గతాన్ని త్రవ్వి చంద్రాన్ని బాధించానని 'తెలుసుకుంది హేమ చంద్రం ముఖంలోని విషాదాన్ని చూసి హేమ తను తప్పుచేసినట్లు బాధపడింది.
"చంద్రం! నువ్వు రాసిన కవిత్వం ఏదయినా వినిపించావూ?" ప్రసంగాన్ని మార్చే ఉద్దేశ్యంతో ఉత్సాహంగా అడిగింది హేమ.
"కవిత్వమా? నేను కవిత్వం ఏదయినా వినిపించవూ?" ప్రసంగాన్ని మార్చే ఉద్దేశ్యంతో ఉత్సాహంగా అడిగింది హేమ.
"కవిత్వమా? నేను కవిత్వం ఏమీ రాయలేదు," అన్నాడు చంద్రం ముభావంగా.
విచారంగా ఎక్కడకో చూస్తున్న చంద్రం ముఖంలోకి చూడసాగింది హేమ తనివితీరా విచారంతో అమాయకంగా కనిపిస్తూన్న చంద్రం ముఖం ఎంతో అందంగా కనిపించింది హేమకు. కానీ కనిపించని పాపిడితో వెనక్కువిరిచి దువ్విన నొక్కులు లేని ఆ జుత్తు లోపలకు వేళ్ళుదూర్చి గుప్పెడునిండా జుత్తు పట్టుకొని వూపుతూ "ఇంతలోనే అంత కోపమా?" అని అడగాలనిపించింది హేమకు.
"ఒక పాట పాడనా చంద్రం!" అంది హేమ ఆ మాట వినగానే తన పాటలంటే ఒకప్పుడు చెవి కోసుకొనే చంద్రం ముఖం సంతోషంతో చాటంత అవుతుందని ఆశించిన హేమ నిరాశతో కుంగిపోయింది.
"ఊఁ" అన్నాడు చంద్రం ఎలాటి ఉత్సాహాన్ని చూపకుండానే.
హేమ పాడటం మొదలుపెట్టింది. చంద్రం ఉలిక్కిపడి హేమ వైపు చూశాడు. హేమ తలవంచుకొని పాట పాడుతున్నది. చంద్రానికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఆ పాట తను చిన్నప్పుడు రాసింది. ఆనాడు స్కూలు వార్షికోత్సవంలో ఆ పాటకే బహుమతి లభించింది. తనకు గుర్తులేని ఆ పాటను హేమ ఎంత పదిలంగా తన మనస్సులో దాచుకుందో! ఆ పాటలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదో చిన్న తనుఉ తెలిసీ తెలియని భావాలు - కాని, హేమ డానికి చక్కని బాణీకట్టి పాడుతుంటే ఎంతో మధురంగా వుంది ఆ పాట హేమను తను అర్ధం చేసుకున్నాడు.
పాట ఆగిపోయింది. "ఎంత బాగుంది?" అన్నాడు చంద్రం తన్మయత్వంతో.
"ఏమిటి బాగుంది? నా పాటా లేక నీ కవిత్వమా?" కొంటెగా నవ్వింది హేమ చంద్రం శృతి కలిపాడు.
"చంద్రం!" ఏదో అడగాలని మళ్ళీ అడగలేక ఆగిపోయింది హేమ.
"ఊఁ అడుగు! ఆగిపోయావేం! నీ ప్రశ్న ఏమిటో నేను చెప్పనా?" అంటూ హేమ కళ్ళలోకి సూటిగా, చిలిపిగా చూశాడు చంద్రం.
హేమ సిగ్గుతో ముడుచుకుపోయింది మల్లెమొగ్గలాగ.
"నేను ఇంకా వివాహం చేసుకోలేహ్డు కాని త్వరలోనే చేసుకోబోతున్నాను!" లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకుంటూ, హేమ ముఖంలో దేన్నో వెతుకుతూ అన్నాడు చంద్రం.
సిగ్గుదొంతర్లు దొర్లుతూంటే ఆమె ముఖం వెన్నెల్లో ఓ వింత సోయగాల్ని వెదజల్లుతోంది.
