Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 4

 

                               ధన దాహం
                
                                                                      వసుంధర

    "నమస్కారం వెంకన్న గారూ!" అన్నాడా యువకుడు.
    "నమస్కారం కూర్చోండి " అని ఆ యువకుడి వంక పరీక్షగా చూశాడు డిటెక్టివ్ వెంకన్న. అతడి వయస్సు పాతిక్కి లోపే వుంటుంది. మనిషి చూడ్డానికి కాస్త ఆధునికంగా ఉన్నాడు.
    "నా పేరు నారాయణ!"అన్నాడతను "నేను ఈ ఊరొచ్చి రేన్నెల్లయింది. ఇక్కడే నా మొదటి ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు...."
    వెంకన్న అతన్ని సగం లో ఆపి "కులం, గోత్రం కూడా చెప్పావంటే నీకేదైనా పెళ్ళి సంబంధం చూస్తాను అన్నాడు.
    అతను తడబడి "నా పరిస్థితి తెల్సుకుంటే మీరిలా వేళాకోళం చెయ్యరు. రేన్నేల్లుగా ముక్కూ, మొహం తెలియని వారింట వుంటూ ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. రెండ్రోజుల క్రితం నాకు ఇల్లు దొరికింది. అతడికి బయనాగా రెండు నెలల అద్దె మూడు వందలు కూడా యిచ్చాను. ఈరోజున ఆ ఇంట్లో ప్రవేశించాల్సి వుంది. కానీ బయానా పుచ్చుకున్న పెద్దమనిషి ఆ యింటి యజమాని కాదుట. ఇంటి యజమాని కి బావగారట. డబ్బు విషయం ఆ యిద్దరికీ ఏ సంబంధం లేదుట. అంచేత నేను మళ్ళీ అడ్వాన్స్ ఇస్తేనే తప్ప ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చేతనైతే నేనిచ్చిన మూడు వందలూ తన బావ దగ్గర్నుంచి ఎలాగో వసూలు చేసుకోమన్నాడు. అడ్వాన్సివ్వందే మాత్రం ఇంట్లో అడుగు పెట్టనివ్వట్ట" అన్నాడు.
    వెంకన్న జాలిగా చూసి "ఇందులో నేను చేయగలదేముంది? నువ్వు కాస్త తొందరపడి డబ్బిచ్చేశావు. అలా చేయకుండా వుండాల్సింది" అన్నాడు.
    "ఆఫీసులో నా కొలీగ్స్ చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఆదరణ లో ఇన్నాళ్ళూ యెలాగో నెట్టుకొచ్చేసాను. నామూలంగా వాళ్ళ కెంత యిబ్బంది కలుగుతుందో నాకు తెలుసు. అందుకేప్రతిరోజు ఇంటి కోసం వెతుకుతుంటే బ్రహ్మచారుల కెవ్వరో ఇల్లివ్వనంటున్నారు. దొరక్క దొరక్క దొరికిన యీ బంగారు అవకాశాన్ని వృధా చేసుకోదల్చుకోలేదు నేను. ఇప్పుడిలా మోసం జరిగింది" అన్నాడు నారాయణ.
    "నీ దురదృష్టం " అన్నాడు వెంకన్న.
    "మీలాంటి ప్రఖ్యాత డిటెక్టివ్ ల కిలాంటి విషయం తెలిస్తే వెంటనే తగిన చర్య తీసుకుంటారని ఆశించాను. కానీ మీరు నిర్లిప్తతవహించారు " అన్నాడు నారాయణ జాలిగా.
    "ఏమన్నావ్ప్రఖ్యాత డిటెక్టివుననా? నేను నిజంగా ప్రఖ్యాత డిటెక్టివ్ నని నీ అభిప్రాయమా?"    
    'అందుకే కదండీ మీదగ్గరకు వచ్చాను. ఇలా వాళ్ళు యెంత మందికి అన్యాయం చేస్తున్నారో ఏమో! మీబోటి వారు కలగజేసుకుని వాళ్ళకు కొంత బెదురు కలిగించక పొతే వాళ్ళ ఆగడాలకు అడ్డుండదు."అన్నాడు నారాయణ.
    "నేను ప్రజాసేవ కోసం ఇక్కడ కూర్చోలేదు. కేసు పడితే ఫీజు కావాలి" అన్నాడు వెంకన్న.
    "నేనుద్యోగం లో చేరి రెండు నెలలయింది. నిలవేసిన అయిదొందల్లోనూ మూడొందలు అన్యాయమై పోయాయి. మిగిలిన ఆ రెండొందలు మీకు ఫీజుగా ఇచ్చుకుంటాను" అన్నాడు నారాయణ.
    "సరే నువ్వెళ్ళు, నిన్ను మోసంచేసిన వాడి అడ్రసు నాకు ఇచ్చి వెళ్ళు"అన్నాడు వెంకన్న.

