నరబలి ?
వసుంధర
మేష్టారు పేపర్ల కట్టతో క్లాసులో ప్రవేశించాడు. కుర్రాళ్ళంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ పేపర్ల పైన విద్యార్ధులకు ప్రత్యేకమైన ఆసక్తి వుంది. అంతవరకూ చాలా పేపర్లు ఇచ్చారు. ఇవి ఆఖరువి. వీటితో పాటు ప్రోగ్రెస్ రిపోర్టు తండ్రి చేత సంతకం చేయించి వెనక్కు తీసుకురావాలి విద్యార్ధులు.
ఆ ప్రోగ్రెస్ రిపోర్టు లో ప్రత్యేకమైన విశేష రాంకింగ్ అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధికి ఫస్టు ర్యాంకు. అతని నెంబరు ఒకటన్నమాట.
ఆ క్లాసులో మొత్తం యాభై యిద్దరున్నారు.
ఆ క్లాసులో చదువుతున్న రవికుమార్ కి ఎప్పుడు ఫస్టు ర్యాంకు రాలేదు. కానీ సాధారణంగా పన్నెండు కి ఇరవై కి మధ్య లో వుంటుందతని నెంబరు. అయితే అతనికో హాబి వుంది.
క్లాసులో విద్యార్ధు లందరి పేర్లు ఒక కాగితం మీద రాసుకుని వాళ్ళకి ఏయే సబ్జెక్టు లో యెన్నెన్ని మార్కులువచ్చాయో నోట్ చేసుకుని - మొత్తం కలిపి వాళ్ళకి రాంకు లిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ పేర్లన్నీ రాంకుల ప్రకారం వరుసగా రాస్తాడు. అతని ర్యాంకింగూ మేష్టారిచ్చిన రాంకింగూ సరిపోతుంది. సరిపోనప్పుడతనా విషయాన్ని మేష్టారి దృష్టికి తీసుకుని వస్తాడు. సాధారణంగా రవికుమార్ లెక్కల్లో తప్పుండదు.
మేష్టారు ఒక్కొక్కరి పేరూ, మార్కులూ చదివి ఇస్తుంటే రవికుమార్ అవన్నీ తన లిస్టులో నోట్ చేసుకుంటున్నాడు. ఇతని పిచ్చి తెలిసిన మేష్టారు అతని పేపరు ఆఖరున ఇచ్చాడు. రవికుమార్ కి ఆ లిస్టు తయారు చేయడంలో వున్న ఆనందం తనకు వచ్చిన మార్కులు తెలుసుకోవడం లో కూడా వుండదు.
ఈ పేపర్లో కృష్ణమూర్తి కి ఫస్టు మార్కు వచ్చింది. అతను ఆ ఊళ్ళో మునసబు గారికి కుడి భుజంగా పేరుపడ్డ చంద్రయ్య ఒక్కగానొక్క కొడుకు.
చంద్రయ్య కు రెండెకరాల మాగాణి వుంది. తన స్వంత పొలం తో పాటు మునసబు గారిదో పాతికేకరాలు సాగు చేస్తున్నాడతను. మనిషి కండలు తిరిగి బలిష్టంగా ఉంటాడు. చంద్రయ్యకు లేక లేక కలిగిన కొడుకు క్రుష్ణమూర్తి అంటే పంచ ప్రాణాలు. తన కొడుకు పెరిగి పెద్దవాడై అందరి కంటే గొప్పవాడు కావాలని అతని ఆశ. అతని ఆశకు తగ్గట్టే కృష్ణమూర్తికి చదువు మీద ఆసక్తి యెక్కువ.
ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే ఆతృతగా కృష్ణమూర్తి తన నంబరు కోసం వెతుక్కున్నాడు. అయిదవ నంబరు చూడగానే అతని ముఖం నిరుత్సాహంగా అయిపొయింది.గుసగుసల్లో అతనికి తెలిసిన విషయం మునసబు గారబ్బాయి మాణిక్యాలరావు మళ్ళీ ప్రధమ స్థానంలో నిలిచాడని.
మాణిక్యాలరావంటే కృష్ణమూర్తి కిష్టమే! కానీ తనూ క్లాసులో ఒక్కసారయినా ఫస్టు రావాలని అతని తాపత్రయం.
