ముత్యాల్రావు తెల్లబోతూ-"ఆమెను నేను హత్య చేశానంటారా? ఎందుకు చేస్తానూ?" అన్నాడు అమాయకంగా.
"వేదవతితో స్నేహం చేసినవారంతా ఆమెను చంపాలనుకునే క్షణం యెప్పుడో ఒకసారి వస్తుంది-" అన్నాడు మోహన్.
సంభాషణ ఈ విధంగా దారిమళ్ళడం ముత్యాల్రావుకి నచ్చలేదు. మోహన్ ని ట్రాప్ చేయబోయి తనే ట్రాప్ లో పడుతున్నాడా అని అనుమానం కూడా వచ్చిందతడికి.
"ఈ ఉత్తరం చూశాక నాకు అనుమానంగా వుంది. ఇంక వేదవతి రాదు, ఆమె ఈలోకంలో లేదు...." మోహన్ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.
అనుకోకుండా తను మోహన్ కి సాయపడ్డానని ముత్యాల్రావు గ్రహించాడు. అందుకని తను యే పని మీద వచ్చాడో అది వెంటనే మొదలుపెట్టా లనుకున్నాడు.
"వేదవతికి మీతోనూ నాతోనూ తప్ప వేరెవ్వరితోనూ ప్రస్తుతం స్నేహం లేదు. ఆమె హత్య చేయబడిఉంటే మనిద్దరిలోనూ ఒకడు హంతకుడయుండాలి. నాకు వచ్చిన ఉత్తరాన్ని బట్టి ఓ మనిషి వద్ధ నన్ను హంతకుడిగా ఋజువుచేసే ఆధారాలేమో ఉన్నాయి. ఆ మనిషి ఎవరు? అతడీ అధారాలెలా సంపాదించాడు? అతడే హంతకుడా? ఆధారాలు తనే సృష్టించాడా?.....ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఆ హంతకుడికి మనమో అవకాశమివ్వాలి. అందుకోసం నేనో పథకం వేశాను. అందులో మీ సాయం కావాలి-" అన్నాడు ముత్యాల్రావు.
"చెప్పండి-" అన్నాడు మోహన్.
"నే నో చిన్న ప్లాస్టిక్ పెట్టె తెస్తున్నాను. దాన్ని ఆ క్రోటన్సు క్రింద పాతిపెడదాం. ఆ పెట్టెలో డబ్బుండదు. కానీ వుందనుకుని హంతకుడు దానికోసం ప్రయత్నిస్తాడు. అతడిమీద నిఘా వేయాలి. లేదా యే డిటెక్టివుకైనా ఈ పని అప్పగించాలి...." అన్నాడు ముత్యాల్రావు.
"ఇందులో డిటెక్టివుల ప్రసక్తి యెందుకు? సాహసిక చర్యలంటే నా కెంతో ఇష్టం. ఆ పని నేనే చేయగలను..." అన్నాడు మోహన్.
"సరే-అయితే మనమిద్దరం కలిసి వెడదాం-" అన్నాడు ముత్యాల్రావు.
"అసలు మనం ఆ క్రోటన్సు క్రింద పనిగట్టుకుని వెళ్ళి పాతిపెట్టడమెందుకు? హంతకుడనేవాడుంటే మనం పాతిపెట్టామని ఊహించుకుని వెళ్ళడా?"
"ఏమో-ఏం చెప్పగలం? వాడు మనని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ వుండివుండవచ్చు, మనం ఆ క్రోటన్సు క్రింద యేదో పాతామని తెలిసినాకనే అక్కడికి వెళ్ళి చూసుకొనవచ్చు..." అన్నాడు ముత్యాల్రావు.
"మీరు మనం మనం అంటున్నారు. ఈ కేసులో ఇంతవరకూ నాకే సంబంధమూ లేదు-" అన్నాడు మోహన్ ఇబ్బందిగా.
