Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 4

 

    "హలో శరభయ్యా!"అంటూ అద్దం లోని ప్రతిబింబాన్ని పలకరించాడు. అలవాటై పోయిందో యేమో అతని గొంతు స్త్రీ కంఠం లాగునే పలికింది. శరభయ్య అధైర్య పడలేదు, ఆనందించాడు. తర్వాత గదిలో కాసేపు అటూ యిటూ నడిచి తన నడకను సవరించుకున్నాడు. ఇప్పుడతని నడక కూడా ఆడవారి నడకకు  దగ్గరలో ఉంది.
    హటాత్తుగా శరభయ్యకు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. శరభయ్య కు పుట్టు వెంట్రుకలు తీయించడం ఆలశ్యమైందట. జుట్టు ఒత్తుగానూ, పొడవుగానూ, వుండేదిట. తల్లి అతనికి జడవేసి , బొట్టూ కాటుక పెట్టి గౌను తొడిగితే అంతా ఆడపిల్లనే అనుకునేవారుట. శరభయ్య తోలి కాన్పు బిడ్డ కావడమూ, అతడి తల్లికి ఆడపిల్ల లంటే మనసు కావడమూ వల్ల ఆవిడ ఇతడ్ని ఆడపిల్లలా తయారు చేసి ఆ మనసు తీర్చుకునేదిట. చూసేవాళ్ళు కూడా మీ వాడు పొరపాటున మగపిల్లాడు గా పుట్టాడమ్మా అనేవారుట. శరభయ్య తర్వాత కూడా అతడి తల్లి మనసు తీరలేదు. ఆరేళ్ళ తర్వాత ఇంకో మగపిల్లాడు పుట్టాడు అంతే!
    'ఇప్పుడు అమ్మ నన్నీ వేషంలో చూస్తె ఎమనుకుంటుందో?" అనుకున్నాడు శరభయ్య.
    అమ్మ సంగతెలాగున్నా గదిలోకి వీరేశ్వర్రావు వచ్చాడు. శరభయ్య అతడు చెప్పిన ప్రకారం అతన్ని అనుసరించి వెళ్ళి కారెక్కాడు. కారు వింత వింత దారుల్లో వెళ్ళి ఓ భవనం ముందు ఆగింది.
    
                                    6
    వీరేశ్వర్రావు కారు దిగాడు. శరభయ్య ను కూడా దిగమన్నాడు. ఇద్దరూ కలిసి భవనంలో అడుగు పెట్టగానే అక్కడ కనబడ్డ నౌకరు తో -- "వీరేశ్వర్రావు వచ్చాడనీ డ్యాన్సు మాస్టరు సుజాతను తీసుకొచ్చాడని చెప్పు గోవిందరావు గారితో -- " అన్నాడు.
    "గోవిందరావు గారు లేరండి ...." అన్నాడు నౌకరు.
    "పోనీ....పార్వతీ గారున్నారా?"
    "ఉన్నారండీ ...."
    "పీల్చుకునిరా...." అన్నాడు వీరేశ్వర్రావు , నౌకరు వెళ్ళాడు.
    అయిదు నిముషాల అనంతరం మెరుపు తీగ లాంటి పిల్ల పదహారేళ్ళ వయసుది వచ్చింది. ఆమె పార్వతి అయుండాలని అనుకున్న శరభయ్య -- "నాకు నిజంగా డాన్సు వచ్చి వుంటే ఎంత బాగుండును?" అనుకున్నాడు.
    "నీకు డాన్సు నేర్పడానికి కొత్త మేస్టర్ని తీసుకొచ్చాను. పేరు సుజాత..." అన్నాడు వీరేశ్వర్రావు. పార్వతికి శరభయ్య ను పరిచయం చేస్తూ.
    అందమైన పార్వతి కళ్ళు తన వైపు జాలిగా చూడడం గమనించిన శరభయ్య ఆశ్చర్యపడి నా -- ఆమె చూపులే అంతేనేమో లే అనుకున్నాడు. మేలి ముసుగు మరి కాస్త ముఖం మీదకు లాక్కున్నాడు.
