Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 2

 

    మోహనుడి కెలాగూ గుమ్యం లేని ప్రయాణం కాబట్టి అతను భయంకరాకరుడితో పాటు బయల్దేరి ఓ కొండ గుహ చేరుకున్నాడు. భయంకరాకరుడి అక్కడ ఆగి , "తలుపు తెరవరా బుడతా !" అన్నాడు. వెంటనే గుహకు అడ్డంగా వున్న కొండరాయి పక్కకు తొలగి దారి ఇచ్చింది.
    లోపల మోహనుడూహించినట్లు గాక చాలా శుభ్రంగా ఉంది. ఆ గుహ లోపల మూడు గదులున్నాయి. భయంకరాకారుడి భార్య, కూతురున్నారక్కడ. అతడు వాళ్ళను మోహానుడికి పరిచయం చేసాడు. భయంకరాకారుడి కుమార్తె చంద్రిక తండ్రి వలె గాక ఎంతో సుకుమారంగా, అందంగా ఉంది. మోహనుడామెనూ చూసేక కళ్ళు తిప్పుకోలేక పోయాడు.
    మోహనుడి కక్కడ ఎంతో మంచి భోజనం లభించింది. ఆవురావురు మంటూ తిన్నాడతను. భోజనం చేయడమయ్యే వరకూ ఆ భయంకరాకారుడేవ్వరికి అతని కధ ఏమిటో తను తెలుసుకోలేదన్న విషయం మోహనుడికి తట్టలేదు.
    "ఇరవై ఏళ్ళ క్రితం నేనూ మనుష్యుల మధ్యనే ఉండేవాణ్ణి. నీతిగా, నియమంగా బ్రతికినందుకు నా మీద అక్రమ నేరం ఆపాదించి ఉరిశిక్ష విధించారా మనుషులు. అప్పుడు నేను కారాగారం నుంచి పారిపోయి భార్యతో సహా ఈ అరణ్యం చేరి ఈ గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. నేనిక్కడి కొచ్చిన రెండేళ్ళ కే చంద్రిక పుట్టింది. దీనికి తగిన వరుడి కోసం చూస్తుంటే నువ్వు కనపడి నీ కధ వినిపించావు. వెంటనే నిన్నిక్కడకు తీసుకొచ్చాను. మనుషులు నీకూ, నాకూ అన్యాయం చేసారు కాబట్టి మనిద్దరం ఇక్కడే ఉండిపోదాం. మనుష్యుల మధ్యకు వెళ్ళవద్దు " అంటూ భయంకరాకారుడు తన కధ చెప్పాడు. అతడి పేరు ప్రసన్నుడు. అతడి భార్య భానుమతి.
    "నాకు మనుషుల మీద పగలేదు. మనుషులు నాకు అన్యాయం చేసారని నేననుకోవడం లేదు " అన్నాడు మోహనుడు.
    ప్రసన్నుడు చిరాగ్గా మోహనుడి వంక చూసి "ఇంకా కుర్రతనం పోలేదు నీకు. ఈ రోజుకు ముందు విశ్రాంతి తీసుకో " అన్నాడు.
    ఒకరోజు కొండ గుహలో గడిపాక మోహనుడు కాస్త స్థిమిత పడ్డాడు. అతడికి ప్రసన్నుడి కొండ గుహ చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది. అది కొండ గుహే అయినా ఎంతో విశాలంగా ఉంది. లోపల గదులు ఎంతో అందంగా ఉన్నాయి. భాగ్యవంతుల ఇండ్ల లో తప్ప దొరకని సామాగ్రి అక్కడ ఉంది.
    షడ్రసోపేత రుచులతో బోజనాలు జరిగిపోతున్నాయి. ప్రసన్నుడు, భానుమతి, చంద్రిక కూడా అడవి నార బట్టలు కాక మేలు వస్త్రాలు ధరిస్తున్నారు. వారి దుస్తులు ఎప్పుడూ అప్పుడే ఉతికిన బట్టలా ధగధగలాడుతూ వుంటున్నాయి.
    ఇందులోని రహస్యమేమిటో మోహనుడికి తెలియలేదు గానీ గుహలోని ఓ గదికి తాళం వేసి వుంటోంది. అందులోకి మోహనుడిని వెళ్ళవద్దని హెచ్చరించాడు ప్రసన్నుడు.
    ప్రసన్నుడి కుమార్తె చంద్రికకు మోహనుడు నచ్చాడు. అడవికి వచ్చిన మనుషుల్ని ఆమె దూరాన్నుంచి చూడడమే గానీ ఇంత దగ్గర్లోంచి తండ్రి గాక మరో మనిషిని చూడడం ఆమెకిదే ప్రధమం. అందులోనూ మోహనుడు అందగాడు కూడా! ఐతే వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం ప్రసన్నుడివ్వడం లేదు.
