జగదీష్ రహస్యం గురించి పాండురంగ విఠల్ మనుషులేప్పుడో కలుసుకున్నారు. వాళ్ళా నమూనా కాగితాల కోసం అతడికి పది లక్షల దాకా ఇస్తామన్నారు అతడు చలించలేదు.
ప్రతి మనిషికీ ఏదో కీలకముంటుంది. పాండురంగ విఠల్ మనుషులతడి కీలకం పరిశోధించారు. అతడి కీలకం అతడి కుటుంబం లో వుంది. పిల్లలతోనూ, భార్య కోసం అతడు ప్రాణాలైనా యిస్తాడు. పది లక్షలు సాధించలేని ఘనకార్యం ఈ విధంగా సాధించాలనుకున్నాడు పాండురంగ విఠల్.
"ఈ విషయం తెలుసుకుందుకు నాకు నెల రోజులు పట్టింది--" అన్నాడు విఠల్.
"నీకు తెలిసినదంతా నిజమే ననుకుంటున్నావా?" అన్నాడు జగదీష్.
"ఈ ప్రశ్న అడిగే ముందు నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించుకో...." అన్నాడు విఠల్.
జగదీష్ సోఫాలో వెనక్కు జారగిల బడ్డాడు. కాసేపాగి -- "నా పిల్లల్నేం చేసినా నేను భరించలేను. అయితే నావంటి సామాన్యుడైన ఉద్యోగిని మీరెవరో కానీ యిలా బాధించడం అన్యాయం..."అన్నాడు.
"అయితే నీ గురించి నాకింకా ఏం తెలుసో చెప్పాలి" అన్నాడు విఠల్.
కొత్తగా గూడచారి సంస్థ ఏదైనా సమాచారం సేకరించినపుడా సమాచారాన్ని కూలంకషంగా చర్చించడం కోసం కొత్త ఆఫీసు వెలుస్తుంది. ఆవిధంగా ఈ ఊళ్ళో ఆర్నెల్ల క్రితం వెలసింది ప్రజా సంక్షేమ సంస్థ. చుట్టుపక్క లుండే సామాన్య పౌరులకు ప్రభుత్వమందించే సదుపాయాలే విధంగా అందుతున్నవి తెలుసుకోవడం ఆ సంస్థ పరమోద్దెశ్యమని పదిమందీ భావిస్తారు.
జడ్ - 17 టెక్నాలజీ గురించి కూలంకషంగా అవగాహన చేసుకునేందుకా సంస్థ వెలసిందని విఠల్ కు తెలుసు. అందులో పనిచేస్తున్న వారందరూ ఆరితేరిన సాంకేతిక నిపుణులని అతడికి తెలుసు. ఆ సంస్థకు చీఫ్ జగదీష్ . జడ్-17 నమూనా కాగితాలు సర్వకాల సర్వావస్థలయందూ అతడి సంరక్షణలో వుంటాయనీ అతడికి తెలుసు.
"పోనీ నువ్వు చెప్పింది నిజమనుకుందాం. ఆ జడ్ -17 నమూనా కాగితాలు తీసుకొని ఏం చేస్తావు?" అన్నాడు జగదీష్.
"యఫ్-16 లో మార్పులు చేస్తాం...."
"చేస్తాం అంటున్నావు .....ఆ పనీ నీ ద్వారానే అవుతుందా?"
"అది నీ కానవసరం....."
"అయాం సారీ -- ఈ విషయంలో నీకేమీ సాయం చేయలేను...." అన్నాడు జగదీష్.
"పాపం--- నీ పిల్లలు ...." అన్నాడు విఠల్ జ్యోత్స్న వంక తిరిగి.
జోత్స్న కంగారుగా -- "ఏమండీ -- ఇప్పుడెం చేయాలి?" అంది.
"మిస్టర్ విఠల్...." అన్నాడు జగదీష్ తీవ్రంగా -- "నేను చాలా మొండి వాడ్ని--"
"నేను కూడా -- " అన్నాడు విఠల్. అతడి గొంతు కటువుగా ధ్వనించింది.