                                    2
    "ఇక్కడ ఏదో గది అద్దెకు దొరుకుతుందన్నారు?" అన్నాడు వెంకన్న.
    "అద్దె నెలకు నూటయాభై . రెండునెలల అడ్వాన్సు ముందివ్వాలి" అన్నాడు ఆ వ్యక్తీ.
    "గృహ యజమాని మీరేనా?' అడిగాడు వెంకన్న.
    "ఏం అలా అడుగుతున్నారు?' అన్నాడా వ్యక్తీ.
    "ఇల్లు నా కోసం కాదు. నా స్నేహితుడి కోసం. ఇక్కడ ఓ యింట్లో అతను మూడ్రోజుల క్రితం మూడొందలు అడ్వాన్సిచ్చి వెళ్ళిపోయాట్ట. తీరా నిన్న ఇంట్లో ప్రవేశించాలను కుంటే డబ్బు తీసుకున్నది ఇంటి యజమాని బావగారని తెలిసింది"అంటూ వెంకన్న నారాయణ గురించి చెప్పాడు.
    ఆ వ్యక్తీ నవ్వి "నా పేరు సుబ్బరాజు. నేను యీ యింటి యజమానిని. నా దురదృష్టం కొద్ది యిక్కడ నాకో బావగారు న్నారు . ఆయనకన్నీ దురలవాట్లు. కనబడ్డ ప్రతి వాడి దగ్గరా అప్పు చేస్తాడు. ఇవ్వని వాడిది పాపం. మొదట్లో కొంతకాలం ఎలాగో సహించాను. తర్వాత నుంచి ఆయనతో తెగతెంపులు చేసుకున్నాను. ఎవరైనా ఆయనకు డబ్బిస్తే నాకేం సంబంధం లేదని చెప్పాను. తెలిసిన వారెవ్వారూ ఆయనకి డబ్బివ్వరు. ఎంత తెగతెంపులు చేసుకున్నా స్వయాన బావ కదా అందుచేత ఇంటికి వస్తూ పోతూంటాడు. అయన ధోరణి కనిపెట్టి కొందరు నా దగ్గరకు వచ్చి నీ బావగారికి ఇంతిచ్చాం. అంతిచ్చాం అంటూంటారు. అవి నమ్మాలో , నమ్మకూదదో తెలియదు. అంత్య నిష్టూరం మెందుకని ఆదిలోనే ఆయన్ను పూర్తిగా డబ్బు విషయంలో వదిలిపెట్టేశాను. మీ స్నేహితుడు మోసగాదో మోసపోయాడో నాకు తెలియదు. కానీ అసలు కధ ఇది" అన్నాడు.
    'సరే ముందు యిల్లు చూపించండి" అన్నాడు వెంకన్న.
    సుబ్బరాజు వెంకన్న ను పక్క సందులోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ అన్నీ ఒక్కలాగే వున్నవి. మొత్తం పది బ్లాకులున్నాయి. ఒకో బ్లాకులో నాలుగేసి క్వార్టర్స్ న్నాయి. ఒకో క్వార్టరు ని రెండు భాగాలు చేసి అద్దె కిస్తున్నాడు సుబ్బరాజు. ఊళ్ళో లెక్క ప్రకారం చూస్తేఅద్దె తక్కువేనని అనుకున్నాడు వెంకన్న. అతడికి గది నచ్చింది.
    "నేను కూడా తాళం కప్ప తెచ్చుకున్నాను. ఇప్పుడే మీకు అడ్వాన్సిచ్చి యింటికి తాళం వేసుకుని వెళ్ళిపోతాను. అడ్వాన్సు ముట్టినట్లుగా మీరు నాకు రసీదు యివ్వండి. మీ యింట్లో వున్నా యిబ్బందుల కారణంగా యీ జాగ్రత్త తప్పదు " అన్నాడు వెంకన్న.
    "దానికేం భాగ్యం అలాగేచేయ్యండి" అన్నాడు సుబ్బరాజు.
    వెంకన్న సుబ్బరాజుకు మూడు వందరూపాయల నోట్లు యిచ్చాడు. సుబ్బరాజు రసీదు ఇచ్చాడు. వెంకన్న ఆ యింటికి తను తెచ్చిన తాళం వేశాడు.

