"ఏందె, ముత్తాలు! యిట్ల కండెలుపడితే సనుగెట్లయితదో ఎరికెనా?" అంటడిగింది సుంకులమ్మ.
"ఎరికెలే! ఏమయితదత్తా?"
"పోగు ఊసమీన మంచిగ సుట్టుకొనదు. మంచిగ కరివడదు. నాడె కొమ్ముకు కండె సెక్కి, లట్టు మనిపిచ్చి గుంజిన కాని, పోగు మంచిగ పారదు. పారకుంటే నేసకంరాదు. జల్ది సనుగు తీర్వ కాదు. సనుగు కాకుంటే, బద్దె కోసెడి దెట్ల? బద్దె కోయకుంటే బువ్వాడెది ఎట్ల? మల్ల నీ మామకు, నాకు, నీ బావకు బువ్వ రాబన్లేద?"
"అవు, అత్తా!" అన్నది ముత్తాలు.
"అందుకోపానికి నువ్వేమి సెయ్యాలె! మంచిగ కూసోని, యీడ పనంత ఎట్లెట్ల చెయ్యాలంట, జర నేర్వాలె నాతన్న!"
"నేరిపియ్యి, అత్తా!"
"అగ్గొ! మంచి పిల్లంటే యిట్లుండాలే! ఈయాల్రేపు పోరిలంత గీడపోయి ఆడా, గాడ పోయి ఆదా పొద్దు గడవాలంట సూస్తరుగాని, మా ముత్తాలు లెక్క అత్త తన్న కూసోని మంచిగ పని నేరిసెటోండ్లేడున్నరు? ముత్తాలు తల్లి నా పానం!" అంట ముద్దాడింది.
ముత్తాలు సిగ్గుత ముడుసుకపోయింది.
అప్పుడే సుంకులమ్మ యాదో యాదు సేసు కోని, అర్రల కెల్లి గింత బచ్చెం తెచ్చిపెట్టింది ముత్తాలుకు.
"ఒద్ధత్తా!" అన్నది ముత్తాలు.
"అగ్గో! గింతలోనే యాడ నేరిసినవే! అప్పుడే సిగ్గయితన్నాది? ఇట్ల సేస్తె సెంద్రయ బావ ఏమంటాడో ఎరికెనా?"
"బావకు సెప్ప కత్తా! తింట! నీ కాల్మొక్కుతా!"
"సెప్తె ఏమంటడే, బావ?"
"ఈపుమీన దబ్బు దబ్బు నేస్తడత్తా!"
"అట్ల?"
"అవు."
"ఏసిండా, ఎన్నడన్న? ఇంట్లకు రానియి. సెప్త వాని పని!"
"లేదత్తా. కొట్టలే! నే విట్లన్ననంట బావ తన్న అనొద్దు!"
బచ్చెం తిన్నంక గిని నీల్లు తాగి సెయ్యి, నోరు తుడుసుకొని రాటం ముంగల కూసున్నది ముత్తాలు.
సుంకులమ్మకు ముచ్చటయింది. కోడలు పిల్లను జర పక్కకు కూసుండవెట్టుకొని, బుగ్గలమీద ముద్దెట్టుకున్నది.
"నా ముత్తాలమ్మ బంగారబ్బొమ్మ! నా సెయ్యల పేనముండంగ నువ్వేమి సెయ్యబన్లేదు. ఈడ పక్కకు కూసుని సూస్తంటే సాలు. నీ సూపే కోటొరాల మూట!" అన్నది.
'అత్త శాన మంచిది!' అనుకున్నది ముత్తాలు. గాడనే కూసుండి, అత్త సేస్తండె పన్లన్ని ఒకోటె సూస్తన్నది.
నీల్లల తడిసి ఎండకేసిన నూలు సిట్టెలు తెచ్చుకున్నది సుంకులమ్మ.
