నెలరోజులయినా అమ్మాయి పేరు కూడా తేల్చుకోలేక పోయింది. ఓరోజు ఆఫీసు నించి వస్తూ లిప్ట్ లో కలిస్తే "సర్దుకోడం అయిందా? ఎక్కడా కనపడ్డమే లేదు. పేరన్నా అడగలేదు. మీ యింటికి వద్దామంటే మీరెప్పుడూ బిజీ......" నవ్వుతూ పలకరించింది వరలక్ష్మీ.
"సారీ అండీ! పొద్దుట వెడితే యిదిగో యిప్పుడే రావడం , రాగానే వంట పని, తీరిక వుండదు" కాస్త నవ్వు మొహం పెట్టి అంది.
"అవునులే , వర్కింగ్ వుమన్ గదా! నీ పేరన్నా చెప్పలేదు నీవు?"
"ఆ, వాణి అండీ ...వస్తానండి" లిప్ట్ డోర్ తెరవగానే గబగబా వెళ్ళిపోయింది.
ఏదో పక్కింట్లో కి ఎవరన్నా వస్తే కాస్త కాలక్షేపం వుంటుందనుకున్న వరలక్ష్మీ కి నిరాశ అనిపించింది. తన వయసు దానితో ఏం మాటలను కుందేమో! తీరిక ఓపిక లేవేమో!
లిప్ట్ గుమ్మం ముందు వుండడంతో వచ్చీ పోయే వారు కనపడి ఆ ఫ్లోర్ లో వున్నవాళ్ళు ఏదో పలకరిస్తారు. ఈ అమ్మాయి భర్త పొద్దుట ఏడు గంటల కల్లా వెడుతుంటే చూసింది. ఆ మొహం చూస్తె సీరియస్ గా అనిపించింది. రంగు తక్కువ, కళ లేని మొహం , అంత పొడుగు లేడు. ఈ వయసులో అంత సీరియస్ ఏమిటో! నెల రోజులయినా యిద్దరూ కల్సి ఎక్కడికీ వెళ్ళడం చూడలేదు అనుకుంది వరలక్ష్మీ.
ఒకరోజు ఆదివారం. పాల ప్యాకెట్టు గుమ్మం ముందు పడి వుంది. ఎనిమిదైనా తీసుకోలేదు. పాలు విరిగి పోతాయేమోనని తీసి బెల్ కొట్టింది. అతను తలుపు తీసి సీరియస్ గా ప్రశ్నార్ధకంగా చూశాడు. "పాల ప్యాకేట్ట్ తీసుకోలేదు. విరిగిపోతాయని......" కాస్త తడబడుతూ , అతని మొహం చూస్తూ....అతని కళ్ళలోని తీవ్రత , అప్రసన్నత చూస్తూ అంతకంటే అనలేకపోయింది.
"థాంక్స్" ప్యాకట్టు తీసుకుని తలుపు వేశాడు. తన గుమ్మం వైపు నడుస్తుంటే లోపలి నించి అతని గొంతు గట్టిగా వినిపించింది. పాల ప్యాకెట్టు తీసుకోలేదని అరుస్తున్నాడు గాబోలు భార్య మీద. తరవాత నాలుగయిదు సార్లు సాయంత్రం యిద్దరూ యింటికి వచ్చాక దేనిమీదో అరుచుకోడం, ఒకటి రెండు సార్లు గ్లాసో, గిన్నో విసిరికోట్టిన చప్పుళ్ళు, అలాంటప్పుడు దడాలున తలుపు తెరుచుకు విసురుగా అతను యింట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రో పది గంటలప్పుడు రావడం -- మళ్ళీ యింట్లో విసురుగా మాటలు -- చాలాసార్లు వినిపించేవి. తన బెడ్ రూమ్ బాల్కనీ, వాళ్ళ డ్రాయింగ్ రూము బాల్కనీ పక్క పక్క నుండేనెమో స్పష్టంగా వినపడక పోయినా యిద్దరూ దేనికో ఘర్షణ పడ్తున్నట్టు అర్ధమయ్యేది. ఏమిటో యిద్దరూ సుఖంగా, హాయిగా వుండాల్సిన ఈ వయసులో యిప్పటి నించీ యీ గొడవ లేమిటో? మనుసులు కలవని సంసారం అనిపించింది.
ఇవాళ వినిపించిన పళ్ళెం గింగురులు వాళ్ళు వచ్చిన నెల రోజులకి మొదటిసారి వినిపించింది. విసురుగా అతను బయటికి వెళ్ళిపోవడమూ చూసింది. ఏదో గొడవ జరిగింది. అలాంటి గొడవలు నాలుగైదు సార్లు విన్నాక పాపం ఆ ఆమ్మాయి ....ఎందుకిలా ...ఒకసారి వెళ్లి చూసి విషయం తెల్చుకొంటే? అట్టే పరిచయం అన్నా లేని అమ్మాయి, తను వెడితే యిబ్బంది పడచ్చు. యిష్టం లేకపోవచ్చు. ధైర్యం చెయ్యలేక నిస్సహాయంగా వూరుకుంది.
