డబుల్ హెచ్ ఒకటి, సున్నా, ఏడు, ఆరు సున్నా , తొమ్మిది ఆరు, తొమ్మిది !
HH10760969 . అదే నెంబర్! అదే నెంబర్!
బెంచి మీద అలాగే ఒరిగిపోయాడు జయసింహ!
పానకాల్సామీ దిగ్గున లేచాడు. పైపు దగ్గర నీళ్ళు పట్టి లేచి అతని ముఖం మీద చిలకరించాడు!
"బాబుగారూ! ఏం జరిగింది? ఎవరైనా పోయారా?"
"ప్రైజ్ వచ్చింది" పలవరిస్తున్నట్లుగా అన్నాడు జయసింహ!
"ఎవరికి బాబుగారూ!"
"పది లక్షలు! పది లక్షలు! టెన్ లాక్స్"
"ఎవరికొచ్చింది బాబూ అంత డబ్బు"
"నాకే! నా నంబరుకే హురే! హురే! నాకే! పది లక్షలు!"
"ఛా తమాషా చెయ్యకండి బాబూ!"
"నిజం పానకాల్సామీ!"
"పొండి బాబూ! నేనెలా నమ్ముతాను"
"ఎందుకు నమ్మవూ! ఇదిగో నంబరు!" అదేమిటో అర్ధం కాక పోయినా పేపరు వంక చూశాడు. అతని చూపులు ఆశ్చర్యంతో పెద్దవి అవుతున్నాయి. ఆనంద విషాదాలు కలిపిన ఉద్వేగం ఉప్పెనలా జయ సింహాను చుట్టూ ముట్టింది. నోబుల్ పార్కు బయటకు పరుగుతీశాడు.
చల్లని గాలి వీస్తున్నా శరీరమంతా చెమటలు క్రమ్ముతోంది. శ్రీవన దుర్గాంబ ఏజన్సీస్ దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు.
కోటిలింగం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడు. నల్లని వస్త్రాలు కట్టుకున్నాడు. ముఖాన చందనం రాసుకున్నాడు. మధ్యలో పెద్ద కుంకుమ బొట్టు దీక్ష తీసుకోబోయేముందు వరకూ కారా కీళ్ళీలు నమిలి నందు వల్ల గారపట్టిన పళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి.
ఎవరో ఒక తెలివి కలిగిన ఆసామి టికెట్లు బేరం చేస్తున్నాడు.
"ఇది చాపల మార్కెట్టనుకున్నావా? చింతపండు బేరం అనుకున్నావా? కమీషన్ కావాలట కమీషన్! బుద్ది లేకపొతే సరి! చదువు కున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా?" అంటున్నాడు.
"డ్రా రేపే నంటున్నావు కదా!"
"అవును రేపే డ్రా! అయితే ఏం చెయ్యమంటావు?"
"టికెట్స్ చాలా ఉన్నాయి కదా!"
"అవును వున్నాయి. నీకు ఊరికే యిమ్మంటావా?"
"తెల్లవారితే వాటి జీవితం అయిపోతుంది కదా!"
"అయిపోతుందయ్యా పొతే ఏం?"
"తెల్లవారేలోగా ఈ టికెట్స్ అన్ని ఎలా అమ్ముతావు?"
"అమ్మకపోతే చెత్తకుండిలో పోసుకుంటాను. నీకెందుకు?"
"చెత్తకుండీలో పోస్తే ఊరికే పోతాయి. యాభై పైసల కమీషనివ్వు. నేను తీసుకుంటాను."
"అయిదు పైసలు కమీషను ఇస్తే ఈ టికెట్లు గంటలో అయిపోతాయి. నీకు యాభై పైసలు కమీషను కావాలా?"
"ఇస్తే తీసుకుంటాను. ఇప్పుడయితే నీ డబ్బులు నీ కోస్తాయి. గంట గడిచింధనుకో! ఇహ నీ డబ్బులు రావు!" అంటూ అతి తెలివి ప్రదర్శించాడు ఆ పెద్ద మనిషి.
కోటిలింగానికి తెలుసు! ఎలాంటి వాళ్ళు లాటరీ టికెట్స్ కొనటానికి వస్తారో! వాళ్ళలోనూ చివరి నిముషంలో వచ్చి బేరం కూడ చేయగలిగిన వాళ్ళు లాటరీల వ్యవహారంలో తలపండిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడ తెలుసు.!
"ఇవన్నీ అమ్మలేకపోతే మిగిలాయను కున్నావు కదూ? ఎంత అమాయకుడవయ్యా , కావాలనే ఉంచాను"
"కావాలని ఉంచుకున్నావా? ఎందుకు?"
"ఎందుకేమిటి? మేఘాలయ లాటరీ ఎప్పుడూ ఐ.కె. సిరీస్ లోంచి ప్రయిజులు వస్తున్నాయి. ఇప్పటికి మూడు సార్లు ఫస్టు ప్రయిజు ఐ.కె. తగిలింది. సెకండ్ ధర్డ్ ప్రయిజులు కూడ అక్కడే తగిలాయి. ఈ సారి ఖచ్చితంగా ఆ సిరీస్ లో వస్తుంది. అందుకే ఉంచుకున్నాను."
"ఓ అదా సంగతి? అయితే నాకు ఐ.కె. సిరీస్ లో పాతిక టికెట్లు యివ్వు!" అంటూ నూరు రూపాయాల నోటు అందించాడు.
