ఆ రోజు గుహలో చూసింది చేసింది అంతవరకే.
"ఇతరులు ఎవరూ ఈ గుహలోకి ఎప్పుడూ వెళ్ళరా?" కైలాసగణపతి గుహలోంచి బైటికి వచ్చింతరువాత అడిగాడు.
"గుహలో గవ్వలమ్మ వుందని మా వూళ్ళో అందరికీ తెలుసు మా ఊళ్ళో వాళ్ళు ఎవరూ వెళ్ళరు. ఇదిగో యిలా నీబోటి తెలియనివాళ్ళు వస్తే అడిగితే తీసుకొచ్చి చూపించటం జరుగుతుంది."
"మరి సోదివాళ్ళు?"
"వాళ్ళు ఒకసారి ఆ దేవతని ఆహ్వానించి ఏదో తతంగం చేసి వాళ్ళ వాళ్ళకి సోది ఎలా చెప్పాలో నేర్పుతారు. ఏడాదికి ఒకసారి మాత్రం అర్ధరాత్రి వచ్చి మొక్కి వెళతారని అంటారు."
"మరి ఆ కుండ అలా ఎన్నాళ్ళు వుంటుంది?"
"నాకు తెలియదు. సోది చెప్పేవాళ్ళమీద ఏదైనా మహాగ్రంధం రాయదలిస్తే చెప్పు వాళ్ళతో మాట్లాడుతాను" నవ్వుతూ అన్నాడు సూర్యారావు.
"మీకు ఇలాంటివి సామాన్యం కావచ్చు. మాకలా కాదు, ఏదో వింతగా కొత్తగా వుంది. సరే ఈ ఒక్కప్రశ్నకి జవాబుచెప్పు. గవ్వలమ్మ అన్న దేవత నాకు కనపడలేదు. ఉత్తకుండలుతప్ప. మరి...?"
"కైలాసం అలా మాట్లాడకు అపచారం. ఆ దేవతకి ఒకరూపం ఉండదు. కుండ, కుండమీద లోపల గవ్వలు అవే ఆ దేవత అంతే."
"కుండలో గవ్వలు తప్ప ఇంకేమీ వుండవా?"
"ఉండవని అంటారు. నాకు సరీగ తెలియదు."
"ఏమిటో ఈవిచిత్ర పద్ధతులు!" పెదవి విరుస్తూ అన్నాడు కైలాసగణపతి.
"నీ ప్రశ్నలు చూస్తుంటే ఏదో ఒకరోజు పాడుపని చేసేటట్లున్నావు అనిపిస్తున్నది." అన్నాడు సూర్యారావు.
"అదేమిటి సూరీడూ! ఉన్నట్లుండి కొత్తగా మాట్లాడుతున్నావు?"
"నీ ప్రశ్నలు అలా వున్నాయి మరి!"
"విషయం మొదలంటా తెలియదు కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేశాను."
"ప్రశ్నల వరకూ అయితే ఫరవాలేదు."
"మరి?"
"ఎప్పుడో నేలేకుండా చూసి గుహలో దూరి కుండ మీద మూతతీసి పరిశోధించేటట్లున్నావు."
"సూరీడూ! నీవు ఈ విషయంలో పొరపాటు పడ్డావని నొక్కి వక్కాణిస్తున్నాను. తెలియని విషయం తమాషాగా వుండటంతో ఇన్ని ప్రశ్నలు వేశాను. నేను నాస్తికుడిని అయితే నీవీ మాట అన్నా బాగుండేది. నీవు నమస్కారం పెట్టమనగానే గవ్వలమ్మకి నమస్కారం పెట్టానా లేదా?"
"పెట్టావు."
"అది నీ మాటమీద వున్న గౌరవము. దైవంమీద నాకున్న భక్తికి నిదర్శనము. కోరి ప్రమాదములో కాలు పెట్టనురోయ్! పరిశోధన అంటే రాళ్ళూ రప్పలమీద చెయ్యాలిగాని దేముళ్ళమీదా దెయ్యాలమీదా కాదు. దేముళ్ళూ, దెయ్యాలూరెండూ వున్నాయని నేను నమ్ముతాను కనుక వాటిమీద పరిశోధనలు, ప్రయోగాలు చేయను. నీకంత భయంగా వుంటే చెప్పు నీచేతిలో చెయ్యివేసి ప్రమాణమో, వట్టో....."
"వద్దురా కైలాసం! నీ మాటలు పూర్తిగా నమ్ముతున్నాను. చాలా నాకు మాటల్లోనే మాట యిచ్చావు అదిచాలు." తృప్తినిండిన స్వరంతో అన్నాడు సూర్యారావు.
కైలాసగణపతి నవ్వి వూరుకున్నాడు.
ఇది వాళ్ళిద్దరి మధ్య ఆనాడు జరిగిన విషయం.
ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం.
"ఆ గుహలోకి యింక వెళ్లేపని ఏముంది! ఓసారి చూశాము. ఇంక చూడటానికి ఏముంది?" అన్న కైలాసగణపతి "వట్టువేయనా, ప్రమాణం చేయనా!" అన్న కైలాసగణపతి మాట తప్పి గుహలో కాలుపెట్టాడు. అంతే కాదు వెంటనే రంగంలోకి దిగాడు.
