Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 30


    ఇంతలో మిత్ర చిన్నగా గొంతు సవరించుకుని ప్రారంభించాడు.

 

    "మిస్టర్ అన్వేషీ! మీ డిటైల్స్ చూసి, అయ్ మిన్ మీరు ఇదివరకు పనిచేసిన డిపార్ట్ మెంట్ కు సిన్సియర్ గా చేసిన సర్వీస్ తెలుసుకొని ముందు ఆశ్చర్యపోయాను. పరిస్థితుల్ని మీకనుకూలంగా తిప్పుకోవడంలో మీ అనుభవరాహిత్యమే కారణమని అనుకుంటున్నాను. బిలియన్ల విలువజేసే విశ్వాత్మ ఫౌండేషన్ ఆస్తులను కాపాడడంలో అణువంత పొరపాటు జరిగినా పాతికేళ్ళ శ్రమ వృధా అవుతుందనే విషయం..." ఎందుకో ఆగి సూటిగా అన్వేషి కళ్ళల్లోకి చూశాడు మిత్ర.

 

    తనను ఇంటర్వ్యూకు పిలవడానికి ముందే, వాళ్ళు తన గురించి పూర్తి వివరాలు సేకరించాలని అన్వేషికి అర్థమయింది.

 

    కాసేపాగి చెప్పాడు మిత్ర- "మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి ఒకే ఒక్క కారణం...." అంటూ సీల్డ్ కవర్ లోంచి ఓ పేపర్ ని తీస్తూ-

 

    "మీరు సి.బి.ఐ. డిపార్టుమెంట్ కు రాజీనామా చేయడం..." అన్నాడు మిత్ర.

 

    ఆ రూమ్ లో శ్వాస వినిపించేంత నిశ్శబ్దం!

 

    నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు అన్నట్లు డేగ చూపులతో చూస్తున్నాడు మిత్ర. శృతి ముఖంలో ఒకింత ఆశ్చర్యం.

 

    "మేం తెలుసుకున్న విషయాల్లో లోపాలున్నాయంటారా?" మందస్మితం చేస్తూ అన్నాడు మిత్ర.

 

    "మీరేం తెలుసుకున్నారో పూర్తిగా నాకు తెలిస్తే మీరేం తెలుసుకోలేదో, తెలుసుకోవాలో నేను చెప్పగలను" అన్నాడు అన్వేషి. ఆ మాటకు శృతి పెదవులు విచిత్రంగా కదిలాయి. ట్యూబ్ లైట్ కాంతిలో ఆ పెదవులు ఎర్రగా మెరుస్తున్నాయి.

 

    "నోనో... మమ్మల్నంత తక్కువగా అంచనా వెయ్యకు మిస్టర్ అన్వేషి. ప్లీజ్ లిజన్" అంటూ రిపోర్టు చదవడం ప్రారంభించాడు.

 

    "పేరు అన్వేషి, వయసు 27 సంవత్సరాలు, ఇంకా పెళ్ళి కాలేదు.

 

    జ్ఞానభారతి యూనివర్శిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేశాక సి.బి.ఐ. డిపార్టుమెంట్ లో ఆఫీసర్ గా సెలక్టు అయ్యావు. సిన్సియర్ ఆఫీసర్ గా, ముక్కుసూటి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నావు.

 

    రీసెంట్ గా వీరేంద్రస్వామీజీ అరెస్ట్ విషయంలో పార్లమెంట్ హాల్లోనే మినిష్టర్ ని పట్టుకొని కొట్టడం, ఆ తర్వాత పరిణామాలు అన్నీ మాకు తెలుసు" అని వింటూ విస్తుబోయాడు అన్వేషి.

 

    "ఇంకా రెండు నెలల్లో ప్రమోషన్ పొందడానికి అవకాశం వుందని తెలిసినా, రాజీపడకుండా మీరెందుకు డిపార్టుమెంట్ కు రాజీనామా చేశారు?" అడిగాడు మిత్ర.

 

    "జీవితంలో ఏ లక్ష్యమూ లేకపోవడం ఎంత విషాదమో, ఆ లక్ష్యాలను అధిగమించేవాళ్ళకు అడుగడుగునా అడ్డంకుల్ని కల్పించడం అంతకంటే విషాదం. అదే మనదేశపు పొలిటికల్ లీడర్స్ ధ్యేయం. అందుకే నేను ఛాలెంజ్ గా తీసుకొని వెలుగులోకి తేవాలనుకున్న వాస్తవాలను మళ్ళీ చీకట్లోకి నెట్టారు.

 

    డిపార్టుమెంట్ లోనూ, వ్యవస్థలోనూ పొలిటికల్ బ్రోకర్స్ కి కొమ్ము కాయలేక, రాజీపడి జీవితాంతం నిస్సారంగా బతకలేక, రాజీనామా చేశాను" అంటూ ముగించాడు అన్వేషి.

 

    "ఓ.కె. అన్వేషీ! మాకు కావాల్సింది నీలాంటి యువకుడే. ఈ క్షణం నుంచే మీరు మా విశ్వాత్మ ఫౌండేషన్ కి అతి కీలకమైన పోస్టులో నియమింప బడుతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ మైడియర్ యంగ్ జీనియస్" అంటూ చేతులు చాచి సాదరంగా షేకహేండ్ ఇచ్చాడు డైరెక్టర్ మిత్ర.

 

    అభినందన పూర్వకంగా అన్వేషివైపు చూస్తూ చిరునవ్వు నవ్వింది శృతి.

 

    ఇద్దరికీ థాంక్స్ చెప్పాడు అన్వేషి.

