Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 25


    "అలాగే బావా! సినిమాకి అందుకునేలా వచ్చేస్తానులే" అంటూ నవ్వి బయటకు వెళ్ళిపోయింది.

 

    నాలుగయిదేళ్ళ క్రితందాకా ఆమె అతన్ని చెవులు పట్టుకుని ఆడించింది. భుజాలమీద ఎక్కి త్రొక్కింది. అతనిదగ్గర ఆమెకు చనువు, గారాబం,

 

    ఆమె ఆలోచిస్తూ పరధ్యాసగా ఏలూరురోడ్డుమీద నడుస్తోంది. సెలవులన్నీ బద్ధకంగా గడిచిపోయాయి. కుదురుగా ఇంట్లో కూర్చుని రికార్డులన్నీ పూర్తి చేద్దామనుకుంది. ఎనాటమీ రికార్డు, గీయవలసిన బొమ్మలూ తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. అందులో ఆమెకు బొమ్మలేయటం అసలు చేతకాదు. డయాగ్రమ్స్ అంటే మొదట్నుంచీ తలనొప్పి.

 

    "హలో!"

 

    ఏదో వింత అనుభూతికి గురై తలత్రిప్పి చూసింది.

 

    "రాజా!"

 

    "ఎప్పుడొచ్చావు?"

 

    "ఈ ఊరికి ఇంతకుముందే."

 

    ట్రాఫిక్ పోలీసు ఎక్కడినుంచో విజిల్ ఊదుతున్నాడు.

 

    "నిన్నిలా ట్రాఫిక్ ఎక్కువగా వున్న రోడ్లమీదే కలుసుకోవటం బాగుంది. ఈ పోలీసు నువ్వు స్కూటరెక్కి మనం ఇక్కడ్నుంచి కదిల్తేనేగానీ ఊరుకునేట్టు లేడు. రా మరి!"

 

    ఆమె బుద్ధిమంతురాలిలా తల ఊపి స్కూటరెక్కి, అతని భుజాలు పట్టుకుని కూర్చుంది.

 

    "ఎక్కడకు వెళదాం?" అనడిగాడు.

 

    "నువ్వే చెప్పు?"

 

    "మనుషులు లేని చోటుకు."

 

    ఆమె నవ్వింది "మనుషులు లేనిచోటు అంటూ ఎక్కడైనావుందా అనిపిస్తుంది. ఎంత ఎడారుల్లోకి వెళ్లినా, అడవుల్లోకి వెళ్ళినా నిర్మానుష్యంగా ఉంది అనుకున్నచోట కూడా ఎవరో ఒకరు కనిపిస్తూ వుంటారు."

 

    "పోనీ, మనుషులు ఎక్కువగా వున్న చోటుకు?"

 

    "అయితే ఇటు పోనియ్ చెబుతాను."

 

    స్కూటర్ ని ఆమె సూచనల ప్రకారం పోనిస్తూ కృష్ణాబ్యారేజ్ దగ్గరకొచ్చి దానిమీద నుంచి పోకుండా తిన్నగా మళ్ళించి, కనకదుర్గ గుడికిపోయే ఘాట్ రోడ్ దగ్గరకు తీసుకువచ్చాడు.

 

    "గుడికా? అక్కడ జనం చాలామంది వుంటారు."

 

    "కాదు, స్కూటర్ ఇక్కడే పార్క్ చేసి, ఈ ప్రక్కనుంచి కొండమీదకు ఎక్కుదాం."

 

    ఆమె చెప్పినట్లే చేశాడు. కార్లు వెళ్లేరోడ్డుకు కొంచెం దూరంగా వెళ్లి-ఇద్దరూ కొండపైకి ఎక్కసాగారు.

 

    సూర్యుడు పడమటివైపుకు దిగిపోతున్నాడు. మొదట్లో అక్కడక్కడా కొన్ని ఇళ్ళు, జనసంచారం కనబడింది గానీ రాను రానూ మనుషులు కనబడటం మానేశారు. మధ్యమధ్య ఎక్కడానికి వీలులేని చోట, పెద్ద పెద్ద బండలు అడ్డు వచ్చినప్పుడు, ఆమెకు చేయి అందించి, సాయం చేస్తున్నాడు. ఇద్దరి ముఖాల మీదా స్వేదబిందువులు అలుముకుంటున్నాయి. చిన్న వగర్పు వస్తోంది.

