Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 23


    తననే రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ అపరిచిత యువకునివైపు చిత్రంగా చూసింది హేమ. ఆమె దృష్టి కుడిచెవుకు కిందగా మెడమీద వున్న పెద్ద పుట్టుమచ్చమీద పడింది.

 

    "చంద్రం!" - పెదవులు కొంచెం కదిలాయి. కాని ధ్వని బయటకు రాలేదు. ఇంతకాలంగా ఆమె హృదయాకాశాన్ని ఏలుతున్న నెలవంక ఈనాడు అనుకోకుండా పూర్ణచంద్రుడై ఆమె ఎదుట నిలిచాడు. అనుకోకుండా ఆనందాంబుధిలో మునిగిపోయిన హేమకు ఊపిరి సలపటంలేదు.

 

    తన బాబాయి, హేమ అలా ఒకర్నొకరు చూస్తూ నిలిచిపోవటం చూసిన రజనికి తమాషాగా అనిపించింది. తన చక్రాల్లాంటి పెద్ద కళ్ళను తమాషాగా తిప్పుతూ, ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తున్నది. మొన్నను తను చూసిన సినిమాలో నాగేశ్వరరావూ, కృష్ణకుమారీ అలాగే ఒకర్నొకరు చూసుకున్నారు - అనుకుంది. బాబాయీ, హేమ పిన్నీ ప్రేమించుకుంటున్నారు - బలే! బలే! రజని తను చదివే నవలల జ్ఞానం, చూసే సినిమాల అనుభవంతో, ఆ వయస్సు పిల్లలకు సాధారణంగా అర్థంగాని విషయాన్ని అర్థం చేసుకున్నట్లనుకొని ఆనందించసాగింది.

 

    "ఏమోయ్ చంద్రం! ఎవరో అనుకున్నాను సుమా! ఎంత ఎదిగావు? చిన్నప్పుడు నిన్ను చూసి ఇంత స్ఫురద్రూపివవుతావనుకోలేదు సుమా!" అంటూ ప్రసాదరావు, కృష్ణారావుతో కలసి, హేమా, చంద్రంల దగ్గరకు వచ్చాడు.

 

    చంద్రం, హేమా ఒకేసారి ఉలిక్కిపడ్డారు. తన పరిస్థితిని అందరూ గ్రహించారేమోనని సిగ్గుపడిపోయింది. హేమ.

 

    "కూర్చోమ్మా హేమా!" అన్నాడు కృష్ణారావు.

 

    అందరూ కూర్చున్నారు. ప్రసాదరావు చంద్రం గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. కాని చంద్రం కొన్నిటికి ముక్తసరిగా జవాబిచ్చాడు. కొన్నిటికి అసలు జవాబే ఇవ్వలేదు. గతాన్ని జ్ఞాపకం చెయ్యటం చంద్రానికి ఇష్టం లేనట్లుందని అర్థం చేసుకుని ప్రసాదరావు ప్రసంగాన్ని మార్చాడు. హేమ చదువుగురించీ, ఉద్యోగం గురించీ చెప్పసాగాడు.  

 

    "ఈ విషయాలన్నీ ఎవరిక్కావాలి? అసలు హేమకు పెళ్ళయిందో లేదో ఒక్కరూ చెప్పరేం?" అని తనలో తనే విసుక్కున్నాడు చంద్రం. ఆమెకు వివాహం అయిందో కాలేదో తెలుసుకోవాలనే ఆదుర్దా నిముష నిముషం పెరగసాగింది.

 

    సరిగ్గా అదే భావం హేమలో కూడా ఆందోళన కలిగించసాగింది. ఆమె మౌనంగా అందరి మాటలు వింటూ కూర్చుంది. ఇన్ని విషయాలు అడిగే నాన్న, చంద్రానికి వివాహం అయిందో కాలేదో కనుక్కోడేం?

 

    కృష్ణారావు కూడా తమ్ముడి వివాహం అయిందో కాలేదో తెలుసుకోవాలనే కుతూహలం తమ్ముణ్ణి చూచినప్పటినుంచీ పట్టుకుంది. తను అడిగితే తమ్ముడు చెప్పడు. ప్రసాదరావన్నా అడిగితే బాగుండును అనుకున్నాడు.

 

    కాని ప్రసాదరావుకు అసలు ఆ అనుమానమే వచ్చినట్లు లేదు. చంద్రం రూపురేఖలూ, మాట్లాడే తీరు, అతనిలో కనిపిస్తున్న సంస్కారం చూసిన ప్రసాదరావు తన హేమ చాలా అదృష్టవంతురాలని మురిసిపోయాడు.