"అయాం సారీ-కానీ వేదవతి హత్యా నేరం విషయం మనిద్దరం కలిసి సమిష్టిగా పరిశోధించాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి-వేదవతి ఉంటున్నది అద్దె యిల్లు. వాళ్ళింటికి వెళ్ళి క్రోటన్సు మొక్క క్రింద యీ ప్లాస్టిక్ పెట్టెను పాతే ఉపాయ మేమిటి? సాహసిక చర్యలంటే మీకు యిష్టమని అంటున్నారు. ఇందుకేదయినా పథకం చెప్పండి!" అన్నాడు ముత్యాల్రావు.
మోహన్ కొద్దిక్షణాలు ఆలోచించి-"ఇది చాలా సులభం. ఈ రోజు శనివారం. స్కూల్సుకి సెలవు. ఆ యింట్లో ప్రసాద్ ఒక్కడే వుంటాడు. మగవాళ్ళు ఉద్యోగాలకీ-ఆడవాళ్ళు సంగీతానికో, కుట్టుపనులు నేర్చుకుందుకో బయటకు పోతారు. ప్రసాద్ ని టాకిల్ చేయడం పెద్ద కష్టంకాదు. రండి-వెడదాం...." అన్నాడు.
ఇద్దరూ వెళ్లారు. మోహన్ చెప్పినట్లే యింట్లో ప్రసాద్ ఒక్కడే వున్నాడు.
మోహన్ కా యింటి గురించి అన్ని ఆరా లెలా తెలుసు? అతడు శనివారాలు వెళ్ళి వేదవతిని కలుసుకుంటూండేవాడా? ప్రసాద్ ని యే విధంగా టాకిల్ చేసేవాడు?....ముత్యాల్రావు మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తాయి.
"వేదవతి ఊర్నించి రావడానికింకా రెండు రోజులు పట్టవచ్చు. తను వేసిన ఎర్ర ఆకుల క్రోటన్సు మొక్కకు ఎరుపు వేయమని ఆమె చెప్పివెళ్ళింది. అలా చేయకపోతే ఆమెకు కోపం వస్తుంది. ఈ రోజే వున్నట్లుండీ నా కీ విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగున వచ్చాను. దారిలో ఈయన కనిపించారు....." అన్నాడు మోహన్.
ఆ ఎర్ర ఆకుల క్రోటన్సు మొక్కను వేదవతి వేసుకుంది. దాన్ని ప్రాణంగా చూసుకుంటోంది. ఆ విషయం తనకు చెప్పింది. మోహన్ కు కూడా చెప్పిందా? వేదవతి తనతో ఉన్నంత చనువుగానూ మోహన్ తో కూడా ఉంటుందా?.....ముత్యాల్రావు ఆలోచిస్తున్నాడు.
అంతా దొడ్లోకి వెళ్లారు. వారు కోరిన ప్రకారం ప్రసాద్ గునపం తీసుకునివచ్చాడు. ముత్యాల్రావు గునపం అందుకున్నాడు.
మోహన్ ప్రసాద్ ని పక్కకు తీసుకుని వెళ్ళి కబుర్లలో పెట్టాడు.
ముత్యాల్రావు గునపం తీసుకుని జాగ్రత్తగా మొక్కచుట్టూ తవ్వసాగాడు, అతడి బుర్రలో యెన్నో ఆలోచనలు....
తను పోస్టుచేసి ఉత్తరం నిన్ననే మోహన్ కి అందిందన్న విషయం ధృవపర్చుకున్నాడు. ఆ ఉత్తరం చదివేక మోహన్ భయపడి వుంటాడు. అప్పుడేం చేస్తాడు? ఉత్తరంలో చెప్పిన ప్రకారం డబ్బిక్కడ పాతిపెట్టాడా? అతడి వ్యవహారం చూస్తూంటే ఏమీ తడబడుతున్నట్టు లేదు సరిగదా అసలా ఉత్తరం తనకు అందనట్లే వ్యవహరిస్తున్నాడు.
మొక్క చుట్టూ తవ్వడం పూర్తయింది. ముత్యాల్రావు నెమ్మదిగా మొక్కను పైకి తీశాడు. దాని అడుగున ఓ చిన్న ప్లాస్టిక్ పెట్టె వున్నది. అతడు ఆత్రుతగా ఆ పెట్టె తెరిచి చూశాడు. అందులో ఒక వందరూపాయల నోట్లకట్ట వున్నది. అంటే సరిగ్గా పదివేలు.