"మీ మొండితనం ఇప్పుడు చూపకండి--" అంది జ్యోత్స్న కంగారుగా.
"జ్యోత్స్న -- నీ కేమీ తెలియదు. నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో...." అన్నాడు జగదీష్-- "మిస్టర్ విఠల్ ! నువ్వు గుండెలు తీసిన బంటువని నాకిప్పుడర్ధమైంది. నిన్ను నేనంత సులువుగా నమ్మను, నా పిల్లలు నీ దగ్గరున్నారు. నువ్విడిగినవి నీ కొస్తే వాళ్ళు క్షేమంగా తిరిగోస్తారన్న నమ్మక మేమిటి!"
"నమ్మాలి--తప్పదు...."
"నేను నమ్మను...."
"నమ్మకపోతే నీ పిల్లలు నీకు దక్కరు...."
"వాళ్ళు నాకు దక్కకపోతే నీకు నమూనాలూ దక్కవు..."
విఠల్ ఆశ్చర్యంగా జగదీష్ వంక చూశాడు. అతడిలో దృడనిశ్చయం కనబడుతోంది --"నువ్వు నిజంగానే మొండి వాడివి...." అన్నాడు.
"నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. దేశానికే నమ్మక ద్రోహం చేస్తున్నావు. నన్ను మోసం చేయవని నమ్మక మేమిటి?" అని- "నా పిల్లలు వంటి మీద ఈగ వాలిందో -- నువ్వు నా నుంచి యేమీ పొందలేవు" అన్నాడు జగదీష్.
విఠల్ సాలోచనగా -- "నువ్వు నన్నెలా నమ్ముతావు?' అన్నాడు.
"నా పిల్లల్ని నాకప్ప గించు ...." అన్నాడు జగదీష్.
"అల్ రైట్ -- అలాగే చేస్తాను...." అన్నాడు విఠల్ - "అయితే అందుకు నువ్వు విచారించక తప్పదు...."
"ఎందుకని?"
"మనమిద్దరం కలిసి బైటకు వెడతాం. నేను నీ పిల్లల్ని నీ కప్పగించే యేర్పాటు చేస్తాను. వాళ్ళను నీకు నచ్చిన చోట ఉండవచ్చు. కానీ ఆ తర్వాత వెనువెంటనే నాకు జడ్-17 నమూనా లివ్వాలి నువ్వు ...." అన్నాడు విఠల్.
"అలాగే ---తప్పకుండా యిస్తాను....." అన్నాడు జగదీష్.
"నువ్వు నన్ను నమ్మనట్లే నేనూ నిన్నంత సులభంగా నమ్మను. నేను నీతో నీ ఆఫీసుకు వచ్చి నమూనాల ఫోటోలు తీసుకుంటాను...."
"నేను సరైన నమూనాలు చూపిస్తానన్న నమ్మకమేమిటి?"
"చెప్పనా?' అన్నాడు విఠల్ - నీ ఆఫీసులో స్పెషల్ రూం ఒకటుంది. అందులో రెండు ;లాకర్లున్నాయి. లాకర్ నంబర్ వన్ లో మొత్తం ఇరవై ఆరు ఫైల్సున్నాయి. అందులో ఫైల్ నంబరు పదిహేడులో జడ్-17 నమూనాలున్నాయి. అవి నకిలీవి. అసలు నమూనాలు లాకర్ నంబర్ టూ లో ఇరవై రెండో నంబరు ఫైల్లో ఉన్నాయి...."
జగదీష్ ఆశ్చర్యంగా -- "అన్నీ తెలుసు నీకు...." అన్నాడు.
విఠల్గర్వంగా నవ్వి -- "ఆ విషయం యిప్పటికి గ్రహించావు --" అన్నాడు.
"అన్నీ తెలుసుకో గలిగావు . ఆ నమూనాలు మాత్రం యెందుకు సంపాదించలేవు?' అన్నాడు జగదీష్.
"ఎందుకు సంపాదించలేను? అందుకేగా యిప్పుడోచ్చింది!"
