Read more!
Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 1

                                 

         

                                                మళ్ళీ వచ్చిన వసంతం
   
               
                                               --డా|| ముక్తేవి భారతి

   
                                

 

   "నీ నిర్ణయం మారదా" -బతిమాలుతున్నట్టుగా అన్నాడు రామం.
   
    "మారదు- చచ్చినా మారదు-నేనెందుకు మనసు మార్చుకోవాలీ. ఈ విషయం ఇప్పటికి చాలాసార్లు చెప్పాను - నా నిర్ణయం మారదు - పూనకం వచ్చినట్టుగా గట్టిగా అరిచింది శారద. రామం శారదవంక అలానే చూస్తూవూరుకున్నాడు.
   
    ఆడవాళ్ళలో మాతృత్వం పొంగి పొరలుతుంటుందని, కన్న పిల్లలకోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తారని, ఆడవాళ్ళకి పిల్లలే లోకం అని చెప్పే మాటలన్నీ ఒట్టి అబద్దాలన్నమాట- ఆడపిల్లయితే నేమిటి, మగపిల్లాడయితే నేమిటి - శారదకి ఎందుకీ పట్టుదల - రామంతల తిరిగి పోతోంది. వారం రోజులుగా ఇదే సమస్య - పరిష్కారం లేని సమస్య - పోనీ ఎవరితోనైనా, అంటే శారద స్నేహితుల చేత చెప్పిస్తే మనసుమారుతుందేమో - ఏమో - రామం శారద వంక చూసాడు.
   
    గోళ్ళకున్న ఎర్రని పాలిష్ వంక చూసుకుంటోంది శారద.
   
    "అంతేనా శారదా" రామం శారద భుజం మీద చేయివేసాడు.
   
    "స్కానింగ్ చేయించుకొచ్చాక అదే అవి తేలితే అంతే, నామనసు మారదు - నేనెంత మొండిదాన్నో మీకింకా తెలియదు"- శారద చీరకుచ్చెళ్ళు సరి చేసుకుని, చెప్పులు తొడుక్కుని నిలబడింది.
   
    "మీరొస్తున్నారా - రారా"
   
    'రాను - రాను - ఈ పాపంలో పాలుపంచుకోలేను శారదా - నేను మనిషిని - బతకటంలో బతికించటంలో నమ్మకమున్నవాడి'
   
    "ఉపన్యాసాలాపండి - వస్తారా, రారా"-
   
    "రాను - రాను" గొంతుచించుకున్నాడు రామం
   
    శారద గుమ్మంలోకెళ్ళి నుంచుంది.
   
    "ఛీ ఛీ - ఎంతతేలికై పోయింది అబార్షన్ చేయించుకోటం - ఒక పెళ్ళయిన స్త్రీ, నిర్మోహమాటంగా ఆడపిల్లయితే నాకొద్దు అని చెప్పటం, మరో ఆడది క్షణాలమీద ఆ గర్భం తీసేయటం -ఎంత బాధాకరమైందో, శారద మూర్ఖత్వానికి ఏడుపొచ్చింది. ఎక్కడో ఎవరో ఒక ఆడపిల్ల ఉరేసుకుందని, లోకంలో ఎవరూ ఆడపిల్లనికనరా - ఒక పట్టుపరికిణీ కట్టుకుని, పొట్టిగౌను తొడుక్కుని, కాళ్ళగజ్జలతో, కాటుక కళ్ళతో తిరిగే ఆడపిల్ల ఇక తనింట్లోవుండదన్నమాట - ఆడపిల్ల చదువుకోవాలని, పెద్ద పదవులు నిర్వహించాలని, గొప్పవ్యక్తిత్వం సంపాదించుకోవాలని, తల్లికావాలని, ఇంటి కల్పవల్లికావాలని తను ఊహించినవన్నీ కలలుగా మిగిలిపోవలసిందేనా! రామానికి అక్కలు చెల్లెళ్ళు లేరు ... తనింట్లో తిరుగాడే మహాలక్ష్మికోసం తన తల్లి ఎంత ఎదురుచూస్తోందో - అయినా మరో మారు మగపిల్లాడుకలగడా - 'శారదా! కోపంతో అరిచాడు రామం. 'ప్లీజ్ శారదా, వద్దు - వద్దు 'గుమ్మంలో నిలబడ్డ శారదను బతిమాలాడు రామం.
   
    శారద అటుపోతున్న ఆటోని పిల్చింది. వాడు తల అడ్డంగా తిప్పి వెళ్ళిపోయాడు. పదినిముషాలు గుమ్మంలో నిలబడింది. 'శారదా తొందరపడుతున్నావ్' రామంమళ్ళా అన్నాడు. ఆటో ఒకటి గుమ్మంలో ఆగింది. 'శారదా'రామం అరుస్తూనే వున్నాడు. ఆటో నర్సింగ్ హోం చేరిపోయింది.
   
                                          *    *    *
   
    శారద తత్వమే అంత చిన్నప్పటి నుంచి. ఎవరి మాట ఎప్పుడూ వినదు. తనకెంతతోస్తే అంత. చదువుకొనే రోజుల్లో స్నేహితులలో కూడా అన్ని విషయాలలోనూ అలాగే మాట్లాడేది శారద.
   
    స్నేహితులు నలుగురూ పరీక్షలయ్యాక హోటలుకి వెళ్ళారు.
   
    'ఇక మన భవిష్యత్కార్యక్రమం ఏమిటీ' అంది శారద.
   
