Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 30


    దేవేంద్రుఁడు మహోజ్వలమగు శక్తియను నాయుధంబు రాధేయున కొసంగి "త్యాగమూర్తీ! నీకీర్తి యాచంద్రతారార్కము వెలయుఁ గాక! ఈ యమోఘ శక్తిని నీకిచ్చుచుంటిఁ గాదనక గైకొనుము. నీ ప్రాణాపాయ సమయంబున దీనిం బ్రయోగింపుము. దుర్జయుండైన నీ విరోధి నొక్కని మాత్రము సంహరించి యిది వెండియు నన్నుఁ జేరఁ గలదు." అని వాసవుఁడా సూతనందనునకు శక్తి నొసంగి కవచ కుండలములతో నిజలోకమున కరిగెను. కాంతారవాసము గడుపుచున్న కుంతీనందనులీ వృత్తాంతము నంతయు నాలకించి యిఁక నజేయుండగు రాధేయుఁడు సుజేయుఁడుఁ డయ్యెఁగదా యని యత్యంత సంతోష తరంగితాంతరంగులైరి. దుర్యోధనాదులు కర్ణుని యుదంతము విని దురంత దుఃఖసంతప్తస్వాంతులైరి.


                               5


    కుంతీదేవి కుమారులకు దూరమై హస్తినాపురమున విదురు నింట కాలక్షేపము గావించుచుండెను. తన ప్రియ నందనుఁడగు కర్ణునకుఁ గవచ కుండలములు దానమిచ్చుటచేఁ గలిగిన వికారమును దలంచుకొని యామె లోలోన వాపోయెను. నిజమున కామెకు ధర్మజభీమార్జున నకుల సహదేవులం దెంత ప్రేమకలదో ప్రథమ సంతానమగు కర్ణుని మీఁద సైత మంతటి యనురాగ మేల లేకుండును? పవిత్రమగు మాతృ హృదయమునకు పుత్రుల విషయమున దారతమ్య ముందడుగదా! కాని పాండవులందలి ప్రేమ బహిరంగము. కర్ణుని విషయమైన ప్రేమ యాంతరంగికము. చిన్నతనమున నాలోచింపక చేసిన తప్పిదమున కామె జీవితాంతమువఱకు దురంత సంతాపముతోఁ గ్రుంగి కృశించి పోవలసి వచ్చెను. ఆనాఁటి సంఘమునకును, తల్లిదండ్రులకును, కులగౌరవునకును, బంధు మిత్రాదులకును భయపడి తన రహస్యమును బాహిర మొనర్పలేక పోయెను. ఐనను సమయ మరసి సత్యవృత్తాంతమును గర్ణున కెఱింగించి వానినిఁ బాండవులలోఁ గలుపుటకై యామెహృదయ మాకాంక్షించు చుండెను.
    ఒకానొక దినమున రాధేయుఁడు నిజప్రాసాదో పరిభాగమునఁ జల్లనిగాలికి విహరించుచుండ మేలిముసుగు ధరించిన యొక రమణీలలామ యల్లనల్లన నడుగు లిడుచు నచ్చటికి వచ్చెను. పరధ్యాములో నున్న కర్ణుఁ డామె రాకను గమనింపలేదు. అప్పుడామె సన్నని కంఠముతో "కుమారా!" యని పిలిచెను. రాధేయుఁడు చటుక్కునఁ దలయెత్తి చూచి "ఎవరు? ఈ రాత్రి సమయమున నా కొఱకై వచ్చితిరి?" అని విస్మయముతో బ్రశ్నించెను. వెంటనే యా స్త్రీ ముసుగు నొత్తిగించి "కుమారా! నన్ను గుర్తింప లేవా?" అనెను. కర్ణుఁ డాశ్చర్యముతో నామెను సమీపించి తేఱిపాఱఁజూచి "అమ్మా! మీరా! కుంతీదేవియా? రండు దయచేయుఁడు! ఈ పీఠము నలంకరింపుడు! ఇట్టి సమయమున నాతో ఏమి పని యుండి వచ్చితిరి? ఆజ్ఞాపింపుఁ"డనియెను.
    కుంతి "నాయనా! ఈనాఁడు నేను నీకొక జీవిత రహస్యమును దెలుపుటకై వచ్చితిని. ఎంతకాలము నుండియో యే కాంతముగ నీతో మాటాడ వలయనని తహతహలాడు చుంటిని. కాని దురదృష్టవంతురాల నగు నేను నీ చెంతకు రాజాలక పోయితిని" అని పలుకుచుండఁ గర్ణుఁడు భయ సంభ్ర మాశ్చర్యములు ముప్పిరిగొన "జీవిత రహస్యమా! ఎవరి జీవిత రహస్య మమ్మా?" అని యడిగెను. కుంతీదేవి "ఎవరిదో కాదు తండ్రి! నీదే" అని సమీపమునకు వచ్చి కూర్చుండెను. కర్ణుఁడు కుంతీవదనము వైపు తదేక దృష్టితో వీక్షించి "నా జీవిత రహస్యమా! నా జీవితమునకు రహస్యమేమిటమ్మా! రాధేయుని జీవితములో రహస్య మేమియు లేదే?" అనుచుండ కుంతీదేవి "ఆగు మాగుము! నాయనా! నీవు రాధేయుఁడవు కావు" అని యననాంచల ములఁ బ్రవహించు బాష్పధారలను బయ్యెద చెఱంగున నొత్తుకొనెను.