    వీరేశ్వర్రావు వెళ్ళిపోయాడు. పార్వతి అతన్ని సమీపించి చేయి పట్టుకుని -- "పదండి -- నా గదిలోకి వేడదాము--" అంది. ఆ స్పర్శ శరభయ్యకు ఎంతో హాయిగా ఉంది. కానీ పార్వతి తను ఆడది అనుకుంటోందని అతనికి తెలుసు. అందువల్ల మృదువుగా ఆమె చేయి విడిపించుకుని ఆమెను అనుసరించాడు.
    అంతవరకూ శరభయ్య గమనించలేదు. కానీ అది మహారాజుల భవనం లా ఉంది. పార్వతీ కూడా ఏదో రాజ్యానికి యువరాణిలా అనిపిస్తోంది -- అందాన్ని బట్టే కాదు ధరించిన బట్టల్ని బట్టి కూడా! అలక్ష్యంగా ఆమె వంటి మీద వేలాడే నగలు కూడా ఆమె విలువను చెప్పకనే చెబుతున్నాయి.
    ఇద్దరూ అంతఃపురం లాంటి గదిలో హంస తూలిక తల్పం లాంటి మంచం మీద పక్క పక్కన సుఖాసీనులయ్యాక -- "మేస్టారూ -- మామయ్యా ఊళ్ళో లేరు. ఈలోగా మీకేం కోరికలున్నా చెప్పండి. నేను తీరుస్తాను. మావయ్య వచ్చేదాకా నేనీ ఇంటికి రాణిని...." అంది పార్వతి.
    "నాకేం కోరికలుంటాయ్-- నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. చేతనైతే నన్నిక్కడి నుంచి పంపెసేయ్ --" అన్నాడు శరభయ్య.
    "అమ్మ బాబోయ్ -- " అంది పార్వతి -- " నా పెత్తనం నాలుగు గోడల లోపలే గానీ బైట చెల్లదు. మీకు కావాల్సిన బట్టలు, నగలు ఇవ్వగలను. మంచి భోజనం ఏర్పాటు చేయగలను. కోరిన సేవలు చేయగలను. కానీ ఈ ఇంటి గడప దాటించలేను--"
    శరభయ్య ఆశ్చర్యంగా -- 'అంతా విచిత్రంగా వుంది నాకు. ఇదంతా ఏమిటో నాకు చెప్పగలవా?" అనడిగాడు.
    పార్వతి నిట్టూర్చి -- "చెబుతాను. కానీ నాకు మీ మీద జాలిగా వుంది!" అంది.
    "ఎందుకు?" అనడిగాడు శరభయ్య.
    "నేను నిత్యం ప్రమాదంలో ఉంటున్నాను. కానీ ప్రాణాలకు భయం లేదు. మీకైతే ప్రాణాలకి ప్రమాదం -- " అంది పార్వతి.
    శరభయ్య భయపడ్డాడు -- "ఏం?" అన్నాడు మళ్ళీ.
    "ఏమంటే ఏం చెప్పను? మామయ్యకు స్త్రీ వ్యసనం ఉంది. అందమైన ఆడపిల్ల కనపడితే తన మనుషుల్ని పెట్టి ఇంటికి రప్పించుకుని ఇష్టమైనంత కాలం అనుభవించి తర్వాత చంపించేస్తాడు...."
    "చంపడ మెందుకు?" అన్నాడు శరభయ్య కంగారుగా.
    "తన విషయాలు బయటకు పొక్కడం మామయ్యా కిష్టముండదు. నాకు డ్యాన్సు నేర్పడం మిష మీద పెద్ద పెద్ద జీతాలు ఆశ పెట్టి ఇక్కడకు రప్పిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకు బండలౌతుంది. కొత్త వాళ్ళెవరూ ఈ ఇంటికి వచ్చి ప్రాణాలతో బయటకు వెళ్ళలేదు-- "అంది పార్వతి.
