Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 31


    కుమారా! నీ కీ జన్మ వృత్తాంతము దెలిపి నిన్నుఁగొనిపోవుటకై వచ్చితిని. కౌరవ పాండవయుద్ధ మనివార్యము. అందు గర్ణార్జునులొండొరులతోఁ బోరుట నేనెట్లు చూడఁగలను? నామాట వినుము. ఎట్లయిన వచ్చి పాండవులతోఁ గలియుము. నా జీవితమును దురంత చింతానలముపాలు సేయకుము" అని దీనాలాపము లాడుచున్న తల్లినిఁ జూచి కర్ణుడు "జననీ! నన్ను క్షమింపుము. నీవు పలికినట్లు నేను నీబిడ్డనే! ఈ దేహమునందుఁ బ్రవహించునది నీ రక్తమే! కాని లోకము దృష్టిలో నేను సూతపుత్రుఁడను; రాదేయుఁడను! నేడు రాచబిడ్డనని బయటకువచ్చిన నా బ్రతుకు నవ్వులపాలుగాదా? తల్లీ! నన్ను బలవంతము చేయకుము. నేను నా సర్వస్వమును రారాజైన సుయోధనున కర్పించుకొని యున్నాఁడను. ఆతఁడు నా భుజబలముపై నాసపెట్టుకొనియున్నాఁడు. నేను విశ్వాసద్రోహము చేయఁజాలను, నీమాట వినలేదని యాగ్రహింపకుము. నీవు నాకు తల్లివే. నన్ను గంగపాలు కావించితివని నిన్ను దూషించునంతటి దుర్మార్గుడను గాను. ఆనాఁటి నీ యస్వాతంత్ర్యమును, ఈనాఁడు నీవు పడు బాధను నేను గ్రహించితిని నీకీకర్ణుఁడును పాండవులును సమానులే! ఇందెవరి ప్రాణమున కపాయము సంభవించినను నీ మాతృహృదయమునకు గొడ్డలిపెట్టే!
    అమ్మా! నీవడుగకపోయినను నేను నీకీ వాగ్దానము చేయుచున్నాను. అర్జునుఁడు తప్ప మిగిలిన పాండవులు యుద్ధమున నాచేతఁబడినను నేను వారిని సంహరింపను. కాని తల్లీ! నీవు పార్థుని విషయమున మాత్రము పట్టుబట్టకుము. అర్జునుని నేను జయింపఁగలనని రారాజు నాపైఁ గొండంత యాస పెట్టుకొని యున్నాఁడు. నన్ను మిత్రద్రోహిని జేయకుము. అర్జునుఁడు ఓడినచో నాతో నైదుగురమనుకొనుము. నేను ఓడినచో నీయైదుగురు నీకున్నారనుకొనుము. నీ మాటలు వినుచున్న కొలఁది నా హృదయము వ్యాకుల పడుచున్నది. నీవిఁక వెళ్ళుము తల్లీ! నిస్సహాయురాలవైన నీచేఁ జరిత్యజింపఁబడిన నీకుమారుఁడు నేఁడు నిఖిలరాజమండలములో నిరుపమాన కీర్తి నార్జించినాడు. వీరాధి వీరుఁడని పేరుగాంచినాడు. దానకర్ణుఁడని యశస్సు గడించినాఁడు. ముల్లోకము లేలు దేవేంద్రుని చేయి క్రిందు గావించి తనచేయి పైగావించుకొన్నాడు. క్షత్రాణివగు నీకు వీరమాత వగుటకన్న కావలసిన గౌరవ మేమున్న దమ్మా! శరీరము లశాశ్వతము! లోకము మనలను గుర్తింపకున్నను నీవు నా వీర హృదయమును గుర్తించితివి. ఇక లెమ్ము తల్లీ! నీ నివాసమున కరుగుము. ఈ రహస్యము పైకి రానీయకుము. ఇవే నీకు హృదయపూర్వక నమస్కారములు" అని పలికి కుంతీదేవిని లేవదీసి మెల్ల మెల్లగా గ్రిందికి దీసికొని పోయెను.
    పాండవు లరణ్య వాసమును బూర్తి గావించుకొని యజ్ఞాతవాసమును ముగించుకొనిన యనంతరము తమ యర్ధ రాజ్యమును దమ కిమ్మని శ్రీకృష్ణుని రాయబారము పంపిరి. శ్రీకృష్ణుడు పాండవదూతయై హస్తినాపురమునకు వచ్చి కౌరవ సభలో దుర్యోధన,దుశ్శాసన, కర్ణ, శకుని, భీష్మ, ద్రోణాదులు వినుచుండ సంధిగావింపు మని మహారాజగు ధృతరాష్ట్రునితో ననేక భంగుల రాయబారమును సలిపెను. కాని సంధి కుదరక తుదకు యుద్ధమే నిర్ణీతమయ్యెను. భగ్న ప్రయత్నుఁడై పాండవుల సమీపమునకుఁ దిరిగి పోవుచున్న శ్రీకృష్ణుఁడు రాధేయునకు బోధించి పాండవుల పక్షమునకుఁ ద్రిప్పవలయు నను నుద్దేశముతో నేకాంతముగఁ గొన్ని విషయములు సంభాషింపవలయునని పలికి యతనిని తన రథముపై నెక్కించుకొని యొక రహస్య ప్రదేశమునకుఁ గొనిపోయి యిట్లు సంభాషింప సాగెను.
