Read more!
 Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 2

 

    "కుర్చోవోయ్ అని రామనాధం గారు మెట్ల పైకి చూసి "మాధవీ , మాధవీ " అని పిలిచారు.
    "వస్తుందిలే కూర్చో" అంటూ రామనాధం గారు పేపరు తీసుకుని తన ఆఫీసు గది కేసి బయలు దేరారు.
    "సార్ మీ కోసమే వచ్చాను." అన్నాడు సాగర్.
    "నా కోసమా?" నోసలేగరేసి సాగర్ ను చూసి అన్నారు రామనాధం గారు.
    "మీ కోసం కూడా!"
    "ఓ ఐ సి ఏమిటి విశేషం?"
    "రేపు మా నాన్నగారు పుట్టిన రోజు"
    "పోలీసు వాళ్ళకు కూడా పుట్టిన రోజు లేమిటోయ్."
    "అదే మాట మా నాన్నగారు కూడా అన్నారు."
    "కరెక్టు చూశావా మరి!"
    'అయితే సార్ ఏ 'లా' లో వుందంటారూ!"
    "ఆఫ్ కోర్స్ 'లా' పాయింటు లేదనుకో"
    'అందుకే సార్ మా నాన్నను బలవంతం మీద ఒప్పించాను. ఈ బర్త్ డే జరపడానికి ఇంకో విశేషం కూడా వుంది సార్."
    "అదేమిటోయ్?"
    "మా నాన్నగారికి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తవుతుంది."
    ఓ! అయితే కంపల్సరీ రిటైర్ మెంటు చేయవచ్చన్న మాట!
    'అదేమిటి సార్! మా నాన్నగారి లాంటి హానెస్ట్ ఆఫీసర్ మన స్టేటులోనే లేరు. ప్రెసిడెంటు మెడల్ కూడా పొందారుగా."
    "యస్ యస్, ఐనో , తమాషా కంటున్నా."
    "హాయ్ ప్రేమ్ " మాధవి జడ కొసలు వేలుకు చుట్టుకుంటూ వచ్చింది.
    "వస్తానోయ్ సాగర్! నాకు కోర్టుకు టైం అయింది." అంటూ రామనాధం లేచారు.
    "ఎల్లుండి తప్పకుండా రావాలి మాయింటికి."
    "ఓ, ష్యూర్" అని రామనాధం వెళ్ళిపోయారు.
    "ఏమిటి విశేషం" మాధవి సాగర్ కు ఎదురుగా కూర్చుంటూ అన్నది.
    "ఎల్లుండి మా నాన్నగారి పుట్టిన రోజు . మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించటానికి వచ్చాను."
    "ఓహో! అందు కొచ్చావన్నమాట!" సాగదీస్తూ అన్నది మాధవి.
    "మరెందు కొచ్చా ననుకున్నావ్!" కొంటెగా అన్నాడు సాగర్.
    "నేనేమీ అనుకోలేదు" మూతి విరుస్తూ అన్నది మాధవి.
    "అరె, అంతలోనే మెలికలు తిరిగి పోతావెందుకు?"
    "మెలికలు తిరిగి పోవడానికి నేనేమన్నా పామునా?"
    "కాదు, నగకన్యవు " మాధవి కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    "అదేమీ వర్ణ'నయ్యా బాబూ ! దేవకన్యా! వనకన్యా! జలకన్యా! అంటారు గాని నాగకన్యలా వున్నావని ఎవరన్నా అంటారా?"
    "నాకు తెలుగులో ప్రవేశం తక్కువలే."
    "అందుకేగా మా రచయిత్రుల నవలలు చదవమనేది."
    "అయితే నీ అభిమాన రచయిత్రి ఎవరో చెప్పు!"
    "ఏమిటీ కొంపతీసి ఆమె దగ్గర కెళ్ళి ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా ఏమిటి?"
