"ఎన్నాళ్ళు దాగుతుందీ విషయం-" దాగినన్నాళ్ళు దాగనీ ఎప్పుడు తెలిస్తే అప్పుడే చెప్పచ్చు ముందుగా మనం రిజిస్ట్రార్ ఆఫీసులో దరఖాస్తు పెట్టాలి. ఆఫీషియల్ గా మనం భార్యభర్తలం కావాలి." భవిష్యత్తు నిర్ణయించుకున్నాను-"
'రైలు దిగి టాక్సీ ఎక్కి హోటలు పేరు చెప్పి పోనిమ్మన్నాడు రజియా ఆశ్చర్యంగా అదేమిటి మా యింటికి కాదూ రమ, శకుంతల ఏరీ అనబోయింది. రజియావంక కొంటెగా చూశాను. ఊహు మనమధ్య అడ్డు వెళ్ళేందుకు" అన్నాడు చెయ్యి మృదువుగా నొక్కి రజియా మొహం సిగ్గుతో కందింది ఊహు ప్లీజ్ వద్దు హోటలుకి వద్దు అంది అభ్యర్దిస్తున్నట్టు - "ఊహు అదేంకుదరదు ఈ రాత్రి మన మొదటి రాత్రినిమరిచిపోకు అన్నా అలకగా రజియా చురుక్కున చూసింది. మనం లోకం దృష్టిలో యింకా భార్యభర్తలం కాదన్న సంగతి మరిచిపోకండి" మీ అల్లా సాక్షిగా అయ్యాంగా. "మీ దేముడి సాక్షిగా నలుగు రెదుట జరగకపోతే రేపు నేను అందరికి మొహం ఎలా చూపగలను?" అంది రజియా రజియా మాట నిజమే అన్పించింది కాస్త నిరుత్సాహం అన్పించినా అందరికి పని ఎందుకు కలిపించాలని ఆలోచించి టాక్సీడ్రైవరుకి తోవ చెప్పాడు. "కోపం వచ్చిందా?" రజియా నా మౌనాన్ని చూసి అడిగింది. "ఊ.....చాలా వచ్చింది సరే, యివాళ తప్పించుకున్నావు రేపు వడ్డీ వేసుకు వసూలు చేస్తాను" అన్నాను చెయ్యి గట్టిగా నొక్కి రజియా సిగ్గుల పెళ్ళి కూతురయింది. రమ, శకుంతల మమ్మల్ని చూసి ఆనందించారు కేవలం చదువుకే ఆదుకుంటారనుకున్న వాళ్ళిద్దరూ అసలు సంగతి విని చిన్న పిల్లల్లా సంబరపడ్డారు రజియాని కౌగలించుకున్నారు. మర్నాడు ఉదయం దేవాలయంలో అర్చకుని మంత్రాల మధ్య దండలు మార్చుకున్నాం రమ, శకుంతల రజియాని హిందూ పెళ్ళికూతుర్లా పూలు, కుంకుమ పౌరాణిలతో అలంకరించారు.
రజియా కోరిక మీదే మెడలో తాళి కూడా కట్టాను. తాళి కడ్తూ "ఈ రోజు నుంచి నీవు రజియాని కావు రాజీని ఈ తాళి బొట్టుతో నీమతం సంప్రదాయం నీ పాతపేరు అన్నీ పోయి మాలో చేరిపోయావు" అన్నాను. రజియా కళ్ళు సంతృప్తితో తళతళ లాడాయి సాయంత్రం హోటలులో నా స్నేహితులకి, రజియా స్నేహితులకీ పార్టీ యిచ్చాం. ఆశ్చర్యపడ్డవాళ్ళు, అభినందించిన వాళ్ళు, రజియా అందం చూసి నా అదృష్టానికి అసూయ పడ్డవాళ్ళు అన్ని రకాలవారు వున్నారు. ఆ రాత్రి హోటలులో గది తీసుకున్నాను రమ శకుంతల రజియాని శ్రద్దగా ఆలంకరించి మరీ పంపారు. పాల నురుగులాంటి తెల్లని వెన్నెలలాంటి ట్యూబ్ లైట్ కాంతిలో తెల్లచీర, విరబూసిన జాబులతో రతీదేవిలా రాజీ వచ్చింది. ఆతృతగా కౌగిలిలోకి లాక్కున్నాను ఆక్షణం అలా శాశ్వతంగా నిలిచిపోతే చాలనిపించింది రాజీ అందం ముందు రాజీ అందించిన ఆనందం ముందు తల్లి అన్న, వంశం గౌరవం, అన్న పేలవంగా కన్పించాయి.
