ఆలస్యం అయింది
"ఓ షామ్ , కుచ్ అజీబ్ ధీ........ఏ షామ్ భీ అజీబ్ హై....' బాల్కనీ లో చీకటి వెలుగుల మధ్య వాలు కుర్చీలో కూర్చుని పాట యిచ్చే అనుభూతిని ఆనందిస్తుంటే -- 'ధన్' మని పళ్ళెం కింద పడ్డ చప్పుడు , పళ్ళెం కిందపడి గింగురులు తిరిగి ఆగిన చప్పుడు -- అప్రయత్నంగా వెలువడ్డ నిట్టుర్పు , వరలక్ష్మీ ని నిర్వేదం లోకి నెట్టేయి.
వెంటనే వినవచ్చిన మగ కేకలు, ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు. అడ మాటలు ...ఎన్నో సార్లు అలవాటయినా ప్రతి సారి వరలక్ష్మీ గుండెలు బరువెక్కు తాయి. తలుపు దడాలున తీసిన చప్పుడు మాటలు అనవలసిన మాటలు, అరుపులు, అయిపోయి, గడపదాటి వెళ్ళిన మగవాడు....అవమాన భారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి తేల్చిన దృశ్యం....
అంతలో సుడిగాలి కి ఆరేసిన చీర లుంగ చుట్టుకు బాల్కనీ లోంచి ఎగిరి పోయినట్టు -- ఓ చీర ....అది వట్టి చీర కాదని చీరలో మనిషి వుందన్నది తట్టి కుర్చీలోంచి చేతులు చాచి పిలుస్తూ లేవబోయే లోగా ఆరో అంతస్తు నించి డబ్బున కింద పడ్డ చప్పుడు........'
కాళ్ళు గజగజ వణికి కుర్చీల్లో మళ్ళీ కూలబడిపోయింది వరలక్ష్మీ. ఇంక లేచి ఏం చెయ్యాలి? ఏం చూడాలి? చూడడానికి రక్తం ముద్దా తప్ప ఏం మిగులుతుంది? కింద ఏవో కేకలు, అరుపులు , హడావిడి అస్పష్టంగా వినిపిస్తున్నా... కాళ్ళ ల్లో శక్తి లేనట్లు లేవలేక పోయింది. ఎంత పని జరిగింది? ఎంత పని చేసింది?
ఇంతకూ తెగిస్తుందని యింత తొందర పడ్తుందని ఊహించని వరలక్ష్మి కి హటాత్తుగా అయ్యో? తను తొందర పడలేదు అన్నది తట్టి... అవును , పాపం! ఎన్నాళ్ళు ఆవేదన భరిస్తుంది? ఎన్నాళ్ళు నరకం అనుభవిస్తుంది? భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆశ చచ్చిపోయాక , నిత్యం చస్తూ బతికే కంటే చావే నయం అని, పెళ్ళయిన ఏడాది కే ఓ ఆడపిల్ల నిర్ణయించు కుందంటే ...తెలివి తక్కువగా తొందర పడిందని ఎలా నింద మోపడం , తను తొందర పడలేదు. ఆలోచన తెమలక తను తొందర పడలేదు. ఈలోగా యింత పని జరుగుతుందని ఊహించకపోవడం తన తప్పే! అదుకుందామన్న ఆలోచన వచ్చినా, అమల్లో పెట్టడానికి ఎన్ని అనుమానాలు, అడ్డంకులు, ఏ హక్కుతో తను వెళ్లి అదుకోవాలి? ఎనభయ్యో వడిలో పడిన తను ఎన్నాళ్ళు ఉంటుందో? ఎటూ కాకుండా ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందో? ఓ పెళ్ళయిన అమ్మాయిని యింట్లోంచి రా, వచ్చేయ్ అని చెప్పడం , నే చూసుకుంటా, నీకేం భయం లేదు అని భరోసా యివ్వడం యీ దేశంలో అంత సులువైన పని కాదు అని అర్ధమయి తర్జన భర్జన పడి కొడుక్కు ఫోన్ చేసింది.
"అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఆ అమ్మాయి బాధ్యత నీవు తీసుకోడం ఏమిటి? ఆ మొగుడు ఊరు కుంటాడా? నీ ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడిగితె , నా పెళ్ళాన్ని తీసి కెళ్ళడానికి ఏ హక్కుతో వచ్చావు అని నిలేస్తే జవాబుందా నీ దగ్గిర? సరే, ఆ అమ్మాయి భర్త చేతిలో హింసలు పడ్తుంది. ఆమె ధైర్యం చేసి యిల్లు వదిలి బయటకు వెళ్లి కోర్టు ద్వారా విడాకులు తీసుకొంటే అపుడు నీవేదన్నా సాయం చెయ్యగలవు కావాలంటే. నిజమే నీవు చెప్పిందాన్ని బట్టి పాపం అమెకి ఎవరూ లేరు. అంత ధైర్యం చేసి బయటికి వచ్చే తెగింపున్న పిల్లలా లేదంటావు. బాగుంది. ఆ తెగువ, దైర్యం లేని అమ్మాయి, రేపు అతను పోలీసు కేసు పెట్టి నిన్ను యిరికించడని ఏముంది? అతని ఇగో హార్ట్ అయి కావాలని కక్ష కట్టి చెయ్యచ్చు. నీకేమో ఎనబై రెండేళ్ళు. ఎన్నాళ్ళు ఉంటావో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి యిటు అటు కాకుండా అయిపోదా?
'ఆ......అ;అలా ఎందుకవుతుంది? చదువుకుంది. ఏభై వేలు వచ్చే ఉద్యోగం చేస్తుంది. తన బతుకు తను బతుకుతుంది' అంటావు. అమ్మా! అన్నీ నీవే అలోచించి అనేస్తున్నావు. అసలా అమ్మాయి ఏమంటుందో అడిగావా? భర్తని వదిలి బయటికి రావాలను కుంటుందా? అసలేమీ మాట్లాడకుండా జాలిపడి పోయి అన్ని ఆలోచనలు. నిర్ణయాలు నీవే తీసేసుకొని ఆ అమ్మాయిని తెచ్చి యింట్లో పెట్టుకుంటాననడం, ఆమె బాధ్యత తీసుకుంటా ననడం....ఏమిటి నీకేమన్నా మతిపోయిందా? అవును చూస్తూ జాలి పద్తున్నావు బాధపడ్తూన్నావు ఓ ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగిపోతోందని కలవర పడిపోతున్నావు. బాగుంది ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో వుంటారు. పైకి చెప్పుకోలేక కొందరు, ఇల్లు వదిలి వచ్చే ధైర్యం లేక కొందరు , బయటికి వస్తే ఎదురయ్యే యిబ్బందులు తలుచుకు భయపడి కొందరు, ఏదోలా సర్దుకు బతకడం నయం అని కొందరూ అన్నీ సహించి పడుండేవాళ్ళు ఎందరో! ఏదో నీ యింటి పక్కన వున్నారు, నీ కళ్ళ బడినవి, చెవుల బడినవి చూసి , విని బాధపడ్తున్నావు. అమ్మా! జాలి పడి , ఆ క్షణం లో ఆవేశం లో ఏదో నిర్ణయం తీసుకునే విషయం కాదు ఇది. నీవు ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చినా, ఆ అమ్మాయి నీకేమవుతుంది అన్న ప్రశ్న ముందుగా వస్తుంది. అదే నీ కూతురయితే నీకు హక్కు వుంటుంది . అమ్మా! సారీ, నేనింత కంటే ఏం చెప్పాలి? అలోచించి ఆడుగు వెయ్యి. నీవు యీ వయసులో మనశ్శాంతి పోగొట్టుకుని ఇదంతా నీనేత్తిన వేసుకొని సమస్యల్లో పడతానని నా భయం " అని వూరుకున్నాడు.
కొడుకు నిష్కర్ష గా చెప్పేశాడు. కొడుకే కాదు ఎవరన్నా యిలాగే అంటారు. అవును, తనకేం అవుతుంది ఆ అమ్మాయి? ఎందుకంత జాలి, అభిమానం , బాధ ఆ అమ్మాయి మీద తనకి?
ఏడాది క్రితం చూసిన మొదటి సారే ఆ అమ్మాయి మొహం లో ఏదో అవ్యక్తమైన బాధ. ఎన్నార్ధం క్రితం పెళ్లి అయిన అమ్మాయి.....పక్క ఫ్లాట్ కి అద్దెకి దిగిన ఆ భార్య , భర్త సామానుతో పక్క యింటికి వచ్చిననాడే లిస్ట్ తలుపు తెరుచుకుని ఎడాపెడా సంచులు భుజాన, చేతికి తగిలించుకుని, ఆదివారం మూడు గంటల వేళ గుమ్మం లో అడుగుపెట్టిన ఆ అమ్మాయిని లిస్ట్ ఎదురుగా వున్న అపార్ట్మెంట్ డ్రాయింగ్ రూములో కూర్చుని చూసింది వరలక్ష్మీ. కొత్తవాళ్ళు వచ్చారు అని లేచి గుమ్మంలోకి వెళ్లి ఆహ్వానం పలికినట్టుగా నవ్వుతూ చూసింది పలకరింపుగా ." ఇన్నాళ్ళూ ఖాళీగా వుంది మీరొచ్చారు. సంతోషం. మంచినీళ్ళు అవీ ఏమన్నా కావాలంటే అడుగమ్మా!" అంది చనువుగా.
