Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 8

 

                                మరణ శిక్ష
            
                                                                    వసుంధర

    నా పేరు రాజారావండీ!" అన్నాడా యువకుడు.    
    "నాతొ ఏం పని నీకు ?" అన్నాడు రామభద్రయ్య
    "ఒక్క పది నిమిషాలు మీతో మాట్లాదాలండి-" అన్నాడు రాజారావు.
    "మాట్లాడు--"
    "రాజారావు అనుమానంగా కాస్త అటూ ఇటూ చూసి "విషయం కాస్త రహస్యమైంది. ఇక్కడే మాట్లాడవచ్చు నంటారా?" అన్నాడు.
    రామభద్రయ్య ముఖంలో కాస్త కుతూహలం కనబడింది - "నాతొ రహస్యమా -- చాలా ఆశ్చర్యంగా వుందే - ఏమిటో త్వరగా చెప్పు --" అన్నాడు.
    "ఇక్కడే చెప్పొచ్చు ఫరవాలేదంటే చెప్పేస్తా నండి-- " అన్నాడు రాజారావు కాస్త వినయంగా.
    "ఫరవాలేదు - చెప్పు ..." అన్నాడు రామభద్రయ్య.
    "నాకో పది వేలు కావాలి !" అన్నాడు రాజారావు.
    "పదివేలా -- ఎందుకు?" అన్నాడు రామభద్రయ్య.
    "జీవితంలో చివరి ఘడియలు సమీపించాయి నాకు. ఇప్పుడున్నలాంటి జీవితం బహుశా ఈ ఒక్క రోజులోనే ఆఖరు కావచ్చు. అందుకని ఈ ఒక్కరోజూ వీలైనంత సుఖంగా గడపాలనుకున్తున్నాను. అందుకు డబ్బు కావాలి. డబ్బు నా దగ్గర లేదు కదా -- అందుకని మీ దగ్గరకు వచ్చాను. డబ్బంటే మీకు లెక్కలేదని తెలుసు. పదివేలు కాదు, పాతికవేలడిగినా మీరిస్తారని తెలుసు! కానీ నాకు అత్యాశ లేదు. ఒక్కరోజులో పాతికవేలు ఖర్చు పెట్టగల సరదాలూ నాకు లేవు! పదివేలు చాలు" అన్నాడు రాజారావు.
    "నీకోరిక చిన్నదే కావచ్చు. అది తీచగల సామర్ధ్యం నాకుండి వుండనూ వచ్చు. కానీ నేను నీకు డబ్బు యెందుకు ఇస్తాననుకున్నావ్?" అన్నాడు రామభద్రయ్య. అయన కంఠంలో కోపం లేదు, సవాలు కోసం ఎడురుచూస్తున్న ఆయన కళ్ళు రాజారావు ముఖ కవళికలను సునిశితంగా పరిశీలిస్తున్నాయి.
    "నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు కాబట్టి...." అన్నాడు రాజారావు.
    "నువ్వెవరో నాకు తెలియదు..."అన్నాడు రామభద్రయ్య.
    "మీకా ఇబ్బంది యేమీ అవసరం లేదు.... అన్నీ నేను చెబుతాను...." అన్నాడు రాజారావు.
    "చెప్పు!"
    "లలిత మీ అమ్మాయే కదూ!" అన్నాడు రాజారావు.
    "నువ్వడిగే లలిత ఎవరో నాకు తెలియదు . కానీ లలిత పేరు గల కూతురు నాకుంది--"
    రాజారావు చిన్నగా నవ్వి -- "మిమ్మల్నాట్టే ఇబ్బంది పెట్టదల్చుకోలేదు . నేనెరిగున్న లలిత మీ అమ్మాయి ఒక్కతే! ఇంకా అనుమానముంటే ...." అంటూ జేబులోంచి రెండు కార్డు సైజు ఫోటోలు తీసి అయన ముందుంచాడు.