తర్వాత వారం రోజులకి ఓ యిల్లు కుదుర్చుకొని రాజీతో కాపురం పెట్టాను. హాస్టల్లో వుండడం లేదు. వేరే యిల్లు తీసుకున్నాను. డబ్బు ఎక్కువ కావాలి అని యింటికి వ్రాసి తెప్పించుకున్నా రోజుకో కొత్త అందం ఆనందాలు చూపే రాజీతో కాపురం స్వర్గం అన్నది వేరే ఎక్కడుంటుంది అనిపించిన రోజులు. ఎంత ఆలోచించినా యీ విషయం యింట్లో ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
శలవలకి వెళ్ళకుండా ఏదో సాకు పెట్టి తప్పించుకున్నాను హౌస్ సర్జన్సీ పూర్తయింది. ప్రాక్టీసు పెట్టాలని నిర్ణయించుకున్నాను దానికి దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం రెండు రోజులు యింటికెళ్ళక తప్పలేదు. యింటికి వెళ్ళింది దగ్గరనించి ఈ జమీందారుగారి ఏకైక కుమార్తెనిస్తా మన్నారు. ఆ జమీందారుగారి చెల్లెలు వుంది. అంటూ పెళ్ళిచేసుకోమని పోరు. కొన్నాళ్ళు పోయాక అని తప్పించుకున్నాను. ఇటు ప్రాక్టీసు ఆరంభించడం అటు రాజీ నాకు మొదటి పేషెంటు అవడం ఒకేసారి జరిగాయి. రాజీగులాబి చెక్కిళ్ళు పాసిపోయాయి. ఎన్ని అలాంటి కేసులు చూసినా నా రాజీకి ఆవగింజంత కష్టంవున్నా భరించలేక డాక్టర్ ల దగ్గరికి పరుగులు పెట్టను. కాని అని మా అనురాగఫలం అందుకోవాలంటే రాజీ ఆమాత్రం కష్టపడకుండా ఎలా? లేడీ డాక్టరు అభినందిస్తూనే 'మరీ అంత అపురూపం అయితే ఎలా అయ్యా' అంది హాస్యంగా ఇప్పటికైనా మీ ఇంటిలో చెప్పారా అంది రాజీ. చెపితే అభినందనలు కాదు అందుకునేది అని తెలిసి ఎలా చెప్పడం అన్న ఆలోచనలోపడ్డాడు.