"ఎవర్నని అడగవేం?"
చంద్రంలో ఇంత కొంటెతనం, చిలిపితనం కూడా ఉన్నాయని హేమ అనుకోలేదు. హృదయవీణను ఎవరో మీటినట్లయింది.
"నే నెందుకడగటం? నువ్వే చెప్పూ!" అంది ధీమాగా, ఆ చెప్పబోయే పేరు తనదేనని ఊహించకుని హేమ.
హేమ ధీమాను చంద్రం అపార్ధం చేసుకున్నాడు. అయితే హేమకు తన వివాహంతో ప్రమేయం లేదన్నమాట! కేవలం చిన్ననాటి స్నేహితునిగానే గౌరవిస్తున్నదన్నమాట! అవును ఆమె చదువూ, సంఘంలో ఆమెకున్న గౌరవం, చిన్నతనంలోనే దొంగగా ఇల్లు విడిచి పారిపోయిన ఓ వ్యక్తిని వివాహం చేసుకోవాలనే భావాన్ని కలలో కూడా రానివ్వవు. చంద్రానికి వెంటనే ఓ ఊహ తట్టింది. హేమ మనస్సును తను అర్ధం చేసుకోలేకపోతున్నాడు. పరీక్షించటానికి మంచి అవకాశం లభించింది. ఈ అవును, కాదు అనే మీమాంసలో పడి కొట్టుకోవటం అనవసరం.
"చెప్పమంటావా? నేను వివాహం చేసుకోబోయే అమ్మాయికి నీ అంత చదువూ సంస్కారమూ లేదు. సంఘంలో ఎలాంటి గౌరవమూ మనిషికి ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వములాటివి ఏమీలేవు. ఒక అమాయకురాలైన బీద అమ్మాయి," అన్నాడు చంద్రం గబగబా అతని స్వరంలో తీవ్రత కనిపిస్తోంది.
హేమ ఉలిక్కిపడి చంద్రం ముఖంలోకి చూసింది. అకస్మాత్తుగా ఆమె ముఖంలోని చైతన్యం గడ్డకట్టినట్లు కనిపించింది చంద్రానికి. అది చూసిన చంద్రం ముఖంలోకి ఓ కొత్తకాంతీ, ఉత్సాహం ఉబికి వచ్చాయి. 'దొంగ దొరికిపోయింది. బతికిపోయాను' అనుకున్నాడు. కింది పెదవిని బిగించి వచ్చే నవ్వును ఆపుకుంటూ హేమ చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కాడు.
హేమ ఉలిక్కిపడి చంద్రం ముఖంలోకి చూసింది. కేవలం తనును ఏడిపించటానికే అలా చేశాడని తెలుసుకున్న హేమ 'అమ్మయ్య' అనుకుంది మనసులోనే చంద్రం చేతిలోని తన చేతిని లాక్కోబోయింది. కానీ చంద్రం వదల్లేదు.
"నా చెయ్యి వదులు నీ కాబోయే భార్య చూస్తే ఊరుకోదుసుమా!" అంటూ చెయ్యి లాక్కుంది హేమ.
"ఆ అమ్మాయి చాలా మంచిది, చూసినా ఏమీ అనుకోదు," అన్నాడు చంద్రం నవ్వుతూ.
"అలాగా? అయితే ఆ అమ్మాయి ఎలా వుంటుందో కాస్త వర్ణించండి కవిగారూ!" అంది హేమ ఎగతాళిగా.
హేమను కాస్త ఉడికించాలనిపించింది చంద్రానికి వర్ణించాలంటే వెంటనే ఏ రూపమూ కళ్ళకు కట్టలేదు. ఇంతలో గౌరీ గుర్తొచ్చింది.
"వర్ణించమన్నానా? మళ్ళీ ఉడుక్కుంటే లాభంలేదు."
"మధ్యలో నా కెందుకు ఉడుకుబోతుతనం?"
