Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 31


    "ఈ విశ్వాత్మ ట్రస్టుకి అసలు బాస్ ఎవరో తెల్సా?"

 

    "మీరు కాదా?"

 

    "కాదు"

 

    "మరెవరు?"

 

    "ది గ్రేట్ విశ్వాత్మ" ఆ జవాబుకి ఆశ్చర్యచకితుడయ్యాడు అన్వేషి.

 

    "ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫౌండర్ అవుతాడుగానీ, ఇప్పటికీ అసలు బాస్ ఎలా అవుతాడు?" ప్రశ్నించాడు అన్వేషి.

 

    "ఇప్పటికీ విశ్వాత్మగారే అసలైన అధిపతిగా మేము భావించడానికి కారణం ఆయన నమ్మిన విశ్వాసాలను మేమూ నమ్మడమే..." స్థిరంగా అన్నాడు మిత్ర.

 

    "అంటే...?"

 

    "విశ్వాత్మకు పునర్జన్మ పట్ల వున్న నమ్మకమే"

 

    "అంటే... విశ్వాత్మగారు మళ్ళీ జన్మించి, తను స్థాపించిన యీ ట్రస్టుకి తనే మళ్ళీ సారధ్యం వహిస్తారని మీరు నమ్ముతున్నారా?" దిగ్బ్రాంతికి గురవుతూ అన్నాడు అన్వేషి.

 

    "నా వ్యక్తిగత నమ్మకం, మీ వ్యక్తిగత నమ్మకం- ఇవిక్కడ అప్రధానం. ఈ ట్రస్టుకి యాజమాన్యంలో పనిచేసే ప్రతివ్యక్తి విశ్వాత్మ నమ్మకాలను, విశ్వాసాలను గౌరవించాలనేది ఇక్కడ ప్రధానమైన నిబంధన" ఒకింత కఠినంగా అన్నాడు మిత్ర.

 

    విశ్వాత్మ విపరీత ధోరణి ప్రపంచానికి అర్థం కాలేదు. విశ్వాత్మ విల్లుమీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు, పరిశోధనలు యింకా జరుగుతున్నాయి.

 

    అంతా వింతగా వుంది అన్వేషికి.

 

    "ఎక్కడైతే నిజాన్ని వదిలేస్తామో, అక్కడ్నుంచే కల్పన మొదలవుతుంది. కల్పన, ఊహ, ఆశాభావం నిజాలు కాకుండా పోవుగా? నేటి కల్పనలే రేపటి నిజాలని ఎందరో శాస్త్రజ్ఞులు నిరూపించారు.

 

    ఇదంతా విశ్వాత్మ కేవలం మైథాలజీపై ఆధారపడి చేసింది కాదు. విశ్వాత్మ విశ్వసించింది తన ఆత్మసాక్షిని... దట్సాల్" అన్నాడు మిత్ర.

 

    "ఎక్స్ క్యూజ్ మి సర్...." మది శృతి.

 

    కనుబొమలు ముడిచి, ఆమెవైపు చూశాడు మిత్ర.

 

    "తన ఆస్తికి తనే వారసుడినని విల్లు రాసుకోవడంలో, విశ్వాత్మ ఊహాభావంగల మనిషి అని స్పష్టంగా అనిపిస్తుందేమో...." అంది శృతి.

 

    "ఎగ్జాట్లీ... ఈ ప్రపంచం కాల్పానిక కథలను ప్రేమిస్తుంది- పిచ్చిగా నమ్ముతుంది కూడా. కానీ ఇది మామూలు కన్నా, వేగంగా జరిగిన సంఘటన. ఒక వూహాతీతమైన విషయాన్ని సృష్టించడానికి శతాబ్దాల కృషి జరగాలి. కానీ విశ్వాత్మ 30 ఏళ్ళ క్రితం దానిని సృష్టించాడు. విశ్వాత్మ తనకు తానుగా తన జ్ఞానాన్ని పునాదిగా చేసుకొని నిర్మించుకున్న నమ్మకం" డైరెక్టర్ మిత్ర స్వరంలో యిదో అద్భుతం అనే ఫీలింగ్ ధ్వనించింది. ఆ ఫీలింగ్ పట్ల ఆయనకు పవిత్రమైన భావన వుంది. ఆ ఫీలింగ్ నిజం కావాలనే కాంక్ష ఆయనలో బలంగా వుంది.  

 

    "విశ్వాత్మ మీకు వ్యక్తిగతంగా తెలుసా?" కుతూహలంగా అడిగాడు అన్వేషి.

 

    ఏదో ఫైలు వైపు చూస్తున్న శృతి, చటుక్కున తలెత్తి మిత్రవైపు చూసింది.

 

    "విశ్వాత్మగారు... నాకు తెల్సు... ఆయన మా నాన్నగారిని బాగా విశ్వసించేవారు" అన్నాడు మిత్ర.

 

    "మీ నాన్నగారి పేరు?" ఆసక్తిగా అడిగాడు అన్వేషి.

 

    "పరాంజపే" చెప్పాడు మిత్ర.

 

    "మీ నాన్నగారేం చేస్తుండేవారు?" ప్రశ్నించాడు.

 

    "చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు విశ్వాత్మజీ! వారిద్దరి మధ్య యజమాని ఉద్యోగం సంబంధం కేవలం నామమాత్రమే. విశ్వాత్మగారు మా నాన్నని మంచి స్నేహితునిగా నమ్మారు. రాజకీయాలు, వ్యాపారం, వ్యక్తిగత విషయాలను మొట్టమొదట ఆయన మా నాన్నతోనే చర్చించేవారు. నేను చిన్నప్పుడు మా నాన్నతో పాటు ఎస్టేట్ కి వెళ్ళినప్పుడు విశ్వాత్మగారిని అబ్బురంగా చూస్తుండేవాడిని"

 

    "ఆయన మీతో ఎప్పుడైనా మాట్లాడారా?"

