Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 4

 

    క్రూర బుడతడికి జరిగిన మోసం అర్ధమయిపోయింది. వాడు లబో దిబో మంటూ రాజదంపతుల దగ్గరకు వెళ్ళి అంతా చెప్పి తనను క్షమించమనీ, ఎలాగైనా రాజకుమార్తెను రక్షించమని కోరాడు.
    జరిగింది విని అంతా కలవరపడ్డారు. మన వీర బుడతడు అప్పుడు ముందుకు వచ్చి "ప్రభూ ! నేను రాజకుమార్తెనూ రక్షించి తీసుకువస్తాను. అప్పుడే నిజంగా నేనామెను వివాహం చేసుకునేందుకు అర్హుడనని " అన్నాడు.
    "బాగానే వుంది - కానీ ఎక్కడికని వెళతావు ? ఎలాగని వెతుకుతావు ?" అనడిగాడు రాజు నిరాశగా.
    "ముందా మాంత్రికుడి నివాసానికి వెళతాను. అక్కడ్నించి ఎలాగోలా వాడి జాడ తెలియక పోదు " అన్నాడు వీర బుడతడు.
    మాంత్రికుడు నివాసముండే అరణ్యం పాపాల మయమని బుడతడి దేశస్తులు నమ్ముతారు. క్రూర బుడతడు అక్కడికి వెళ్ళటం వల్ల వచ్చిన పాపం వల్లే రాజకుమార్తె మాయమైంది. ఇంకా ఎవరైనా అక్కడికి వెళితే ఇంకెంత పాపం చుట్టూ కుంటుందో! ఈ భయం వల్ల అనుమానం వల్ల  ఎవ్వరు అక్కడికి వెళ్ళటం లేదు. వీరబుడతడు మాత్రం అక్కడికి వెళ్ళటానికి బయలుదేరి - "నేను తిరిగి వస్తే రాజకుమార్తెతోనే వస్తాను. రాజకుమార్తె తో తిరిగి వస్తే నన్నే పాపమూ అంటలేదనే అర్ధం. అందుచేత ఆ అరణ్య పాపలేవీ నన్నంటవు" అన్నాడు.
    రాజు రాణీల దీవేనలందుకుని వీరబుడతడు అ అడవికి చేరుకున్నాడు. అయితే అప్పటికే మాంత్రికుడక్కడనించి మకాం ఎత్తేశాడు. బుడతడికా అడవిలో ఓ బుడత మహాముని కనిపించి "ఈ భయంకర అరణ్యంలో కి ఎందుకొచ్చావు నాయనా ?' అనడిగాడు.
    వీరబుడతడు తన కధంతా చెప్పాడు.
    అప్పుడు బుడత ముని తన గడ్డం సవరించుకుని 'ఆ మాంత్రికుడు నిన్నటి రోజునే అక్కడి నుంచి మకాం ఎత్తేశాడు. వాడు పోవటం వలన ఈ అరణ్యం మళ్ళీ పునీతమైంది. మునులందరము ఒక్కొక్కరమే వచ్చి చేరుతున్నాం " అన్నాడు.
    గతంలో మునులంతా ఇక్కడే వుండేవారట. మాంత్రికుడు వచ్చాక వారక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారట.
    "స్వామీ! దుర్మార్గుల్ని ఉపెక్షిస్తుంటే మీకింక ఈ తాపస్సెందుకు ?" అన్నాడు వీరబుడతడు.
    "వెర్రి వాడా! మేము తపస్సు చేసేది మోక్షం కోసం. మోక్షం అంటే జన్మ రాహిత్యం . అంతేకాని దుర్మార్గులందర్నీ ఎదిరించడం కోసం మేము తపస్సు చేయడం లేదు" అన్నాడు బుడత ముని.
    "మరి దుర్మార్గుల అగడాలిలా కొనసాగవలసిందేనా ?" అన్నాడు వీరబుడతడు బాధగా.
    "దుర్మార్గుల అగడాన్ని అరికట్టేందుకు దేవుడున్నాడు. " అన్నాడు బుడత ముని.
    వీరబుడతడు దీనంగా ముఖం పెట్టి , "స్వామీ! ఆ దుర్మార్గుడయిన మాంత్రికుడేక్కడున్నాడో మీరు చెప్పగలరా ?" అన్నాడు.
    "వాడు తనకిక్కడ ప్రమాదమని మనుషుల మధ్య బ్రతకడానికి వెళ్ళిపోయాడు. పాపానికి ఆదరణ మనుషుల మధ్యనే లభిస్తుంది" అన్నాడు బుడత ముని.
    "నే నిప్పుడక్కడికి వెళ్ళే మార్గం లేదా అన్నాడు బుడతడు.