ఆ క్లాసులో మొదటి అయిదు స్థానాలకూ పోటీ పడే వాళ్ళు మొత్తం అయిదుగురే వున్నారు. అందులో మొదటి స్థానం విధిగా మునసబు గారబ్బాయి మాణిక్యాలరావు కే చెందుతుంది. మిగతా నాలుగు స్థానాలకూ పేర్లు మారుతూంటాయి. కరణంగారబ్బాయి మోహన్, బండి తోలే మునయ్య కొడుకు రమణారావు, గ్రామ పురోహితుల్లో అగ్ర గాణ్యుడయిన సోమయాజులు గారబ్బాయి చిన సోమయాజులు, చంద్రయ్య కొడుకు కృష్ణమూర్తి ఆయా స్థానాలకు పోటీ పడుతుంటారు. కృష్ణమూర్తి ఒక్కసారి మాత్రం రెండవ స్థానం లభించింది.
ఈ పాటీ వీరికి చదవ తరగతిలో ప్రారంభమయింది. ఇప్పుడు వీళ్ళందరూ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఇన్ని సంవత్సరాలలో జరిగిన ఇన్ని పరీక్షల్లోనూ మాణిక్యాలరావు స్థానం అచంచల మైతే ఒక్కసారి మినహాయించి అన్ని సమయాలల్లో నూ కృష్ణమూర్తి అయిదనువాడుగానే వుంటున్నాడు.
క్లాసులో తనకు ఫస్టు రావాలని ఉన్నదని తండ్రి కృష్ణమూర్తి ఎన్నో సార్లు చెప్పగా అతను -- "మునసబు గారిబ్బాయితో మనమెక్కడ పోటీ పడక కుండా వాళ్ళంతా పెట్టి పుట్టిన బాబులు. ఇంతమంది ఉన్న క్లాసులో నువ్వు అయిదో వాడుగా రావడం మాత్రం గోప్పకాదా--" అని నవ్వేస్తుండేవాడు.
అయితే కృష్ణమూర్తి అనుమానాలు లేదు. చంద్రయ్య తో పోలిస్తే ఒక్క మునెయ్య తప్ప మిగతా అందరికీ గ్రామంలో అంతో యింతో పేరుంది. వాళ్ళ స్థితి గతుల్ని బట్టి వాళ్ళకీ ఎక్కువ మార్కులు వేస్తున్నారనీ లేకపోతె తనే ఫస్టుగా రావలసిన వాడనీ కృష్ణమూర్తి అనుమానం. మునెయ్య మేస్టార్ల అందరికీ బండి వుచితంగా కడుతుంటాడు. ఆ విధంగా వాళ్ళ అభిమానం సంపాదించుకుని కొడుక్కు మంచి రాంకింగ్ సంపాదిస్తున్నాడని కృష్ణమూర్తి తల్లి దగ్గర తరచుగా ఆరోపిస్తుంటాడు. అదీకాక, చంద్రయ్య కు నెమ్మదితనమున్న నోటి మంచితనం లేదు. మేస్టార్ల కు చాలామందికి అతనంటే కిట్టదు.
'అందువల్ల కావాలని చెప్పి నాకు మార్కులు తక్కువేస్తున్నారు. మిగతా వాళ్ళు మరీ చచ్చురకం కాబట్టి గానీ లేకుంటే నన్నింకో ఏ పదో పదిహేడో స్థానంలో పడేసేవారు. మనూరి ప్రెసిడెంటు గారికి నా క్లాసులో చదుకునే కొడుకుండి ఉంటె అప్పుడు నేను ఆరో వాడ్నయుండే వాడ్ని క్లాసులో" అని తల్లి దగ్గర కృష్ణమూర్తి ఎన్నో సార్లు చెప్పాడు.
చంద్రయ్య ఆ మాటలు చిన్నప్పుడు "పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయక బుద్దిగా చదువుకో " అని కోపగించేవాడు.
2
చంద్రవంక పులుసు తీసుకువచ్చి వడ్డించి -- "సరిగ్గా కలుపుకోరా లేకపోతె పులుసు నేలంతా అవుతుంది." అంది.