గుహనంతటినీ ఓసారి పరిశీలనగా చూశాడు. అప్పటికే గుహలో వెలుతురు తగ్గింది. బైట సూర్యభగవానుడు దిగిపోతున్నాడు డ్యూటీలోంచి. దానివల్ల కూడా వెలుతురు అంతగాలేదు.
కైలాసగణపతి కోటు లోపలివైపు జేబులోంచి పెన్ టార్చి తీసి వెలిగించాడు. మరో జేబులోంచి మినీ రివాల్వర్ తీసి రెండోచేత్తో పట్టుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ గవ్వలమ్మ అనే దేవత అనబడే కుండ దగ్గరకు వెళ్ళాడు.
అంత మాత్రాన దేవత ప్రత్యక్షం కావట.... ఒరేయ్ మొండికొండి బండ వెధవా! నిన్నేం చేస్తానో చూడు. కక్కు ఓ బాటిల్ నెత్తురు కక్కు ఇదే నా శాపము" అంటూ శపించటం దాంతో కైలాసగణపతి సరీగ బాటిల్ రక్తం బి గ్రూపుది కక్కటం లాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగలేదు.
కైలాసగణపతి ముందు చిన్న కుండమీద నున్న మూకుడుని తొలగించి టార్చిలైటు లోపలికి వేశాడు. కుండలో లెక్కపెట్టినట్లు అయిదు గవ్వలున్నాయి. మిల్లిగరిటెడు పసుపు కుంకుమ వున్నాయి అంతే.
ఓసారి కుండను పైకి ఎత్తిచూశాడు. ఏమీలేదు మళ్లీ ఆ చిన్న కుండని యధావిదిగా పెట్టి మూకుడుని మూతపెట్టాడు.
ఈసారి యిక చూడాల్సింది పెద్దకుండ.
కైలాసగణపతి అలాకుండలమీద పరిశోధనకి దిగితే అక్కడ కొంపలు మునగలేదు. కొండ కంపించలేదు.
అతను వణకడం తొణకడంలాంటిది జరగలేదు.
మాటపడిపోలేదు. నిక్షేపంగా వున్నాడు. కాకపోతే కాస్త చెమట ముఖానికి పట్టింది అంతే.
అతను పెద్దకుండమీదున్న మూకుడుని తీశాడు.
ఆ కుండలోంచి.....
పైన ఆకారం, కింద పొగరూపంలో వున్న తోకగల పెద్ద దయ్యం పైకి రివ్వున ఎగురుతూ రాలేదు.
భేతాళుడు రాలేదు.
ఆఖరికి వళ్ళంతా గవ్వలతో గవ్వలమ్మా రాలేదు.
అతను టార్చిలైట్ ఫోకస్ వేసి తొంగిచూశాడు.
కుండలోపల....
కాస్త పెద్దసైజు గవ్వలు అయిదు వున్నాయి. చంచాడు పసుపు కుంకుమ వున్నాయి. సోదివాళ్ళు చిన్నపుల్లను చేతిలోకి తీసుకుని పుల్లని కదిలిస్తూ సోదిచెపుతారు. అలాంటిది కాస్తలావుపాటిది వుంది.
కైలాసగణపతి ఒక్కో గవ్వా పరిశీలించి మళ్లీ కుండలో వుంచాడు. చివరికి పుల్లని చేతిలోకి తీసుకున్నాడు. పుల్లని పరిశీలిస్తే ఓ వింత కనపడింది. పుల్లకి సన్నటి పగులు. ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకానరాని పగులు. అదీ కర్ర చుట్టూతా వుంది.
అతను అదిపట్టుకుని లాగాడు. వూడి వచ్చింది. బొంగుమధ్యలో ఖాళీ వుంటుంది. అలాగే ఈ కర్రపుల్ల మధ్య ఖాళీ వుంది. అది గొట్టంలా వుంది. ఆ గొట్టానికి యిది మూత. అలా నిర్మించాలా పుల్లని.
గొట్టంలా వున్న ఆ పుల్లని తెరిచి ఉన్నవేపు కింద పెట్టి నెమ్మదిగా నేలమీద కొట్టాడు. ఉండచుట్టిన చిన్న కాగితం దాంట్లోంచి కిందపడింది.
అతను గబగబా ఆకాగితం విప్పాడు.
ఆ కాగితంలో విచిత్రమైన గుర్తులతో బొమ్మలు కొంత రాత గజిబిజిగా వుంది.
అదేదో సీక్రేట్ విషయం కోడ్ భాషలో పొందుపరచబడి వున్నట్లు తెలుస్తున్నది. మేటర్ చాలా చక్కగా క్లుప్తంగా రాసి వుంది.
అతను గబగబా జేబులోంచి పెన్నుచిన్నడైరీ తీసి వేగంగా చాలా చక్కగా కాగితంలో వున్నది ఎక్కించుకున్నాడు. గుర్తులు బొమ్మలు కూడా వేసాడు.
ఆ పనిపూర్తి చేసాడు. యధాప్రకారం కాగితాన్ని ఉండలాగా చుట్టి మళ్ళీ కర్రగొట్టంలో పెట్టిమూతపెట్టాడు. కుండలో యదాస్థానంలో ఉంచి మూకుడు మూతపెట్టాడు. ఇంక అక్కడ వుండి చూడవలసిందీ, చేయవలసిందీ ఏమీ కనిపించలేదు.