    వారం రోజులు గడిచాక - "ఇక్కడ నేనెంత కాలం ఉండాలి ?" అనడిగాడు మోహనుడు ప్రసన్నుణ్ణి.
    "ఎంత కాల మేమిటి? నాతొ పాటే నువ్వునూ, నీకు నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను " అన్నాడు ప్రసన్నుడు.
    'అందుకు నాకభ్యంతరం లేదు. త్వరగా పెళ్ళి చేసేయ్ " అన్నాడు మోహనుడు.
    "మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళనని మాటిస్తేనే నీకు పెళ్ళి చేస్తాను " అన్నాడు ప్రసన్నుడు.
    "మాటిచ్చి తప్పనన్న నమ్మకమేమిటి ?" అన్నాడు మోహనుడు.
    "నువ్వు మాటిస్తే చాలు. తప్పకుండా నేను చూసుకుంటాను ' అన్నాడు ప్రసన్నుడు.
    మోహనుడు ఆలోచించకుండా 'సరే అయితే మాట ఇస్తున్నాను. నేను మళ్ళీ మనుష్యుల మధ్యకు వెళ్ళను " అన్నాడు.
    "విన్నావా బుడతా! మరి పెళ్ళి ఏర్పాట్లు చేసేయ్ అన్నాడు ప్రసన్నుడు.
    "ఎమిటంటున్నావ్ ?" అన్నాడు మోహనుడు ఆశ్చర్యంగా.
    "అది నీకర్ధం కాదులే. నా మాటల గురించి నువ్వు పట్టించుకోకు " అన్నాడు ప్రసన్నుడు.
    ప్రసన్నుడిలో ఏదో తమాషా ఉందని మోహనుడికి అనిపించింది.
    ఆ తర్వాత రెండు రోజులకు ప్రసన్నుడు మోహనుడితో - "నీ పెళ్ళి ఏర్పాట్లయి పోయాయి ." అన్నాడు.
    మోహనుడు ఆశ్చర్యంగా , "ఐతే నా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది ." అన్నాడు.
    "ఈ గుహలోనే!" అన్నాడు ప్రసన్నుడు. అతనా రోజు గుహలోని మూడవ గది తలుపు తాళం తీసాడు.
    మోహనుడు కుతూహలంగా గదిలోకి చూసాడు " అక్కడ ఒక అందమైన వివాహవేదిక ఉన్నది - వేదికపై పూల మాలలు న్నాయి. వేదికకు కాస్త పక్కగా ఓ పెద్ద మంచం ఉంది. దాని మీద అందంగా పక్క వేయబడి ఉంది. పక్క నిండా పూలు చల్లబడి ఉన్నాయి.
    ప్రసన్నుడు మోహనుడికి , చంద్రికకు కొత్త బట్టలిచ్చి కట్టుకోమన్నాడు. వివాహ వేదిక పైకి వెళ్ళి ఇద్దర్నీ దండలు మార్చుకోమన్నాడు. తరువాత తనూ, భార్య ఆ నూతన దంపతుల నాశీర్వదించి గదిలోంచి వెళ్ళిపోయారు.
    ఇన్నాళ్ళు మోహనుడికి చంద్రికతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వచ్చింది.
    "నేనంటే నీ కిష్టమేనా ?" అని అడిగాడామెను.
    "చాలా ఇష్టం !" అంది చంద్రిక .
    "అయితే నాతొ వచ్చేస్తావా ?" అని అడిగాడు మోహన్.
    "ఎక్కడికి ?' అంది చంద్రిక భయంగా.
    మనుష్యుల మధ్యకీ !"అన్నాడు మోహన్.
    "మనుషులంటే నాకు భయం !' అంది చంద్రిక.
    "మనుషులంటే భయమెందుకు ?" మీనాన్న మనిషి , మీ అమ్మ మనిషి , నేను మనిషిని - అన్నాడు మోహన్.
    "ఈగుహలో ఉన్నంత సేపు ఫరవాలేదుట. కాని గుహదాటితే మనిషి అంటే భయపడాలట-" అంది చంద్రిక.
    "మరి మీ నాన్న గుహ దాటి రోజూ వెళ్ళి మనుషుల్ని కొట్టి డబ్బు తెస్తున్నాడుగా!" అన్నాడు మోహన్.
    "నాన్న సంగతి వేరు "-- అంది చంద్రిక.
    "మీ నాన్న అన్నీ అబద్దాలే చెప్పాడు. మనుషులు చాలా మంచి వాళ్ళు. ఆసంగతి నాకు తెలుసు -- అన్నాడు మోహన్. ఆ రాత్రంతా అతనామెకు మనుషుల మధ్య జీవితం గురించి చెప్పాడు.