 

    "మాట్లాడి వుండొచ్చు. కాని జ్ఞాపకం లేదు"

 

    "విశ్వాత్మగారిని మీరు గాఢంగా అభిమానిస్తున్నారా?" ప్రశ్నించింది శృతి.

 

    మిత్ర ఉత్సాహంగా సీటులో కదిలాడు.

 

    "విశ్వాత్మగారి గురించి తెలిసినవాళ్లెవరూ ఆయనని అభిమానించకుండా వుండలేరు. ఆయన అసాధారణ సాహసి మాత్రమే కాదు. శక్తివంతమైన మేధో ప్రతిభగల వ్యక్తి కూడా. నేను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకోలేని పాఠాలు విశ్వాత్మగారిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకున్నాను."

 

    ఆరాధనా భావంతో చెప్పాడు మిత్ర.

 

    "అన్నట్టు మీకు తెలుసా... విశ్వాత్మగారికి కుటుంబపరంగా గానీ, సంతానపరంగా గానీ నిజమైన వారసులెవరూ లేరు. ఆ బాధను మరిచిపోవడాని కన్నట్లు ఆయన నాతో గడిపినంతసేపూ చాలా ప్రేమ, వాత్సల్యం నా పట్ల చూపేవారు" అకస్మాత్తుగా గుర్తొచ్చినట్లు చెప్పాడు మిత్ర.

 

    "అంటే ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని విశ్వాత్మ ఫౌండేషన్ కి డైరెక్టర్ గా నియమించారన్న మాట" తీగ లాగుతున్నట్లు అన్నాడు అన్వేషి, ఫౌండేషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే పట్టుదల అన్వేషిలో వుండే డిటెక్టివ్ కు క్షణక్షణానికి అధికమవుతోంది.

 

    "ఈ పోస్టులో కొన్నాళ్ళు మా తండ్రి పరాంజపే వున్నారు. ఆ తర్వాత నేనొచ్చాను. విశ్వాత్మ గురించిన చరిత్రలో మనం చెప్పుకుంది చిన్న చాప్టర్ మాత్రమే. కానీ ఆయన ఫౌండేషన్ గురించి మనం ఏకాగ్రతతో పరిశీలిస్తే చాలా విశేషాలు తెలుస్తాయి" అంటూ సీట్లో వెనక్కి వాలుతూ, తన జ్ఞాపకాల మడతలను విప్పుతూ నమ్మలేని వాస్తవాన్ని ఏకాగ్రతతో చెప్పడం ప్రారంభించాడు మిత్ర.

 

    "విశ్వాత్మ రూపొందించిన విల్లులో దేశంలోని తన ఆస్తులు, వ్యాపారాలపై వచ్చే ఆదాయమంతా విశ్వాత్మ ఫౌండేషన్ ద్వారా జ్ఞానభారతి యూనివర్శిటీకి చెందేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ పద్ధతి విశ్వాత్మగారు పునర్జన్మ పొంది, తన ఆస్తికి వారసుడిగా నిరూపించుకొనే వరకు కొనసాగుతుంది..." చెప్పి గాఢంగా వూపిరి పీల్చాడు మిత్ర.

 

    బోర్డ్ ఆఫ్ ట్రస్టీకి డైరెక్టర్ గా నియమితులయ్యే వ్యక్తులు విశ్వాత్మ ఆస్తిని మోసగాళ్ళ బారినుండి కాపాడడం తమ ప్రధాన కర్తవ్యంగా భావించాలి. విశ్వాత్మ ఫౌండేషన్ విషయాల గురించి ప్రచారం చేయడానికి కొంత ధనాన్ని వినియోగించాల్సిందిగా విశ్వాత్మ విల్లులో రాశారు.

 

    అంటే ఈ ప్రపంచంలో ఏ మూలో విశ్వాత్మ పునర్జన్మ ఎత్తగానే తనకీ విషయం తెలిసి తన ఆస్తిని తాను కైవసం చేసుకోడానికి ఆ ప్రచారం వీలు కలిపిస్తుందని ఆ ప్రకటన చూడగానే తనలో గతజన్మ స్మృతిలో మెదిలి తన లక్ష్యం కేసి సాగిపోవటానికి సులభమవుతుందని ఆయన ఆలోచన.

 

    మరో జన్మ గురించి అన్నివైపులా ఆలోచించి, పకడ్బందీగా వ్యూహం పన్నిన అపూర్వ మేధావి విశ్వాత్మ" సడన్ గా ఏదో విషయం జ్ఞాపకం వచ్చిన వాడిలా కొన్ని క్షణాలు ఆగి-

 

    "మిస్టర్ అన్వేషి... మీకు గుప్తలిపి గురించి తెలుసా?" అడిగాడు మిత్ర.

 

    "తెల్సు చరిత్రలో గుప్తలిపికి ప్రధాన స్థానముంది. మనిషి తన భావాలకు ప్రతిరూపంగా సంజ్ఞలు, గుర్తులు చిత్రించుకున్నా, రహస్యాన్ని నిక్షిప్తం చేయడానికి గుప్తలిపిని రూపొందించుకున్నాడు. ప్రపంచాన్ని తన పిడికిల్లో బంధించుకోవాలని కలలుగన్న మహానియంతలు హిట్లర్, ముస్సోలినీలు కూడా గుప్తలిపి ద్వారా రహస్యాలను దాచేవారు. ముఖ్యంగా డిటెక్టివ్స్ కి గుప్తలిపి ఆరోప్రాణం లాంటిది" చెప్పాడు అన్వేషి.

 Previous Page Next Page