అప్రయత్నంగా రంగారావు నిట్టూర్చారు చదువుతూ. ప్చ్, మాధవ్ యింత స్వల్పకాలంలో యింత వ్యధ అనుభవించాడా? తమకి మాటమాత్రం తెలియకుండానే యింత కధ జరిగిందా? ఆ పాపని ఏంచేశాడు. ఏమయింది? ఆరాటంగా పేజీ తిప్పారు. తరువాత పేజీ ఖాళీ యింకేం రాసిలేదు. మరో పేజీ తిప్పారు, శ్యామలకి యీడైరీకి సంబంధం ఏమిటి? శ్యామల చెప్పదలచింది ఏమిటి? ఆ పేజీలో వున్నది మాధవ రాతకాదు, శ్యామలది శ్యామల ఉత్తరం రాసింది. "పూజ్యులైన రంగారావుగార్కి నేను మనసారా ప్రేమించి, గౌరవించిన భర్తగా, చనువుగా పిలుచుకునే అధికారం లేదు కాబట్టి, యిలా పిలుస్తున్నందుకు అన్యదా భావించవద్దు.
టెలిగ్రాం కొరకు ఎదురు చూస్తున్న మీకు యింత పెద్ద ఉత్తరం చిరాకు కలిగించవచ్చు చిన్నప్పటినించి అసలు పుట్టకముందునించి దౌర్భాగ్యురాలివే అందుకే అలా దిక్కు మొక్కు లేకుండా అనాధలా అనామికగా ఏ ఆశలు, కోరికలు లేకుండా పెరిగాను, ఏనాటి పుణ్యఫలమో మీరు నన్ను అభిమానించి ఆదరించారు. ఏనాడు చేసిన పూజాఫలమో మీ అంతటి పరువు, ప్రతిష్ట కల ధనవంతులయింట అడుగుపెట్టి మీలాంటి వారిని చేపట్టగలిగాను. నా అదృష్టానికి మురిసిపోయి పొంగిపోతున్నాను. నడమంత్రపుసిరి లాగే మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే కొట్టుకుపోయింది.
మీరు అడిగినప్పుడు నానోరు ఎందుకు మూగపోయింది. ఎందుకు నిజం చెప్పలేకపోయిందీ, అసలు సంగతి ఏమైందీ చెప్పేలోపలే మీరు నేను ఈ లోకంనించి శాశ్వతంగా నిష్క్రమించాలని నిర్ణయించారు. మీరింత తొందరగా, యింత కఠిన నిర్ణయం తీసుకుంటారని అనుకోని నేను ముందుగానే నిజం చెప్పకుండా మీ శిక్షకు పాత్రురాలినయ్యాను, మీశిక్ష అమలుజరపకపోతే తిరిగి మమ్మల్ని చూడలేనని, ఎవరో ఒకరే మిగిలి వుంటామని, నేను యేమి చెయ్యాలో తోచకుండా నా కాళ్ళూ చేతులు కట్టేశారు. నా కర్తవ్యం మీరు చెప్పిన మార్గం కంటే మరొకటి లేదని తేల్చేశాను. నాపై మీకు నిజంగా నమ్మకం, అభిమానం వుంటే ఇంతతొందర పడేవారు కారు. అవి లేకపోయాక పైపై బంధనాల కోసం ఆశపడి నేను బతకదం అనవసరం. కాబట్టి శెలవు పుచ్చుకొంటున్నాను, బహుశా మీకు ఇది అందే సరికి టెలిగ్రామూ రావచ్చు. మీకిష్టం ఉన్నా లేకపోయినా ఆఖరిసారి లోకం కోసం వచ్చి నన్ను చూడకతప్పదు.
ఏమిటీసోది అని విసుక్కుంటున్నారా? నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక, నన్ను నిలువునా కాల్చే అభిమానం నా నిష్కళంకతని నిరూపించుకోవాలని ప్రోత్సహిస్తూంది. మీ దృష్టిలో చనిపోయాక కూడా దోషిగా నిలబడడం యిష్టంలేక యీ నాలుగు మాటలు రాస్తున్నాను చివరి వరకు చదవండి.
మీ తమ్ముడు గారి డైరీ చదివితే నేను చెప్పబోయేది సగం అర్ధం అయి వుంటుంది. ఈ మిగతా సగం కూడా చదివి నేను దోషినో కాదో మీరే నిర్ణయించండి.
నేను మీ ఇంటికి వచ్చాక ఇంటి యజమానురాలిగా సర్వాధికారాలు నాకప్పగించారు.
