Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 9

 

    రామభద్రయ్య గదిలోంచి బయటకు వెళ్ళి రెండు నిముషాల్లోనే వెనక్కు వచ్చాడు.
    ఒక వందరూపాయల కట్ట రాజారావు ముందు పడింది. లెక్కపెట్టాడు. నంబర్లు వరుసగా, వేర్వేరుగా వున్నాయో లేదో చూసుకున్నాడు. ఆ కట్టాను జేబులోకి తోసేసి -- "సో-- ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. నేను బ్లాక్ మెయిలర్ని కాను. అనగా డబ్బు కోసం మరోసారి నీ దగ్గరకు రాను. కానీ ఈరాత్రి రెండు గంటలకు మరోసారి నీ దగ్గరకు వస్తాను" అన్నాడు.
    "ఎందుకు!" అన్నాడు రామభద్రయ్య.
    "ఎందుకేమిటి?- చంపడానికి!' అన్నాడు రాజారావు.
    రామభద్రయ్యకు ముచ్చెమటలు పోశాయి. తేలికగా నవ్వేయాలని ప్రయత్నించాడు కానీ ఆయనకు నవ్వు రాలేదు. రాజారావు మాట్లాడే పద్దతి బెదురూ పుట్టించే విధంగా వుంది.
    "నన్ను నువ్వు చంపుతావా?" అన్నాడు రామభద్రయ్య.
    "అవును . కత్తితో గుండెల్లో పొడిచి చంపుతాను. ఈరోజు రాత్రి రెండు గంటలకు!" అన్నాడు రాజారావు. చాలా సామాన్యమైన విషయం చెప్పినట్లు అతను చాలా తాపీగా అన్నాడు.
    "ఎందుకు నన్ను చంపడం?"
    "ఎండుకన్నది నేను చెప్పను. అది నీ ఊహకే వదిలి పెడుతున్నాను. ఎటొచ్చి నేను చెప్పినట్లు వింటే నువ్వు చచ్చినా నీ పరువు పోదు. చెప్పినట్లు వినకపోతే చావు నెలాగూ తప్పించుకోలేవు కానీ పరువు కూడా పోతుంది"
    'అంటే?"
    "నువ్వు నేనెవరో తెలుసుకునేందుకు ప్రయత్నించ కూడదు. ఈ హత్య నుంచి తప్పించుకుందుకు ప్రయత్నించ కూడదు. చావుకు సిద్దపడి రాత్రి రెండు గంటలలోగా పూర్తి చేసుకోవలసిన రాచకార్యలేమైనా వుంటే పూర్తీ చేసుకో. దుష్టాలోచనలు కట్టి పెట్టు, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు నేను నీకు ఫోన్ చేసి యేక్కడకు రావాలో చెబుతాను. నీనుంచి యెటువంటి ప్రతిఘటన వచ్చినా నేను సహించను. నీకు సంబంధించిన రహస్యాలన్నీ బయట పెట్టేస్తాను. అలా కాక బుద్దిగా వున్నావా రెండు గంటలకు నువ్వు చస్తావ్-- అంతకు మించిన అన్యాయం నీకేమీ జరుగదు--" అన్నాడు రాజారావు.
    "ఎందుకు నన్ను చంపడం?.... కావాలంటే ఇంకా యెక్కువ డబ్బు తీసుకో ...." అన్నాడు రామభద్రయ్య.
    "వద్దు.....పదివేలు చాలు నాకు. నిన్ను చంపాలన్నది నా జీవితాశయం. అది మాములుగా కాదు నిన్ను నిస్సహాయుడిని చేసి చంపుతాను. నీ డబ్బు, నీ హోదా , నీ బంధు బలగం -- యెవ్వరూ నిన్ను రక్షించ లేరు. ఇన్నాళ్ళకు నా జీవితాశయం ఫలిస్తోంది -- " అన్నాడు రాజారావు.
    "వద్దు....నన్ను చంపొద్దు....నీకేం కావాలంటే అదిస్తాను...."అన్నాడు రామభద్రయ్య.
    "నా క్కావలసింది నువ్వివ్వలేవు. అది నీ వల్ల కాదు. నీకు చావు తప్పదు. నువ్వు చావుకి సిద్దపడు...."
    "నాకు చావాలని లేదు, నీలో ఏదో పెద్ద పగ ఉన్నట్లుంది. అందుక్కారణం చెప్పు. నేను నా తప్పు దిద్దుకుంటాను. నువ్వు చెప్పినట్లు వింటాను...."
    రాజారావు అదోలా నవ్వాడు...."నువ్వు బ్రతకాలంటే ఒకే ఒక్క ఉపాయముంది. ఏదో బలీయమైన కారణం వల్ల నేను నిన్ను రెండు గంటలకు కలుసుకోలేక పొతే మళ్ళీ యెప్పుడూ నిన్ను కలుసుకొను, నీ జోలికి రాను...."
    రామభద్రయ్య కళ్ళలో ఏదో మెరుపు మెరిసింది.
    'అలా ఆశపడకు. ఆ బలీయమైన కారణం నీచేత సృష్టించబడింది కాకూడదు. అందుకు నువ్వే ప్రయత్నం చేసినా జీవితాంతం నిన్ను వేటాడి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నీకు సంబంధించినంత వరకూ దేవుడి మీద భారం వేసి ఊరుకో, నీ అదృష్టం బాగుంటే బ్రతుకుతావు. నేనీ డబ్బుతో జల్సా చేస్తాను. ఈ ఒక్క రాత్రితో నాకూ జీవితం ఆఖరు కదా మరి!" అన్నాడు రాజారావు.
    "నువ్వు యువకుడివి. నిండా నూరేళ్ళ జీవితం ఉంది నీకు. ఎందుకు హత్యల ఆలోచనలతో నీ మనసునూ, జీవితాన్నీ పాడు చేసుకుంటావు. నామాట విను, నువ్వు కోరిన డబ్బిస్తాను. ఆ డబ్బుతో హాయిగా జీవించు. నీ పగగి కారణమేమిటో చెప్పు . ఒకోసారి అకారణంగా అయిన వాళ్ళను అపార్ధం చేసుకుని పగ పెంచుకోవడం జరుగుతుంది. నాకు అన్నీ కాస్త వివరంగా చెప్పు " అన్నాడు రామభద్రయ్య. అయన కంఠంలో ఎంతో ఆదుర్దా వుంది.
    "మిస్టర్ రామభద్రయ్య! నాది తిరుగులేని నిర్ణయం.నీ సలహాలు నేను ఈ చెవితో విని ఆ చెవిలోంచి వదిలేశాను. ఈరోజు రాత్రి రెండు గంటలకు నీ చావు ఖాయం. నా కంఠంలో ప్రాణ ముండగా నిన్ను వదిలి పెట్టను' అని రాజారావు అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా లేచి వెళ్ళిపోయాడు.