    శరభయ్య గుండెలు గుబగుబ లాడాయి. తను చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడా?
    "ఈ ఇంట్లోని నౌకర్లు దీన్ని మృత్యు మందిరం అని పిలుస్తారు. దీనికి ఇష్టపడకుండా ఇక్కడుంటున్న మనిషిని నేనొక్కదాన్నే!" అంది పార్వతి మళ్ళీ.
    "ఇక్కడి నౌకర్ల కు ఈ మందిర మంటే ఇష్టమేనా?" అన్నాడు శరభయ్య.
    "చాలా ఇష్టం! ఎందుకంటె మామయ్య తన మోజు తీరిపోయాక ఆ ఆడవాళ్ళను నౌకర్ల కు వదిలివేస్తాడు. వాళ్ళు ఇష్టం వచ్చినంత కాలం అనుభవించవచ్చు. ప్రాణాలతో ఉండాలంటే ఆ నౌకర్లు చెప్పినట్లు వింటూ వాళ్ళతో మంచిగా వుండాలి. కాదంటే ప్రాణాలు కోల్పోతారు. ప్రాణభయంతో ఇప్పటికి ఈ ఇంటి దాసీలుగా యాభై మంది ఆడవాళ్ళున్నారు. వాళ్ళ జీవితం అతి నికృష్టమైనది. సంపాదన లేని వేశ్యలు. గౌరవ మెరుగని పని మనుషులు. గతిలేక ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళలో కొందరు , పాపం ఉన్నత కుటుంబాలకు చెందిన వారుకూడా ఉన్నారు. ఏం చేస్తారు? ఈ ఇంటి నౌకర్లు సామాన్యులు కారు. బలం లో భీముళ్ళు, వృత్తిరీత్యా హంతకులు, ప్రవృత్తి రీత్యా రాక్షసులు...."
    పార్వతీ మాటలు వింటుంటే శరభయ్య భయం పెరిగిపోయింది -- "అది సరేలే గాని నీ కధేమిటో చెప్పు అన్నాడు కనీసం కొంత మార్పుంటుందని.
    పార్వతిని నిట్టూర్చింది -- "విలువ కట్టలేని ఆస్తికి వారసురాలిని చేసి నాన్న చచ్చిపోయాడు . మగ దిక్కు లేని అమ్మ తన తమ్ముడ్ని చేర దీసింది. నడమంత్రపు సిరి మామయ్యను దుర్మార్గుడిని చేసింది. మామయ్య కిరాతకాలు నచ్చక అమ్మ అతడికి ఉద్వాసన చెప్పాలని చూసింది. మామయ్యా అమ్మను చంపేశాడు. ఈ ఆస్తి కిప్పుడు వారసురాలిని నేను. నన్ను చంపితే పోలీసుల దృష్టిలో పడతానని భయపడుతున్నాడు . అదేకాక అమ్మ రాసిన విల్లులో నాకు మామయ్యా సంరక్షకుడిగా ఉంటాడనీ- నేను చనిపోయిన పక్షంలో ఆస్తి ప్రభుత్వానికి చెందాలని ఉంది. అందువల్ల మామయ్యా దుర్మార్గం నా మీదకు మళ్ళలేదు. మామయ్యా నాకంటే చాలా పెద్దవాడు. అయినా సరే నామీద కూడా ఆశపడ్డాడు. తను నా మీద చెయ్యి వేస్తె ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాను. అందుకే నా జోలికి రావడం లేదు..."
    శరభయ్య పార్వతి చెప్పిన కధంతా విని -- "టూకీగా ఆమె చెప్పిన ఈ కధలో అంతులేని విషాదమూ, ఒక దుర్మార్గుడి అమానుషమూ దాగి ఉన్నాయని గ్రహించాడు.
    "ఇలాంటి కొంప లో ఉన్న నీ ధైర్యాన్నభినందించాలి!" అన్నాడు.
