Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 3


    మోహనుడు చంద్రికతో -- "నీ తండ్రి నన్ను గుహకు బందీని చేశాడు. నువ్వు నన్ను విడిపించ లేవా ?" అన్నాడు.
    చంద్రిక బాధగా నవ్వి - "నేను ఈ గుహకు బందీనే ! మా అమ్మ కూడా ఈ గుహకు బందీయే మా నాన్న తలచు కొంటె తప్ప ఆ బంధాలు పోవు" అంది.
    "మిమ్మల్ని కూడా బందీని చేశాడు మా నాన్న! ఇదేం మనిషి?" అన్నాడు మోహనుడు.
    "మేమంతా ఎప్పుడూ ఇక్కడే వుండాలని అయన ఆశ!" అంది చంద్రిక తన కాలికున్న మెత్తటి తాటి బంధాన్ని చూపిస్తూ.
    "ఐతే ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదా?" అన్నాడు మోహనుడు.
    "ఒక్కటే మార్గం బుడతడున్నాడు " అంది చంద్రిక.
    "బుడతడా! వాడేవాడు అన్నాడు మోహనుడు.
    "బుడతడు లేకుండా ఈ గుహలో కిన్ని ఏర్పాట్లేలా వచ్చాయనుకున్నావు? ఈ విషయం నీకు చెప్పకూడ దనుకున్నాను గానీ ఇప్పుడు నాక్కూడా మనుషుల మధ్యకు వెళ్ళాలని పించి చెబుతున్నాను " అంది చంద్రిక .
    "ఎక్కడుంటాడా బుడతడు ?" అన్నాడు మోహనుడు.
    "ఈ గుహలోనే అమ్మ దగ్గర వుంటాడు. అమ్మ వాడ్ని కొంగున ముడేసుకుని తిరుగుతుంది " అంది చంద్రిక.
    "కొంగున ముడేసుకోవటమేమిటి? బుడతడంటే మనిషి కాడా ?" అన్నాడు మోహనుడు.
    "మనిషే కానీ బొత్తిగా చిటికెన వ్రేలంత వుంటాడు " అంది చంద్రిక.
    'అసలీ బుడతడి గొడవేమిటి వివరంగా చెప్పు !" అన్నాడు మోహనుడు కుతూహలంగా.
    "చెపుతాను విను !' అంటూ చంద్రిక చెప్పనారంభించింది.
    
                              *    *    *    *
    ప్రసన్నుడు భార్యతో కలిసి పారిపోయి వస్తున్నప్పుడు దారిలో వాన వల్ల ఏర్పడ్డ చిన్న పిల్లకాలవలో పడి కొట్టుకు పోతున్న బుడత వాడ్ని చూసి రక్షించాడు. బుడతడికి అద్భుతమైన శక్తులున్నాయి. వాడు గొప్ప శిల్పి, కళాకారుడు, వంటవాడు, మహా బలవంతుడు.
    ఎటువంటి ప్రదేశంలో నయినా మేడలు కట్టగలడు. ఎలాంటి నారతో నయినా వాడు అద్భుతమైన బట్టలు నేయగలడు. ఎలాంటి పదార్ధంతో నైనా రుచికరమైన వంటలు చేయగలడు. ఎంత బరువైన వస్తువునైనా అవలీలగా మోయగలడు. ఏపనికైనా వాడు తీసుకునే వ్యవధి చాలా తక్కువ.
    ప్రసన్నుడు వాడి సాయం తోనే ఈ కొండ గుహలో ఇల్లు కట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసుకొని సుఖంగా జీవనం గడుపుతున్నాడు.
    ఎటొచ్చీ బుడతడికి సంస్కృతం తప్ప మరే భాష రాదు - అర్ధం కాదు. అందువల్ల వాడితో సంభషించ గల్గిన వాడు ప్రసన్నుడొక్కడే! అంత మహా శక్తి వంతుడైన బుడతడు ప్రసన్నుడి కెందుకు లొంగి పడి వుంటున్నాడో తల్లీ కూతుళ్ళకు తెలియదు. వాడి వల్ల ఉపకారం పొందే ఉపాయం వాళ్ళకు తెలియదు. ఈ కొండ గుహ జీవితం భానుమతికి నచ్చడం లేదు. ఇరవై ఏళ్ళుగా ఇక్కడ మగ్గిపోతూ ఉన్నామనీ తనను మనుషుల మధ్యకు తీసుకెళ్ళమని ఆమె భర్తను వేడుకుంటుంది కాని ప్రసన్నుడది వినటం లేదు.
    
