ముకుందరావు వెళ్ళి సుబ్బరాజును కలుసుకున్నాడు. సుబ్బరాజు వెంకన్న పేరు వింటూనే అతణ్ణి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వివరాలన్నీ అడిగాడు. అతడి వుద్యోగం వివరాలు తెలియగానే కంగారుగా -- "ఇళ్లేవి ఖాళీ లేవు. బాబూ -- కాళీ అవగానే మీకు చెబుతాను. వెంకన్న బాబుకీ విషయం చెప్పండి--" అన్నాడు.
ముకుందరావు యెంత బ్రతిమాలినా పని జరుగలేదు. అతడు ముఖం వేలాడేసుకుని వెంకన్న దగ్గతకు వెళ్ళి జరిగింది చెప్పాడు. వెంకన్న ఆశ్చర్యపడి తాత్కాలికంగా అతడికి తన యింట్లో వసతి ఏర్పాటు చేసి తర్వాత తనే స్వయంగా సుబ్బరాజును కలుసుకున్నాడు.
"మీకైతే కాదంటానా? మీసంగతి తెలియని వాడనా? ఉన్నవాళ్ళని పొమ్మంటే తప్ప యీ అబ్బాయికి దారి లేదు. ఇంట్లో ఉంటున్న వాళ్ళని ఉన్న పళంగా పొమ్మనమని ఎలా చెప్పేది చెప్పండి?" అన్నాడు సుబ్బరాజు.
సుబ్బరాజు చెప్పింది విన్నాక అతడు నిజమే చెబుతున్నాడనిపించింది.
ముకుందరావు వెంకన్న యింట్లోనే ఉంటున్నాడు కానీ అతడికి చాలా మొహమాటంగా వుంది. అతడు బయట తన ప్రయత్నాలు తను చేస్తూనే వున్నాడు.
ఒకరోజున అతను వెంకన్నతో "మీరు కాస్త శ్రద్ధ వహిస్తే నా వసతి సమస్య తీరిపోతుంది" అన్నాడు.
"నీ వసతి కిప్పుడోచ్చిన లోటేమిటి?" అన్నాడు వెంకన్న.
"లోటేమీ లేదండి. కానీ యిలా యెంతకాలం మీకు యిబ్బంది కలిగిస్తాను?.... నేను మా క్వార్టర్స్ గురించి వాకబు చేసాను. వాటి నిర్మాణం పూర్తీ అయి రెండేళ్ళయిందిట. వాటిలో ఇంక శానిటరీ ఫిట్టింగ్స్ అవాలిట. అంతే. అందుకు వారం రోజుల కంటే పట్టదట....ఆ పని అయిపోతే ఆ క్వార్టర్స్ మాకు యిస్తారుట...." అన్నాడు ముకుందరావు.
"ఇందులో నేను చెయ్య గలిగిందేముంది?" అన్నాడు వెంకన్న.
"సుబ్బరాజు గారు మీకు తెలుసు గదా -- ఆయనే మా బిల్డింగ్స్ కాంట్రాక్టరు . మీరు చెబితే త్వరగా మా క్వార్టర్స్ రెడీ కావచ్చు" అన్నాడు ముకుందరావు.
"అమ్మ సుబ్బరాజూ?' అనుకున్నాడు వెంకన్న.
"గవర్నమెంటు బిల్డింగ్స్ కాంట్రాక్టు తీసుకుని అ పని నెమ్మదిగా చేస్తూ తన స్వంత ఇళ్ళను అద్దె కిచ్చు కుంటున్నాడన్నమాట. వాటికి శానిటరీ ఫిట్టింగ్స్ పూర్తయిపోతే తన ఇళ్ళలో సగం మంది ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అందుకని రెండేళ్ళ నుంచి అ పని వాయిదా వేస్తున్నాడు సుబ్బరాజు. ఇది చాలా దారుణం" అన్నాడు వెంకన్న.
"శానిటరీ ఫిట్టింగ్సు కి రెండు సంవత్సరాలు అతను జాప్యం చేస్తే మాత్రం మా ఆఫీసు వాళ్ళెలా ఊరుకుంటున్నారో నాకు తెలియడం లేదు" అన్నాడు ముకుందరావు.
