Read more!
 Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 2

 

   "అంత భయమేమిటి - నేను రామాన్ని, గుర్తుపట్టలేదా" -సన్నగా పొడుగ్గా వున్నాడు. స్కూటరు తాళాలు చేత్తో అటు ఇటు తిప్పుతూ అన్నాడు.
   
    "ఆ. రామం' - తెలుసుకున్న ముఖమే. ఎక్కడ చూసిందీ. వెంటనే గుర్తురాలేదు.
   
    'మీ స్నేహితురాలు లలిత గుర్తుందా' రామం నవ్వుతుంటే శారదకి నవ్వొచ్చింది.
   
    'అదేమిటి -లలితని ఎలా మర్చిపోతాను'
   
    'ఆ లలిత పక్కవాటాలో చాలా ఏళ్ళుగా వున్న అబ్బాయిని - గవర్నమెంటు ఉద్యోగిని ఒకసారి హైదరాబాదు అలవాటు పడ్డవాడు దీన్ని వొదిలి వుండలేడు కదూ.
   
    శారద రామం మాటలు వింటూనే బస్ వస్తుందేమోనని అటు చూస్తోంది.
   
    'ఇంకా బస్సు వస్తుందనే ఆశ వుందామీకు --- రాదు"
   
    'అయ్యో - రాదా' శారదకి భయమేసింది - ఏ రిక్షా అయినా కనిపిస్తే బావుండును - ఇంటికెలా వెళ్ళాలితను.
   
    'రండి, నా స్కూటరు మీద మీ యింటి దగ్గర దించుతాను. అయినా నేనుండేదీ అక్కడేగా" రామం అన్నదానికి శారద సమాధానం చెప్పలేదు. వర్షం మెల్లగా పెరుగుతోంది. రామం కాసేపు ఆగాడు.
   
    "నేను వెడతాను" రామం స్కూటరు దగ్గర కెళ్ళాడు.
   
    'వస్తున్నాను' - శారద రామం స్కూటరు వెనక కూర్చుంది.
   
    శారద గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వర్షం మరీ పెద్దదయింది. ఆ ప్రయత్నంగా శారద చేయి రామం భుజంమీద పడింది. ఒళ్ళు జలదరించింది. అతన్ని పట్టుకు కూచోకపోతే ఈ వర్షంలో పొరబాటున జారిపడితే - భయం భయంగా అటు ఇటు కదులుతోంది శారద.
   
    ఇంటిముందు స్కూటర్ ఆగటం, శారద ఇంట్లోకి పరిగెత్తటం ఒక్కనిముషంలో జరిగిపోయాయి.
   
    ఊరినించి వచ్చిన రాజారావు శారదతండ్రి ముందుగదిలోనే వున్నాడు. "ఎలా వచ్చావమ్మా ఇంతవానలో" అన్నాడు తల తుడుచుకుంటున్న శారదతో.
   
    'ఆ.....ఆ....రిక్షాలో, రిక్షాలో వచ్చాను. అయినా తడిసిపోయాను అంది శారద అద్దంలో చూసుకుంటూ.
   
    ఎందుకు అబద్దం ఆడుతోందితను, రామం స్కూటర్ మీద వచ్చాను అని చెప్పచ్చుగా....ఏమో!!
   
    శారదకి ఎలాగో అనిపించింది. స్త్రీపురుషుల ఆకర్షణ వయసుని బట్టి వుంటుందా, అవసరాన్ని బట్టి వుంటుందా - రామంస్కూటర్ మీద ఎందుకు రావడం - నిజంగానే ఇంకో పదినిముషాలు బస్ స్టాపులో వుంటే బస్సేవచ్చేదో, రిక్షా ఏ దొరికేదో - ఆలోచన పరిపరి విధాలుగా పోతోంది.
   
    శారద వానపడుతుంటే కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. తను స్నేహితులతో, బంధువులతో, పెళ్ళి తప్పనిసరి కాదని, పెళ్ళిచేసుకోక పోయినా హాయిగా బతకవచ్చని చెప్తోన్నమాటలలో నిజం వుందా - ఆడదానికి ఒక వయసు వచ్చాక మగతోడుకావాలి -ఖచ్చితంగా కావాలి - కాకపోతే, రామంతో, తనకి స్నేహం లేదు - పెద్ద పరిచయం లేదు - తన ఆఫీసుకాదు - లలిత ఇంట్లో అద్దెకుంటాడు - అంతమాత్రం చేత అతను రమ్మంటే స్కూటర్ వెనక కూచుని రావాలా?! - ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు శారదకి !!
   