                                   2
    
    రాజారావు వెళ్ళిపోయిన గంట వరకూ రామభద్రయ్య గదిలోంచి కదలలేదు. అలాగే కుర్చీలో కూర్చుని ఏవేవో ఆలోచిస్తున్నాడు.
    తనిరుక్కున్నది చాలా విచిత్రమైన పరిస్థితి!
    ఈరాత్రి రెండు గంటలకు తను హత్య చేయబడతాడు. హంతకుడెవరో తెలుసు. ఎలా చంపుతాడో తెలుసు. కానీ ప్రతిఘటించలేడు తను. హంతకుడు గారూ, నన్ను చంపండి అంటూ తనే హంతకుడి యెదురు వెడతాడు. హంతకుడు తనను చంపేస్తాడు.
    తను పోలీసులకీ విషయం చెప్పుకోలేడు. పోలీసులకే కాదు, ఎవరికీ చెప్పుకోలేడు.
    ఒకవిధంగా చెప్పాలంటే ఆ రాజారావెవరో కానీ తనకు ఉరిశిక్ష విధించాడు. పరువు,ప్రతిష్టలకు ఖైదీగా వున్న తను ఈ ఉరిశిక్ష నుంచి తప్పించుకు పోయే ప్రయత్నం చేయలేడు.
    రాజారావు సూచనలను తూచా తప్పకుండా పాటించాలన్న నిర్ణయానికి వచ్చేక రామభద్రయ్య గదిలోంచి లేచాడు. భార్యను పలకరించాలని అనుకున్నాడాయన.
    ఆయన వెళ్ళేసరికి భార్య రమాదేవి ఇంకా నిద్ర లేవలేదు. ఆమె గాడ నిద్రలో ఉంది. వంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా వున్నాయి.
    రామభద్రయ్య ఆమెను సమీపించి వంటి మీద బట్టలు సరిచేసాడు. ఆమె కింకా మెలకువ రాలేదు.
    "రాత్రి బాగా తాగి ఉంటుంది" అనుకున్నాడు రామభద్రయ్య. అయన ముఖం ముడతలు పడింది. భార్య ముఖం వంకే పరీక్షగా చూశాడాయన.

