Previous Page Next Page 
మహాశక్తి పేజి 4

    రాజుకి కొంతమందిని తోడుగా డాక్టర్ దగ్గరకి పంపించాడు ఈశ్వర్ జెన్నీ తన స్నేహితులతో పాటు వెళ్ళిపోయాడు
   
    ఈశ్వర్ చుట్టూ మూగిన వాళ్ళు అన్నారు.

    "నువ్వు జాగ్రత్తగా ఉండు. జెన్నీ పాములాంటి వాడు. నిన్నేమన్నా చేస్తాడు!"

    "అన్నయ్య ఒంటిపైన చెయ్యి పడితే మనం ఊరుకుంటామేమిటి? ఆ వెధవకి బుద్ధిచెబుదాం" అన్నాడు ఇంకొకడు.

    ఈశ్వర్ కాంటీన్లోకి నడిచాడు. ప్రొప్రయిటర్ దిగులుగా నుంచుని ఉన్నాడు.

    "సారీ, మీకు నష్టం ఎంత జరిగిందో చెబితే నేను 'పే' చేస్తాను" అన్నాడు ఈశ్వర్.

    ఆ మాటతో అతని మొహం వికసించింది.

    "బల్లలు విరిగిపోయాయి. వాటిని బాగుచేయించుకోవాలి. కప్పులు, సాసర్లు పగిలిపోయాయి. మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి. టీ డికాషన్, పాలు ఒలికిపోయాయి..... మళ్ళీ......"

    "లిస్ట్ అవసరం లేదు. ఎంత ఇవ్వమంటారు?"

    "అయిదొందలు" ఆశగా చెప్పాడు.

    ఈశ్వర్ మాట్లాడకుండా జేబులోంచి పర్స్ తీశాడు. అందులోంచి అయిదు వంద కాగితాలు తీసి అతనికి అందించాడు.

    ఆ నోట్లని లెక్కబెట్టుకొంటూ మనసులో అనుకొన్నాడు కాంటీన్ ప్రొప్రయిటర్ "వందకంటే నష్టం ఉండదు. ఈ రోజు నాలుగొందలు లాభం. రోజూ వాళ్ళిలా కొట్టుకు ఛస్తే బాగుండును" అని.

    ఈశ్వర్ బయటికి వచ్చేశాడు.

    పోర్టికో దగ్గర మెట్లపైన నుంచుని వున్న అశ్వని అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది, మల్లెపూలని దోసిళ్ళలో పట్టి అతని తలపైన పోసినట్టు.

    అశ్వని అంకయ్య కూతురు. ఈశ్వర్ చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు.

    ఆ రోజు రోజంతా క్లాసులకి అటెండ్ కాలేదు ఈశ్వర్.

    కాలేజీ అయిపోయాక మెల్లగా నడుస్తూ గేటు బయటకు వచ్చాడు ఈశ్వర్.

    రాజుని చూడ్డానికి బయలుదేరాడతను. వెనకనుంచి ఓ కారు వేగంగా దూసుకు రావడం అతను చూడలేదు.

    సర్రుమని చప్పుడు చేస్తూ అతని పక్కగా ఆగింది కారు. అతను తేరుకొనేలోగా డోర్ తెరుచుకోవడం, అందులోంచి ఓ చెయ్యి అతన్ని లోపలకు లాగడం క్షణంలో జరిగిపోయింది. కారు వేగంగా ముందుకి కదిలింది.

                                      2
   
    స్టీరింగు పట్టుకుని పగలబడి నవ్వుతోన్న ఆమెని చూసి "చిత్రా! నువ్వా? ఏమిటిది?" అరిచాడు ఈశ్వర్.

    అరవై కిలోమీటర్ల వేగంతో వెళుతోన్న కారుని వేగాన్ని తగ్గించకుండానే రైట్ కి కట్ చేసింది చిత్ర. ఆ విసురుకి అతను ఆమె ఒడిలో పడ్డాడు.