 

    "చంద్రం! మీ అన్నయ్య ఎంత చక్కని గార్డెన్ పెంచాడో చూశావా?" - చంద్రం, హేమలు మాట్లాడుకోవటానికి అవకాశం కలిగించాలనే ఉద్దేశ్యంతో అన్నాడు ప్రసాదరావు.

 

    "అబ్బే, ఇంకా వాడేమీ చూడందే!"
    
    "ఇంకా మేం వచ్చి గంటకూడా కాలేదు. అప్పటినుంచి బాబాయి, కూతురు కబుర్లతోనే సరిపోయింది. హేమా! చంద్రానికి గార్డెన్ చూపించమ్మా!" అన్నాడు కృష్ణారావు, ప్రసాదరావు అభిప్రాయాన్ని తెలుసుకొని.
    
    రజని చటుక్కున లేచింది. "బాబాయ్ కి, నేను చూపిస్తాను మనతోట," అంది చంద్రం చెయ్యిపట్టుకు లాగుతూ చంద్రం నవ్వుతూ లేచి నిల్చున్నాడు. హేమ కూడా లేచి తోటవైపు బయలుదేరింది. బాబాయి చెయ్యిపట్టుకుని రజని కూడా ఉత్సాహంగా బయలుదేరింది.
    
    "చూడమ్మా రజనీ! వంటింట్లో అమ్మకు కాస్త సాయం చెయ్యి" అన్నాడు కృష్ణారావు.
    
    "వంటవాడున్నాడుగా? నే నెందుకు అమ్మకు సాయం చెయ్యాలి?" అంది, తండ్రి పురమాయింపుకు కారణం తెలుసుకోలేని రజని.
    
    "వంటసాయం కాదమ్మా! కప్పులూ, ప్లేట్లూ అవీ తుడిచి సిద్దంగా పెట్టవద్దూ? మరి బాబాయి వచ్చాడని ఇచ్చే పార్టీలో ఆమాత్రం కూడా ఆపని చెయ్యకపోతే ఎలా?" అన్నాడు కూతుర్ని బుజ్జగిస్తున్నట్లు కృష్ణారావు.
    
    రజని బుంగమూతి పెట్టుకొని అయిష్టంగా బాబాయి చెయ్యి విడిచిపెట్టి వంటింట్లోకి వెళ్ళింది. హేమా-చంద్రం తోటవైపు వెళ్ళారు.
    
    "బాబాయి అంటే మా రజనికి ఎంత గౌరవమో చూడండి, అందుకే మొదటిసరిగా నేను పని చెప్పితే కిక్కురుమనకుండా వెళ్ళింది!" మురిపెంగా అన్నాడు కృష్ణారావు ప్రసాదరావుతో.
    
    గార్డెన్ అంతా హేమా, చంద్రం మౌనంగా తిరిగాడు. రకరకాల పూలచెట్లతో ఎంతో శ్రద్దగా పెంచిన ఆ గార్డెన్ చంద్రానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ముఖ్యంగా హేమ తనకూడా ఉండటం వల్లనే ఈ పూలతోట తనకు ఇంత అందంగా కనిపిస్తుందేమో ననుకున్నాడు చంద్రం.
    
    ఇద్దరికీ ఓ యిష్టమైన కలగంటున్నట్లు అనుభూతి కలిగింది. కలలోనే మళ్ళీ తమతమ కలల్లో తేలిపోతున్నారు ఎవరికీ మాట్లాడాలని లేదు. మాట్లాడితే అంత ఆనందాన్నిస్తున్న ఆ అనుభూతి ఎక్కడ కరిగిపోతుందోనని వారి భయం కృష్ణారావూ, ప్రసాదరావూ వాళ్ళిద్దర్నీ ఇలా తోటలోకి పంపించటానికి ప్రయత్నించినప్పుడే హేమ అవివాహిత అని తెలుసుకున్నాడు చంద్రం.
    
    అలా ఎంతసేపు తోటంతా కలియతిరిగారో వారికే తెలియదు. మల్లెపందిరి దగ్గరకు రాగానే అక్కడున్న సిమెంటు బెంచీని చూపిస్తూ "ఇక్కడ కూర్చుందాం" అన్నాడు చంద్రం. హేమ అంగీకారసూచకంగా తల ఆడించింది.
    