"అది కాదు . ఇన్ని తెలుసుకోడానికి సహకరించిన మీ మనుషులా నమూనాలు కూడా సంపదించలేక పోయారా?"
'అందరివల్లా అన్ని పనులూ కావు....' ముక్తసరిగా అన్నాడు విఠల్ -- "నిన్నభినందించక తప్పదు. నీ ఆఫీసు నుంచి ఆ నమూనాలు నువ్వు తప్ప ఇంకెవ్వరూ బయట పెట్టలేరు...."
'సరే -- పద.....బయటకు వెడదాం...." అన్నాడు జగదీష్.
"ఒక్క నిముషం....." అన్నాడు విఠల్. అతడు తన జేబులోంచి మినీ ట్రాన్స్ మీటర్ తీసి -- "సరితా బజార్లో ఆనంద్ హోటల్ ఎదురుగా సందులోకి వస్తాను. రణధీర్ నీ, రవి శంకర్ నీ అక్కడకు పంపించండి. అర్జంటు...." అన్నాడు. తర్వాత ట్రాన్సి మీటర్ జేబులోకి తోసేసి -- "మిస్టర్ జగదీష్ .....నువ్వలా బుద్దిగా కూర్చో....నిన్నిక్కడ రహస్యంగా మనుషులు కనిపెడుతున్నారు. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు...." అన్నాడు.
"మనం బయటకు వెడుతున్నాం కదా --" అన్నాడు జగదీష్.
"వెడుతున్నాం. కానీ నా యేర్పాట్లు నేను చేసుకోవాలి గదా . అందుకని కాసేపు బుద్దిగా కూర్చో...." అన్నాడు విఠల్. తర్వాత జ్యోత్స్న వైపు తిరిగి -- "నువ్వు నాతోరా --" అన్నాడు.
జ్యోత్స్న భర్త వైపు అసహయంగా చూసింది.
"వెళ్ళు. నేనుండగా నీకేమీ భయం లేదు" అన్నాడు జగదీష్ గంభీరంగా.
జ్యోత్స్న విఠల్ ననుసరించినది. ఇద్దరూ బెడ్రూం లోకి వెళ్ళడం చూసి జగదీష్ పళ్ళు పటపట లాడించాడు. కానీ సోపాలోంచి లేవలేదు.
పాండురంగ విఠల్ బెడ్రూం లోంచి బయటకు రావడానికి సుమారు అయిదు నిమిషాలు పట్టింది. బయటకు వచ్చి అతడు తలుపులు దగ్గరగా వేసి గడియ పెట్టి తాళం వేశాడు. తర్వాత జగదీష్ ని సమీపించాడు. అతడి చేతిలో ఒక ప్లాస్టిక్ బ్యాగుంది.
"నీ భార్య చాలా మంచిది. ప్రతిఘటించలేదు...." అన్నాడు విఠల్.
"ఏం చేశావామెను....?" అన్నాడు జగదీష్ ఆవేశంగా.
"నా జాగ్రత్తలో నేనున్నాను. తప్పితే నేనామె కన్యాయమేమీ చేయలేదు--" అంటూ అతడు ప్లాస్టిక్ బ్యాగును జగదీష్ కందించి -- "చూడు ---......" అన్నాడు.
జగదీష్ బ్యాగు లోని వస్తువులు బయటకు తీశాడు. అవన్నీ మొత్తం జ్యోత్స్న ధరించిన బట్టలు....
"యూ...." అన్నాడతడు ఆవేశంగా.
"నువ్వు అవేశపడవలసినంత ఘోరమింకా జరగలేదు. కానీ జరిగే అవకాశముంది. ఒక్క నిముషం నిదానంగా కూర్చో...." అంటూ విఠల్ సన్నగా ఈల వేశాడు. వెంటనే పక్క వాటాలోంచి ఓ మనిషి వచ్చాడు.
అతడు ఉక్కు పిడుగులాగున్నాడు.
"ముసలాడెం చేస్తున్నాడు?" అన్నాడు విఠల్.