    నీ సంగతి నీ అభిమాన రచయిత్రికే తెలిస్తే నిన్ను హీరోయిన్ గా పెట్టి ఓ కధ రాసెస్తుంది."
    "నిన్ను హీరో గా మాత్రం పెట్టదులే!"
    "వద్దు బాబోయ్! నేను కనబడ్డ అమ్మాయినల్లా ప్రేమించలేను. విమానాలు, రాకేట్టులు నడపలేను. ఇంకా ఇంకా మీ హీరో గారు చాలా పనులు చేయాలి - అవన్నీ చేత కాదు."
    "ఇంతకీ నా సంగతి తెలిస్తే అన్నావ్, ఏమిటదీ?"
    "అదే, ఆరోజు ప్రైజ్ తీసుకుంటూ , నువ్వు చేసిన గొడవ."
    "ప్రేమ్ ప్లీజ్ ఆ దృశ్యాన్ని మళ్ళీ గుర్తు చేయకు. నా కెందుకో అలా అయిపొయింది."
    "రేస్ లో చాలా అలసిపోయి వుంటావు. ఫిజికల్ గా ఎగ్జటాయి వుంటావు."
    "కాదు, ప్రేమ్ , మానసికంగానే ఏదో అయిపొయింది."
    'అయితే అది స్టేజ్ ఫియర్."
    "కాదు ఎన్నో సార్లు స్టేజ్ మీద పాడాను, మాట్లాడాను. కాని ఆరోజు నా కెందుకో అలా అయింది. సైకాలజీ పి.హెచ్.డి చేస్తున్నావు. నీవే చెప్పాలి నా కుందుకలా అయిపోయిందో."
    "అయితే నేనడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు."
    "ఓ.కే. " సోఫాలో సర్దుకు కూర్చోంది.
    "ఆరోజు రెండు సార్లు స్టేజ్ ఎక్కావు. రెండవసారి స్పృహ తప్పి పడిపోయావు , అవునా."
    "ఇదేం ప్రశ్న ,  బోడి ప్రశ్న."
    'అందుకే ముందే సూటిగా సమాధానం చెప్పాలని చెప్పాను. నేనడిగిన ప్రశ్నలకు 'అవును' 'కాదు' అని మాత్రమే సమాధానం చెప్పాలి. ఎదురు ప్రశ్నలు వేయకూడదు."
    "సరే మళ్ళీ అడుగు"
    "రెండు సార్లు స్టేజీ ఎక్కావు. రెండోసారి స్పృహ తప్పి పడిపోయావు , అవునా?"
    "అవును, అవునూ! ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్లూ?" సాగదీసి అడిగింది మాధవి.
    "మళ్ళీ మొదలు - ఎందుకడిగా నంటావా? ఆరోజు జరిగింది నీ కేంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి తెలిసిందా!"
    "తెలిసింది, తెలిసింది!" కొంటెగా నవ్వింది మాధవి.
    "నువ్వు సీరియస్ గా వుంటేనే! లేకపోతే నే వెళ్ళిపోతా. నాకేం పని లేదనుకున్నావా?"
    "అరే! అంతలోనే అలుగుతావేమిటోయ్!" సాగర్ చెయ్యి పట్టుకుని కూర్చో పెట్టింది మాధవి.
    "దెన్ బి సీరియస్, అన్సర్ మై కొశ్చన్స్."
    "ఓ.కే."
    "మొదటిసారి స్టేజి ఎక్కి బహుమతి అందుకొని దిగేంతవరకూ నువ్వు మాములుగా వున్నావ్, అవునా!"
    అంతవరకు గడ్డం క్రింద చెయ్యి పెట్టుకుని సాగర్ కేసి చిలిపిగా చూస్తున్న మాధవి ఆలోచనలో పడింది.
    "కాదు, మొదటిసారి స్టేజి ఎక్కినప్పుడే ఏదో ఏదోగా అయిపొయింది."
    "ఓ ఐసి!"
    "అవును, అప్పుడే ఏదో ప్రారంభమయింది."

 Previous Page Next Page