    "నేను బ్రతుకుతున్నది ధైర్యంతో కాదు. ఆశతో! ఏదో ఒక రోజున ఈ భయంకర మృత్యుమందిరం నుంచి బయట పడతానన్న ఆశే నన్నింకా బ్రతికిస్తోంది ...." అంది పార్వతి.
    శరభయ్య నిట్టూర్చి -- "నాకా ఆశ కూడా వున్నట్లు లేదు....' అన్నాడు. తననీ మృత్యుమందిరానికి పంపించిన సుజాత గురించి అతనాలోచిస్తున్నాడు . ఈ సుజాత ఆపద నుండి బాగానే తప్పించు కోగలిగింది . కానీ ఆమెకు ఈ మృత్యుమందిరం గురించి యెవరు చెప్పారు? పార్వతి చెప్పిన ప్రకారం ఇక్కడి విషయాలు బయటి వాళ్ళెవరికీ తెలియవు. అలాంటప్పుడు ఆమె ఈ విషయాల నెలా తెలుసుకోగలిగింది?

                                      7
    "నేను బట్టలు మార్చుకుంటాను. మీరు కూడా మర్చుకుంటారా ?" అనడిగింది పార్వతి.
    శరభయ్య తడబడుతూ -- "ఎందుకు?" అన్నాడు.
    "ఎందుకేమిటి? మనిద్దరికీ ఈ గదిలోనే మకాం --" అంది పార్వతి- "ఇప్పుడు టైం చాలా అయింది. మనం పడుకుంటే మంచిది; మామయ్య ఇంట్లో లేని రోజున నాకు హాయిగా నిద్ర పడుతుంది. ఈ రాత్రి వృధా చేసుకోవడం నాకిష్టం లేదు...." అంది పార్వతి.
    శరభయ్య మంచాన్నీ, గదినీ పరీక్షగా చూసి -- "ఇంకో మంచం లేదా?' అన్నాడు.
    "మిమ్మల్ని వేరే మంచం మీద పడుకోబెట్టడానికి మీరేం మగాడు కాదు గదా! మీరే మగాడైతే ఈ గదిలో పడుకోనిస్తానా?" అంది పార్వతి. అంటూనే ఆమె బీరువా దగ్గరకు నడిచి తలుపు తీసింది. అందులోంచి పలచటి నైటీ గౌను తీసింది.
    శరభయ్య అటు చూడడం మానుకున్నాడు. తను మగవాడని తెలియక ఆమె ఏ ఇబ్బందీ ఫీలవడం లేదు. తను మాత్రం ఆమె పరాయి ఆడది. ఆమెవంక చూడడం తప్పు.
    "ఏమిటి మేస్టారూ. అలోచిస్తున్నారూ?" అంది పార్వతి. చటుక్కున శరభయ్య ఆమె వైపుకు తిరిగాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. జీవితంలో అటువంటి సౌందర్యం కళ్ళబడినా అదృష్టమే! పలచటి నైటీ గౌన్ లోంచి ఆమె శరీరపు వంపు సొంపులు స్పష్టంగా తెలుస్తున్నాయి.
    "మీరు కూడా బట్టలు మార్చుకుంటారా?" అంది పార్వతి.
    తల అడ్డంగా ఊపాడు శరభయ్య. వేడెక్కిన అతడి శరీరం మెదడును పని చేయనివ్వడం లేదు. పార్వతి మంచం ఎక్కి పడుకుని-- "మీరూ పడుకోండి --నాకు నిద్ర వస్తోంది --" అంది.
    "నా కింక నిద్ర రావడం లేదు. నువ్వు పడుకో - అన్నాడు శరభయ్య.
    "మీరు పడుకుంటే గానీ నేనూ పడుకోను -- " అంటూ అతన్ని చేయి పట్టుకుని లాగింది పార్వతి. అనుకోకుండా మంచం మీద వెల్లకితలా పడ్డాడు శరభయ్య.
    పార్వతీ అతనికి దగ్గరగా చేరి మీద చేయి వేసి కళ్ళు మూసుకుని పడుకుంది.

 Previous Page Next Page