలు ఉంటారు.
పెళ్ళికి వచ్చినవారు ఆ పిల్లల్ని చూసి, సవతి తల్లి పెట్టబోయే బాధల్ని ఊహించుకుంటూ జాలిపడతారు పిల్లల ఎదుటే తమ సానుభూతిని వ్యక్తం చేస్తారు అమ్మ వస్తోందని ఆనందంతో పెళ్ళి పందింట్లో తిరిగే పసివాళ్ళ మనసులో వారి సానుభూతి మాటల్తో భయం ప్రవేశిస్తుంది వారి హృదయాలలో కొత్త అమ్మ గురించి వింత వింత భయాలు ఏర్పడతాయి.
అంతేగాని రెండో పెళ్ళి వాడిని చేసుకుంటున్న ఆ అమ్మాయిని గురించి ఎవరూ జాలిపడరు ఆమె ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించరు ఆ పిల్ల పెళ్ళి కుదిరినప్పటి నుంచీ ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటుంది సవతి బిడ్డల్ని తన బిడ్డలుగా చూసుకోవాలని కూడా అనుకుంటుంది.
ఆ బిడ్డల మీద ఆమెకు ఆ సమయంలో ద్వేషం ఉండవలసిన అవసరం ఉండదు కాని ఊహ వేరు వాస్తవం వేరు.
సంసారంలో కాలుపెట్టిన రోజునుంచే ఆమెను సమస్యలు చుట్టుముడ్తాయి ఇరుగు పొరుగు మాటలు ఆమె చెవుల్లో పడతాయి భర్త కూడా ఒకపట్టాన తన భార్య సవతి బిడ్డల్ని ప్రేమించగలుగుతుందని నమ్మడు ఇక పిల్ల భయాల సంగతి ఆమెకు ఇట్టే అర్థం అవుతుంది సున్నితమైన ఆమె మనసు బాధపడుతుంది.
పిల్లలు అల్లరి చేస్తారు చెప్పిన మాట వినరు తల్లి కోప్పడుతుంది మరీ అల్లరి చేస్తే రెండు తగలనిస్తుంది అదే పని సవతి తల్లి చేస్తుందనుకోండి ఇంకేముంది? అదొక చర్చా విషయంగా మారుతుంది.
పిల్లల్ని కాల్చుకొని తింటుందనే భావం ఇరుగు పోరుగుల్లోనే కాదు - భర్త మనసులో కూడా నాటుకుంటుంది తను ఎలా చూసినా, ఎంత ప్రేమించినా అందరూ తనను సవతి తల్లిగానే భావిస్తున్నారనే బాధ ఆమెలో ద్వేషాగ్నిని రగిలిస్తుంది ఆమె కఠినంగా ప్రవర్తిస్తుంది.
ఇంటికి వచ్చే దగ్గర బంధువులనుంచి (మేనత్తలూ మొదలైన వాళ్ళు) ఇరుగు పొరుగు వాళ్ళ వరకు, పిల్లల్ని పిలిచి "ఏమ్మా: మీ పిన్ని నిన్ను బాగా చూస్తుందా? కొడుతుందా? తిడుతుందా? పాపం! మీ అమ్మ ఎంత మంచిదో! వెళ్ళిపోయింది మహాతల్లి:" అంటూ పిల్లల మనసులో సవతి తల్లి ఎడల విషబీజాలను నాటుతారు దాంతో సవతి తల్లి ఏ కొంచెం మందలించినా ఆ పిల్లలు ఆమె తమను బాదిస్తున్నట్లుగా భావిస్తారు.
ఇలా తల్లీ పిల్లల మధ్య గొడవలు లేస్తాయి తల్లికీ సవతి తల్లికీ ఉన్న భేదమల్లా 'ఆ సవతి' అనే శబ్దానికి సమాజం చాలా పెద్ద కళంకాన్ని ఆపాదించింది సైకలాజికల్ గా ఆ స్థానాన్ని ఆక్రమించుకున్న స్త్రీ వింతగా మారిపోయింది. కాదు, చుట్టూ వాళ్ళు ఆమెను మార్చేస్తారు మా కాలనీలో ఉండే గంగాభవాని అనే యువతి కథ చెబుతాను ఆ పిల్లకు పెళ్ళి నాటికి పదిహేడు సంవత్సరాలు తల్లిదండ్రులు అష్ట దరిద్రులు కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యలేరు. ఇంకా ముగ్గురు ఆడపిల్లలున్నారు బంగారు బొమ్మలాంటి భవానిని భార్యపోయిన వెంకట్రావుకు ఇచ్చి చేశారు అతని వయసు ముప్ఫయి ఏడు పెళ్ళినాటికి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తమ కూతురికి దిగుల్లేకుండా మంచి ఆశ్రయం లభించిందని తల్లిదండ్రులు సంతృప్తి పడ్డారు.
ఆ పిల్ల పూరింటిలో నుంచి పెంకుటింటిలోకి కాలు పెట్టింది భర్త పిల్లల్ని బాగానే చూసేది అయినా ఆ పిల్లలు ఆమెను తల్లిగా ఏనాడూ భావించలేదు ఆమెకూ ఇద్దరు సంతానం కలిగారు అయినా ఆమె ఎందరు ఎన్ని అన్నా నలుగురి పిల్లల్ని సమానంగా చూడసాగింది ఆమె పది వరకు చదువుకున్నది.