Previous Page Next Page 
అర్చన పేజి 79


    "అసలు కాదు."
    "నోరు మూసుకో. వంట నేర్చుకో. రేపు పెళ్ళయాక మొగుడి మొహాన ఏం పెడతావు?"
    "ఎంచక్కా చెఫ్ ని చేసుకుంటా."
    "అంతే బుద్ధులు భూములేలుతుంటే అదృష్టాలు గాడిదలు కాస్తాయట!"    
    "నీ ఉద్దేశం ఏంటి? చెఫ్ అంటే అంత చులకనా, ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ జీతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఎక్కువ తెలుసా నీకు?"
    "అయితే?"
    "ఇంకేంటి ప్రాబ్లం?"
    "నాకేం ప్రాబ్లమే లేదు. సరేకానీ, అలాంటిదేమన్నా ఉందా కొంపదీసి?"
    "అంటే?"
    "అంటే ఏముంది? లవ్ ఎఫైర్ ఏదన్నా?"
    "ఏదీ చెఫ్ తోటా?"
    "చెఫ్ కాకపోతే పఫ్. ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా."
    "ఉంటే చెపుతారేంటి పాపం?"
    "ఏం నీకు అక్కని కదా చెప్పచ్చు."
    "రమ్మని పాపం ఆశ. అక్కైనా చెప్పను. చెల్లి అయినా చెప్పను. అయినా లవ్ అనేది పెళ్ళి అయిందాకా సీక్రెట్ గా ఉంచాల్సిన సంగతి తెలుసా?"
    "తిక్కవాగుడాపి చెప్పు ఎవరినన్నా ప్రేమించావా?"
    "సరేగానీ, నాకు  ఎందు దోసెలు పెట్టేసి, ఇంక చాలు డైటింగ్ చెయ్యి అనాలనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంకో దోశె కావాలి" అంది ప్రీతి ప్లేటులో మిగిలిపోయిన కూర తాలూకు ముక్కలు ఏరుకుతింటూ.
    మాధవి అది చూసి గబుక్కున లేస్తూ అంది "సారీరా! నే ప్లేటు చూళ్ళేదు. ఇప్పుడే తెస్తాను. చల్లారిపోతాయని రెండే వేశాను" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
    ప్రీతి మాధవి వెళ్తోంటే అటూ ఇటూ కదులుతున్న ఆమె పెద్ద జడ చూస్తూ నవ్వుకుంది. పెద్ద అజాద ఉన్నవాళ్లు చీర కట్టుకుంటే, ఆ 
జడ అలా వాళ్ళు నడుస్తున్నప్పుడు నాట్యం చేస్తుంటే ఎంత బాగుంటుంది అనుకుంది.
    మాధవి చేతిలో హాట్ ప్యాక్ తో వచ్సింది.
    "అక్కా, నువ్వు చాలా బాగుంటావు తెలుసా?" తన ప్లేటులో దోశె వేస్తున్న మాధవి మొహంలోకి చూస్తూ అంది ప్రీతి.
    "దోశెలు ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. నో రేషన్. దానికోసం పొగడడం అవసరమా?"
    "అందుక్కాదు కానీ, నిజంగా చెపుతున్నాను. అవునూ నీదీ, బావగారిది లవ్ మ్యారేజా?"
    "నా సంగతి ఎందుకే నీకు? నేను నీ సంగతి అడిగితే మాట దాటేయడానికి కాకపోతే ఎందుకు?" కోపంగా అంది మాధవి.
    "ఏం మాట అడిగావని దాటేయడానికి?"
    "అదే! నీకేదన్నా లవ్ ఎఫైర్ ఉందా అని."
    "ఉంది."
    మాధవి చేతిలో ముక్కజారిపోయింది. చటుక్కున ప్రీతి మొహంలోకి చూస్తూ "ఎవరతను?" అంది. అలా అడుగుతునప్పుడు మాధవి గండే దడదడా కొట్టుకుంది. ఏ జవాబు తను వినకూడధనుకుందో అదే జవాబు చెప్పింది ప్రీతీ. అయ్యో పాపం వేణుకి ఈ సంబంధం కూడా కుదరదా? దేవుడా, దేవుడా!