నూలు పెట్టెల్ల ఏ నెంబరు పెట్టెకు అన్ని లడిలు అండ్లుంటయి. ఒక్క లడిల పది సిట్టె లుంటయి. ఒక్క సిట్టెకు ఏడు కట్లుంటయి. దారం కట్టు అంటే పెండ్లయినోండ్లు ఏసుకునేడి జందాలకంటే యింక దొడ్డుగుంటది.
ఎండకేసిన సిట్టెలు తెచ్చుకోని, ఒక్కోక్కటే తీసి కట్లు వాపుకోని గుమ్మి కేసినది.
గుమ్మెంటె ఎట్లుంటదీ? రంగుల్రాటం లెక్క తిరిగేడిధీ. కట్టు, బాపి గుమ్మికి తొడిగి, పోగుతీసి పంటే ఆకుకు మలిపింది. మలిపి, కామ పట్టుకొని తిప్పుత ఉంటే, మొద్దుల కెల్లి పంటే ముక్కు తిరగా, గాడకెల్లి గుమ్మి తిరగా! జోరు జోర్న తిరుగుత ఉంటే గుమ్మి మీనా సిట్టెల కెల్లి దారమంత పంటే పోసు కున్నది. ఒక్కో పంటే కాన్గనే నీల్లత తడిసి పక్కకు వెడత ఉన్నది సుంకులమ్మ.
ముత్తాలు ఆడ కూసోని అత్త సేస్తున్న పన్లన్ని పక్కగ సూస్తుంటే, గాడ మొగ్గం వేస్తున్న ముసలాయన, సిన్నగ నవుకున్నడు. జరసేపు గుంతల కాళ్ళు నిలిపి పిలిసిండు.
"ఏందె, ముత్తాలు! గట్ల ముచ్చట సూస్త కూసుంటవుగాని, గ్గా సిప్పనిండ కండెలు పట్టి యియరాదు?"
"ఇస్త, మామా!" అన్నది ముత్తాలు.
"ఏమిటికి? ఎవలీయాలె?" అంటడిగింది సుంకులమ్మ.
"నీ కోడలు!" అన్నడు బావనారుశి.
"ఏమట్ల? కోడలు పిల్ల యిప్పటి సంది కండెలు పట్టిస్తె మొగ్గం నెయాలనుకుంటున్నావు? నే నీడుండంగ అట్ల సెయ్యనీను గద! నా బిడ్డ లేత సెయిలు యిప్పటి సంది మొద్దుబారుతయి. అట్లెట్ల?" అంటడిగింది సుంకులమ్మ మగన్ని.
"అగ్గో! అయితే, ముత్తాలును యిప్పుడే పాలకి మీన కూసుండ బెడతావు?" అన్నడు బావనారుశి.
"ఏడనో ఆడ! నీ కేమిటికి?"
"మామను అట్లంట నేం దత్త?" అన్నది ముత్తాలు.
"మంచిగడిగినవు, బిడ్డా! నీ యత్త కట్లనే బుద్ది సెప్పాలె!"
అత్త, మామల ముచ్చట సూసి ముత్తాలు సిన్నగ నవుకున్నది.
"అత్తా! కండెలు పడతం నేరిపిస్త నన్నవు కద?" అడిగింది ముత్తాలు,
"మల్లడుగుతున్నావు? అచ్చ! అట్లనే కానియి! నీ ముచ్చట నీ మామ ముచ్చట-యిద్దరిది తీర్తది, ఆడి కెల్లి, రాటం యీడ వెట్టు!"
రాటం తెచ్చినెట్టింది ముత్తాలు.
"ఈడసూడు, బిడ్డా! రాటంకొనాకు ఎన్కయ సీటున్నది కద? దాని సెవుల్ల కెల్లి కదరు వెట్టాలె. కదరు మీన దిండున్నది కద? దాని మీ కెల్లి రాటప్పురి లాగాలే కదరు కొనాకెల్లి ఊసే చెక్కాలే. పంటె మీన పోసిన దారమున్నది కద? ఒక్క పోగు లాగి, ఊసె కతికిచ్చి రాటం సెయి పట్టుకోని కుడిశేత్త తిప్పుత, ఎడఁపఁశేత బార తియ్యాలె. బారతీసి ఊసెకు పొయ్యాలె. అట్లనే కండెయితది."