    'నేనయితే హాయిగా పెళ్ళిచేసుకుని పిల్లల తల్లిగా ఇంట్లోవుంటాను ఈ ఉద్యోగాలు ఊళ్ళేలతాయినాకు రావు" అంది లలిత. లలిత, శారద పక్క పక్క ఇళ్ళలోనే వుంటారు.
   
    'నేను ఎం.ఎ చదువుతాను - వీలయితే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తాను' భవాని అంది.
   
    "నేను మాత్రం పెళ్ళి చేసుకోను" అంది శారద.
   
    'అంటే'
   
    "ఎందుకూ, అందరూ పెళ్ళి చేసుకోవాలా మన నలుగురిలో ముగ్గురు పెళ్ళి చేసుకునేందుకు సిద్దంగా వున్నారు కదా. చాలు"
   
    "నీ పెళ్ళి నీ కోసం చేసుకుంటావు - మా కోసమా" అంది లలిత.
   
    "నాకోసం అయినా పెళ్ళే ఎందుకు చేసుకోవాలి. లోకంలో పెళ్ళి లేకుండా జీవించలేరా' శారద అందరివైపు చూసింది.
   
    'నీ కోసమే నువ్వు పెళ్ళి చేసుకుంటావు. ఓ తోడు నీడ కావాలని పెళ్ళి చేసుకుంటావు - ఎవరు చేఇస్నా అంతే - నువ్వయినా అంతే'
   
    'ఓ మంచి స్నేహితురాలిగా, ఓ మంచి స్నేహితుడు తోడు కాకూడదా'
   
    'ఆ - అదే మేం చెప్పేది -ఓ మంచి స్నేహితుడు ముందు తోడు అవుతాడు'
   
    "తరవాత నీడ అవుతాడు" శారద నవ్వింది.
   
    'తరువాత ప్రియుడు అవుతాడు, ఆ తరువాత భర్త అవుతాడు. ఆ తరువాత నీ పిల్లల తండ్రి అవుతాడు- లలిత గట్టిగా అంది.
   
    'ఛీ ఛీ - నేనసలు పెళ్ళి చేసుకోను పిల్లల్ని కనను - 'ఒక వేళ కావాల్సి వచ్చినా ఆడపిల్లని కనను"-
   
    'ఓహో - మనమందరమూ ఎవరమూ - ఆడపిల్లలంకాము' అంది భవాని.
   
    'అది వేరు విషయం - అది మా నాన్న అమ్మలయిష్టం.. ఇప్పుడే వినండి - నాకు కనక అమ్మాయిపుడితే గొంతునొక్కి చంపేస్తా చెవులు మూసుకుంది జయ.
   
    'పుట్టిన తర్వాత చంపటమెందుకు, పుట్టకుండానే చంపేసేయే' కోపంగా అంది లలిత.
   
    'ఆడదానివై ఇలా మాట్లాడుతుంటే, నీతోమాట్లాడకూడదు మేము' - అంతా లేచారు. అక్కడితో సంభాషణ అయిపోయింది. అందరికీ శారదపైన విపరీతమైన అసహ్యం కూడా కలిగింది.
   
    తమాషాగా కాకుండా శారద చాలా కసిగా అనటం అందరినీ మరీ బాధించింది.
   
    శారదరెండో అక్క విజయ ఎప్పుడూ మనసులో మెదులుతూ వుంటుంది. కట్నాలు కానుకలు బాగా చెల్లించలేదని రోజూ సాధించే అత్తని, ఏమీ పట్టించుకోని భర్తనీ ఎదిరించలేక సర్దుకోలేక టాంకుబండ్ లో పడి మరణించిన విజయమని తల్చుకున్నపుడల్లా నిలువెల్ల వణకి పోతుంది శారద. ఆడపిల్లలు పుట్టకూడదు - ఈ సంఘం ఆడవాళ్ళని హాయిగా బతకనీయదు - ఈ భావం శారద మనసులో గాఢంగా నాటుకుపోయింది. కిరసనాయిలు పోసి కోడలిని కాల్చిన అత్తలు, ఆరళ్ళుపడలేక ఉరేసుకున్న కోడళ్ళు ఏదో సందర్భంలో పేపరులో కనిపిస్తూనే వున్నారు శారద కళ్ళకి ఇవన్నీ కూడా శారద భావాలకి బలం చేకూర్చాయి.
   
    అనుకోకుండా ఓ మేఘం ఉరమచ్చు. ఊహించరానంత వర్షం ఎడతెరిపిలేకుండా కురవచ్చు. నేలకొరిగిన పచ్చని తీగ మళ్ళీ మొక్కై తల ఎత్తచ్చు. ఎండిపోయిన చెట్టు చిగుళ్ళు వేయచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికేం తెలుసు!!
   
    ఆఫీసునించి బయటకి రాగానే లైట్లు పోయాయి. బస్ స్టాపులో నుంచున్న శారదకి చిరాగ్గా వుంది. ఎంతకీ బస్సులు రావటం లేదు. అంతలో వీధి దీపం ఒక్కసారి వెలిగింది - ఆ బస్ స్టాపులో తనతో కలిసి ఐదుగురున్నారు. ఎంత సేపని అలానుంచోటం. అటు ఇటు చూస్తున్నది శారద. అంతలోనే పక్కన ఎవరో వచ్చి నిల్చున్నారు ఉలిక్కిపడింది.

Next Page