    "మహేష్..మహేష్ బాబు."
    మాధవి ప్రీతి నెత్తిన ఒక్కటి మొట్టింది. "నిన్నసలు తన్నాలి పట్టుకుని" కోపంగా అంది.
    ప్రీతి పెదాల మధ్య నవ్వు బిగపట్టుకుని "అరె నిజం చెబుతున్నాను. మహేష్ బాబంటే హీరో మహేష్ ఒక్కడేనా? నా బాయ్ ఫ్రెండ్ పేరు మహేష్ కాకూడదా?" అంది.
    "నీ మొహానికి మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలి గానీ, నేనో సంబంధం చూశాను నీకు" అసలు విషయంలోకి వచ్చింది మాధవి.
    "ఎవరు వేణా?" తినడం పూర్తిచేసి, వాష్ బేసిన్ దగ్గరకు నడుస్తూ అడిగింది ప్రీతి చాలా మామూలుగా. అలా అడగడంలో ఎగ్జయిట్ మెంట్ లేకపోవడం కొంఘ నిరాశ కలిగించినా ఆ మాటకే మాధవి సంబరంగా అంది "యస్. వేణు. మన వేణునే."
    ప్రీతి మాట్లాడకుండా చెయ్యి, మూతి కడుక్కుని నోట్లో నీళ్ళు పోసుకుని. పుక్కిలించి వచ్చి నాప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ మాధవి మొహంలోకి చూసింది.
    మాధవి కూడా చెయ్యి కడుక్కు వచ్చి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు, గిన్నెలు సర్దుతూ చెప్పసాగింది. "వేణు చాలా మంచివాడు ప్రీతీ! నెమ్మదస్థుడు. చూశావుగా కుర్రవాడు కూడా బాగుంటాడు. తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు. అంతో ఇంతో ఆస్తి ఉంది మంచి ఉద్యోగం ఉంది. ఎంతలేదన్నా జనరల్ మేనేజర్ స్థాయికి ఎదుగుతాడని అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంటి?"
    మాట్లాడుతూనే కిచెన్ లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికీ తిరుగుతూ అన్నీ సర్దుకుంటూ, కాఫీ కూడా కలిపి తీసుకొచ్చింది. ప్రీతి మౌనంగా మాధవి మాటలు వింటూ ఫ్రెంచ్ విండోలోంచి బైట ఉన్న మొక్కల్ని చూడసాగింది.
    మాధవి కాఫీ కప్పు ప్రీతికి ఒకటి ఇచ్చి తనొకటి తీసుకుని "నిజం ప్రీతీ! చాలా మంచివాడు. అతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు" అంది.
    మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వి తిరిగి తల వంచుకుని కాఫీ తాగసాగింది.
    "మాట్లాడవేం? ఏదో ఒకటి చెప్పు."
    ప్రీతి కాఫీ తాగడం పూర్తిచేసి, కప్పు టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద వేలితో సున్నాలు చుడుతూ కూర్చుంది.
    "ఏంటే మాట్లాడవేం?" చిరాగ్గా అడిగింది మాధవి.
    ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది "ఏం మాట్లాడను?"
    "ఏదో ఒకటి వేణు మీద నా అభిప్రాయం చెప్పాను. నువ్వేం అనుకుంటున్నావో చెప్పచ్చుగా."    
    "వేణుకేం అక్కా! అందగాడు, బ్యాంక్ ఆఫీసర్, మంచివాడు కానీ...."
    "ఊ కానీ, చెప్పు బాబు గురించేనా? అది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగినదాని ఫలితం వాడిని నేను పెంచుకుంటాను."
    "అదికాదు."
    "మరేంటి?"
    "ఆవిడ, వేణు విడాకులు తీసుకున్నారా?"

 Previous Page Next Page