ముసిలాయన నగిండు.
"ఏందట్ల, సుంకులో! కోడలు పిల్ల కే మెరికె లేదనుకున్నావు? పెద్ద గురువు లెక్క సెప్తన్నవు!" అన్నడు.
"నా బిడ్డకు సెప్పిన గని, తప్పే మున్నది?"
"నువ్వు సెప్పకుంటే సెయలేదనుకున్నవా, గింత పనినె?"
"అట్లెట్ల నుకుంట? ఈమె నా బిడ్డ. ఇట్ల కూసుండ పెట్టుకోని సెపుతం నా ముచ్చట. నడను నీ దేంది?"
బావనారుశి మల్ల ఏమన్లే. గమ్ము నూకున్నడు.
ముత్తాలు, అత్త తన్న రాటం అందుకోని కండెలు పడతం శురుచేసింది. ఆమె అట్ల సేస్తుంటే, ముసిలాయిన, ముసిలామె ఒకల్ల దిక్కొకల్లు సూసుకుంట నవుకున్నరు.
బొమ్మంత పొద్దు అయీతలికి లక్ష్మయ్య బావింటి కొచ్చిండు.
గ్గాయిల్లు శాన దవ్వున్నది. గవిండ్లు, గల్లిలు దాటుకుంట బోయెతలికి యాష్టాస్తది. అందుకోసానికె ఎన్నడన్న, అట్ల యాదొస్తనే బోతడు లక్ష్మయ్య.
ఇల్లు ఏమంత పెద్దగ లేదు. కడపల అడుగు వెడతనె ముంగలికి సూసిండు. బావ మొగ్గం నేస్తుండు.
ఆడున్న జాగాల ఒక్క మొగ్గంకె సోటున్నది. పైన అచ్చుల దండెం ఏలాడుత ఉంది. గోడకు మూలగ లాకలకట్ట ఉన్నది.
లక్ష్మయ్య రాడం ఎవల్లు సూడలే.
సుంకులమ్మ ఆసుమీద పడుగు బోస్తున్నది. పక్కకు ముత్తాలు కండెలు పడుతున్నది. ముత్తాలు యీడ కండెలు పడతం సూసెతలికి లక్ష్మయ్య మనుసు సివ్వుమన్నాది!
'తన బిడ్డ, కండెలు పట్టడమా?'
బావకు జర్ర కోపం జాస్తి అందుకోసానికి, ఆయన ముంగల, బిడ్డను కోపం సెయడం మంచిగనిపియ్యలేదు,
రొండడుగులేసి లోప కొస్తండంగ, ముత్తాలు సూసింది. రాటం కండెలు ఆడనే యిడిసి ఉరుక్కొంచింది.
సుంకులమ్మ, బావనారుశి అప్పుడె సూసిన్రు, వాని దిక్కుకు.
"ఈడి కొచ్చినావు, బిడ్డ?" అంటడిగిండు లక్ష్మయ్య.
"అన్, నాయనా! అత్త తన్న కండెలు పడతం నేరుస్తన్న!"
"నేరిసినవు గాని, నువ్వీడ కండెలు పట్టకున్న గాని, ఏమీ కాదు. సేసుకునెటోల్లున్నరులే! జల్ది యింటికి పోయి నాష్ట తిను, పో అమ్మ నడుక్కొని చాకూడ తాగు. పో, బిడ్డా!"
ముత్తాలు అత్త దిక్కుకు సూసింది.
"పో, బిడ్డా! నాయన సెప్తున్నడు కద? మల్ల వస్తువులే!" అన్నది సుంకులమ్మ.
బావనారుశి మొగ్గం నేస్తనే బావను సూస్త ఉన్నడు.
ముత్తాలు అత్త దిక్కుకు సూస్తనే బయలెల్లింది.
"కూసో, లచ్చయ్యా!" అంట సాప పరిసింది సుంకులమ్మ.