మీరు నాకిచ్చిన అధికారం, నాపై మీ ఆదరాభిమానాలు యింటిలో అందరికీ ఆశ్చర్యం కలిగించాయి అన్నది మీకూ తెలుసు. ఇలా వుండగా నేను వచ్చిన రెండునెలలకి ఒకరోజు మీ అమ్మగారు నాకు కబురంపారు. వెళ్ళాను. ఆవిడమనసులో ఏదో వుందని, అది నాకు చెప్పాలని ఆరాటపడుతున్నారని ఆవిడ మొహం చూస్తే తెలుస్తూంది." కూర్చో శ్యామలా" అన్నారు గంభీరంగా "శ్యామలా ఈ రోజు నీతో నేను ఒక విషయం చెప్పబోతున్నాను, ఆ విషయం నీదగ్గర నుంచి మరో మనిషికి చేరదని, ఆ విషయం మరొకరికి తెలియనీయనని నాకు మాట యీయగలవా? నేను చెప్పబోయే రహస్యం మనిద్దరి మధ్యనే వుంచుతానని నీవు వాగ్ధానము చేయగలవా?" అన్నారు నాకేం అర్ధం కాలేదు ఆశ్చర్యంగా చూశాను అంత రహస్యం ఆవిడ నాతో చెప్పడం ఏమిటో అంతా వింత అనిపించింది. "శ్యామలా నీ ఆశ్చర్యం నాకు తెలుసు. ఈనాడు నాకింత కంటే గత్యంతరం లేదు, శ్యామలా నేను చెప్పబోయేది విని నీ పూర్తి సహకారం నాకిస్తానని నీవు మాట యివ్వాలి. ముఖ్యంగా ఈ విషయం రంగారావుకి అసలు తెలియడానికి వీలులేదు. ప్రమాణం చెయ్యి" చెయ్యిచాచి అడిగారు. మీకు కూడా తెలియని ఆ రహస్యం ఏమిటో నేనేం చెయ్యాలో నాకేం అర్ధంకాలేదు అయినా ఆవిడ మీద వున్న గౌరవం కొద్దీ" ముందు మీరు విషయం చెప్పండి. విషయం తెలుసుకోకుండా నేను చెయ్యగలనో లేదో ఎలా చెప్పగలను. మీరేం చెప్పినా అది నాలోనే వుండి పోతుందని మాత్రం హామీ యివ్వగలను" అంటూ ఆవిడ చేతిలో చెయ్యి వేశాను. "శ్యామలా నీకీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈపని కాగలిగితే అది నీవల్లే అవాలి. యిప్పుడు నీకంటే యింకెవరూ కనపడటంలేదు. రంగారావు నీ మాట వింటాడన్న నమ్మకం నాకున్నది నీవు అడిగితే కాదనడన్న విశ్వాసం నాకున్నది "తెల్లబోయి చూశాను. అప్రయత్నంగా నామొహం ఎర్రబడింది. "మీరు .... మీరు" "కంగారుపడకు, యీ రెండు నెలలుగా అబ్బాయి నీకిచ్చిన స్థానం నాకు తెలుసు. నీమీద వాడికున్న నమ్మకమూ గ్రహించాను. కనుకే ఈపని నీవే చెయ్యగలవన్న నమ్మకంతో నీకీ సంగతి చెపుతున్నాను". ఆవిడ ఆయాసంగా ఆగి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. తరువాత కళ్ళు తెరచి "నీవు నా రెండో కొడుకు మాధవరావు పేరువిన్నావు కధా! వాడు కారు ఏక్సిడెంటులో చనిపోయిన సంగతి తెల్సుకధా!" చప్పున తలవూపాను.
"శ్యామలా! నాకొడుకు రక్తం పంచుకుపుట్టిన బిడ్డ మన అనాధశరణాలయంలో అనాధగా పెరుగుతూంది తెలుసా?" ఆవిడ చెప్పలేక చెబుతున్నట్టు నల్లబడిన మొహంతో అన్నారు ఆవార్తకి దిమ్మెరపోయాను. అవును శ్యామలా నాకొడుకు కాలేజి చదివే రోజులలో ఒక ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించాడు. కులం, సాంప్రదాయం, వంశం, పరువు ప్రతిష్టలంటే ప్రాణం పెట్టే మేము ఆ అమ్మాయిని చేసుకోడానికి ఎంత మాత్రం వప్పుకోమని వాడికి తెలుసు ముఖ్యంగా అన్నగారి ఎదుట మాట్లాడి వాడ్నివప్పించలేనని వాడికి తెలుసు. అంచేత మాకెవరికి తెలియకుండానే ఆ అమ్మాయిని రిజిష్టర్ మ్యారేజి చేసేసుకున్నాడు వారి ప్రేమఫలం ఒక కూతురు కాని ప్రేమించి పెళ్ళాడిన ఆ అమ్మాయి..... బిడ్డని కని కన్ను మూసింది. వాడి ప్రేమకధ ఒకసంవత్సరంలోనే పరిసమాప్తం అయింది ఆ పుట్టిన బిడ్డని ఏం చేయాలన్నదివాడికి ఒకసమస్య అయింది. ఒక దాసి పెంపకంలో పెట్టాడు.