Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 5

 

    "వెడతాను. కానీ మనం మళ్ళీ కలుసుకుందాం...."అన్నాడు సుబ్బరాజు.
    "మిస్టర్ సుబ్బరాజు! నన్ను మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలను కోవడం నీ ఆరోగ్యానికీ మంచిది కాదు. ఎటొచ్చీ నా స్నేహితుడి కేమయినా అన్యాయం తలపెట్టావంటే నీ అంతు చూస్తాను. నా దృష్టి గట్టిగా నీపై ప్రసరించడం నీకే మంచిది కాదు. కోడి గుడ్డుకు ఈకలు పీకగలను -- జాగ్రత్త !" అన్నాడు వెంకన్న.
    సుబ్బరాజు క్కోపం వచ్చింది. భయమూ వేసింది. కానీ కోపంలో చేయగలిగిందేమీ లేదు-- భయపడుతున్న ట్లు వెంకన్నకు తెలియజేయడమూ యిష్టం లేదు. అతను వెళ్ళిపోయాడు.
    సాయంత్రం కాస్త పొద్దు పోయాక నారాయణ వచ్చి వెంకన్న ను కలుసుకుని-- "వెంకన్న గారూ! మీ మేలు మరువలేను. పోయాయనుకున్న మూడొందలూ తిరిగి వచ్చాయి. ఇదిగో మీ ఫీజు రెండు వందలూ -- " అంటూ డబ్బు ఇచ్చాడు.
    వెంకన్న ఆ డబ్బు తీసుకుని -- "నీ మూడొందలు నీకు తిరిగోచ్చాయన్న విషయం నేను చెప్పకుండా నువ్వెలా తెలుసుకున్నావు? సుబ్బరాజు చెప్పాడా అనడిగాడు.
    "సుబ్బరాజు చెప్పాడమేమిటి? అయన బావమరిది నాకు యిందాకనే డబ్బు తెచ్చి యిచ్చేశాడు...." అన్నాడు నారాయణ.
    "మరి ఆ డబ్బు అడ్వాన్సివ్వాలి గదా -- సుబ్బరాజు కివ్వలేదా?" అనడిగాడు వెంకన్న.
    "సుబ్బరాజుకు అడ్వాన్సీవ్వక్కర్లేదట. ఆ విషయం అతడి బావగారే చెప్పాడు--" అన్నాడు నారాయణ.
    "సరేలే - రెండు నెల్లదాకా నువ్వు సుబ్బరాజుకు అద్దె కూడా యివ్వక్కర్లేదు. అది కూడా ఆయనకు ముట్టింది. డిటెక్టివ్ వెంకన్న చెప్పాడని చెబితే ఆయనకు అర్ధమవుతుంది-- " అన్నాడు వెంకన్న.
    "నాకేమీ అర్ధం కావడం లేదు. మీరా సుబ్బరాజు కేం మాత్రం వేశారో నాకు అర్ధం కావడం లేదు --"అన్నాడు నారాయణ.
    "మంత్రాలు నేర్చుకోవాలంటే యిప్పుడు కాదు. అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకు శుచివై సుస్నాతుడివై రావాలి. ప్రస్తుతానికి నీ సమస్య తీరింది.... వెళ్ళు...."అన్నాడు వెంకన్న.
    నారాయణ వెళ్ళిపోయాడు. అప్పుడు వెంకన్న తన అసిస్టెంట్ సీతమ్మ, రాజమ్మల వంక తిరిగి -- "ఈ కేసు మీకు విచిత్రంగా లేదూ?" అన్నాడు.
    "టైము సాయంత్రం ఎడవుతున్నా యీ రోజూ మేమింకా యిక్కడే వుండడం విచిత్రం కాదూ?" అంది సీతమ్మ.
    "విచిత్రమేముంది? యీ రోజు నా పెళ్ళి రోజు. మీకూ మా యింట్లో నే భోజనం -- " అన్నాడు వెంకన్న.
    "ఆహా - పద్మావతీ దేవిగారి వంట ....ఎంత అదృష్టం ?' అంది రాజమ్మ.
