కైలాసగణపతి పెన్ టార్చీ, డైరీ, కలము కోటుజేబులో పెట్టుకున్నాడు.
రివాల్వర్ తో పని కనబడలేదు. రివాల్వర్ ని కూడా జేబులో పెట్టుకొని లేచాడు.
అతను ఒకేఒక చిన్న పొరపాటు చేశాడు. అది గుర్తించలేదు ఆ నిమిషాన.
క్షేమంగా గుహలోంచి బయటికి వచ్చాడు.
బయట వాతావరణం మరికొంత వెలుతురు తగ్గి వుంది.
కైలాసగణపతి చుట్టూ చూశాడు. అనుమానించతగ్గది ఏమీ కనిపించలేదు.
ఓ పదినిమిషాలు ఆచుట్టుపక్కల తచ్చాడి కొద్ది దూరాన వున్న అక్కాచెల్లి గుహలోకి కూడా వెళ్ళివచ్చాడు మరికొంత సేపు అక్కడే తిరిగి చూశాడు.
అతని మనసు చాలా తృప్తిగా వుంది. ప్రతీది రంద్రాన్వేషణ చేసి పరిశోధన చేస్తాడు. అలా ఓ చిన్న అనుమానంతో రంగంలోకి దిగినందుకు నిజంగానే ఎంతో కొంత ఫలితం కనిపించింది.
కైలాస గణపతి తృప్తి నిండిన మనసుతో కొండ దిగటం ప్రారంభించాడు.
16
ఆ సాయంత్రం.....
పిల్లలు ఎవరూ యింట్లో లేనప్పుడు సూర్యారావు అడిగాడు.
"రేపోమాపో పరిశోధన ప్రారంభిస్తావా లేక కొన్నాళ్లు ఆగుతావా?"
"అదేమిటిరోయ్ సూరీడూ! కొన్నాళ్లపాటు పరిశోధన చేయకురా నాయనా అన్నవాడివి ఈ ప్రశ్నవేశావు. అప్పుడే నామీద మొహం మొత్తిందా ఏమిటి" అడిగాడు కైలాసగణపతి.
"నీ ముఖం అదికాదు."
"నా ముఖం నాదగ్గరే ఉంది. నీ ముఖం నీకర్ధంకాదు అంటే అర్థం ఏమిటి? అదిగాదు. నీ ముఖం అన్నావు ఆ అర్థం ఏమిటి?"
"నా ముఖం అని."
"సరే. అదే చెప్పు."
"అదిగాదురా కైలాసం! ఈ మధ్య నీవెందుకో కాస్త డల్ గా ఉన్నావు. కొన్నాళ్ళు పరిశోధన మర్చిపోమ్మని అన్నాకదా? దానికి బాధపడుతున్నావేమోనని అనుమానము వచ్చింది.
"చాలా కొద్దిగా పరిశోధన ప్రారంభించాను. ప్రస్తుతం అది చాలు."
"మరి నీవు డల్ గా వుండటానికి కారణం ఏమిటి?"
"ముప్పాటలా తిని కూర్చోటం చేతినిండా పనిలేక సగం పిచ్చిగా వుంది. నాలుగు రోజులు పట్నం వెళ్ళి వద్దామనుకుంటున్నాను." కైలాసగణపతి చెప్పాడు
"దేనికి?" సూర్యారావు అడిగాడు.
"ఆచారి దగ్గర నాతో పాటు పని నేర్చుకున్న శిష్యగణం ఉండేవారు. వాళ్ళలో ఆదిమూర్తి నాకు బాగా దగ్గర అయ్యాడు. ఓ సారి అతన్ని కల్సుకుని రావాలి."
"పిచ్చికి అతను మందు యిస్తాడా!"
"అదేమిటి! నీ ప్రశ్న చాలా విచిత్రంగా వుంది."
"నీవు చెప్పింది అలా వుంది మరి."
"నేనేంటన్నాను...."
"చేతినిండా పనిలేక సగం పిచ్చిగా వుంది..... అని అన్నావా లేదా?"
"అన్నాను."
"ఆ మాట అన్న వెంటనే నాలుగు రోజులు పట్నం వెళ్ళి వద్దామనుకుంటున్నాను.... అన్నావా లేదా!"
"అన్నాను."
"చేతినిండా పనిలేక సగం పిచ్చిగా వుంది. నాలుగు రోజులు పట్నం వెళ్ళి వద్దామనుకున్నాను అని అన్నావు ఆ అర్థం ఎలా వుంది."
"అలా అన్నానా!" కైలాసగణపతి అమాయకంగా అడిగాడు.
"సరీగా అలాగే అన్నావు" సూర్యారావు నవ్వుతూ చెప్పాడు.
"ఎలాగూ తోచటం లేదు. ఆదిమూర్తితో పనివుంది అతని దగ్గరకు నాలుగు రోజులు వెళ్ళిరావాలి అని చెప్పబోయాను. మాటలు ఎగుడు దిగుడు అయ్యాయి."
"నేను అలాగే అనుకున్నాలే. నీ భాష అప్పుడప్పుడు నాకే కొరుకుడు పడదు. సరేలే యిది ఎప్పుడూ వున్నదే ఆదిమూర్తి అన్నావు ఆయన దగ్గరకు దేనికి?"
"రాత్రిళ్ళు నేను పరిశోధనలోని కొత్త భాష రాయటం ఓ రోజు నీవు చూసి అదేమిటి అన్నావు గుర్తుందా....."
"ఉంది."
"అప్పుడు అది రాళ్ళ పరిశోధన గురించి కోడ్ భాష అని చెప్పాను. ఇదీ గుర్తుండే వుంటుంది నీకు..... కోడ్ లోని ఒక వాక్యం మరచిపోయాను....."
"చూశావా, చూశావా, నీకు బాగా మతి మరుపు వచ్చింది రా అంటే ఛత్ నాకేంటి మతిమరుపు ఏమిటి! అని కోప్పడ్డావు. నాకున్నదీ పరధ్యాన్నంగానీ మతిమరుపు కాదన్నావు. ఇప్పుడు నీనోటి వెంట మతిమరుపు వచ్చింది....."
"మతిమరుపు కాదు మరిచిపోవటం"