ఒకరోజు చాలా చాలా చప్పుళ్ళు గిన్నెలు, ధబధబ కుర్చీల లాంటివి పడిన చప్పుళ్ళు. కేవ్వుమన్న ఆ అమ్మాయి కేక విని కలవర పడిపోయి....అతను విసురుగా తలుపు తీసుకుని వెళ్లి పోగానే యింక ఆగలేక తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది.
డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని, చూసి మనసు ద్రవించి నెమ్మదిగా వెళ్లి తల మీద ఓదార్పుగా రాసింది. దిగ్గున తలెత్తిన ఆమె తనని చూసి బిత్తర పోయింది. తన బతుకు బట్టబయలయిందన్న సిగ్గు, అవమానం , దుఃఖం ఆశ్చర్యం , ఉక్రోషం ...ఏవేవో భావాలు మొహం నిండా .
"ఊరుకో అమ్మా, అలా ఏడవకు. బాధపడకు. నేను మీ అమ్మ, అమ్మమ్మ వయసు దాన్ని. రోజూ వింటూ కూడా వస్తే ఏం అనుకుంటావో నని రాలేదు. ఇవాళ యింక ఆగలేక వచ్చా. నీ కష్టం చెప్పమ్మా నాతో. ఏం జరిగింది ? ఎందుకిలా?"
ఆ అమ్మాయి హిస్టీరియా వచ్చిన దానిలా రెండు చేతులతో తలమీద దబదబా బాదుకుని "నా ఖర్మ , నా దురదృష్టం , ఇలాంటి వెధవ పాలబడ్డాను. వెధవ పెళ్లి చేసుకున్నా, ఒక్క రోజు సుఖం లేదు. నా బతుకింతే , చావడం తప్ప మార్గం లేదు"పెద్ద పెట్టున వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు మధ్య ఒక్కో మాట ....అలా ఆగకుండా పది నిమిషాలు ఏడ్చింది.
మంచినీళ్ళు యిచ్చి , కొంగు తడిపి మొహం తుడిచి, ఓదారుస్తూ తల నిమురుతూ , కంటి కింద కమిలిన చోట తడి కొంగుతో అద్దుతూ "ఊరుకో అమ్మా! ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇలా ఎందుకు సహిస్తూ వుంటున్నావు? చదువుకున్న దానివి. ఉద్యోగస్తురాలివి. ఇంత బేలగా అన్నీ భరిస్తూ యిలా పడి వుండడమేమిటి? ధైర్యం తెచ్చుకో , తిరగబడి నిలేయి. కొట్టే హక్కు లేదని చెప్పు. ఊరుకుంటే ఇలాంటి మగాళ్లు యింకా పెట్రేగి పోతారు."
"ఏం చెయ్యను. నాకెవరూ లేరు. ఎవరితో చెప్పుకోను?" ఏడుస్తూ అంది.
"చూడు, ముందు ఆ అన్నం తిను. అన్నం మానేస్తే ఏడవడాని కన్నా ఓపిక వుండాలి గదా! కడుపు మాడ్చు కుంటే కరిగిపోయే మొగుడు కాదన్నది నీకు అర్ధమయేవుంటుంది గదా!" అంటూ కంచంలో మజ్జిగ అన్నం అంత ముద్దలు చేసి పెడితే ఎంత ఆకలి మీద వుందో అంతా తినేసింది. "లే, యింక వెళ్లి పడుకో. ఇవన్నీ యిలా వుండనీ, వీలయితే రేపు సెలవు పెట్టు. మనం మాట్లాడుకుందాం . ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. లే, వెళ్ళు లోపలికి" అంటూ లేపి లోపలికి పంపి, వీధి తలుపు లాగి వేసి వెళ్ళింది వరలక్ష్మీ.