    చంద్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది హేమకు. తనివితీరా చూడాలని వుంది. చంద్రం తనను చూడటం లేదనుకున్నప్పుడల్లా చూస్తున్నది చంద్రం ఆ విషయాన్ని గమనించకపోలేదు. చంద్రం ముఖంలోకి చూసి మాట్లాడటానికి ఏదో బలహీనత హేమను వశం చేసుకుంది. ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తూంది ఆ విషయం ఆలోచిస్తే హేమకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమిటి ఈ అనుభూతి! స్త్రీ, మగవాడిని చూసి సిగ్గుపడుతుందంటే ఆమెలోని బలహీనతే అందుకు కారణం అనుకొనేది తను చీటికి మాటికి మగవారిముందు సిగ్గుపడాలంటే తనకు చాలా సిగ్గు కానీ ఈరోజు తనకు తెలియకుండానే తనలో సిగ్గు ప్రవేశించింది.
    
    "హేమా!" చంద్రం హేమ చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకున్నాడు.
    
    హేమ ఉలిక్కిపడి చేతిని లాగేసుకుంది. కాని అలా చేసిన వెంటనే చంద్రం బాధపడుతున్నాడేమోనని అతని ముఖంలోకి చూస్తూ-
    
    -అవే కళ్ళు! పెద్ద పెద్ద కనురెప్పలు కొంచెం వాలినట్లుండే ఆ కళ్ళు తనకెంతో ఇష్టం చంద్రం కళ్ళు అందమైన ఆడపిల్లకు వుండవలసిన కళ్ళు ఆ కళ్ళే చంద్రం ముఖానికి సౌమ్యతను కలిగిస్తూ చూడగానే మంచివాడు అనే భావాన్ని కలిగిస్తాయి.
        
    "ఏమిటి అంత దీర్ఘంగా అలోచిస్తున్నావు?" - చంద్రం ప్రశ్నకు హేమ తన ఆలోచనల నుంచి బయటపడింది.
    
    "నువ్వు....మీ.....రు రాసిన పుస్తకాలు కొన్ని చదివాను," అంది హేమ గాబరాగా, చంద్రాన్ని మాటల్లోదించే ధోరణిలో.
    
    చంద్రం పకపక నవ్వాడు. హేమ చంద్రం ముఖంలోకి తెల్లబోయి చూసింది, ఆ నవ్వుకు కారణం తెలియక.
    
    "ఏమిటి హేమా! 'మీరు' అంటున్నావు? ఈ ఎనిమిది సంవత్సరాల్లోనే నీ మనస్సుకు అంతదూరం అయిపోయానా? అప్పుడు నేనుకూడా నిన్ను 'మీరు' అనాలికాబోలు!" అన్నాడు చంద్రం, ఆఖరుమాటల్ని కొంచెం సాగదీస్తూ హేమ వస్తున్న నవ్వును పెదవులతోనే అతికష్టంమీద బంధించింది.
    
    "హేమా! ఎంత పెద్దదానివయావు?" అన్నాడు చంద్రం హేమ సౌందర్యాన్ని కళ్ళతోనే తాగుతూ, తననే రెప్పవాల్చకుండా చంద్రం చూస్తుంటే హేమకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
    
    "అయితే చంద్రం! నువ్వు ఇక్కడ నుంచి పారిపోయావుగదా?" ఆ తరువాత ఏం జరిగింది? ఎక్కడెక్కడికి వెళ్ళావు?.... ఏం చదివావు? చెప్పవూ?" అంది హేమ చంద్రాన్ని వేరే మాటల్లోకి దించాలనే ఉద్దేశంతో.
        
    హేమ ప్రశ్నలకు చంద్రం మనస్సు చివుక్కుమంది. అవును, తను ఇంటినుంచి పారిపోయాడు. పైగా, దొంగతనపు నేరాన్ని నెత్తిన వేసుకొని పారిపోయాడు. హేమ ఆనాడు తనను దొంగగా భావించింది. ఈనాడు? ముఖ్యంగా ఇంత కాలానికి కలుసుకున్న ఈ క్షణంలో కూడా హేమ ఆ విషయాన్నే గుర్తుచేస్తున్నది. సిగ్గుచేత చెయ్యి లాగేసుకున్నదని తను భావించాడు. ఎంత పొరపాటు! హేమ తను - ఏం చదివాడో, ఎన్ని డిగ్రీలు పొందాడో, దొంగగా పారిపోయిన తను - ఈ మధ్యకాలంలో ఏమేమి చేశాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. అంటే?....

 Previous Page Next Page