    "బావా! పెక్కు దినంబుల నుండి నీకొక్క రహస్యము దెలుప వలయునని యువ్విళ్ళూరు చున్నాను. నేటి కట్టి యవకాశము లభించినది. వినుము. నీవు రాదేయుఁడవు గావు; కౌంతేయుఁడవు; సూతనందనుఁడవు; సుక్షత్రియ కుమారుఁడవు. ప్రభాకరుని ప్రసాదముచేఁ గుంతిభోజ తనయకు జన్మించినవాఁడవు. ధర్మజ భీమార్జున నకుల సహదేవులు నీ సహోదరులు. రమ్ము పోవుదము. దుర్మార్గుఁడగు దుర్యోధనునిఁ బరిత్యజించి సన్మార్గవర్తియగు ధర్మరాజువద్దకుఁ బోవుదము రమ్ము! పాండవులు నిన్ను దమ యన్నగా మన్నింతురు. సమస్త భారత సామ్రాజ్యమునకు నిన్ను బట్టభద్రుని గావింతురు! రమణీయ రత్నఖచిత కిరీటమును మౌళిధరించిన నీవు రాజువై సుందర సువర్ణ సింహాసనమున విరాజిల్లు చుండ ధర్మజుఁడు నీకు వింజామర విసరును. భీమసేనుఁడు శ్వేతచ్చత్రము బట్టును. అర్జునుఁడు కుడిభుజమై నీప్రక్కనిలిచి నీ యశస్సు దిగంతవిశ్రాంత మొనర్చును. నకుల సహదేవులు సేనానాయకులై నీకు జయమ్ము పలికెదరు. పాంచాల మత్స్యదేశాధీశ్వరులు నీకు సామంతులయ్యెదరు. వినుచుంటివా! పాంచాలి నిన్నారవభర్తగా స్వీకరించును".
    శ్రీకృష్ణుని పలుకు లాకర్ణించుచున్న కర్ణుఁడు దిగ్గున లేచి "మాధవా! ఇంకఁ జెప్పనక్కఱలేదు. నీమాటలు నాకర్థమయినవి. నీ యుద్దేశము నా కవగతమైనది. వాసుదేవా! కర్ణుఁడంత హృదయములేని సౌందర్య కాముకుఁడను కొంటివా? లేక సామ్రాజ్య కాముకుఁడనుకొంటివా? నా జన్మ రహస్యము నాకిదివఱకే దెలియును. నీ విప్పుడు క్రొత్తగా నేమియు జెప్పనక్కఱలేదు. ఈ సామ్రాజ్యమే కాదు. త్రిలోకాధిపత్యము నాకు'ఁ గట్టిపెట్టినను నేను నన్ను నమ్ముకొని యున్న సుయోధనుని వీడిరాఁజాలను. సూతుని చేతికి దొరికి, సూతగృహిణి పాలుద్రావి సూతునింట బెరిఁగి పెద్దవాఁడనై, సూతకాంతను వివాహమాడి నేటివఱకు సూతపుత్రుఁడనని పిలువబడుచున్న నేను క్షత్రియపుత్రుఁడనని యెట్లు చెప్పుకొందును! నేను నీచకులోద్భవుఁడనని లోకముచే దిరస్కరింపఁబడిన సమయమున నన్ను గౌరవించి యంగరాజ్యమునకు నధిపతిఁ గావించి నిజసహోదరులకంటె గాఢానురాగముతో మన్నించుచున్న నారారాజు, నా సుయోధనుని, నా ప్రాణాధిక ప్రియమిత్రుని విడచివచ్చుట కంటె ద్రోహమున్నదా! ఇట్టి యకార్యమును సల్పుమని నన్ను బ్రబోధించుట సర్వధర్మ విశారదుఁడవైన నీవంటి వానికి న్యాయమా? నీమహోపదేశము నంగీకరింప నందులకు నన్ను మన్నింపుము. నా రహస్యమును పాండవుల కెఱింగింపనని నాకు మాట యిమ్ము. దయయుంచి నా కనుజ్ఞ నొసంగుము. పోయి వచ్చెద"నని తన నిశ్చయమును సుస్పష్టముగా నెఱింగించెను. శ్రీకృష్ణుడు చేయునదిలేక రాధేయుని వీడ్కొని పాండవుల సమీపమునకు మరలిపోయెను.

 Previous Page Next Page