ఆ అమ్మాయి తలెత్తి చూసి, పెదాలు దాటని చిరునవ్వుతో అలాగే అన్నట్టు తల ఆడించి , "థాంక్స్ అంటీ!' అంది లోపలికి వెడుతూ . చామన చాయ , పల్చటి మనిషి, మొహం ముందు కనపడేవి కళ్ళే. కాని ఆ కళ్ళల్లో జీవం లేదు.ఆ మొహంలో కాంతి లేదు. ఉదయం నించి సామాను, అదీ సర్దుకు యిల్లు మారడం , అలసిపోయినట్టు కనిపించిన ఆ అమ్మాయి ఆ తర్వాత యిల్లు అదీ సర్దుకుని ఆఫీసు కేడుతున్నా వస్తున్నా, ఎప్పుడు కంటబడినా నిస్తేజమైన ఆ కళ్ళు, మొహం లో నిర్లిప్తత, ఏ ఉత్సాహమూ కనపడలేదు. ఉదయం ఏడున్నర కే హడావిడిగా వెళ్ళిపోయేది. సాయంత్రం ఆరింటికి ఊసురో మన్నట్టు వచ్చి తలుపు మూసుకునేది. అవును మరి! పాపం ! యింట్లో మళ్ళీ చాకిరీ. వంట తప్పదు గదా ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా ఆడదానికి, ఆ అమ్మాయి ఆదివారమన్నా బయటికి వస్తే పలకరించాలన్నా కనపడేది కాదు. ఇంట్లో పనులు చక్క పెట్టుకోడం, కాస్త రెస్ట్ తీసుకోడం చేస్తుందేమో! తను వెళ్లి పలకరించా లన్నా ఆదివారం యింట్లో మొగుడుంటాడు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వూరుకుంది వరలక్ష్మీ.
మొదటి రోజు నాలుగు గంటలకి ఫోన్ చేసి, ఫ్లాస్కు లో పోసి, ప్లేట్లో అరడజను బిస్కట్లు పెట్టి పాపం, సామాను అదీ సర్దుకున్నారో లేదో, టీ చేసుకోడానికి స్టవ్ అదీ రెడీ అయిందో లేదో ననిపించి టీ పెట్టి తీసుకెళ్ళి తలుపు తట్టింది.
తలుసు తీసిన అమ్మాయి, యింటి నిండా పరిచినట్లున్న పుస్తకాలు, సామాను మధ్య కుర్చీలో లుంగీ, బనీనుతో కూర్చుని పేపరు చదువుకుంటున్న అతను, చెమటలు కారిపోతూ అలిసిపోతూ సర్దుకుంటున్న ఆమె.
"టీ తాగండమ్మా! స్టవ్ అదీ వెలిగించావో లేదో....ఏదన్నా టిఫిను ఉప్మా లాంటిది ఏదన్నా చేసి యివ్వనా అమ్మా!" అంది చనువుగా.
ఆ అమ్మాయి గబగబా "అయ్యో! వద్దండీ, వద్దు. టీ కూడా చేసుకుంటాం లెండి . మీరెందుకు తెచ్చారు?" అంది.
"అయ్యో! టీ ఏం భాగ్యం ! పక్కనున్నా, ఇల్లు సర్దు కుంటున్నావు. టీ త్రాగండి కాస్త ఓపిక వస్తుంది" అంటూ ట్రే ఆ అమ్మాయి చేతికి అందించింది.
ఆ అమ్మాయి మొగుడి వంక ఓసారి చూసి ట్రే అందుకుని "థాంక్స్ అండీ" మొహంలోకి రాని నవ్వు తెచ్చుకుని అంది.
"సరే, సరే, నీళ్ళ సీసా యివ్వనా?"
"వద్దండీ , వున్నాయి" అంటూ యింక మాటలకి అవకాశం యివ్వకుండా తలుపు మీద చెయ్యి వేసింది. పనిలో వున్న వాళ్ళని యింక యిబ్బంది పెట్టినట్లు అవుతుంది అని తప్పుకుంది వరలక్ష్మీ.
* * *