                                   3
    "హలో డిటెక్టివ్ వెంకన్న స్పీకింగ్" అన్నాడు వెంకన్న.
    "నేను ఇన్ స్పెక్టర్ వీర్రాజు ని మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు స్టేషను కు వస్తారా?' అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఇప్పుడే వస్తున్నాను" అన్నాడు వెంకన్న. మరుక్షణం లోనే అతను పోలీస్ స్టేషన్లో వున్నాడు. అక్కడ అతనికి వీర్రాజుతో పాటు సుబ్బరాజు కూడా కనబడ్డాడు.
    "ఇన్ స్పెక్టర్ గారూ -- యితనే నండీ నాకీ నోట్లు ఇచ్చింది...."అన్నాడు సుబ్బరాజు వెంటనే.
    "ఏం జరిగింది?' అన్నాడు వెంకన్న.
    "మీరితనికి మూడు వంద రూపాయల నోట్లు యిచ్చారా?"
    "ఇచ్చాను...." అన్నాడు వెంకన్న.
    "ఇవేనా అవి....."అంటూ ఇన్ స్పెక్టర్ వాటిని వెంకన్న కు చూపించాడు.
    "ఎలా చెప్పగలను? నోట్ల నెంబర్లు నేను గుర్తు పెట్టుకోలేదు. ఇంతకీ ఏం జరిగింది?" అన్నాడు వెంకన్న.
    "ఇవి దొంగ నోట్లు. ఈ దొంగనోట్లు ఆచూకీ తెలుసుకోవాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇతను వీటిని మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్ళాడు. క్యాషియర్ వీటిని గుర్తించి పోలీసులకు ఫోన్ చేశాడు అన్నాడు వీర్రాజు.
    "ఇవి దొంగనోట్లే అయితే నావి కావు ......" అన్నాడు వెంకన్న.
    "అబద్దం .....అవి నీవే... నన్ను మోసం చేసి దొంగనోట్లు నాకు అంటగట్టావు...." అంటూ అరిచాడు సుబ్బరాజు. ఇన్ స్పెక్టర్ వీర్రాజు అతణ్ణి వారించి ---"అతనేవరనుకుంటున్నావ్? మోసగాళ్ళకు సింహస్వప్నం గా ఉండే డిటెక్టివ్ వెంకన్న----......' అన్నాడు.
    సుబ్బరాజు లిక్కిపడి ---"ఇతను డిటెక్టివా?" అన్నాడు అతను మరింకేమీ మాట్లాడలేదు.
    వెంకన్న సుబ్బరాజు వంక జాలిగా చూసి -- "వీర్రాజు గారూ! ఇతన్ని చూస్తుంటే నాకు మోసగాడనిపించటం లేదు. ఆ మూడు నోట్లనీ మీ దగ్గర వదిలి వెళ్ళమనండి. ఎవడో టోకరా యిచ్చి ఈయనకు అంటగట్టి వుంటాడు. నేనీయనకు హామీ ఉంటాను. వదిలి పెట్టేయండి--"అన్నాడు.
    వెంకన్న మాట మీద ఇన్ స్పెక్టర్ వీర్రాజు సుబ్బరాజును అప్పటికి వదిలి పెట్టాడు.
    "నా కార్లో డ్రాప్ చేసేదా?" అన్నాడు వెంకన్న.
    "చేసింది చాలు...."అన్నాడు సుబ్బరాజు వుక్రోషంగా.
    "చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ...."అన్నాడువెంకన్న.
    "డిటెక్టివ్ నని చెప్పుకుంటూ దొంగ నోట్లు చలామణీ చేస్తున్నావా?' అన్నాడు సుబ్బరాజు.
    "ఈ దొంగనోట్ల కేను నేనే పట్టుకున్నాను. నేరస్తుణ్ణి పోలీసులకు అప్పగించాను. నీలాంటి వాళ్ళకు బుద్ది చెప్పడానికి పనికొస్తాయని కొన్ని దొంగనోట్లుంచుకున్నాను. వాటి నంబర్లూ, అన్ని బ్యాంకుల వారికి కంఠతా వచ్చును. ఆ నోట్లు నా దగ్గరున్నాయని ఇన్ స్పెక్టర్ వీర్రాజు కీ తెలుసు. నువ్వు నారాయణకు అన్యాయం చేశావు. అందుకు ప్రతీకారం చేశాను-- తెలిసిందా , ఇంక వెళ్ళు!" అన్నాడు వెంకన్న.

 Previous Page Next Page