    "నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు మీరు ---ఈ కేసు విచిత్రంగా లేదూ?"
    "ఏదీ ....నారాయణ కేసా?" అంది సీతమ్మ. తర్వాత అసిస్టెంట్ ఇద్దరూ కాసేపు మౌనంగా వుండిపోయారు. మరి కాస్సేపటికి -- "ఏ మాత్రమూ లేదు!" అన్నారు.
    "అందుకే మీరు అసిస్టెంట్ - నేను డిటెక్టివ్ ను..... సుబ్బారావు బావగారు నారాయణకు డబ్బు తిరిగిచ్చేశాడు. అది విచిత్రంగా లేదూ?"
    "అందులో విచిత్రమేమీ లేదు...."
    "తన బావగారి పై తనకేమీ అదుపు లేదని అన్నాడు సుబ్బరాజు. సుబ్బరాజుకు నా కారణంగా ఇబ్బంది రాగానే బావగారు నారాయణకు డబ్బిచ్చేశాడంటే - అయన పూర్తిగా సుబ్బరాజు అదుపులో వున్నాడని గ్రహించాలి. అంటే యిదంతా ఆ బావ మరుదులిద్దరు ఆడుతున్న కుతుంత్రమన్నమాట. సుబ్బరాజు  పెద్దమనిషి గానూ అయన బావమరిది తిరుగుబోతుగానూ సంసారహీనుడు గానూ వర్తిస్తాడు. అందువల్ల యిద్దరికీ ధనలాభం. అడలాగుంచండి. ఈ కేసు నేను చేపట్టే సుబ్బరాజును బెదరగొట్టాను. నేనిచ్చినమూడు వందలకూ రసీదిచ్చాడు సుబ్బరాజు. అవి దొంగనోట్ల ని తేలిపోయింది. కానీ రశీదలాగే వుంది కదా అలాంటప్పుడు బావగారు నారాయణని మోసం చేసి తీసుకున్న ఇబ్బంది డబ్బుంది కదా అని సరిపెట్టుకోవచ్చు. అలా సరి పెట్టుకోకుండా ఆ డబ్బు కూడా ఎందుకు తిరిగిచ్చేశాడు. అడివ్వమని నేనడగలేదు. అనవసరంగా ఆ డబ్బిచ్చి నష్టపోయాడు సుబ్బరాజు. అలా ఎందుకు చేశాడు?"
    సీతమ్మ, రాజమ్మ ముఖముఖాలు చూసుకున్నారు. సమాధానం వాళ్ళకు స్పురించినట్లు లేదు.
    వెంకన్న తిరిగి ప్రారంభించాడు-- "అంటే సుబ్బరాజు వెంటనే నా గురించి అరా తీశాడు. నేను ప్రమాదకరమైన వ్యక్తీ నని తెలిసి వుంటుంది. వెంటనే నా దృష్టి తనపై పడకుండా వుండాలని జాగ్రత్త పడ్డాడు. తన బావ గురించి కానీ తన గురించి కానీ నేనే విధమయిన అరాలూ తియ్యకూడదు. అలా తీయడం వల్ల అతడికి చాలా పెద్ద నష్టం వస్తుంది. అలా జరక్కుండా వుండడానికి సుబ్బరాజు తాత్కాలికంగా ఈ మూడు వందల నష్టం భరించాడు...."
    సీతమ్మ, రాజమ్మ -- యింకా ఆశ్చర్యపడుతూనే వున్నారు.
    "మూడొంతులు రేపు నాకు నారాయణ దగ్గర్నించి ఫోన్ కూడా రావచ్చు. సుబ్బరాజు భయపడుతున్నాడని -- యింక అతణ్ణి గురించి మరిచి పొమ్మనమనీ -- " అన్నాడు వెంకన్న.
    మర్నాడు నిజంగా అలాగే జరిగినపుడు సీతమ్మ, రాజమ్మ లకు కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు.
    "తప్పదు-- సుబ్బరాజు కధకమీషూ తెలుసుకోవాల్సిందే!' అన్నాడు వెంకన్న.
    