 

    మిత్ర చేసిన సంజ్ఞ మేరకు శృతి పక్కరూమ్ లో కెళ్ళింది.

 

    మూడు నిమిషాలు గడిచాక ఒక కవరుని తెచ్చి శృతి మిత్రకు ఇచ్చింది. మిత్ర ఆ కవర్ ని విప్పి ఒకసారి చూసి తల పంకించి పేపర్ ను యథాతధంగా మళ్ళీ కవరులోపెట్టి- "దిసీజ్ యువర్ అపాయింట్ మెంట్ లెటర్" నవ్వుతూ అందించాడు మిత్ర.

 

    ఇక్కడ అన్ని పనులూ చాలా ఫాస్ట్ అనుకున్నాడు అన్వేషి! వెంటనే కవరుని విప్పి చూడాలో లేదో అని సంశయిస్తున్నాడతను.

 

    "మీ అపాయింట్ మెంట్ ఆర్డర్ ను చూసుకోండి" భావరహితంగా అంది శృతి.

 

    అంతకుపూర్వం శృతి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆమెవైపు నఖశిఖ పర్యంతం పరీక్షగా ఓరకంట చూశాడు అన్వేషి.

 

    అయిదడుగుల అయిదంగుళాల పొడవు, ఛామనఛాయ, కాటుకతీర్చి దిద్దిన కనులు, బాబ్డ్ హెయిర్, కుర్తా, పైజామాలో వుంది. ఆ మోములో ఏదో గ్రేస్. రాజహంసలాంటి ఆకర్షణ.

 

    బ్రీత్ టేకింగ్ స్ట్రక్చర్, మేగ్నిఫిషియంట్ వైటర్ స్టాటిస్టిక్... ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బ్యూటీ. హిందీ సినీనటి రేఖలా అందంగా వుంటుందని పించింది అన్వేషికి.  

 

    ట్రేతో బాయ్ వచ్చాడు. ట్రేలో కూల్ డ్రింక్స్ ని అందుకుని మిత్రకు ఒకటిచ్చి, అన్వేషికి ఒకటిచ్చింది శృతి. బాటిల్ అందుకుంటున్న సమయంలో అన్వేషికి శృతి మునివేళ్ళు అప్రయత్నంగా తగిలాయి. రియాక్షన్ కోసం ఆమె ముఖం వంక చూశాడు.

 

    అలాంటి రియాక్షన్స్ ని బయటపెడితే, ఆమె మామూలు ఆడపిల్ల అవుతుంది- శృతి కాదు- అందుకే ఆమె మోములో ఏ రియాక్షన్ లేదు. పది నిమిషాలు గడిచాయి. తరువాత నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు డైరెక్టర్ మిత్ర- "మిస్టర్ అన్వేషి! మీకు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించడమే కాదు- విశ్వాత్మ గురించీ, ఈ ట్రస్ట్ గురించి మీకు పూర్తిగా చెప్పడం నా బాధ్యత" అంటూ సిగరెట్ ముట్టించి అన్నాడు.

 

    "వాటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం కూడా నా ప్రధాన బాధ్యత" ఆసక్తిగా కుర్చీలోంచి ముందుకు జరుగుతూ అన్నాడు అన్వేషి.

 

    "దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం విశ్వాత్మ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా నేను వచ్చేటప్పటికి, ఈ ట్రస్ట్ ఆస్తుల విలువ సుమారు 500 కోట్ల అరవై లక్షలు.

 

    ఇన్నేళ్ళుగా అతికష్టం మీద ఈ ట్రస్ట్ ని కాపాడుకొంటూ వస్తున్నాను. విశ్వాత్మ వారసులుగా మేమంటే, మేమంటూ ఇప్పటివరకూ కొన్నివేల మంది వచ్చారు. కానీ పకడ్బందీగా వారి డిటైల్స్ సంపాదించి, వాళ్ళ ప్రయత్నాలను విఫలం చేశాం.

 

    పాతికేళ్ళుగా ఈ ట్రస్ట్ పట్ల అమితమైన అంకితభావంతో పనిచేసిన డిటెక్టివ్ జెమ్స్ ఈ మధ్యే అనారోగ్యంతో రిటైర్ అయ్యాడు.

 

    అప్పటి నుంచి దేశంలోకెల్లా అత్యుత్తమమైన ప్రతిభగల డిటెక్టివ్ కోసం గాలించడంతో మీరు దొరికారు. అఫ్ కోర్స్... మీలో డిటెక్టివ్ స్కిల్స్ ఏ స్థాయిలో వున్నాయో మాకింకా తెలీకపోయినా మీ నిజాయితీ, అంకితభావం నాకు బాగా నచ్చాయి...." అంటూ అన్వేషి కనుబొమల వైపు చూశాడు మిత్ర.

 

    కొద్దిక్షణాలు గడిచాక, మళ్ళీ చెప్పడం కొనసాగించాడు మిత్ర. "విశ్వాత్మ గురించి మీకు తెలుసనుకుంటాను" అనడిగాడతను.

 

    "తెలుసు. కాలేజీ టైమ్ లో ఆయన గురించి లెసెన్స్ ద్వారా తెల్సు" చెప్పాడు అన్వేషి.

 

    "ఈ విశ్వాత్మ ట్రస్ట్ గురించి మీకేం తెలుసు?"

 

    "పొలిటికల్ షెల్టర్ లేకుండా నిజాయితీగా సేవా దృక్పథంతో అనేక సంస్థలు విశ్వాత్మ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్నాయని తెల్సు"

 Previous Page Next Page