    చిత్ర కూలింగ్ గ్లాసెస్ లోంచి అతనికేసి చూస్తూ గలగలా నవ్వి అతని తలని ఒడిలో నొక్కుతూ "నిన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాను" అంది.

    "నాకు అవతల బోలెడు పనుంది. ఆడ గూండాలా ఏమిటిది?"

    "నీకున్న బోడి పనులు నాకు తెలిసినవే! తేరగా దొరికింది కదా అని ఒడిలో పడుకున్నావు గానీ లే. ఇదేం సోఫా కం బెడ్ కాదు."

    "సోఫా కమ్ బెడ్ కంటే హాయిగా వుంది. లేవకపోతే ఏం చేస్తావ్?" అడిగాడు ఆమె తొడపైన గిల్లుతూ ఈశ్వర్.

    "షటప్ అండ్ గెటప్."

    మోకాలు పైకి ఎత్తి అతని నెత్తికి తగిలేలా కొట్టింది చిత్ర

    "ఉహుఁ. లేవను."

    "కొట్టినా సిగ్గులేదా?"

    "ఆడపిల్లలు కొట్టేదెబ్బలు తీయగా ఉంటాయి."

    "ఎంతమంది చేత తిన్నావేమిటి? పెద్ద ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టు చెబుతున్నావు?"

    "నీ దెబ్బే దానికి ఉదాహరణ."

    "బుద్ధిగా లేచి కూచో" నవ్వుతోంది చిత్ర.

    ఈశ్వర్ లేవబోయాడు.

    సడన్ బ్రేక్ వేసింది చిత్ర.

    అతను ముందుకి తూలి కిందపడ్డాడు.

    "రౌడీ మేళం! ఏమిటిది?"

    "నోటి కొచ్చినట్టల్లా వాగుతున్నావుగా, వాగు. అన్నీ లెక్కపెడుతున్నాను.

    ఆడగూండా.

    సోఫా కమ్ బెడ్ -

 

    రౌడీ మేళం -

    ఇంకా ఏమన్నా.... మిగిలాయా అనడానికి?"

    చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అడిగింది చిత్ర.

    "అబ్బో! యింకా చాలా ఉన్నాయి."

    "సరే! నిన్ను తీసుకెళ్ళి నాలుగు తగిలించి వదిలేస్తాను. అప్పుడు చెబుదూగాని."

    "నన్నా?"

    "ఎస్ మాన్! గూండా, రౌడీ, హీరో అన్నీ నువ్వే నాకు" కారు వేగంగా వెళుతోంది.

    అతను మెల్లిగా లేచి కూర్చున్నాడు.

    ఒక చేత్తో స్టీరింగుని పట్టుకుని రెండో చేతిని అతను భుజంపైన వేసింది చిత్ర.

    "ఏమిటివాళ జేమ్స్ బాండ్ వేషం వేశావట? దంచావా? దంచేశారా?"

    "దంచబడలేదు. దంచే వచ్చాను."

    "ఏం దంచుతావో బాబూ! నాకయితే నమ్మకం లేదు! ప్చ్! ఎన్నోసార్లు ట్రైల్లో పెట్టాను. ఆముదం మొహం నువ్వూను. ఏమీ చాతకాదు."

    "రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కానీయ్."

    "రాజు కాదు. ఇక్కడ రాణి అనాలి. ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చినందుకు పాపం అబ్బాయిగార్ని చూస్తే జాలేస్తోంది."

    "చిత్రా ప్లీజ్! యీ రోజుకి నన్ను విడిచిపెట్టకూడదూ? నేను వెళ్ళి రాజుగాడ్ని చూడాలి. పాపం అనవసరంగా చచ్చేదెబ్బలు తిన్నాడు వాడు."

    చిత్ర నవ్వింది.

    "అనవసరంగా కాకపోతే అవసరంగా కొడతారా జెన్నీవాళ్ళు? నువ్వుండగా అతన్ని కొట్టడం నాకు నచ్చలేదు."

    "అంటే నన్ను కొడితే బాగుండేదా?"