 

    చాలా ఎత్తుకు వెళ్ళాక- కొంచెం విశాలమైన ప్రదేశం కనిపించింది. చుట్టూ ఆకుపచ్చగా అలుముకున్న చెట్టు.

 

    "ఇక్కడ ఆగుదాం" అంది మాధవి.

 

    "నీ ఇష్టం."

 

    ఒక అనువైన జాగా చూసుకుని ఇద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చున్నారు.

 

    అక్కడినుంచి ఒకవైపుకు చూస్తే ఇటు నిర్మలంగా, అటు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించే కృష్ణానది, మధ్య పొడవైన వెలుగుచారలా కృష్ణాబ్యారేజి, దూరం నుంచి చిన్నగా కనిపిస్తూ దానిమీద పరిగెత్తే వాహనాలు, అతి చిన్నగా గోచరిస్తూ చేతులు కదులుతున్నట్లు కదిలే మనుషులు. ఇంకా అవతలగా రైల్వే బ్రిడ్జిమీద అగ్గిపెట్టెలా సాగిపోతున్న రైలుబండీ, తల ఇటు త్రిప్పి చూస్తే కనకదుర్గ దేవాలయమూ, శుక్రవారం కావటంవల్లనేమో ఇసుకవేస్తే రాలనట్లున్న జన సముదాయమూ, అస్తమిస్తోన్న సూర్యకాంతిలో వింతగా మెరిసే గుడి గోపురమూ.

 

    "ఇంకా సెలవులు మూడు నాలుగు రోజులున్నాయిగా...ఇప్పుడు దేనికి వచ్చావు?" అని అడిగింది మాధవి.

 

    "నిన్ను చూడటంకోసం."

 

    "ఒంగోలునుంచి...ఇంతదూరం...స్కూటరుమీదా?"

 

    "అవును"

 

    అతని ముఖంలోకి చూసింది. మిలమిలా మెరిసే ఆ కళ్లు, అందులోని నిజాయితీ-అతను అబద్ధం చెప్పటంలేదని గుర్తించింది.

 

    "ఎందుకంత శ్రమ?"

 

    "నిన్ను చూడకుండా ఇంక ఒక్క నిముషామైనా వుండలేకపోయాను కాబట్టి."

 

    అతని మాటలు ఏవేవో ఆలోచనలు రేపుతుండగా సుదూరంలో కనబడుతున్న పెద్ద పువ్వుకేసి అప్రయత్నంగా చూస్తోంది. ఆ పుష్పం పేరేమిటో తెలీదు. అక్కడ ఎలా పుట్టుకువచ్చిందో తెలియదు. అస్తమించే సూర్యకాంతిలో మరింత అందంగా, అద్భుతంగా వుంది. కొండమీద ఈ దరిన కాకుండా లోయలాంటి ప్రదేశానికి అటువైపునుండి, ఇటుకేసి వంగిన ఓ కొమ్మకి పూచి, ఆ దృశ్యం నేత్రపర్వంగా వుంది.

 

    "మాట్లాడవేం?"

 

    ఊఁ అంది ఫరధ్యాసగా.

 

    "ఇంకెన్నాళ్ళు?"

 

    "దేనికి?"

 

    "నీ మూడో పరీక్షకోసం ఎదురుచూడటం."

 

    ఆమెలో ఓ చిలిపి ఆలోచన ప్రవేశించింది "ఇంకెన్నాళ్లో ఎదురు చూడనక్కర లేదు" అంది ఓ నిర్ణయానికి వచ్చి.

 

    "ఎప్పుడు?"

 

    "ఇప్పుడే"

 

    "ఇప్పుడేనా?"

 

    "అవునిప్పుడే"

 

    "ఏమిటో చెప్పు" అన్నాడతను ఉత్కంఠతతో.

 

    "ఆ పువ్వు చూశావు కదూ?" అంది చెయ్యి జాపి చూపిస్తూ.

 

    అటుకేసి చూశాడు.

 

    "అది నాకు తెచ్చి ఇవ్వాలి"

 Previous Page Next Page