                               *    *    *    *
    "నాకు సంస్కృతం వచ్చు " అన్నాడు మోహనుడు.
    ఈ విషయం వింటూనే చంద్రిక ఎంతో ఉత్సాహ పడింది. మర్నాడు తండ్రి గుహ బయటకు వెళ్ళాక తల్లిని బుడతడి నోసారి తనకు ఇవ్వమని అడిగింది.
    "ఎందుకు " అంది భానుమతి కొంగు ముడి విప్పుతూ.
    "నీ అల్లుడు గారికి సంస్కృతం వచ్చునట. అయన బుడతడితో మాట్లాడతారట -" అంది చంద్రిక.
    "ఆయనకు తెలిస్తే గొడవౌతుంది. త్వరగా మాట్లాడి మళ్ళీ నాకిచ్చేయండి" అంటూ బుడతడిని చంద్రికకు అందించి -- "జాగ్రత్త క్రింద పడేస్తే దెబ్బ తగుల్తుంది !" అంది.
    అరచేతిలో బుడతడ్ని పుచ్చుకుని భర్త దగ్గరకు తీసుకు వెళ్ళింది చంద్రిక.
    బుడతడిని చూస్తూనే మోహనుడెం తో ఆశ్చర్యపడ్డాడు. వాడు అచ్చం మనిషి లాగే ఉన్నాడు. కానీ సరిగ్గా తన చిటికేవ్రేలంత మాత్రమే వున్నాడు. సృష్టిలో ఇలాంటి ప్రాణి వుండటం మోహనుడికి ఆశ్చర్యంగా వుంది. అతడు బుడతడ్ని సంస్కృతంలో పలకరించాడు.
    బుడతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ఆహా- ఎన్నాళ్ళకి చక్కటి సంస్కృత ఉచ్చారణ విన్నాను " అన్నాడు వాడు పరవశంతో ఊగిపోతూ.
    "ఏం ప్రసన్నుడు నీతో మాట్లాడతాడుగా సంస్కృతంలో !" అన్నాడు మోహనుడు.
    "ప్రసన్నుడి ఉచ్చరణ బాగుండదు, వేదాలు చదివిన వాడ్ని. నాకు వాడి ఉచ్చారణ ఏం బాగుంటుంది?" అన్నాడు బుడతడు చిరాగ్గా ముఖం పెట్టి. వాడి ముఖం చూస్తుంటే మోహనుడికి నవ్వొచింది.
    "అయితే మనమిద్దరం రోజూ కబుర్లు చెప్పుకుందాం " అన్నాడు మోహనుడు.
    "చేసేదేముంది ? నాకు ఈ చేర తప్పదు గదా " అన్నాడు బుడతడు.
    "నీక్కూడా ఇది చేరయేనా ?" అన్నాడు మోహానుడు ఆశ్చర్యంగా.
    "నా కధ చెబుతాను విను -" అన్నాడు బుడతడు.
    మోహనుడు కుతూహలంగా వినసాగాడు.
    
