Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 10

 

    "నాకలా అనిపించడం లేదండీ - డబ్బు కోసం ఓ మనిషి ప్రాణాలు తీయాలనుకుంటే అది మన బిడ్డను కూడా కొట్టింది. అంటే దుర్మార్గం మనకు అచ్చి రాదు. ఈ డబ్బు మనల్ని సుఖ పడనివ్వదు. అనవసరంగా మీరు తొందరపడ్డారు" అంది రమాదేవి. కడుపు శోకం ఆమెకు మతి పోగొడుతోంది.
    రమాదేవి ఇంచుమించు పిచ్చి దానిలాగై పోయింది. "నా బిడ్డ -- నా బిడ్డ -- 'అంటూ ఓ రాత్రివేళ లేచేది, మెలకువగా ఉన్నప్పుడల్లా ఏపనీ చేయకుండా ఓమూలకు పోయి ఏడుస్తూ కూర్చునేది. ఒకోసారి -- "దెయ్యం దెయ్యం-- నా కుటుంబం మీద పగబట్టింది " అంటూ పెద్ద కేకలు వేసేది.
    రామభద్రయ్యకు భార్య అంటే ఇష్టం. ఆమె ఈ ధోరణి అతడికి బాధనిపించింది. కష్టాల నుంచి మరిపించడం కోసం అతడే ఒకరోజున అమెచేత బ్రాందీ తాగించాడు బలవంతంగా. అది బ్రాంది అని తెలియక రమాదేవి అది తాగింది. తాగేక నిజంగానే ఆమెకు ప్రాణం హాయిగా ఉంది. కష్టాలామే కిప్పుడు గుర్తు లేవు. గుర్తున్నా పట్టించుకునే స్థితిలో లేదు.
    మర్నాడామే భర్తను -- "నిన్నటి మందు బాగా పని చేసిందండీ " అంది.
    అలా కొద్ది రోజులు మందు పేరుతొ బ్రాందీ పుచ్చుకుందామె.
    ఆమె బ్రాందీ కి అలవాటు పడిపోతోందని గ్రహించి కంగారు పడి రామభద్రయ్య అదేమిటో ఆమెకు చెప్పేశాడు. అది మందు కాదనీ -- బ్రాందీ అని తెలుసి కూడా రామాదేవి దాన్నీ వదిలి పెట్టలేకపోయింది.
    క్రమంగా రామభద్రయ్య ఆర్ధిక పరిస్థితి మెరుగైంది. ఒక్కసారిగా కాక తన డబ్బును క్రమంగా బయటకు తీశాడు రామభద్రయ్య. అయన ఆ డబ్బుతో కాంట్రాక్టు లు ప్రారంభించి కోటికి పడగలెత్తసాగాడు.
    ఇంట్లో రమాదేవి తాగుడుకు బానిస అయింది. రామభద్రయ్య కు వ్యాపార వ్యవహారాలలో క్షణం తీరిక లేదు. పిల్లలకు సరైన అదుపు లేకుండా పోయింది. దాంతో ఒక్కరికీ మం చి బుద్దులు అలవడలేదు. ఆ విషయంలో రామభద్రయ్య పూర్తిగా నిస్సహాయుడయ్యాడు. అయితే అయన పిల్లల ప్రవర్తన అరికట్టడానికి, అదుపులో పెట్టడానికీ పెద్ద ప్రయత్నాలేమీ చేయలేదు. తన బిడ్డలకు డబ్బుకు లోటు లేదు కాబట్టి వారి జీవితంలో ఏ లోటూ ఉండదని అయన నమ్మాడు....
    రామభద్రయ్య భార్య తల నిమురుతూ అలోచిస్తున్నాడు. ఒకణ్ణి చంపి ఇంతవాడయ్యాడతను. ఫలితంగా తన కొడుకు చచ్చిపోయాడు. తన కూతుర్ని ఏ తండ్రీ చూడాలనుకొని విధంగా ఫోటోలో చూడాల్సి వచ్చింది. మరో కూతురు నేరస్థులతో చేతులు కలుపుతోంది. బ్రతికున్న కొడుకు డబ్బు కోసం తొక్కని అక్రమ మార్గమంటూ లేదు.
    తను ఒకే ఒక హత్య చేశాడు. ఆ తర్వాత కాంట్రాక్టు లలో అన్యాయంగానే డబ్బు సంపాదించినా తన ప్రవర్తనకు కొన్ని పరిమితులేర్పరచుకున్నాడు. ఎవరి చేతా వేలెత్తి చూపించుకో నవసరం లేని విధంగా మసలు కున్నాడు.