* * *
మర్నాడు వాణి చెప్పింది వింటుంటే యింక యీ కాలంలో కూడా యిలాంటి మగవాళ్ళు వున్నారా అనిపించింది . పెళ్లి చేసుకుందాం అంటూ వెంటబడి వప్పుకునే వరకూ ప్రేమ నటించి, యిద్దరూ ఒక ఆఫీసు, ఇష్టపడ్డ వాడు దొరికాడు అని ముదిసి మురిపెంగా చూసుకుంటాడు అన్న ఆశలు , ఊహలు , కోరికలు అన్నీ చేసుకున్న నేల రోజులకే నలిపి నేల రాస్తాడని ఏ అమ్మాయి ఊహిస్తుంది? తన ఉద్యోగం , డబ్బు కోసం మాత్రం చేసుకున్న డబ్బు మనిషి అని రెండు నెలలకే అర్ధం అయిపొయింది. మనిషి చదువుకున్నాడు. సంస్కారం వుంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు. నిలువెల్లా మగ అహంకారం, యిల్లు తనది, భార్య తనది. ఆ యింట్లో తనదే సర్వాదికారం. భార్య అన్నది చెప్పు చేతల్లో వుందాలను కునే మగ మహారాజు. కూరకి సర్దుకోడు, టిఫిను కి సర్దుకోడు. భార్యకి వంట్లో బాగులేకపోయినా ఓ పూటన్నా వంటకి సర్దుకోడు. సర్దుబాటు అన్నదానికి అర్ధం అతనికి తెలియదు. భార్యకి పూలు, చీర, పుట్టిన రోజు కానుక. ఓ హోటలు కి వెళ్లి తినడం ఎప్పుడన్నా సినిమాకో , షికారుకో వెళ్ళడం అన్నీ అతనికి అనవసర ఖర్చుల్లాగే అనిపిస్తాయి. జీతం కోసం ఆఫీసు, బతకడం కోసం తినడం ఆ రెండే అతనికి అవసరం. భార్య జీతం మీదా, అతనిదే అధికారం. జమా ఖర్చులు తను జాగ్రత్తగా చూస్తాడు. ఆడవాళ్ళకి తెలియును కాని కొత్తలో నమ్మ బలికి జీతం తీసుకుని, ఖర్చులకి డబ్బు ఎంత యివ్వాలో అతనిదే నిర్ణయం. అన్నింటికీ తల ఆడించింది. తననాడు అతను చెప్పింది వేదం అనుకుంది. తనకేందుకీ డబ్బు లెక్కల గోల? అతన్ని చూసుకోనీ అని నిశ్చింతగా వూరుకుంది. రెండు నెలలు గడిచే సరికి అతని తత్వం అర్ధమైంది. అతని ఆలోచనలు , మాటలు ఆచరణ అన్నీ వక్రమేనన్నది అర్ధమయ్యాక తను ఎంత తెలివి తక్కువగా అతన్ని నమ్మి, మోస పోయిందో గ్రహించింది.
నిలువెల్లా పురుషాహంకారం నింపుకున్న అతనిలో ఏ కోశానా మానవత్వం లేదన్నది , మనిషిగా వుండాల్సిన ప్రేమ, అభిమానం , సెంటి మెంట్స్ లాంటి మాటలకి అర్ధాలే తెలియని మూర్ఖుడు అన్నది తెల్సిపోయింది. అతనికి నచ్చనిది జరిగితే . చెప్పినట్టు చెయ్యకపోతే అతని నోటికి అడ్డు అదుపూ లేకుండా ఎంత సంస్కార హీనంగా మాట్లాడుతాడో! కోపం వస్తే చేతిలో వున్నది మొహం మీదకి విసిరికొట్టడం అతని ప్రవర్తన తో పెళ్ళయిన కొత్తలోనే బేజారు అయిపోయి భయంతో బిక్కచచ్చి పోయింది. పెళ్ళికి ముందే పక్షవాతంతో ఓల్డ్ ఏజ్ హోం లో వున్న తల్లికి నెలకి పదివేలు పంపడం తన బాధ్యత , తల్లిని చూడడానికి ఎవరూ లేరని ముందే పరిస్థితి చెప్పినా ప్రతి నెలా గోల, అరుపులు, పదిసార్లు చెపితే గాని, డబ్బు యివ్వక పోవడంతో జీతం రాగానే తనే ముందే పంపితే డానికి ఎంత రాద్దాంతం! అతని సంగతి అర్ధమై అణిగి వుంటే మరింత రెచ్చి పోతున్నాడని గ్రహించి జవాబులు యివ్వడం, అభిప్రాయం ఖచ్చితంగా తెలియ చెప్పడం మొదలు పెట్టగానే యింకా గొడవలు ఎక్కువై, ఆ మనిషిని ఏం చెయ్యాలో తెలియని అయోమయ అవస్థలో అన్నీ భరిస్తూ తన పని చేసుకుంటూ మౌనంగా వున్నా పొగరు జవాబు చెప్తావూ అంటూ గోల . ప్రతి రోజూ దిన దిన గండంగా బతుకీడుస్తూ తిట్టిన రోజు ఏడుస్తూ , తిట్టకుండా గడిచిన రోజు పండగ అనుకుంటూ బతుకీడిస్తున్నా. ఏం చెయ్యాలో తెలియదు. చద్దామనిపిస్తుంది."