    "ఉ..... ఎంచక్కా హాస్పిటల్ కి వచ్చి నీకు సేవలు చేసేదాన్ని."

    "సేవలు కాదు. పీక పిసికేదానివి" చిరుకోపంతో అన్నాడు ఈశ్వర్.

    "పోలీస్ రిపోర్టు యిచ్చి లోపలికి తోయించెయ్యాలి ఈశ్వర్!" అప్పుడు గానీ యీ వెధవలకి నిజంగా బుద్ధిరాదు."

    "లాభంలేదు. జెన్నీ మేనమామ అంకయ్య పేరు వినగానే విడిచిపెట్టేస్తారు" అన్నాడు వస్తున్న ఉద్రేకాన్ని అణుచుకుంటూ" ఈశ్వర్.

    "యీ దెబ్బలాటల్లో నువ్వెక్కడ రిపేర్ కొస్తావో అన్నభయం వేస్తోంది."

    "నా కొచ్చిన భయం ఏమీ లేదు. కారాపితే దిగి నా దారిన నేను పోతాను. నాకు పనుంది."

    "నాకూ బోలెడు పనుంది. నీతో పని చేయించుకోడానికే తీసుకెళుతున్నాను.

    "నాతోనా? నేను చేసేంత మహత్తరమైన పనేమిటబ్బా?"

    "చెట్లకి నీళ్ళు పొయ్యాలి."

    "నేను తోటమాలిలా కనబడుతున్నానా?"

    "నా తోటకి నువ్వే తోటమాలివి. పూలు పూయించి, కాయలే కాయిస్తావో, లేక కొమ్మలు విరిచి మొదలే నరుకుతావో తెలీకపోయినా నా మాలిగా నిన్నే ఎన్నుకున్నాను" చిత్ర చిత్రంగా మనోహరంగా నవ్వుతోంది.

    "ఖర్మకాలి నీకు దొరికిపోయాను తల్లీ!"

    "షటప్! తల్లీ గిల్లీ అనకు అమ్మమ్మలా కనబడుతున్నానా? ఓ అందమయిన ఆడపిల్ల వెతుక్కుంటూ వస్తే ముద్దు చెయ్యాల్సింది పోయి నన్ను విడిచిపెట్టో అని అడుస్తావే? చిత్రతో ఆటలాడితే చిత్రహింస తప్పదు."

    ఇక ఆమె తనని విడిచిపెట్టదని ఈశ్వర్ కి అర్ధమయిపోయింది.    

    మూడు రోజులనుంచీ ఆమెకి కనబడకపోవటమే అతను చేసిన గొప్ప నేరం.

    "బుద్ధిలేని మనిషి ఇన్నాళ్ళూ ఎక్కడ తగలడ్డావ్? అతని తొడపైన గిచ్చింది చిత్ర.

    "నీలాగే ఎవరో నీళ్ళు పోయించుకోడానికి తీసుకెళ్లారు."

    "వ్వాట్?" అరిచింది చిత్ర.

    "చెట్లకేలే"

    "ఫన్నీ బాయ్"

    అతను ఆమె ముఖంలోకి చూశాడు.

    ఆమె ముఖం కుమరజ్యోతిలా వెలుగుతోంది.

    "ఇప్పుడింతకూ ఎక్కడకి తీసుకుపోతున్నావు?"

    "ఊరి చివర పాడుబడ్డ బంగళాలోకి."

    "దేనికి?"

    "నిన్ను రేప్ చేసి చంపడానికి" అంది.

    "సిగ్గు లేకపోతే సరి!"

    "ఎవరో ఒకళ్ళు సిగ్గు వదిలేయాలిగా" నవ్వింది చిత్ర కారు ఆపుతూ.

    "దిగు" అన్నది కారులోంచి దిగి చిత్ర.

    "దిగను." బింకంగా కూర్చున్నాడు ఈశ్వర్.

    "దిగమంటే?"

    "ఉహూఁ!"    

 Previous Page Next Page