మై మరిచి డైరీ చదువుతున్న రంగారావు మొహం ఎర్రబడింది. తమ్ముడు ఎంత పని చేశాడు. కులం, మతం, సాంప్రదాయం అన్నీ వేరయినా ముస్లిం స్త్రీని పెళ్ళాడాడా? ఈ విషయం తమకి తెలియకుండా ఎంత రహస్యంగా దాచాడు! కానీ తమ్ముడు కధకి, శ్యామల కీ ఏ సంబంధం వుందో ఆయనకి అప్పటికీ అంతుబట్ట లేదు. మధ్య మధ్య అనవసరం అనుకున్నవి వదిలేస్తూ ఆరాటంగా పేజీలు తిప్పారు తొందరగా. మధ్యలో కొన్ని పేజీలు ఏం రాయకుండా ఖాళీగా వున్నాయి, తర్వాత తిరిగి కనిపించిన వ్రాతని చదువుతూ ఒక్క క్షణం చకితులై పోయారు -అయిపోయింది, అంతా అయిపోయింది నా ప్రేమకధ ముగిసిపోయింది. ఏరికోరి వలచి, వలపించి చేసుకున్న నా రాజి ప్రేమకధ పట్టుమని ఏడాది కాకుండానే పరిసమాప్త మయిపోయింది. ఎన్ని మలుపులతో, ఎన్ని వింతలతో, ఎంతో అందంగా, ఆనందంగా, సాగాల్సిన రాజీకధ ఎవరూ ఊహించని ముగింపుతో యింత తొందరగా ముగుస్తుందని ఎవరనుకున్నారు? ఎందుకింత నిర్దాక్షిణ్యంగా పరిసమాప్తి చేశాడు ఆ దేముడు-ఆదేముడుకి మా ఆనందం. మా సంతోషం చూసికన్ను కుట్టిందా? పాపిష్టి దేముడు ఓర్చలేకపోయాడా? ఇంతమంది డాక్టర్లు స్వయానా నేను డాక్టరునయి, రోజుకీ ఎన్నో వందలమంది స్త్రీలకి పునర్జన్మ యిచ్చే నేను నా రాజీని ఎందుకు బ్రతికించుకోలేకపోయాను? ఎంతోమంది బిడ్డలకి తల్లిని-తల్లులకి బిడ్డలని యిచ్చే నేను నాబిడ్డకి తల్లిని ఎందుకు దక్కించుకోలేకపోయాను విధి, కర్మ అని సరిపెట్టుకోవాలా? రాజీని ఎలా మరిచిపోను? ఏంపాపం చేశానని యింత శిక్ష వేశాడు దేముడు? రాజీలేని బ్రతుకు నాకెందుకు? ఎవరి కోసం? రాజీని తీసుకుపోయిన ఆ దేముడు ఈ బిడ్డని నా మెడకి ఎందుకు తగిలించాడు? నా రాజీని నా నుంచి తీసుకుపోవడానికి ఈ బిడ్డకాదు కారణం-పుట్టకముందే దురదృష్టవంతురాలైన ఈ పసిబిడ్డని ఎలా సాకాలి? ఏం చెయ్యను....... ఉహు.....రాజీ లేని యీ ప్రపంచంలో నాకేంవద్దు ఎవరో ఓదార్పు నాకొద్దు. పోండి అందరూ పొండి. ఆ పాపిష్టి బిడ్డని నాకు కనబడకుండా తీసుకుపోండి. పారేయండి దూరంగా ఆ తల్లిదగ్గరికే పంపించండి దాన్ని, నాకేం తెలియదు, నాకేం వద్దు తీసుకుపోండి- పిచ్చివాడిలా రాజీ శవంమీదపడి ఏడ్చే నన్నెవరు ఓదార్చగలరు? తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు ఏడిస్తే రాజీ వస్తుంది. నెల రోజులు ప్రపంచం మొహం చూడకుండా నాలో నేను కుమిలాను. ఉహు రాజీకి జాలి లేదు, రాదూ, యింక రాదు నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చాను స్నేహితులు, ఆప్తులు ఓదార్చడంతప్ప ఏంచేస్తారు? ఇంటికి రాస్తామన్నావద్దన్నాను. మధ్యలో మొదలైన కధ మధ్యలోనే అంతమైపోయింది. మళ్ళీ నాకు నేనుగా మిగిలాను. ఊహు, కాదు నాకు తోడుగా రాజీ ఛాయని మిగిల్చిపోయింది ఏం చెయ్యను ఆ పాపని. అందరూ కలిసి కుదిర్చిన ఆ ఆయా చేతిలో కేరు కేరుమంటూ ఏడిచే ఆ పసికందు మీద ద్వేషంపోయి ప్రేమపుట్టుకొచ్చింది. ఈ పాపఎవరు నా రాజీ కదూ, నా రాజీరక్తంలో రక్తం; పేగులో పేగుకదూ, యింత నిర్దయగా పాపని వదిలేస్తే రాజీ క్షమిస్తుందా నన్ను, ఈ పాపరక్తం నాదికదూ! ఎంత క్రూరుడిని, పసిపాపని కౌగలించుకుని గుండెకి హత్తుకుని విలపించాను.