వెంకన్న నవ్వి "మీ ఆఫీసు విషయాలు తెలుసుకుందుక్కూడా నాలాంటి డిటెక్టివ్ పనిచేయాలా? ఆ పని నీవల్ల కాదా?" అన్నాడు.
సుబ్బరాజు మా ఆఫీసులో సివిల్ ఇంజనీరు కి లంచ మిచ్చాడని చేప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మా జనరల్ మేనేజర్ కి కూడా ఇందులో వాటా వున్నదని చెప్పుకుంటున్నారు. ఆ క్వార్టర్స్ మరో సంవత్సరం దాకా సిద్దం కాదని అందరి అంచనా!" అన్నాడు ముకుందరావు.
"చాలా బాగుంది. క్వార్టర్స్ అంతవరకూ తయారు కావడానికి చాలా ఖర్చవుతుంది గదా ఆ డబ్బంతా రాబట్టుకోవడం కోసమైనా సుబ్బరాజు వాటిని మీ ఆఫీసుకి అప్పజెప్పాలి" అన్నాడు వెంకన్న.
'అబ్బే అదేం లాభం లేదండి. మా ఆఫీసు నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టు కైనా నూటికి తొంబై శాతం డబ్బు ముందే ఇచ్చేస్తారు. గవర్నమెంటు సొమ్ము కదా! ఆ తొంబై శాతం లోనే కాంట్రాక్టరు చాలా లాభం తీస్తాడు" అన్నాడు ముకుందరావు.
"మీ క్వార్టర్స్ క్కడో కనుక్కో. ఒకసారి వెళ్ళి చూసొద్దాం" అన్నాడు వెంకన్న.
"కనుక్కున్నాను. అవి సుబ్బరాజింటికి పక్క వీధిలోనే వున్నాయి" అన్నాడు ముకుందరావు.
"ఏమిటీ?" అని వెంకన్న నోరావలించాడు.
ముకుందరావు తన క్వార్టర్స్ గురించిన వివరాలు పూర్తిగా చెప్పాడు. అవి మొత్తం పది బ్లాకులట. ఒకో బ్లాకులో నాలుగు క్వార్టర్స్ ట.....
"అవి మీ ఆఫీసు క్వార్టర్స్.... వాటినే సుబ్బరాజు తన ఇళ్ళని చెప్పి అద్దె కిస్తున్నాడు. అన్నాడు వెంకన్న. ఆ తర్వాత మళ్ళీ కాసేపు అతడికి నోట మాట రాలేదు.
ముకుందరావు మరీ అంత ఆశ్చర్యపోలేదు. "ఈ విషయం నేను చూచాయగా విన్నాను. కానీ మీకు తెలియదనుకోలేదు' అన్నాడతను.
వెంకన్న కు యిప్పుడు విషయమంతా పూర్తిగా అర్ధమైంది.
సుబ్బరాజు గవర్నమెంట్ క్వార్టర్ కాంట్రాక్టు సంపాదిస్తున్నారు. ఖర్చులో తొంబై శాతం ముందుగానే పుచ్చుకుంటున్నాడు. ఆ డబ్బుతో బిల్డింగ్స్ కట్టేసి గవర్నమెంటు కు అప్పగించకుండా వాటిని తన స్వంతం చేసుకుని అద్దె కిచ్చుకుంటున్నాడు. గవర్నమెంటు ఖర్చుతో తయారైన ఇళ్ళ మీద వచ్చే అద్దెను తను అనుభవిస్తూ అ ఇళ్ళలో అద్దె కుండే వారి కోసం వ్యభిచార గృహల్ని కూడా నడుపుతున్నాడు. బాధ్యత గల గవర్నమెంటు ఉద్యోగులు తమ బాధ్యతల్ని విస్మరించి తన జోలికి రాకుండా వుండడానికి గానూ వాళ్ళకు కొంత మేత పెడ్తున్నాడు. ఇదంతా చాలక ఇంకా తన బావగారి పేరిట అమాయకుల్ని దోస్తున్నాడు. మోసం అతడి నరనరాలా వున్నది.