                            *    *    *    *

    హిమాలయ పర్వత ప్రాంతాల్లో బుడతల దేశం వుంది. ఆ దేశంలోని ప్రజలంతా చిటికెన వ్రేలుడు ప్రమాణం గలవారే! అయితే వారందరూ మహా శక్తివంతులు. వారి శరీర ప్రమాణం వారి జీవిత అనందాని కేం లోటు రానివ్వలేదు. అందువలన వారు చక్కటి భవనాలు నిర్మించుకుని సకల సదుపాయాల తోటీ జీవిస్తున్నారు.
    అక్కడి ప్రజలందరూ నిష్టాగరిష్టులు. ప్రతి రోజూ అక్కడ వేద పారాయణం జరుగుతుంది. సంస్కృతం వారికీ దేశ భాష రాజభాష మాత్రమే కాదు. వారి కున్నదొక్కటే బాష.
    బుడతల రాజుకు ఒక్కగా నొక్క కూతురు. ఆయనకు కొడుకులు లేరు. రాజకుమార్తె ఎంతో అందమైనది. ఆమెను చేపట్టిన వారికి ఆ అందాల రాశితో పాటు రాజ్యాదిపత్యం కూడా దక్కుతుంది. అందుకని ఆమెను వివాహమాడటానికి యందరో యువకులు ముందుకు వచ్చారు. అందువల్ల రాకు స్వయవరం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
    రాజుగారు ఏర్పాటు చేసిన స్వయంవరానికి వందలాది యువకులు వచ్చారు. వారందరి మధ్యనూ ఎన్నో పోటీలు జరిగాయి. కత్తి యుద్దాలు, మల్ల విద్యలు, ధనుర్విద్యలు ఇలా ఎన్నో పోటీలు జరగ్గా వాటన్నింట్లోనే మన బుడతడు ప్రప్రధముడిగా వచ్చి "వీర బుడతడు" అన్న బిరుదునందుకున్నాడు.
    న్యాయానికి వీరబుడతడు రాజకుమార్తెను వివాహం చేసుకోవాల్సిందే! పోటీలు జరుగుతున్నప్పుడు రాజకుమార్తే వీరబుడతడి ప్రతాపం చూసి అతణ్ణి ప్రేమించింది కూడా!
    అయితే అప్పుడొక విశేషం జరిగింది. యుద్ద విద్యల్లో వీరబుడతడితో ఇంచుమించు సమాన ప్రతాపం చూపించి చివరిలో ఓడిపోయిన ఓ క్రూర బుడతడున్నాడు. వాడు బుడత రాణికి స్వయానా తమ్ముడు. ఎంతో కాలంగా బుడత రాజకుమారిని ప్రేమిస్తున్నాడు వాడు. పోటీల్లో తను నెగ్గలేననీ , విజయం వీర బుడతడినే వరిస్తున్నదనీ క్రూర బుడతడికి అర్ధం కాగానే వాడు ఓ బుడత మాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు.
    బుడత మాంత్రికుడు రాజధానీ నగరానికి సమీపరాణ్య మద్యంలో వుంటున్నాడు. ప్రజలేవరైనా తమంతట తాము ఆహ్వానిస్తే తప్ప నగరంలో అడుగు పెట్టలేడని వాడికి శాపం వుంది. వాడికి ఎన్నో కుతంత్రాలు , మాయలూ, మంత్ర విద్యలు వచ్చును. క్రూర బుడతడు తన దగ్గరకు రాగానే బుడత మాంత్రికుడికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. వాడు వెంటనే రాజధానీ నగరం వచ్చాడు. రాజకుమరినీ మాయోపాయంతో ఎత్తుకుని వచ్చి క్రూర బుడతడికి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. క్రూర బుడతడి ఇంట్లో మాయా ముగ్గు వేసి ఏవో మంత్రాలు చదివి రాజకుమారిని భవనం లోంచి మాయం చేసి ఆ ఇంటికి రప్పించాడు.
    రాజకుమారి ఎదుట పడగానే క్రూర బుడతడికి కల్గిన సంతోషం అంతా ఇంతా కాదు. వాడు వెంటనే బుడత మాంత్రికుడి కాళ్ళ మీద పడిపోయాడు. కానీ బుడత మాంత్రికుడు బుడత రాకుమారిని చూడగానే మోహంలో పడిపోయాడు.
    "ఒరేయ్ క్రూర బుడతా! ఈ రాజకుమారి మహా సౌందర్యవతి. ఈమె నాకోసం పుట్టింది. మీరెవరు కనుగొనలేని చోటికి తీసుకుని పోయి ఈమెను నేను వివాహం చేసుకుంటాను " అంటూ బుడత మాంత్రికుడు అక్కణ్ణించి రాజకుమారితో సహా మాయమై పోయాడు.

 Previous Page Next Page