    రామభద్రయ్య ఆ ఫోటోలు ఆత్రుతగా చూశాడు ఆయన ముఖం పాలిపోయింది. అ ఫోటోల్లో లలిత, ఒక పురుషుడు శాస్త్ర కారుడు చెప్పిన శృంగార రీతుల్లో ఉన్నారు.
    "నువ్వు....నువ్వు....బ్లాక్ మెయిలర్ వా?" అన్నాడు రామభద్రయ్య.
    "ఏమాత్రమూ కాదు...." అన్నాడు రాజారావు తాపీగా-- "నేను బ్లాక్ మెయిలర్ కానని కొద్ది సేపట్లో మీరు తెలుసుకుంటారు. ఈ ఫోటోలు మీకు చూపించాల్సినవి కావు. కాని తప్పని సరి అయింది--"
    "ఇప్పుడే నిన్ను పోలీసులకు పట్టిస్తాను...." అన్నాడు రామభద్రయ్య.
    "అది మీ వల్ల కాదు, ఇంకో రెండు గంటల్లో నేను మీ ఇల్లి కదిలి రాకపోతే -- నా మిత్రుడ్ని కలుసుకోకపోతే -- ఈ ఫోటోలు ఊరంతా పంచి పెట్టబడతాయి. అన్నాడు రాజారావు.
    "ఇలాంటి ఎర్పటేదో చేసుకునే వచ్చి ఉంటావని ఊహించాను. కానీ నేను నిన్ను నిర్భంధించి, ప్రాణాలు తీస్తానని బెదిరించి  నీ స్నేహితుడి ఆచూకీ తెలుసుకోగలను-- " అన్నాడు రామభద్రయ్య.
    "ఈరోజుతో జీవితం ముగిసిపోతున్న వాడ్ని. నన్ను మీరేమీ చేయలేరు. నాకు చావంటే భయం లేదు...."
    రామభద్రయ్య కూతురు ఫోటోల వంక బాధగా చూసి కళ్ళు మూసుకుని ఏదో గొణుక్కున్నాడు.
    "ఖజురహో, కొనార్కు శిల్పాల కంటే ఈఫోటోలు బాగున్నాయి --" అన్నాడు రాజారావు.
    "వర్ణనలు తర్వాత, ముందు త్వరగా యిక్కడ్నించి వెళ్ళు. నువ్వెన్ని చెప్పినా ఈఒక్కరోజులో వదుల్తావని నమ్మలేను. ఇప్పుడు నువ్వడిగింది పదివేలు. చాలా ఎక్కువ. రెండు వేలిస్తాను...." అన్నాడు రామభద్రయ్య.
    "నేనడిగిన డబ్బు ఎంత తక్కువో మీరు తెలుసుకోవడాని కెంతో సేపు పట్టదు..."
    "చెప్పు -- " అన్నాడు రామభద్రయ్య.
    "ఇక్కడే చెప్పనా ?" అన్నాడు రాజారావు తాపీగా మళ్ళీ.
    రామభద్రయ్య  క్షణ కాలం తటపటాయించాడు. తను కూర్చున్న చోట్నించి లేచి- గుమ్మం వరకూ వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ కూర్చుని - "ఫరవాలేదు - చెప్పు!' అన్నాడు. గంబీర్యాన్ని తెచ్చి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది అయన కంఠం.
    "గోమతి మీ రెండో కూతురు కదూ?" అన్నాడు రాజారావు.
    ఈ పర్యాయం రామభద్రయ్య కళ్ళలో భయం స్పష్టంగా కనబడింది. అయన భయాన్నదికం చేస్తూ రాజారావు జేబులో చెయ్యి పెట్టాడు. నెమ్మదిగా ఓ ఫోటో బయటకు లాగాడు.
    ఈసారి ఎలాంటి దృశ్యం చూడాలోనని రామభద్రయ్య భయపడుతున్న ప్పటికీ అయన ఆ ఫోటో చూశాడు. ఫోటోలో గోమతి వుంది. ఆమె చేతిలో కొద్దిగా తెరవబడ్డ బ్రీఫ్ కేసు ఉంది. బ్రీఫ్ కేసు నిండా బంగారు కణికలు వున్నాయి. గోమతికి ఎదురుగా వున్న ఒక వ్యక్తీ ఆ బ్రీఫ్ కేసు వంకే చూస్తున్నాడు.