    శారద ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోటానికి ఎవరిపైనా ఆధారపడదు - తన మనసుకి ఎంత తోస్తే అదే - చిత్రంగా శారద మనసు రామం స్నేహంకోరటం ప్రారంభించింది. బస్ స్టాపులో నిలబడి వర్షం లేకపోయినా రామం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది శారద.. అతనితో కలసి స్కూటర్ పైన కూచుని సినిమాలకి, హోటళ్ళకి వెళ్ళటంలో తప్పేమీ లేదని మనసుని సమాధానపరచుకుంటోంది ఈ మధ్య. లలిత ఎక్కడైనా కనిపిస్తుందే మోనని భయపడుతోంది కూడా - అంటే పురుసులంతా చెడ్డవాళ్ళే - అడదానికి పెళ్ళి అవసరం లేదని భావించిన శారద ఒక మెట్టు దిగిందా - ఇక పిల్లలు - చూద్దాం - శారద తీసుకొనే నిర్ణయాలు తనవే - ఎవరి బాధ్యతా లేదు అందులో!
   
    రామంతో పరిచయం స్నేహంగా మారి ఏడాదికావస్తోంది. తన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాడతను - అతన్ని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవటం మంచిదేకదా - శారద మనసు అంగీకరించింది.
   
    రామం చిన్నపుడే తండ్రి మరణించాడు. రామం తల్లి యశోదమ్మ ఆ ఊళ్ళోనే వ్యవసాయం పనులు చేయించుకుంటూ కాలక్షేపం చేస్తూంది. ఆమె పంచ ప్రాణాలు రామంపైనే. అతను ఏమంటే అది తల్లికి అంగీకారమే.
   
    లలిత ఇంట్లో అద్దెకుంటూ వండుకుతింటున్నాడు రామం. లలిత స్నేహితురాలిగా శారదని చాలాసార్లు చూసాడు. శారద గురించి లలిత చెప్పేమాటలు శారదపై ఒక సదభిప్రాయాన్ని కూడా ఏర్పరచాయి. దాంతోపాటు శారదపై ఆకర్షణను కూడా పెంచాయి.
   
    "మీ ఫ్రెండు పెళ్ళి చేసుకోదా. నాన్సెన్స్ - ఇలా అన్న అమ్మాయిలే అందరికన్న ముందుగా పెళ్ళిచేసుకుంటారు. ఒక్క స్నేహితుడు కనిపిస్తే చాలు అలా అలా అల్లుకుపోతారు. వనితా, లతా నిరాధారంగా వుండవంటారు పెద్దలు - లలితా, చూడుమరి, మీ శారదని నేను పెళ్ళి చేసుకుంటాను - అలా చేసుకోకపోతే నా పేరు మార్చేయి- ఏమంటావు" రామంమాటలకి లలిత వెక్కిరిస్తూ.
   
    'చాలు చాలునీ ప్రతిజ్ఞలు - శారద అంటే ఏమనుకుంటున్నావు. అందరిలాటి ఆడపిల్ల అనుకుంటున్నావా. పొరబాటు - నీ స్కూటరు చూసి, నీ పర్సనాలిటీ చూసి మెచ్చి వెంటపడి వచ్చేస్తుందను కుంటున్నావులా వుంది - దానితో అలాంటివేమికుదరవు - దాని పద్దతి వేరు - దాని ఎన్నికవిధానమే వేరు అంది లలిత నిదానంగా.
   
    కాలం ఎవరికోసమూ ఆగకుండా ముందుకెళ్ళిపోతోంది. శారదా రామంలు ఏకమయే సమయమొచ్చింది. నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారిద్దరూ. మా అమ్మకూడా రావద్దా' అన్నాడు రామం.

    'మీ అమ్మ వద్దు - మా అమ్మ వద్దు. అయినా రిజిస్టరు పెళ్ళికి ఎవరు మాత్రం ఎందుకూ - పెళ్ళి అయ్యాక అందరినీ కలుద్దాం' - శారద ఖచ్చితంగా అన్నాక 'దేవిగారి ఆజ్ఞ' అన్నాడు రామం.
   
    "నన్ను నువ్వు గౌరవించాలి - నా అభిప్రాయాలకి విలువనివ్వాలి" అంది శారద.
   
    "నన్ను నువ్వు గౌరవించాలి. నా అభిప్రాయాలకి విలువ నివ్వాలి" అన్నాడు రామం.
   
    రిజిస్టరు ఆఫీసునించి తిరిగి వస్తూ హోటల్లో భోజనం చేశారు ఇద్దరూ.
   
    భార్యాభర్తలుగా శారద రామం ఆహ్లాదంగా జీవిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగస్థులే - స్నేహితుల్లా కలసిమెలసి వుండాలని ముందే అనుకోబట్టి ఎవరిపై ఎవరి పెత్తనం, ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే ప్రశ్న ఉదయించలేదు. కానీ శారద మాత్రం తన వ్యక్తిత్వం ఎక్కడ దెబ్బ తింటోందోనని ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే వుంటుంది. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఆడది చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపాలా, బానిసలా పడివుండాలా - తన అభిప్రాయాలుతనవి - ఈ భావం శారద అంతరంగంలో వుండి శారదను హెచ్చరిక చేస్తూనే వుంటుంది.

 Previous Page Next Page