ఒక్కసారి సిరుగుల పాప దిక్కుకు సూసి, ఒక్కసారి సుంకులమ్మ ముకంల సూసిండు లక్ష్మయ్య. కాని కూసుండలే. సక్కగ బావనారుశి ఆడికి పోయిండు.
"ఏంది, లచ్మయ్యా! అంత మంచిగున్రా?" బావ అడిగిండు.
"ఇగ్గో, యిట్లున్నం!"
"ఏందే, నువ్వట్ల సూస్తవూ? తమ్ముడొస్తే పీట ఎయికుండ సాపేస్తారే?" అంట నగిండు ముసిలాయిన.
"ఫర్వలే, అక్క! ఆయన మాట కేమిలే! అన్ని జాగాల్ల కురిసీలు, తక్తులు యాడకెల్లొస్తయ్?"
"అవ్, లచ్మయ్యా! అందరి కేడ కెల్లొస్తయి మల్ల?" అన్నాడు బావనారుశి.
"ఇగ్గో, బావా! సెందిరిగాని యాడకన్న అంపినవా?" అంటడిగిండు లక్ష్మయ్య.
సెందిరిగా డనటంత సుంకులమ్మ మనుసు సివుక్కు మన్నది.
ముసిలాయిన ముకం అదొక లెక్కయింది. కాని గింతలనె మల్ల సద్దుకున్నడు. లక్ష్మయ్య ఎన్నడు గూడ అల్లుని పేరు యిట్ల పలకలే!
'సెందిరిగా డేంది, సెందిరిగాడు' అంట నుకుం దామె.
"మేము సంపెడి దేముంది, వాన్ని? కాళ్ళు గట్టి కూసుండబెట్టలేం కద! పన్ల కుదురొస్తే అప్పుడింటి తాన వాడే పడుంటడు!"
"ఏమిటికి, లచ్మయ్యా? ఏడకన్న పంపియాల్నా?" అన్నది సుంకులమ్మ.
"లే లే! ఆడు యాడకి బోయిండో నాకంత ఎరికెనే!" అన్నడు లక్ష్మయ్య.
లక్ష్మయ్య మాట తరీక బావనారుశికి మంచిగ విసియ్యలే.
'ఏందీడిట్ల మాటాడతాడూ?' అంట సాంచా యిచ్సిండు.
"అయితే నువ్ సెప్పెడిదేంది?" అన్నడు రుశి.
"ఏమంటవా! సెందిరిగాడు దోస్తులందరిత కల్సి బడికి సదువుకుంటనంట బోయిండు. మా కారకానలకెల్లి, నాగయున్నడులే-వాన్నికూడ తోలుకపోయిండు. ఇట్ల సేత్తె ఊర్ల బతగ్గలుగు తరా, మల్ల? తాజెడ్డ కోతి వనమంత సెరిసిం దంటె యింతనే!"
"పిల్లోండ్ల తప్పేమున్నది, లక్ష్మయ్యా? పుట్టినన్క గింతప్పటి సంది మనమంత యీపన్ల సస్తనే ఉన్నం. ఈ పిలగాండ్లు యిప్పుడు కూడా సూస్తనే ఉన్నరు. చిన్న కష్టమున్నాది? అయిన కాని, యింట్ల అందరు కలిసిపనిసేత్తె దినాముకు రూపయి పావుల రాడం కష్టమయితున్నది. అందుకోసానికె సాటోండ్లు శాన ఊర్లల్ల కూలి పనికి పోతున్రు, అండ్లనన్న రొండ్రూపాలు దినామ్కు వస్తయికద! మనమెట్లన్న సస్తనే ఉన్నం. వాండ్లను కూడా యిండ్లబెట్టి మన సేతుల్తనే ఎందుకు సంపాలె? పోనీ, బడికిపోయి సదూకుంటే వాండ్లన్న మంచిగ కొలువుసేసుకు బతుకుతరు. అంతే సాలు మనకు!" అన్నది సుంకులమ్మ.
"ఓ సుంకులో, నువ్వూకో!" అంటరిసిండు రుశి.