Previous Page Next Page 
అర్చన పేజి 78


    ఇలాంటి ఆడవాళ్ళు ఇంత మానసికమైన వత్తిడి భరంచలేరు.
    ఏమిటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్? ఎప్పుడూ ఎవరూ రారు. పెళ్ళి అయినట్టు లేదు.మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకీవిడ పెళ్ళిచేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తోంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు.
    "అమ్మా....!" అర్చన మూలుగు వినిపించి చటుక్కున కుర్చీలోంచి కదిలాడు.
    "మేడమ్!" ఆర్ద్రంగా పిలిచాడు.
    అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. "దా.....దాహం."
    "వన్ మినిట్ మేడమ్" అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం ఆర్చన తలకింద చేయిపట్టి ఆమెని కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది.
    "చాలు" వాంతి వస్తునంట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన.
    "పడుకోండి" చిత్ర ఆమెని తిరిగి పడుకోబెట్టి గ్లాసు తీసేసి, కర్చీఫ్ తడిపి, మూతి తుడిచింది.
    చల్లగా తగలడంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తోందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "ఎలా ఉంది మేడమ్?" ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి.
    అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటినుంచి కన్నీళ్ళు జారాయి.
    చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
    "సార్! పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడమ్! మా ఇంటికి తీసికెళ్ళాలని ఉంది. కానీ, మా అత్తగారు చిరాకు మనిషి" అంటోన్న చిత్రని ఆపుతూ...
    "వద్దులెండి. ఫర్వాలేదు. మా ఇంటికి తీసుకెళ్తాను. మా మిసెస్ చూసుకుంటుంది" అన్నాడు శ్రీపతి.
    ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన.
    రెండు చేతులూ జోడించింది వాళ్ళకి.
    "ఏంటి మేడమ్ మీరు! ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మీరేం బాధపడకండి. నేను మీ సొంత అన్నననుకోండి. సారీ, మీ కభ్యంతరం లేకపోతేనే!" అన్నాడు శ్రీపతి.
    అర్చన కళ్ళు వర్షించసాగాయి.
    కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెని కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకెళ్ళాడు.
    అతని భార్య వారిజ అర్చనని కంటికి రెప్పలా చూసుకుంది.
    ఆ జ్వరం జ్వరం నాలుగు రోజులు కొనసాగింది. వైరల్ ఫీవర్, అలవాటు లేని ఒత్తిడి, వానలో, చలిలో, బురదలో తిరగడం ఆమెని పూర్తిగా పడేశాయి. నాలుగో రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. లేచి కూర్చుని చారన్నం తింది.
    "మీకు చాలా శ్రమిచ్చాను. సారీ!" అంది వారిజతో.
    "అదేం మాటండి! ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది. అలా ఎప్పుడూ అనుకోమాకండి. ఇది మీ ఇల్లే అనుకోండి" ఆప్యాయంగా అంది వారిజ.
    అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపని చూస్తూ "ఎంతమంది పిల్లలు మీకు?" అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది.
    "ఇద్దరండి. బాబు పెద్ధ్హవాడు. పాప చిన్నది. దీనికి నాలుగేళ్ళు. బాబుకి ఎనిమిదేళ్ళు. స్కూలుకి వెళ్ళాడు" అంది వారిజ.
    అలాగా అన్నట్టు పల్చగా నవ్వి, కళ్ళు మూసుకుంది.
    అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. "కంగారేం లేదు బాగా విశ్రాంతి తీసుకోండి" అని చెప్పాడు.
    అర్చన వాళ్ళందరి ఆప్యాయతకు చలించిపోయింది. ఈ ఒంటరి బతుక్కు నాకెవరూ లేరు అనుకున్నందుకు ఇంతమంది ఆత్మీయుల్ని ఇచ్చావా తండ్రీ! నీకు నా కృతజ్ఞతనెలా తెలుపుకోను? వెంకటేశ్వరస్వామికి మనసారా దణ్ణం పెట్టుకుంది.
    ఐదో రోజు ఇంటికి వెళ్ళిపోతానంది. "మీరు మొహమాటపడి వెళ్ళకండి. ఈ  ఇల్లు మీ ఇల్లే అనుకోండి" అన్నారు శ్రీపతి దంపతులు.
    "లేదు. నాకసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకి, ఆదరణకి నాకసలు మాటలు కూడా రావడం లేదు. కానీ, ఇంటికెళ్ళిపోతాను. ప్లీజ్" అంది.
    "అలాగే రండి దింపేస్తాను" అంటూ శ్రీపతి లేవడంతో వారిజ అర్చన చేయి పట్టుకుని కారుదాకా నడిపించింది.
    కారులో కూర్చుని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన.
    ఆ జోడించిన చేతులు పట్టుకుని పక్కకి నెడుతూ "మీరెప్పుడూ ఇలా చేయకండి. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది" అంది వారిజ.
    కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదనా మొదటిసారిగా తెలుస్తున్నట్టు అనిపిస్తోంది.

                                                                       * * * * *

    ఆ రోజు శనివారం ప్రీతికి ఆఫీసు లేదు. ఆఫీసు లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా తొమ్మిదిన్నరకి లేచింది. మాధవి చిరాగ్గా అంది "నీకసలు డిసిప్లిన్ లేదే ప్ర్తీతీ! వెళ్ళు, ఫ్రెషప అయి రా. ఆఫీసు ఉన్నా లేకపోయినా కనీసం ఆరింటికి లేవాలి ఆడపిల్లలు. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది."
    "అమ్మా! పతివ్రతా! నువ్వు లేస్తావుగా చాల్లే. ఒక్కళ్ళు లేస్తే చాలు ఆవిడకి స్వాగతం పలకడానికి" అంటూ బాత్ రూములో దూరింది ప్రీతి.
    ప్రీతి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేటులో మసాలా దోశె ఎదురుచూస్తోంది. మాధవి మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు తీసుకొచ్చింది.
    చక్రవర్తి ఆఫీసుకి వెళ్ళేటప్పుడే కౌశిక్ ని స్కూల్లో దింపి వెళ్తాడు. ఇవాళ శనివారం కాబట్టి చక్రవర్తి త్వరగా వచ్చేస్తాడు. వస్తూ వస్తూ కౌశిక్ ని కూడా తీసుకొస్తాడు. అందుకే ఇవాళ మసాలా దోశె చేసి, వంట తరువాత చెయ్యచ్చులెమ్మని కూర్చుంది మాధవి.
    "బావుందక్కా దోశె. ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు" అంది ప్రీతి మెచ్చుకుంటూ.
    "నీక్కూడా నేర్పుతాను నేర్చుకో. ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తావా, బావగారికి ఇష్టం" అంది మాధవి.
    "ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు చేస్తాను. కిచెన్ లో దూరి గంటలు గంటలు వేస్ట్ చేయడం అంటే నాకు బోర్" అంది ప్రీతి.
    "వేరేవాళ్ళు చేస్తే లొట్టలు వేసుకుంటూ తినడం బోర్ కాదా...?"

 Previous Page Next Page