"ఐ.కె. యివ్వను! యింకో సిరీస్ కోరుకో!"
'అదేమీ వద్దు. ఐ.కె. లోనే కావాలి"
"ఐ.కె. లో విడిగా అమ్మదలుచుకోలేదు. ఓనరు గారు వోద్దన్నారు. నేను గుమస్తాని. నాదేముంది?" అంటూ మరోవంక చూశాడు కోటిలింగం.
"అయితే మొత్తం యిచ్చేయ్" క్షణ క్షణానికి పెరిగి పోతున్న ఆశకి నూరు రూపాయల నోటు బలి యిచ్చుకున్నాడు ఆ పెద్ద మనిషి!
ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు భారతంలో అరణ్యపర్వంలో!
"ఈ సృష్టి దేని మీద నడుస్తోంది?"
"ఆశ మీద !" అని చెప్తాడు ధర్మరాజు. కలియుగానికి ఆ ప్రశ్న ఎవరయినా వేస్తె సమాధానము మరొకలా ఉంటుంది.
ఆశ మీద కాదు. దురాశ మీద సృష్టి నడుస్తోంది. మనుషుల్లో ఉండే దురాశని అర్ధం చేసుకొని ఆ బలహీనతని సొమ్ము చేసుకునే వాళ్ళు సమాజంలో అన్ని కాలాల్లో ముందుంటూ వచ్చారు.
అది చరిత్రగతి నిరూపించిన తిరుగులేని వాస్తవం.
ఈ కోటిలింగం చరిత్ర కూడా అదే! దురాశ లేకపోతే లాటరీ టికెట్ కొనేందుకు ఎవరూ రారని అతనికి తెలుసు.
ఆ దురాశని సొమ్ము చేసుకోవటం ఎలాగో తెలుసు! అందుకోసం అప్పుడేలాంటి అబద్దం చెప్పాలో అతనికి బాగా అర్ధమయింది.
ఆసామికి నూరు రూపాయల టికెట్స్ యిచ్చాడు. లాటరీ ప్రపంచం తెలియని వాళ్ళకి క్రొత్తగా ఉంటుంది.
టికెట్స్ దొంతరల్ని ఆస్థిగా పెంచుకుంటున్న వాళ్ళు మనదేశంలో ఎందరో ఉన్నారు. ఓటమి ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టినా నిరుత్సాహపడకుండా లాటరీ టికెట్లు కొనేవాళ్ళు వేలుకాదు లక్షలు కాదు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
దాని మీద ప్రభుత్వాల కొచ్చే ఆదాయం వందల కోట్లు ! అన్ని వందల కోట్లు ఎన్ని కోట్ల మంది బలి కాకుండా వస్తాయి!
తెలియని వాళ్లకిది కొత్త ప్రపంచం!
తెలిసిన వాళ్ళకి మామూలే! కోటిలింగంలాంటి వాళ్ళకి కొట్టిన పిండి! అతనికి ఉచ్చు తగిలించాలని ప్రయత్నించిన పెద్ద మనిషి మెడకి నూరు రూపాయల ఉచ్చు వేయించుకొని వెళ్ళాడు.
"మీకేం కావాలి బాబూ!"
"సౌభాగ్యవల్లి లాటరీ బంపర్ డ్రా"
"అయిపొయింది. తెలివిగలవాళ్ళు ముందే మేలుకున్నారు"
"ఈ నంబరు చూశావా?"
"అవును చూశాను. ఫస్ట్ ప్రయిజ్ వచ్చింది"
"నాకే కదా వచ్చింది?" అన్నాడు జయసింహ ఆశగా!
"నీకా! ఫస్ట్ ప్రయిజా! పిచ్చి పట్టిందా?"
"కాదు నిజంగానే! ఇదిగో నెంబర్!" డైరీలో నంబరు చూపించాడు.
"డైరీలో రాసుకున్న నంబర్లకి ప్రయిజులు రావు. టికెట్ చూపించాలి. ఏదీ తెచ్చావా టికెట్?"
"టికెట్ పోయింది. ప్రయత్నం చేస్తాను. దొరుకుతుంది."
"హ హ హ! భలే వాడివయ్యా నీకు నిజంగా పిచ్చా" అంటూ దారిన పోయే పదిమందిని పిలిచాడు కోటిలింగం.
పదిమంది గుమికూదాక పది నిముషాల్లోనే నూరు మంది అయ్యారు.
"చూడండి బాబూ! ఈయన గారూ డైరీలో రాసుకున్న నంబర్ లాటరీ తగిలిందట! అది కూడ ఏ లాటరీ అనుకున్నారు?
సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ! పది లక్షలు!! టెన్ లాక్స్!
డైరీలో నంబరు చూపించి డబ్బివ్వమంటున్నాడా పెద్ద మనిషి. చూస్తె చదువుకున్నవాడిలా ఉన్నాడు. టికెట్ పోయిందట!
"ఏదీ! పది లక్షల రూపాయల సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ ప్రయిజ్ వచ్చిన టికెట్ పోయిందట! ఇహ వినండి!"
"పిచ్చెక్కిందేమో!" జనంలోంచి ఓ కుర్రాడు అరిచాడు. అందరూ విరగబడి నవ్వటం ప్రారంభించారు.