    బుడతముని కాసేపాలోచించి, "నేను నీ కోక సాయం చేయగలను. నన్ను తలచుకొని కళ్ళు మూసుకో. వెంటనే రాజకుమార్తె పక్కన ఉంటావు. ఈ ఒక్కసారికే ఆ మంత్రం పనిచేస్తుంది. ఆ తర్వాత నీ తంటాలు నువ్వు పడు " అన్నాడు.
    వీరబుడతడు కళ్ళు మూసుకుని, "జై బుడత ముని !" అనుకున్నాడు మనసులో. వాడు కళ్ళు తెరిచే సరికి వాడి పక్కన రాజకుమార్తె వున్నది.
    రాజకుమార్తెను అంత దగ్గరగా ఎన్నడూ చూసి ఉండని వీర బుడతడామెను చూసి ఏ స్వర్గం నుండో వచ్చిన అప్సరస అనుకున్నాడు. రాజకుమార్తె మాత్రం వాణ్ని వెంటనే గుర్తుపట్టి "ప్రియా ! నన్ను రక్షించటానికి నువ్వోచ్చావు గదా - "నాకిక ఏ భయమూ లేదు " అంది.
    "రాజకుమారీ! ఇది ఏ ప్రాంతం ?" అని అడిగాడు బుడతడామెను.
    "మనమిప్పుడు మాంత్రికుడి మాయా భవనంలో వున్నాం. అది గాలిలో ఎగుర్తోంది. మాంత్రికుడు పక్క గదిలో దైవపూజ చేస్తున్నాడు. నువ్విక్కడి కేలా రాగలిగావు ?" అంది రాజకుమారి.
    బుడతడు తన కధ చెప్పాడు. అప్పుడు రాజకుమారి తన కధ ఇలా చెప్పింది.
    మాంత్రికుడామెను పెళ్ళి చేసుకోమని రోజూ బలవంత పెడుతున్నాడు. కానీ రాజకుమార్తె వీర బుడతడికే మనసిచ్చేసిందట. తానింకేవర్నీ పెళ్ళాడనని చెప్పేసిందిట. ఇష్టం లేని ఆడదాన్ని ముట్టుకుంటే మాంత్రికుడు చచ్చిపోతాడట. అందుకని వాడు మంచి మాటలతో రాజకుమార్తెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాట్ట.
    "ఈ మాంత్రికులందరికీ ఇలాంటి శాపాలేవో లేకపోతె లోకంలో ఆడవాళ్ళేరికీ రక్షణ లేకుండా పోయేది. "ఈ విధంగా ఆలోచిస్తే దేవుడు చాలా గొప్పవాడు ' అన్నాడు వీరబుడతడు.
    "దేవుడి సంగతి తర్వాత . ముందు మన సంగతి ఆలోచించు. ఈ మాంత్రికుడి బారి నుంచి నన్నెలా రక్షిస్తావు ?" అంది రాజకుమారి దిగులుగా.
    "నా కత్తితో ఇప్పుడే వాడి తల వెయ్యి ముక్కలు చేసేస్తాను." అంటూ కత్తి ఝుళిపించాడు బుడతడు.
    "వీరబుడతా! వాడి మంత్రశక్తుల ముందు నీ కత్తి విద్యలేమీ పని చేయలేవు. ఇంకేదైనా ఉపాయం ఆలోచించు" అంది రాజకుమారి.
    ఇద్దరూ కలిసి కాసేపు ఆలోచించారు. రాజకుమారి నెమ్మదిగా, "నాకొక్క విషయం మాత్రం తెలుసు. ఈ మాంత్రికుడు మనుషుల వల్ల తప్ప చావడు. దానధర్మాల పేరు చెప్పి ఉన్న ఆస్థి నంతా పోగొట్టుకున్నవాడి పెళ్ళాం చేతిలో తప్ప వీడికి చావు లేదు" అంది వీరబుడతడితో.
    "ఇది వరమా - శాపమా ?" అన్నాడు వీరబుడతడు.
    అప్పుడు రాజకుమార్తె చెప్పింది....
    బుడత మాంత్రికుడు రాజకుమార్తె దగ్గర చాలా గప్పాలు కొట్టాడట. ఒకసారి వాడు తపస్సు చేస్తే దేవి స్వయంగా ప్రత్యక్షమైందట. ఏం వరం కావాలో కోరుకోమన్నదట. చావులేకుండా వరమివ్వమన్నాట్టా. దేవి ఒప్పుకోలేదట. సృష్టిలో పుట్టిన ప్రతివాడికీ గిట్టక తప్పదట'. కావాలంటే చావు కేదైనా షరతు పెట్టమన్నదట. అప్పుడు వాడీ షరతు పెట్టాడట. ఎందుకంటె -