    వృద్దాప్యం ఛాయలు కనబడుతున్నప్పటికీ ఆ ముఖం ఇంకా అందంగానే ఉంది. నిద్రలో ఆమె ముఖం ఎంతో అమాయకంగా ఉంది.
    "నా కారణంగానే కదా- రమాదేవి తాగుడుకు బానిసయింది --" అనుకున్నాడు రామభద్రయ్య.
    అది ఈనాటి మాట కాదు. ఇరవై ఏళ్ళ నాటి మాట. అప్పటికి రామభద్రయ్య ఇంకా గొప్పవాడు కాలేదు.
    రామభద్రయ్య ఇంటికి ఓ మనిషి వచ్చాడు. అతని చేతిలో ఓ బ్రీఫ్ కేసు ఉంది. అందులో రొక్కం పది లక్షల రూపాయలుంది. ఆ మనిషి రామభద్రయ్య బంధువుల స్నేహితుడు. ఏదో పని మీద ఆ ఊరు వచ్చి రామభద్రయ్య ఇంట్లో మకాం పెట్టాడు.
    రామభద్రయ్య దృష్టి ఆ డబ్బు మీద పడింది. ఎలాగో అలా ఆ డబ్బు స్వంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఓ పధకం వేశాడు.
    రామభద్రయ్య కు ఓ పోలీసినస్పెక్టర్ స్నేహితుడు ఒకరోజు అతన్ని తన ఇంటికి ఏదో మిష మీద పిలిచాడు. పది లక్షల మనిషికి పోలీసుల పొడ గిట్టదు. అందువల్ల అతడు తన కాకలి వేస్తున్నదని లోపలకు వెళ్ళాడు.
    అప్పటికి రామభద్రయ్య అన్నంలో విషం కలిపి ఉంచాడు. ఆ విషయం రమాదేవికి తెలియదు. ఒక్క పది లక్షల మనిషికి తప్ప ఇంట్లో మరెవ్వరికీ ఆ అన్నం తనకు చెప్పకుండా పెట్టవద్దని రామభద్రయ్య భార్యకు చెప్పాడు. ఆ అన్నంలో విషముందని తెలిస్తే చేజేతులా భార్య అది అతనికి పెట్టడానికి భయపడుతుందని అయన అలా చెప్పాడు. మరెవరికి అన్నం పెట్టకూడదన్న విషయంలో అయన భార్య చేత ఒట్టు కూడా వేయించుకున్నాడు.
    అయితే ఊహించని పరిణామం జరిగింది-- రామభద్రయ్య రెండో కొడుకు నాలుగేళ్ళ వాడు అన్నం పెట్టమని మారాం చేశాడు. వాడికి పెడితే గాని తను తిననని అతిధి మొరాయించాడు. ఫలితంగా రమాదేవి భర్త ఆమోదం పొందకుండా పిల్లవాడికీ, అతిధి కి భోజనాలు పెట్టింది.
    ఇద్దరూ భోజనం చేస్తుండగానే చచ్చిపోయారు.
    ఇంట్లో పోలీసినస్పెక్టరున్నాడు. మనిషి చచ్చి పోయాడు. కాబట్టి దీన్నీ హత్యగా ఎవరూ జమ చేయలేదు. ఇంకో విశేషమేమిటంటే ఆ మనిషి దగ్గర అంత డబ్బున్నదని యెవ్వరికీ తెలీదు.
    చూస్తూ చూస్తూ యెవరూ కన్నకొడుకుని చంపుకోరు కాబట్టి అన్నంలో విషం అనుకోకుండా కలిసిందనే అంతా భావించారు. ఏ కారణం లేకుండా యెవ్వరూ ఓ అపరిచితుడిని చంపాలనుకోరు.
    హత్యా ప్రయత్నంలో రామభద్రయ్య తన కన్న కొడుకును కూడా చంపుకున్నాడు. కానీఆది అయన నిర్దోషిత్వాన్ని మరింత బలపరిచింది.
    అసలు విషయం ఆ రాత్రే రామభద్రయ్య భార్యకు చెప్పేశాడు. ఆమె అది విని పెద్ద షాక్ తింది. కన్నబిడ్డను చేతులారా చంపుకున్నందుకు కుమిలిపోయింది.
    పదిలక్షల ఆస్థి ముందు -- కొడుకు పోవడం రామభద్రయ్య కంత బాధని పించలేదు. అప్పటికాయనకు నలుగురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. ఇప్పుడు రెండో అబ్బాయి చనిపోయాడు.
    "పిల్లల్దేముంది ? కావాలంటే మళ్ళీ పుడతారు. ఇంత ఆస్తి మళ్ళీ సంపాదించలేము. బ్రతీకున్నవాళ్ళు సుఖంగా జీవిస్తారు" అన్నాడు రామభద్రయ్య భార్యను ఓదారుస్తూ.
    
   

 Previous Page Next Page