అందుకే సుబ్బరాజు డిటెక్టివ్ వెంకన్న పేరుకు భయపడ్డాడు. అతడి దృష్టిలో పడకూడదని తాపత్రయపడ్డాడు అయితే....
ఈ విధంగా ప్రభుత్వం ఎంత డబ్బు నష్టపోతోంది? ఎంతమంది ప్రభుత్వోద్యోగులు ఇళ్ళు లేక యిబ్బంది పడుతున్నారు? ఇలా ఎంతకాలం జరుగుతుంది?
ముకుందరావు ఆఫీసు క్వార్తర్సే అతడికి అద్దె కివ్వడాని కిష్టం లేక సుబ్బరాజు అప్పట్లో తన మాట కాదన్నాడని కూడా అర్ధమయ్యేక వెంకన్న ను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే?
ఇలా ఎంతకాలం! దీనికి అంతం లేదా?
వెంకన్న తిన్నగా సుబ్బరాజు దగ్గరకు వెళ్ళి తను కనుక్కున్న విషయమంతా చెప్పాడు.
"బాబూ మీక్కూడా ఏమైనా ఇచ్చుకోమంటే యిచ్చుకుంటాను" అన్నాడు సుబ్బరాజు.
"నేను డబ్బు కోసం రాలేదు. ఇలా ఎన్నాళ్ళు ఆ క్వార్టర్స్ నీ చేతిలో వుంచుకుంటావో తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు వెంకన్న తీవ్రంగా.
'అబ్బే ఎన్నాళ్ళో కాదు. సరిగ్గా యీ వేళ్ళకి ఎనిమిది నెల్లు" అన్నాడు సుబ్బరాజు.
'అప్పటికి నీ ధనదాహం తీర్తుందా?"అన్నాడు వెంకన్న.
"బాబూ ఇలాంటి విషయాల్లో పెద్దపెద్దోల్లె చూసి చూడనట్లూ ఊరుకున్తున్నారు. మీరూ అలాగే వుండాలి. నా పేరు చెప్పుకుని యాభై అరవై మంది చవగ్గా అద్దె ఇళ్ళు సంపాదించుకుంటున్నారు. ఉన్నపళంగా వాళ్లనేక్కడికి పోమ్మనేది? వారం రోజుల క్రితం నాకు కొత్త కాంట్రాక్టు వచ్చింది. ఇంకో పది బ్లాకులు కట్టాలి. ఎనిమిది నెలల్లో ఆ పని పూర్తవుతుంది. ఇప్పుడున్న వాళ్ళని అందులోకి మార్చేసి వీటిని గవర్నమెంటు కప్పగించేస్తాను. మీరు ప్రయివేటు డిటెక్టివ్. గవర్నమెంటాఫీసర్లే పట్టనట్లూరుకుంటున్నారు. ఇంత యీ వ్యవహారంలో నీకెందుకు బాబూ జోక్యం!' అంటూ సుబ్బరాజు అతడికి ఓ వందరూపాయల నోట్ల కట్ల చూపించాడు.
వెంకన్న నోట్లకట్ట అందుకుని "నీ కద ప్రజలకే చెబుతాను. శిక్షిస్తే వాళ్ళే నిన్ను శిక్షిస్తారు"అన్నాడు.
వెంకన్న సుబ్బరాజు కధను తయారు చేసి భార్య కిచ్చి 'అపనకు పంపు" అన్నాడు.
పద్మావతీ దేవి చిరునవ్వు నవ్వి" మీ కధలు ప్రజలు చదువుతారు. తర్వాత సుబ్బరాజుకు మరిన్ని కాంట్రాక్టులు వస్తాయి. మీరు మరిన్ని కధలు వ్రాస్తారు. కధలు చదివి తెలివి పెంచుకునే తత్త్వం మన ప్రజలకు లేదు. మీరు రాసిన అన్ని కధల్లాగే యిది కూడా వారి కాలక్షేపానికి పనికొస్తుంది" అంది.
***