    ఈ కలికాలంలో తనకు లేకుండా చేసుకుని దాన ధర్మాలు చేసేవాడే ఉండడు. ఉన్నా చూస్తూ చూస్తూ వాణ్ని పెళ్ళాడ్డానికి ఏ ఆడదీ ముందుకు రాదు. ఖర్మం జాలక ఈ రెండూ సరిపోయినా ఆ భార్యాభర్తలు తనకు తటస్థపడడం కూడా అసంభవం.
    "బాగానే వుంది. ఇప్పుడు మీ ప్రయాణ మెక్కడికి?" అనడిగాడు వీరబుడతడు.
    "ఈ భవనాన్ని అజగర పర్వతం మీద ప్రతిష్టించి నాతొ అక్కడ కాపురం పెడతానని వాడన్నాడు" అంది రాజకుమారి.
    వీళ్ళ సంభాషణ ఇంకా జరుగుతుండగా ఆ గదిలోకి బుడత మాంత్రికుడు వచ్చాడు. బుడతడిని చూసి వికారంగా నవ్వుతూ - "ఓహ్ ! నువ్వేనా రాజకుమార్తె ప్రియుడివి" అన్నాడు.
    "అవును" అంటూ వీరబుడతడు దైర్యం గా లేచి నిలబడ్డాడు.
    "ఇలారా!" అన్నాడు మాంత్రికుడు. వీర బుడతడు మాంత్రికుణ్ణి సమీపించగానే ఉఫ్ మని ఊదాడు మాంత్రికుడు. అది బుడతడి పట్ల ఝుంఝుమారుతమై వాణ్నక్కన్నించి దూరంగా గెంటేసింది. వీరబుడతడు భవనంలోంచి క్రిందపడ్డాడు.
    వీరబుడతడి కెన్నో వ్యాయామ విద్యలు తెలుసు. అందువల్ల వాడు గాలిలో పల్టీలు కొడుతూ నేలమీద దెబ్బ తగలకుండా నెమ్మదిగా పడేలా చూడసాగాడు. కానీ సమయానికి వాన ప్రారంభం కావడం వల్ల వాడి ప్రయత్నం విఫలమై ఓ పిల్ల కాలవలో పడి ప్రసన్నుడి చేత రక్షించబడ్డాడు.
    బుడత దేశాస్తులందరికీ నీరంటే భయం. నీటిని వారు దాటలేరు. నీట్లో ఈదలేరు.
    బుడత దేశాస్తులాడిన మాట తప్పరు. అలా తప్పితే వారికున్న అద్భుతశక్తులు -- అనగా ఆకారానికి మించిన బలం వగైరాలు పోతాయి.
    తనను నీట్లోంచి రక్షిస్తే ప్రసన్నుడు చెప్పినట్లు వింటానని వీరబుడతడు మాట ఇచ్చాడు. నీట్లోంచి రక్షించబడ్డాక వీరబుడతడు ప్రసన్నుడికి తన కధంతా చెప్పి తనకు సాయపడవలసిందిగా కోరాడు. ప్రసన్నుడు సాయపడతానని ,మాటిచ్చి ఈ కొండ గుహ దగ్గరకు వచ్చి , ఇక్కడ వాణ్ని బానిసగా మార్చుకుని వాడి చేత అన్ని పనులూ చేయించుకుని సుఖపడుతున్నాడు. గుహ బయట ఓ సన్నటి నీటి ధార నిత్యం ప్రవహించే ఏర్పాటు చేయటంతో బుడత డక్కడ శాశ్వతంగా బందీ అయిపోయాడు. ప్రసన్నుడి కారణంగా బుడతడికి కొన్ని తెలియని పదాలు తెలిశాయి. కొన్ని కొన్ని మాటలు కూడా వాడికి అర్ధమవుతాయి. కానీ వాడా భాషలో సంభాషించలేడు. అందువల్ల వాడు తన కధను చంద్రికకు, భానుమతికీ చెప్పుకునే అవకాశం లేదు.

                            *    *    *    *

    వీరబుడతడి కధ వింటుంటే మోహనుడికి నవ్వు వచ్చింది. జాలీ కలిగింది. తన చిటికెన వ్రేలు ప్రమాణంలో వున్న ఆ మనిషి వెనుక ఎంత గాధ! ఎన్ని భావాలు ?
    మోహనుడు తను విన్నదంతా చంద్రికకు చెప్పాడు. "బహుశా మీ నాన్న ఆ బుడత మాంత్రికుణ్ణి చంపించడం కోసమే నిన్ను నాకిచ్చి చేశాడెమో అన్నాడు.
    "అంతే అయ్యుంటుంది. నాన్న మంచివాడు పాపం ఈ బుడతడికి అన్యాయం చెయ్యడు" అంది చంద్రిక.
    అప్పుడు మోహనుడు బుడతడికి తన గురించి వివరంగా చెప్పి, "బహుశా నా భార్య నీకు సహాయపడగలదు. కానీ ఇప్పుడెం లాభం ? ఈ పాటికి నీ ప్రియురాలు ముసలిదయిపోయి వుంటుంది ?" అన్నాడు నిట్టురుస్తూ.

 Previous Page Next Page