"మనకి మనం అర్థంకాకుండా..." ఆమె పెదవులమీద చిరుహాసం ఉదయించింది. అందులో చిలిపితనం వుంది, అల్లరి వుంది. అగాథం వుంది, పోల్చుకోగల ఆడపిల్ల హృదయం వుంది.
"నాకు నేను అర్థమయాను రాజా!"
* * *
కళ్యాణి పడుకునే మంచం విరిగింది. ఎన్నిసార్లు కంప్లెయింట్ చేసినా హాస్టల్ అధికారులెవరూ పట్టించుకోవటం లేదు. అందుకని మాధవి మంచం మీద చేరి ఆమె ప్రక్కనే పడుకుంటోంది.
జరిగిందంతా చెప్పింది మాధవి.
"మాధవీ! నాకు భయంగా వుంది" అంది కళ్యాణి.
"ఏం?"
"నీకు ఆటగా వుందిగానీ చివరికిది చెర్లాట అవుతుంది."
"అంటే ఏం జరుగుతుందని?"
"అతను మూడోపరీక్షలో కూడా నెగ్గితే?"
"నెగ్గడు" అంది మాధవి ఖచ్చితంగా.
"ఒకవేళ నెగ్గితే?"
"నెగ్గడు" అంది మళ్లీ ఖండితంగా.
కళ్యాణి ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకుంది. ఆ రాత్రికి కళ్యాణికి కళ వచ్చింది. మాధవి రాజాకి పాతాళగుహలోకి వెళ్ళిరావటం లాంటిదో, కత్తుల బోనులోకి నడిచి రావటంలాంటిదో భయంకరమైన పోటీ పెట్టింది. అష్టకష్టాలుపడి జీవితంతో పోరాడి, రాజా ఆ పోటీలో నెగ్గి ఇవతలకు వచ్చాడు. ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుని వుంది, జుట్టు రేగివుంది. కళ్ళు ఎర్రబడి వున్నాయి. బట్టలు నలిగి వున్నాయి. మాధవి దిగ్భ్రాంతితో అతనివంక చూస్తోంది.
ఆమె దగ్గరకువచ్చి "పందెంలో గెలిచాను. నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడెలా తప్పించుకుంటావు? రా!" అన్నాడు. అతని కంఠం కర్కశంగా వుంది.
"నేను రాను" అంది మాధవి మొండిగా.
"రావూ? ఎందుకని రావు?"
"నేను రాను. నా ఇష్టం."
"నీ ఇష్టమా?" అంటూ మీదకు వచ్చి ఆమెను ఒడిసిపట్టుకున్నాడు.
ఆమె పెనుగులాడుతోంది. అతన్ని గిల్లిగిచ్చి నానా భీభత్సం చేస్తోంది. అయినా అతని పురుషత్వ బలంముందు ఆమె శక్తి ఎంతకూ సరిపోవటం లేదు. ఆమెను భుజాలమీద వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు.
కళ్యాణి కెవ్వుమని అరిచింది.
కళ్ళు తెరిచేసరికి తాను మాధవి ప్రక్కనే ఆమెమీద చెయ్యివేసి పడుకుని వుంది. కలలోనైతే కేకవేసింది గానీ ఆ కేక ఆమె గొంతుదాటి బయటకు రాకపోవటంవల్ల మాధవికి నిద్రాభంగం కలుగలేదు.
కలలోని దృశ్యాలన్నీ గుర్తుకొచ్చి కళ్యాణికి ఏడుపొస్తుంది. ప్రక్కకి ఒత్తిగిలి మాధవి ముఖంలోకి చూసింది. నిర్మలంగా, నిశ్చలంగా నిద్రపోతోంది. ఎంత అందంగా వుంది?
నిద్రలో విడీ విడనట్లు వున్న ఆమె పెదవులు అరవిచ్చిన మొగ్గల్లా వున్నాయి.
ఆ పెదవులమీద మృదువుగా చుంబించి, మళ్లీ ప్రక్కకి జరిగి మామూలుగా పడుకుంది.
10
కొన్నాళ్ళ తర్వాత...
మాధవి సెలవులకని ఇంటికి వచ్చింది. ఓ సాయంత్రం నాలిగింటికి ఏమీ తోచక అలా ఏ స్నేహితురాలింటికైనా వెళ్ళి తిరిగొద్దామని బయల్దేరబోతోంది.
"మధూ!" అని పిలిచింది ఆమె అక్కయ్య సత్యవతి గదిలోంచి.
"ఏమిటక్కయ్యా?" అంటూ మాధవి వెనక్కితిరిగి గదిలోకి వెళ్ళింది.
సత్యవతి మంచంమీద పడుకుని వుంది. ఒకనాడు అందగత్తె అయితే అయివుండవచ్చు. కానీ నేడా అందమంతా హరించుకుపోయి, శరీరం శుష్కించి పోయి, అస్ధిపంజరంలా వుంది.
"ఎక్కడికి?" అనడిగింది.
"ఊరికినే అలా బయట తిరిగొస్తాను."
"మధూ! నేను..." ఆమె ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ నీళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఇవేళ ఏమీ కొత్తకాదు.
అక్క అంటే మాధవికి పంచప్రాణాలు. తల్లిదండ్రులు పోయినప్పటినుంచీ ఎంతో ప్రేమగా, శ్రద్ధగా ఆమే పెంచింది. కొన్ని సంవత్సరాలుగా అక్క ఆరోగ్యం బాగుండటం లేదు. బాగుండక పోవటమేకాదు, శరీరం బాగా శిధిలమైపోయింది. అది శాశ్వతమైన అనారోగ్యమనికూడా ఆమెకు తెలుసు.
"అక్కయ్యా! ఏం జరిగింది?" అనడిగింది మాధవి వ్యాకులపాటుతో.
చాలా జరుగుతోంది. ఈమధ్య...కానీ ఎలా చెబుతుంది? ఎలా ఈ ప్రసక్తి తీసుకువస్తుంది?
"మధూ! నేను...."
"నువ్వు దిగులు పడకక్కయ్యా! నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది" అంది మాధవి చాలాబాధగా.
సత్యవతి బలహీనంగా నవ్వింది. తాను మాట్లాడదలుచుకున్న సంగతి అదికాదు.
"మధూ! మరి..." అని తటపటాయిస్తోంది.
"ఏమిటక్కయ్యా?"
"మరి...ఏమీ లేదులే. సరే, నువ్వు వెళ్ళిరా.."
ఆమె ధోరణి మాధవికేమీ అర్థంకాలేదు. ఒక్కనిముషం మెదలకుండా ఊరుకుని, బయటకు నడిచింది.
హాలు గుమ్మం దాటబోతుండగా బయట కారాగింది. ప్రతాప్ కారు దిగి లోపలకు వచ్చాడు.
అతనికి నలభై ఏళ్లకు పైగా వుంటాయి. ఎత్తుగా, బలంగా, చామన ఛాయగా వుంటాడు. ఎర్రటి కళ్ళు.
సరిగ్గా మాధవి మెట్లు దిగుతుండేసరికి ఎదురుగా వచ్చాడు.
"ఎక్కడికీ?" అన్నాడు చనువుగా భుజంమీద కొడుతూ.
"ఫ్రెండింటికి"
"కారు తీసుకెళ్ళకూడదూ?"
"వద్దులే బావా! కొంచెంసేపు నడవనీ."
"మళ్ళీ ఎన్ని గంటలకొస్తావు?"
"ఏం?"
"తొందరగా వస్తే సెకండ్ షో సినిమాకి వెళదామని."