    కానీ తన సంతానం అలా కాదు. వాళ్ళు చేడు స్నేహాలు పట్టి అనుభవం లేకుండానే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏ ఇబ్బందుల్లో ఇరుక్కుంటారో నని  తనకు బెంగగా ఉంటుంది.
    "ఏమిటండీ ఆలోచిస్తున్నారు?" అంది రమాదేవి.
    "మెలకువ వచ్చిందా?" - అన్నాడు రామభద్రయ్య .
    రమాదేవి తలాడించింది.
    "రామా! నువ్వింకా యెంత కాలం ఇలా అన్ని బాధ్యతలనూ తప్పించుకు తిరుగుతావు?" అన్నాడు రామభద్రయ్య బాధగా.
    "అన్నీ చూసుకుందుకు మీరున్నారు. నాకే లోటండీ ?" అంది రమాదేవి.
    "అలా అనకు. నా ఆరోగ్యం బాగుండడం లేదు. రాత్రి నాకు గుండెల్లో నొప్పి వచ్చింది. ప్రాణం పోతుందేమో అనిపించింది. అలాంటి నొప్పి ఇంకోసారి వస్తే ఈరాత్రే నేను చచ్చిపోవచ్చు" అన్నాడు రామభద్రయ్య].
    చటుక్కున లేచి అతని నోరు మూసింది రమాదేవి.
    "నానోరు మూసి లాభం లేదు రమా! నాకు జీవితేచ్చ నశించింది. ఇంకా ఈ సంసారాన్ని నువ్వే చూసుకోవాలి. చూసుకోకపోతే మన సంసారం వీధిన పడిపోతుంది.
    "నేనేం చేయండి చెప్పండి" అంది రమాదేవి.
    "గృహిణిగా నీ బాధ్యతలు నిర్వర్తించు. అంతే నేను కోరేది" అన్నాడు రామభద్రయ్య.
    రమాదేవి నిట్టూర్చి -- "ఒక మంచి కోరికను చాలా ఆలశ్యంగా నా నుంచి కోరుతున్నారు" అంది.
    "రమా! నీకు తాగుడు అలవాటు చేసింది నేను, ఆ అలవాటు అవసరపడ్డానికి కారణం నేను. అయితే ఈ రోజుల్లో యెందరో తాగుతున్నారు. విదేశాల్లో ఆడా, మగా ప్రతిరోజూ తాగుతూనే వుంటారు. తాగుతున్నారు కదా అని నువ్వో మూల కూర్చుని  జీవితమంతా గడిపెయ్యక్కర్లేదు. నీకు గర్భ శోకం కలిగింది. నీ చేతి అన్నం తిని నీ కొడుకు ,మరణించాడు. ఆ దుఃఖం మరిచిపోవడానికి నువ్వు చేస్తున్నదేమిటి? మన పిల్లలు బ్రతికుండీ చచ్చిన వాళ్ళతో సమానమయ్యారు" అన్నాడు రామభద్రయ్య.
    "ఏమిటండీ మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారీ రోజున" అంది రమాదేవి.
    "ఈ ఫోటోలు చూడు....' అంటూ రామభద్రయ్య భార్యకు ఫొటోలందించి వాటి గురించిన వివరాలు చెప్పాడు.
    రమాదేవి మత్తంతా ఒక్కసారిగా దిగిపోయింది. ఆప్రయట్నంగా "ఛీ ఛీ" అందామె.
    "నువ్వన్న చీత్కారం మన పిల్లలకు వెళ్ళదు. పెంపాకానికి వెడుతుంది. నువ్వు గానీ నేను గానీ వాళ్లనేనాడైనా పట్టించుకున్నామా? వాళ్ళ మార్గం సరిగ్గా లేదని నాకు తెలుసు. కానీ మరీ ఇంతలా చేడిపోయారని ఈ రోజే నాకు తెలిసింది...." అన్నాడు రామభద్రయ్య . అయన గొంతులో తడి ధ్వనించింది.
    "ఏమిటండీ ఇదంతా? ఇన్నాళ్ళూ మీరు నాకెందుకు చెప్పలేదు?" అంది రమాదేవి.
    "చెప్పకపోవడం నా తప్పు. తెలుసుకోవాలని ప్రయత్నించక పోవడం నీ తప్పు. ఇప్పటికైనా నువ్వు పిల్లల విషయంలో కలగజేసుకోలేక పొతే -- వాళ్ళ క్కూడా  మరి కాస్త విషాన్నం పెట్టి చంపేసేయ్. ఆ దుఖం మరిచిపోవడానికి నువ్వు ఇంకాస్త తాగుడు డోసు పెంచువు గాని....." అన్నాడు రామభద్రయ్య.