    అది చూచి కర్ణుఁడు చకితుఁడై "పాండుమహిషీ! ఏల దుఃఖించుచున్నావు? చెప్పు" మని పలికెను. కుంతి శోకమును మ్రింగుకొని గద్గదకంఠముతో "నాయనా! నేను నీకొక కథ చెప్పెద నాలకింపుము. ఒకానొక పట్టణమున నొక రాజు కలఁడు. ఆ మహీపతి కొక ముద్దుల కొమరిత యుండెను. ఒకనాఁడు దుర్వాసుఁడను మహాముని యాభూపతి వద్దకు వచ్చెను. రాజు మునిరాజును సేవించుట కొరకై తన ప్రియ పుత్రికను నియోగించెను. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి యమ్మౌనీంద్రుడామె కొక మంత్రముపదేశించి దీని జపించిన దేవతలు వచ్చి యభీష్టము లిత్తురని వెడలిపోయెను. ఆ రాకుమారియు బాల్యచాపల్యమున ఉదయించుచున్న బాలభానునిఁ జూచుచు నా మంత్రమును జపించెను. వెంటనే పద్మినీ బాంధవుఁడు మింటినుండి దిగివచ్చి యా రాజపుత్రిక కొక చక్కని కుమారుననుగ్రహించి నిజస్థానమున కరిగెను.
    అప్పుడామె యా బిడ్డ నేమిచేయవలెనో తెలియక లోకాపవాదమునకు వెఱచి సమీపమునఁ బ్రవహించుచున్న నదీగర్భములోఁ బడి మరణించుటకై నిశ్చయించుకొని కుమారునిఁ జేతులతోఁ బట్టుకొని ప్రవాహములోనికి దిగెను. ఇంతలో నొక మందసము భగవంతుడు పంపినట్లు తన ముందుకు కొట్టుకొని వచ్చుటఁ జూచి యా రాచపట్టి తన పట్టి నాపెట్టెలో నుంచి బిడ్డను రక్షింపమని భగవంతుని పరిపరి విధములఁ బ్రార్థించి పోలేకపోలేక యెట్టకేలకు నిజగృహమున కరిగెను. ఆ మంజుష నదీ ప్రవాహములోఁ బడి పోయిపోయి ఒక సూతవంశ సంజాతుని చేతికిఁ జిక్కెను.
    కథవినుచున్న కర్ణుఁడు సూతశబ్దము చెవినఁ బడుటతోడనే యులికిపడి "యెవరమ్మా? యాసూతుఁడు ఎక్కడి వాఁడు? అతని పేరేమి?" అని యాతురతతోఁ బ్రశ్నించెను. కుంతి "తండ్రీ! నీ తండ్రి యగు యధిరథుడే యా సూతుఁడు. నీవే యా బాలుఁడవు" అనెను. "మఱి యా రాజపుత్రిక యెవరమ్మా?" యని కర్ణుఁడాందోళిత హృదయముతో నడిగెను. కుంతికి దుఃఖ మాగలేదు. ఆమె యెలుఁగెత్తి యేడ్చుచు "ఆ నిర్భాగ్యురాలు - ఆ నిర్దయ హృదయ - నీ ముందే యున్నది. నీతో మాటలాడుచున్నది" అనెను.
    ఆ మాటలు వినినంతనే కర్ణుఁడు నిశ్చేష్టుఁడై నోట మాటరాక కొంతవడికిఁ దెప్పరిల్లి "నిజమేనా! నేను కుంతీ కుమారుఁడనా? నీవు కర్ణజనయిత్రివా? అయ్యో! తల్లీ! ఎన్నాళ్ళకీ సంగతి జెప్పితివమ్మా! యింతవఱకీ వృత్తాంతమును నాకేల దెలుపక పోయితివి. కనుకనే కాఁబోలు సూర్యభగవానుఁడప్పుడప్పుడు నాకు స్వప్నమునఁ గనిపించి నన్నా శీర్వదించుచుండును. ఆయనపై నాకింత భక్తి కుదురుటకుఁ గూడ నిదియే హేతువు కాఁబోలు! అయ్యో! మాతా! నీవు నా మాతవా! పాండవులు నా సోదరులా? ఈ పలుకుతొలుతనే నాకెందు కెఱింగింపలేదు?" అని పెక్కు విధముల విచారించెను. కుంతి కర్ణుని వినమ్రశీర్షమును ప్రేమమయ హస్తములతో నిమురుచు "కుమారా! నేను స్త్రీని. అస్వతంత్రురాలను, సంఘమునకు వెఱచి యీ రహస్యమును బయలుపరచజాలక పోయితిని. ఈ దోషము నాది కాదు; ఈనాఁటి సమాజమునకే దాని నారోపింపుము. నేను సత్యము దెలిపి బాల్యచాపల్యమునఁజేసిన యపరాధమును బ్రకటించిన సంఘములో నాకుఁ దావుగలదా? కాని తండ్రీ! నిన్ను నీటిలో విడుచునప్పుడెంత బాధపడితినో, నాడు ధనుర్విద్యాపరిషత్తులోఁ గృపాచార్యుఁడు ముందునకువచ్చి నీ కులగోత్రములను దెలుపుమని ప్రశ్నించునప్పుడు నేనెంత వెతనందితినో, స్వయంవర మహాసభలో "సూతపుత్రుని వరింప"నని పాంచాలి పలికిన పలుకుల కెంత దుఃఖించితినో, సహజ కవచకుండలములను గఱకు కత్తితో గోసియిచ్చితి వన్నమాట విన్నప్పుడు నా మాతృహృదయ మెంత తహతహలాడెనో భగవంతునికే తెలియును.

 Previous Page Next Page