    "ఈఫోటో నాకెందుకు చూపించావ్?" అన్నాడు రామభద్రయ్య.
    "మీకు విక్టర్ తెలియదా?" అన్నాడు రాజారావు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
    "వాడేవాడు ? ఎక్కడుంటాడు?"
    "ఒకప్పుడైతే వాడెక్కుడుంటాడో చెప్పడం కష్టమే కానీ ఇప్పుడు చెప్పడం సులభమే!"
    "ఎందువల్ల?" అన్నాడు రామభద్రయ్య.
    "ప్రస్తుతం విక్టర్ జైల్లో ఉన్నాడు...." అన్నాడు రాజారావు.
    "ఎందుకు...."
    "మీకు తెలియదంటే నేను నమ్మను, అయినా చెబుతున్నాను. వాడి మీద స్మగ్లింగ్ గురించి చాలా నేరాలున్నాయి. నెల్లాళ్ళ క్రితం పోలీసులకు రెండ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు...."
    "వాడి సంగతి నాకిప్పుడెందుకు చెబుతున్నావ్?"
    "తెలియదంటే నమ్మను. మీకు చూపిన ఫోటోలో వున్న మగ మనిషి విక్టర్ అన్న విషయం మీకింకా తెలియలేదా?"
    రామభద్రయ్య ఆశ్చర్యపోలేదు...." సో! అన్నాడు.
    "నేను పదివేలడిగాను , మీరు రెండు వేలిస్తానన్నారు, అందుకే ఈ ఫోటో చూపించాను...."
    రామభద్రయ్య ఓసారి కణతలు నొక్కుకుని-- "మూడు వేలిస్తాను...." అన్నాడు.
    "మీ దగ్గర్నుంచి పదివేలు తీసుకోవడానికి నేనింకా చాలా విశేషాలు చెప్పాల్సోచ్చేలా వుంది!" అన్నాడు రాజారావు కాస్త సీరియస్ గానే.
    "ఇంకా ఎన్ని విశేషాలున్నాయేమిటి నీ దగ్గర!" అన్నాడు రామభద్రయ్య. భయం అయన కంఠన్ని విడిచిపెట్టలేదు.
    "చాలా తెలుసు. ఇటీవల నీ కొడుకు కాంట్రాక్టు లో కట్టబడిన రైల్వే వంతెన కూలిపోతే అది పెద్ద గొడవగా మారకుండా ఉండడానికి ఎవరెవరికి ఎంతెంత లంచాలిచ్చారో సాక్ష్యంగా నిరూపించగలను. నీ భార్య తాగుడుకు బానిస అన్న విషయం తెలుసు ....ఇంకా...."
    "అగు ..." అన్నాడు రామభద్రయ్య కంగారుగా -- 'అసలేవరు నువ్వు? నా కుటుంబం మీద ఎందుకు పగ బట్టావ్?" నన్నెందుకిలా మాటలతో హింసిస్తున్నావ్!"
    "నేనెవరినో తర్వాత చెబుతాను. కానీ నేను మిమ్మల్ని మాటలతో హింసించడం లేదు. నిమ్మకాయ రసం పుండు మీద పడితేనే మండుతుంది. కానీ నాలిక మీద వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. నేను కొన్ని నిజాలు చెబుతుంటే పుండు లాంటి మీ శరీరానికి నిమ్మరసం లా పనిచేస్తున్నట్లున్నాయి" అన్నాడు రాజారావు.
    "పదివేలూ ఇచ్చేస్తాను. మళ్ళీ నా జోలికి రావుకదూ" అన్నాడు రామభాద్రయ్య.
    "ముందు డబ్బు తీసుకురా. అది తీసుకున్నాక నీకో ముఖ్య విశేషం చెప్పాలి" అన్నాడు రాజారావు.

 Previous Page Next Page