    భర్త మాటలకు రమాదేవికి కలిగిన బాధ వర్ణనాతీతం.
    రమాదేవి తాగుతుందన్న విషయం ఇంట్లో పిల్లలక్కూడా తెలియదు. అనారోగ్య కారణంగా ఆమె ఆ గది విడిచి రాదని వాళ్ళనుకుంటూ వుంటారు. రోజూ ఉదయం కాసేపు ఆమె వారితో మాట్లాడుతుంది. అంతే.
    రమాదేవి గదిలో వుండే సీసాలన్నీ రకరకాల మందు సీసాలు. ఆ సీసాల్లో వుండేది మాత్రం బ్రాందీ.
    తను ఇంత రహస్యంగా కాపాడుకుంటూ వస్తున్నా విషయం ఆ రాజారావు కెలా తెలిసిందో రామభద్రయ్య ఆశ్చర్యంగానే వుంది. కానీ రాజారావు కారణం గానే ఆయనకు తన కుటుంబ పరిస్థితి యెంత ఘోరంగా వున్నదో తెలిసింది. ఒకవిధంగా చెప్పాలంటే రాజారావాయనకు మహోపకారం చేశాడు.
    "ముందొకసారి లలితనిలా పిలవండి...." అంది రమాదేవి.
    రామభద్రయ్య అక్కణ్ణించి కదిలి లలిత గదికి వెళ్ళాడు.
    లలిత అప్పుడే మేకప్ అవుతోంది. ఎక్కడికో వెళ్ళడానికి సిద్దంగా ఉందామె!
    "లలితా నిన్ను అమ్మ పిలుస్తోంది...." అన్నాడు రామభద్రయ్య.
    "ఎందుకు?" అంది లలిత ఆశ్చర్యంగా.
    "నాకు తెలియదు...." అన్నాడు రామభద్రయ్య.
    ఇదరూ రమాదేవి దగ్గరకు వెళ్ళారు. రమాదేవి లలితను దగ్గరగా రమ్మనమని పిలిచి ఫోటో ఆమె చేతిలో పెట్టి- "దీని గురించి ఏం చెబుతావో చెప్పు!" అంది.
    లలిత ఆ ఫోటోను చూసి షాక్ అయింది. ఒక్క నిముషం ఆమెకు నోట మాట రాలేదు.
    రామభద్రయ్య, రమాదేవి మౌనంగా ఆమె వంకనే చూస్తున్నారు.
    కొంతసేపు మౌనంగా ఉన్నాక - నోరు విప్పాల్సిన బాధ్యత తనదేనని లలిత గ్రహించింది. ఆమె నెమ్మదిగా "నేను అతన్ని ప్రేమిస్తున్నాను...." అంది.
    "ప్రేమిస్తే ఇంట్లో ఎందుకు చెప్పలేదు?"
    "ఎవరికి చెప్పాలో తెలియలేదు...." అంది లలిత తడుముకోకుండా.
    రమాదేవి, రామభద్రయ్య కూడా దెబ్బ తిన్నారు.... అవును....లలిత తన ప్రేమ గురించి ఎవరికి చెప్పుకుంటుంది? తల్లి ఆమెతో మాట్లాడదు. తండ్రికి మాట్లాడే తీరిక లేదు. అడిగిన డబ్బివ్వడానికి ఏర్పాట్లున్నాయి.
    "పెళ్ళి కాకుండా మొగవాళ్ళ దగ్గర చనువుగా వుండకూడదని తెలియదా ?' అంది రమాదేవి.
    ఆప్రయట్నంగా రామభద్రయ్య కళ్ళ ముందు ఫోటో లోని కూతురు మెదిలింది. ఆమె వయసు ఇరవై మూడేళ్ళు. ఇంతవరకూ తనామే పెళ్ళి గురించి మంచి ప్రయత్నాలేమీ చేయలేదు. ఆ మాటకొస్తే రెండో కూతురు గోమతికి ఇరవై నిండాయి. పదహారేళ్ళ కే ఎదురిళ్ళ;లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి.
    "తెలుసు...." అంది లలిత.
    నెమ్మదిగా లలిత విషయం వివరించింది. ఫోటోలో అబ్బాయి చాలా మంచివాడు. అతని పేరు గోపాల్. అతను ఏదో కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల వాళ్ళిద్దరూ అనుకోని ఏకాంతం లభించి తత్కాలికావేశంలో తప్పు చేశారు. ఈ ఫోటోలు తీసే ఏర్పాటు అతను చేసి ఉంటాడని ఆమె భావించడం లేదు.

 Previous Page Next Page