ముత్యాల్రా వోసారి వెనక్కు చూశాడు. కాస్త దూరంగా మోహన్, ప్రసాద్ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఆ లోకంలో వున్నట్లు లేరు.
ముత్యాల్రావు నోట్లకట్టను తన జేబులోకి తోసేశాడు. తను కూడా తెచ్చిన ప్లాస్టిక్ పెట్టెను కూడా అక్కడే పాతిపెట్టి పైన యధాప్రకారం మొక్కను పాతిపెట్టాడు. తర్వాత అతడు వాళ్ళిద్దరి వద్దకూ వెళ్ళి-"హమ్మయ్య- వచ్చిన పనయింది-" అన్నాడు.
ప్రసాద్ దారి చూపించగా అతడు బాత్రూముకు వెళ్ళి కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు.
ముత్యాల్రావు, మోహన్ కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చేరు.
"ఇంక నన్ను రోజూ కాపలా వుండమంటారా?" అన్నాడు మోహన్.
"రోజూ యెందుకు? యీ రాత్రికి ఉంటే చాలు.... ...."
"ఏమో-వాడీ వేళే వస్తాడని గ్యారంటీ ఏమిటి? మనం కాచుకుని ఉంటామన్న అనుమానంతో వాడు కొన్నాళ్ళు వేచివుండవచ్చును...." అన్నాడు మోహన్.
"ఏమో-నాకు మాత్రం హంతకుడి ఆచూకీ దొరికినట్లే అనిపిస్తున్నది-" అన్నాడు ముత్యాల్రావు.
5
"అబ్బా - యెవరూ?" అంటూ విసుగ్గా లేచింది ముత్యాల్రావు తల్లి. ఆమె మంచి నిద్రలో వుండగా ఎవరో తలుపు తట్టారు.
ఆమె తలుపు తీసి ఎదుటి వ్యక్తిని చూసి-"యెవరు నువ్వు?" అని అడిగింది.
అతడామెకు పూర్తిగా అపరిచితుడు.
"మీ అబ్బాయి స్నేహితుణ్ణి, అతడితో అర్జంటుగా మాట్లాడాలి. ఓసారి లేపండి-" అన్నాడతడు చాలా వినయంగా.
తల్లి వెళ్ళి కొడుకును లేపింది. ముత్యాల్రావు విసుక్కుంటూ లేచాడు.
"ఎవరో నీ స్నేహితుడినంటూ వచ్చాడు.." చెప్పింది తల్లి.
ముత్యాల్రావు మత్తు వదిలింది. వెళ్ళి ఆ స్నేహితుణ్ణి చూశాడు. అతడెవరో తెలియక-"ఎవర్నువ్వు?" అనడిగాడు.
"వేదవతి హత్య గురించి మాట్లాడ్డానికి వచ్చాను. ఏదైనా గదిలోకి పోయి మాట్లాడుకుందాం-" అన్నాడతడు తగ్గింపు స్వరంలో.
ముత్యాల్రావతన్ని తన పడక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. అతడి స్నేహితుడు వెనుకనుంచీ తలుపులు మూశాడు.
"తలుపు లెందుకు మూశావ్?" అన్నాడు ముత్యాల్రావు.
"బయట మీ అమ్మ ఉంది. బాగుండదని!" అన్నాడతడు.
"ఎందుకని?"
అతడు చొక్కా విప్పాడు. అతణ్ణి చూస్తూ దిమ్మెరపోయాడు ముత్యాల్రావు. సన్నగా కనబడుతున్నా కండలు తిరిగి ఉన్నాడతడు.
"ఇందుకు?" అన్నాడతడు కండలు పొంగిస్తూ.
"ఎవరు నువ్వు?" అన్నాడు ముత్యాల్రావు భయంగా.
"వేదవతిని చంపినవాణ్ణి-" అన్నాడతడు.
ముత్యాల్రావుకి నోట మాటరాలేదు. అతడు హంతకుడా? తను మోహన్ కి ఉత్తరం వ్రాస్తే అతడెలా గొచ్చాడు?