                                    4
    సుబ్బరాజు యింటికి సమీపంలో వెంకన్న అటూ యిటూ తిరుగుతున్నాడు. అతడి వేషం మారిపోయింది. చూడ్డానికి ఓ కూలీలా వున్నాడతను. అటూ యిటూ తిరుగుతుండగా ఓ పిల్ల అతడ్ని పలకరించింది.
    "జేబులో ఎంతుందేమిటి?' అదే ఆ పిల్ల పలకరింపు.
    "శానా వుంది --" అన్నాడు వెంకన్న.    
    "సరదా కూడా ఉందా?" అందా పిల్ల.
    "ఉంది --" అన్నాడు వెంకన్న.
    'ముందో రూపాయ చేతిలో పెట్టు- తర్వాత నా వెనకాలే రా--" అందా పిల్ల.
    వెంకన్న  ఆ పిల్లను పరీక్షించి చూశాడు. పిటపిట లాడుతూ మనిషి బాగుంది. కానీ చూడగానే తక్కువ రకం అని తెలిసి పోతోంది. అతను జేబులోంచి ఓ రూపాయ తీసి ఆమె చేతిలో పెట్టి వెనకాలే నడిచాడు. ఆ చుట్టూ పక్కల ఎక్కడా గుడిసెలు కనపడ్డం లేదు. ఆమె యెక్కడికి తీసుకు వేడుతుందా అన్నది అతని కుతూహలం.
    ఆమె తిన్నగా అతణ్ణి అక్కడున్న పది బ్లాకుల్లోనూ ఓ బ్లాకు దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమె అందులో ఓ ఇంట్లోకి నడవబోయి ఆగిపోయి వెంకన్న ను చూసి "పది రూపాయలవుద్ది. ఇష్టమేనా?" అంది.
    "ఇంకా ఎక్కువయినా యిష్టమే -- నీకంటే మంచోళ్ళు కావాలి -- " అన్నాడు వెంకన్న.
    "ఎందాకా ఇవ్వగలవెంటి?"
    "ఎంతైనా ఇస్తాడు?"
    "యాభై ఇవ్వగలవా?"
    "ఊ" అన్నాడు వెంకన్న.
    ఆ అమ్మాయి కళ్ళు రెపరెప లాడించి-- "నిజంగా అంత డబ్బుందా?" అంది.
    "చూపించనా?" అంటూ వెంకన్న ఆమెకు రెండు యాభై రూపాయల నోట్లు చూపించాడు.
    "అయితే యీ యిల్లు కాదు..." అంటూ పక్కింటికి దారి తీసింది ఆ అమ్మాయి.
    ఆ అమ్మాయి ననుసరించి వెంకన్న ఓ యింట్లోకి వెళ్ళాడు. అక్కడున్న పడచు చాలా బాగుంది. చెబితే తప్ప ఆమె వేశ్య అని తెలియదు. వెంకన్న ఆ గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. ఆమె వెనుక నుంచే అతణ్ణి కౌగలించుకున్నది.
    "వదులు....నేను అందుకోసం రాలేదు...." అన్నాడు వెంకన్న.
    "మరెందుకు ?" అందామె చిలిపిగా.
    "నీకు యాభై కాదు --వందిస్తాను. నా ప్రశ్నలకు జవాబు కావాలి ...." అన్నాడు వెంకన్న.
    అక్కడ వెంకన్న ఒక గంట మాత్రం ఉన్నాడు. ఆ గంటలోనూ అతడికి చాలా విశేషాలు తెలిశాయి.
    అక్కడున్న పది బ్లాకుల్లోనూ రెండు బ్లాకుల్లో వ్యభిచారం కొనసాగుతోంది. ఒక బ్లాకులో చౌకబారు మనుషులు. రెండో బ్లాకులో ఖరీదయిన మనుషులు .... వాళ్ళకు బేరాలు చాలా బాగుండడమే కాదు . రద్దీ కూడా చాలా యెక్కువ. ఎందుకంటె మిగతా ఎనిమిది బ్లాకుల్లో ఉన్నవారంతా బ్రహ్మచారులు. బ్రహ్మచారులకు మాత్రమే వాటిని అద్దె కివ్వడం జరుగుతుంది. వారి వారి స్తోమతను బట్టి వివిధ ధరలకు ఆడవాళ్ళు లభించడం కోసం యీ రెండు బ్లాకులు యేర్పాటయ్యాయి. ఇదంతా సుబ్బరాజు నడిపిస్తున్నాడు.
    వెంకన్న నిట్టూర్చాడు. వ్యభిచారం జరిపిస్తున్నాడు. సుబ్బరాజు ను తప్పు పట్టడం అనవసరం. ఎందరో గొప్ప గొప్పవాళ్ళే వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. సుబ్బరాజనగా ఎంత?
    ఈ మాత్రానికే సుబ్బరాజు తనకు భయపడుతున్నాడా? నమ్మడం కష్టం....
    వెంకన్న సంతృప్తి కరమయిన సమాధానం లభించకుండానే అక్కణ్ణించి బయటపడ్డాడు.
    
                                     5
    "నమస్కారం -- నన్ను వియ్యన్నగారు పంపించారండి --" అన్నాడతను వినయంగా.
    'అలా కూర్చో -- " అన్నాడు వెంకన్న. వియ్యన్న అతనికి బాగా తెలుసు. ఈ అబ్బాయి వియ్యన్నగారి స్వేహితుడి కొడుకు. కొత్తగా యీ ఊళ్ళో ఉద్యోగానికి వచ్చాడు. అందాకా అతడికి వెంకన్న ఏదయినా ఆశ్రయం ఏర్పాటు చెయ్యాలి?
    వెంకన్న ఆ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు.
    అతడి పేరు ముకుందరావు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. ప్రస్తుతాని కిల్లు చూసుకుంటే త్వరలోనే క్వార్టర్స్ రెడీ అవుతాయి.
    వెంకన్న సుబ్బరాజు, చిరునామా యిచ్చి -- "నా పేరు చెప్పు. నీ పని జరుగుతుంది. అద్దె చౌక -- " అన్నాడు.

 Previous Page Next Page