"అలాగేం? అయితే విను. చామని చాయకంటే ఓ ఛాయ ఎక్కువే అనుకో అంత ఎత్తూకాదు - అంత పొట్టీకాదు. కొంచెం బొద్దుగా వుంటుంది. ముఖంలో దీనత్వం, కళ్ళలో అమాయకత్వం, బిర్రుగా బిగించి రిబ్బనుకట్టి, తేలుకొండిలా చివర వంకరతిరిగి పైకి లేచిఉండే జడ, బలేగా వుంటుందిలే."
హేమ ముఖంలో భావ పరివర్తనని గమనించిన చంద్రం ఇంకా చెప్పుకుపోసాగాడు:
"నీతో ఆ అమ్మాయిని పోల్చాలంటే ఒక చక్కని ఉదాహరణతో చెప్పవచ్చు."
"ఏమిటది?" ఎంత దాచ ప్రయత్నించినా హేమ స్వరంలో ఆతృత, ఉడుకు బోతుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వున్నాయి.
"నువ్వెప్పుడయినా అడవిమల్లెను చూశావా?" చంద్రం హేమ కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు. చంద్రం కళ్ళలో కదిలిపోతున్న కాంతిరేఖలను చూసి హేమకు వళ్ళు మండిపోయింది. ఆ పిల్ల గురించి చెబుతుంటేనే కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయే, ఆ అమ్మాయిని చూస్తుంటే ఎలా వుంటాయో అనుకుంది హేమ.
"నువ్వు ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళావు. అక్కడ కదంబంలో మల్లెపూలను చూసేవుంటావు. అవి దూరంనుంచి చూట్టానికి మామూలు మల్లెపూలలాగే వుంటాయి. కానీ, దగ్గిరగా చూస్తే మామూలు మల్లెలోని నాజూకుతనం లేకుండా కొంచెం మొరటుగా కనిపిస్తాయి. వాటికి, మంచిమల్లెకు వుండే సుగంధం కూడా వుండదు. మనస్సులను ఆకర్షించలేని ఆ పూలు వెలవెలబోతుంటాయి."
తమాషాగా మొదలుపెట్టిన చంద్రం చెప్పుకుపోతూంటే గౌరీ కాళ్ళకు కట్టినట్లు అయింది.
"అవును, ఆ అమ్మాయి కూడా అందంలో నీకు తీసిదుకాని, మంచిపోషణలేని శరీరం. కాయకష్టానికి అలవాటుపడ్డ శరీరం కావటం వల్ల నీ అంత నాజూకుగా కనిపించదు. విద్యాగంధం లేదు. సభ్యసమాజంలో పెరగలేదు. కాబట్టి హృదయ వికాసంలేదు. ఆమెకూ అన్ని అవకాశాలూవుంటే నీలాగే...."
"చంద్రం! ఇక చాలు ఆపు" అంది హేమ ఆవేశంగా.
చంద్రం ఆవేశం నుంచి బయటపడ్డాడు. తను అనుకున్నదొకటీ, మాట్లాడింది మరొకటీ గౌరి స్థితీ, గౌరీలాంటి ఆడపిల్ల స్థితీ తలచుకొని తను అసలు విషయం మర్చిపోయి, ఆవేశంగా ఏదో ఏదో మాట్లాడేశాడు. తనను తను సంబాళించుకున్నాడు. ప్రశాంతంగా హేమ ముఖంలోకి చూచాడు.
కందగడ్డలా, కోపంతో, అవమానంతో ఎర్రబడ్డ హేమ ముఖం చూసి చంద్రం ఫక్కున నవ్వాడు. ఇదంతా తనను ఏడిపించటానికి అల్లిన ఓ కట్టుకథ మాత్రమే అని తెలుసుకొన్న హేమ మానస్సు శాంతపడింది.
"మొత్తంమీద రచయిత వనిపించుకున్నావు?" అంది హేమ కోపాన్ని అభినయిస్తూ.
"బాబాయ్! అమ్మ భోజనాలకు పిలుస్తూంది" అంటూ పరుగెత్తుకొచ్చింది రజని.