మునయ్య జాగ్రత్తగా కలుపుకుని "కంచంలో అన్నం పెడితే ఈ బాధుండేది కాదు కదండీ" అన్నాడు.
'అదేకదురా బండి వాడికీ , మునసబు కీ తేడా --" అంది చంద్ర వంక.
"తేడా ఏముంది? నాకేం తక్కువ?" అన్నాడు మునెయ్య.
"నువ్వు బండి వాడివి. ఆయన మునసబు. అదే తేడా , "
"అంటే?"
"బండి వాడు మునసబు కాలేడు" అంది చంద్రవంక.
"గొప్ప సత్యం చెబుతున్నారు కానీ బండివాడు తర్వాతే మునసబున్న విషయం మీకు తెలియదు గనుకనా?" అన్నాడు మునెయ్య.
చంద్రవంక కంగారు పడి అటూ ఇటూ చూసి "ఏం మాటల్రా అని!" అంది.
"అవునండీ -- మీకు మోజైనప్పుడు నేను బండివాడనన్న విషయం గుర్తు లేదు. నన్నో రాజకుమారుడిలా దేవుడిలా చూశారు. ఆ చూపు కలకాలం వుంటే నేను కంచం లోనే భోం చేసి వుండేవాడ్ని ఈ యింట్లో --" అన్నాడు మునెయ్య.
చంద్రవంకకు జరిగినదంతా బాగా గుర్తుంది.
మునెయ్య తమ యింట్లో చనువుగా తిరుగుతుండేవాడు. ఏపని అయినా చలాకీగా చేయడం వల్ల అతనంటే ఇంట్లో అందరూ అభిమానంగా వుండేవారు.
చిన్నప్పట్నించీ అతని దగ్గర చంద్ర వంకకు బాగా చనువు. వయసొచ్చినా ఆ చనువు తగ్గలేదు. ఆ చనువును ఇంట్లో వాళ్ళు పెద్దగా అపార్ధం చేసుకోనూ లేదు.
చంద్రవంక కు వయసోచ్చేక మునెయ్య ఆమె ఒంటరిగా తటస్థ పడ్డప్పుడల్లా ఏవో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తుండేవాడు. సరదాకు కోపం నటించినా చంద్రవంకకు వాడి ప్రవర్తన సరదాగానూ, ఇష్టం గానూ వుండేది.
ఆమె ప్రసన్నతను అలుసుగా తీసుకుని మునెయ్య కాస్త ముందడుగు వేసి ఆమెను కౌగలించుకోవడమూ , ముద్దు పెట్టుకోవడమూ వగైరా లు చేస్తుంటాడు. ఆమె పెద్దగా అభ్యంతర పెట్టక పోవడంతో ఓ పర్యాయం వాడింకా ముందడుగు వెయ్యబోయాడు. అందుకు చంద్రవంక అంగీకరించలేదు.
"నేనంధంగా లేనా?" అన్నాడు మునెయ్య.
"నువ్వు చాలా అందంగా రాకుమారుడిలా వున్నావు. కానీ ఇది తప్పు."
"ఇష్టమైన ఆడా, మగా ఇలా కలుసుకోవడం తప్పు కాదు."
"పెళ్ళి చేసుకున్నాకయితే తప్పు కాదు."
"అయితే పెళ్ళి చేసుకుందాం."
"ఛ! నిన్నెలా పెళ్ళి చేసుకుంటాను? నీకు పెళ్ళయి పోయిందిగా ...."
"పెళ్ళయితేనేం - మా బాబు కిద్దరు పెళ్ళాలు, అలాగే నేనూ...."
"ఛీ....రెండో పెళ్ళాంగా ఉండడం నాకిష్టం లేదు " అంది చంద్రవంక.
"పోనీ - మీకోసం దాన్నోదిలేస్తాను ...."
"అది నాకిష్టం లేదు...." అని చటుక్కున అతన్ని విడిపించుకుని అక్కడ్నించి వెళ్లిపోయిందామె. ఆ తర్వాత నుంచి ఆమె మునేయ్యను తప్పించుకుని తిరుగుతూ వచ్చింది.