    మనిషి సంఘజీవి. సంఘం లేకపోతె మనిషి జీవితానికి సంతోష ముండదు. పులులు, సింహాలు లాంటి క్రూర మృగాలు మాత్రమే ఒంటరిగా జీవిస్తాయి. ఒంటరి జీవితం మనిషికి కానందాన్నివ్వదు.
    ఇలా అతను చంద్రికకు ఎన్నో నూరి పోశాడు. తెల్లారేసరికి చంద్రికకు మోహనుని మాటలు బాగా బుర్ర కెక్కాయి. తను అతడితో కలిసి మనుషుల మధ్యకు వెళ్ళాలని ఆమెకు అనిపించింది.
    "మీ నాన్నతో ఈ విషయం చెప్పు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ?" అన్నాడు మోహనుడు.
    మరునాడు చంద్రిక తండ్రికి తన కోరిక చెప్పింది. ప్రసన్నుడది వింటూనే మండిపడి - "ఇది నీకు పుట్టిన బుద్ది కాదు. నీభర్త నీకు చెప్పాడు. అవునా ?" అన్నాడు.
    చంద్రిక నిజం చెప్పింది.
    ప్రసన్నుడు మోహనున్ని పిలిచి , "నువ్వు చంద్రికతో కలసి ఇక్కన్నించి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు ?" అడిగాడు.
    ఇక్కడున్న నలుగురి లోనూ లోకం చూడని చంద్రిక ఒక్కతే! నా భార్య కీలోకం చూపించాలని నాకూను సరదాగా ఉంది" అన్నాడు మోహనుడు.
    'ఇక్కడ నీకు లోపే మొచ్చింది? మంచి భోజనం దొరుకుతుంది. మంచి బట్టలు కట్టుకుంటున్నావు. అందమైన భార్య ఉంది. మెత్తని పడక వుంది. మా ఆదరాభిమానాలున్నాయి --- "అన్నాడు ప్రసన్నుడు.
    "ఎన్నుంటే మాత్రం - ఓమూల కొండ గుహ లో ఎన్నాళ్ళని కూర్చొను ? నేను లోకంలో తిరగాలి నా భార్యకు ప్రపంచమంతా చూపించాలి - అన్నాడు మోహనుడు.
    "ఈ సరదా నాకు మాటిచ్చే ముందు లేదా అన్నాడు ప్రసన్నుడు.
    "మాట తప్పితే తప్పుతానన్నాను గదా !" అన్నాడు మోహనుడు.
    "విన్నావా బుడతా ! నాకిచ్చిన మాట తప్పుతాడట నా అల్లుడు !" అన్నాడు ప్రసన్నుడు.
    "ఏమిటి బుడతా, బుడతా అంటూ నాకు అర్ధం కాకుండా మాట్లాడతావు ? నన్నెవ్వరూ ఆపలేరు నేనూ, నా భార్య కలిసి ఈ గుహ దాటి వెళ్ళిపోతాం!" అన్నాడు. మోహనుడు చిరాగ్గా. అతడి మాటలు పూర్తీ కాకుండానే ఎవరో అతణ్ణి బలవంతంగా పట్టుకున్నట్లయింది. మోహనుడు చుట్టూ చూశాడు కంగారుగా కాని ఎవ్వరూ కనపడలేదు. అయితే అతడి కాళ్ళకు ఏదో మెత్తగా చుట్టుకున్నట్లు అనిపించింది. అంతలోనే చూస్తె ఏదో మెత్తటి తాడు అతడి కాలుకు చుట్టుకుని వుంది. అతనెంత విడదీసినా అది వదలలేదు.
    ప్రసన్నుడు నవ్వి --"ఈతాడు అవతలికోన - నీ గదిలో మంచానికి కట్టబడింది. ఈసారి ఎంత దూరమైనా నువ్వు హాయిగా తిరగ్గలవు. కాని గుహదాటి బయటకు పోలేవు. నువ్వీ గుహకు బందీవి -' అన్నాడు.
    కాసేపు గుహంతా తిరిగిన మీదట మోహనునికి ప్రసన్నుడి మాటలు నిజమేనని అర్ధమయింది. మెత్తటి తాటితో తను గుహలో బంధించబడ్డాడు. గుహలోంచి రాగాలగడంతన వల్ల కాదు. కానీ తననేవరు ఎప్పుడు ఎలా బందీని చేశారో అతనికి అర్ధం కాలేదు. ఎంత ప్రయత్నించినా కాపలా పడ్డ ఆ బంధం విడిపడ్డం లేదు.

 Previous Page Next Page