మెయిన్ హాల్లో ఒక పక్కన రిసెప్షనిస్టు-
ఛైర్మన్ గదిలో- సుమదేవ్, ఆయన కెదురుగా మధుకర్ కూర్చొన్నారు.
"చూడు మధుకర్... ఏ కంపెనీకైనా డిసిప్లెన్ ముఖ్యం... ఇవాల్టి నుంచి ఈ యాడ్ ఏజెన్సీకి ఎమ్.డి.వి. నువ్వు... నీ రెస్పాన్స్ బులిటీస్ ఏమిటో నీకు తెలుసు... నీ వర్క్ లో నేనెప్పుడూ ఇంటర్ ఫియర్ కాను. నీమీద పూర్తి నమ్మకంతో ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాను... ఒన్ ఇయర్ టైమ్ ఇస్తున్నాను... ఫస్టు నుంచి నేను రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ ని."
సూటిగా ఆయన ముఖంలోకే చూస్తున్నాడు మధుకర్.
"ఈ సందర్భంగా నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను- మాన్యుఫాక్చరర్ కి, కష్టమర్ కి మధ్య మనుషులం మనం- ఉత్పత్తిదారుడిని సంతృప్తి పరచడం, వినియోగదారుడ్ని ఎట్రాక్టు చెయ్యడం... ఈ రెండో దానిమీదే మన లైఫ్ ఆధారపడి వుంది... ఎంత ఎఫెక్టివ్ గా మనం ఎట్రాక్టు చెయ్యగలం... అన్నదానిమీద మన బిజినెస్ ఆధారపడి వుంది...
ముప్ఫై ఏళ్ళ వెనక్కి ఒక్కసారి వెళ్ళి చూడు.
అప్పుడూ ఉత్పత్తిదారులున్నారు - అప్పుడూ వినియోగదారులున్నారు- కానీ ప్రకటనల సంఖ్య తక్కువగా వుండేది. ఎందువల్ల? అప్పుడు ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగా వుండేది. ప్రొడక్ట్సు మధ్య కాంపిటేషన్ తక్కువగా వుండేది. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. వంద రకాల టూత్ పేస్టులు, వంద రకాల సోప్స్, వంద రకాల జోళ్ళు, వంద రకాల బట్టలు, ఎన్నో, ఎన్నెన్నో...
కాంపిటేషన్, కాంపిటేషన్...
ప్రొడక్టు మీద అయిదుకోట్లు పెడుతున్న మాన్యుఫ్యాక్చరర్స్, ఎడ్వర్టెజ్ మెంట్ల మీద దాదాపు రెండు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. దేని కోసం? కస్టమర్ ని ఎట్రాక్టు చెయ్యడం కోసం.
అందుకే మాన్యుఫాక్చరర్ కి, కష్టమర్ కీ మధ్య వారధిలాంటి మనం అతి తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యాపారాన్ని చెయ్యాలంటే, ఆ ఇద్దర్నీ ఏకకాలంలో సంతృప్తి పరచాలంటే, ప్రతిక్షణం టైమ్ సెన్స్ ని గుర్తించుకోవాలి- టైమ్ వేల్యూకి వేల్యూ ఇవ్వాలి-
"నీలో అద్భుతమైన స్పార్క్ వుంది. ఆ స్పార్క్ ని వృధా చెయ్యకు."
చెప్పడం ఆపాడు సుమదేవ్.
"ఆర్యూ ఫీలింగ్ బోర్..." పక్కనున్న గ్లాసులో నీళ్ళను తాగుతూ అడిగాడు.
"నో... సర్ ప్లీజ్ కంటిన్యూ..." ఒకప్పుడు తండ్రి కూడా అలాగే చెప్పాడు. కానీ ఆ రోజు తండ్రి మాటల్ని పట్టించుకోలేదు. ఆ తప్పు మళ్ళీ చేయదల్చుకోలేదు మధుకర్.
"మిస్టర్ మధూ... యాడ్ వరల్డ్ ఈజ్ ఏ ఫన్నీ వరల్డ్... సైమల్టేనియస్లీ... సీరియస్ వరల్డ్... దిసీజ్ ఒన్ టైప్ ఆఫ్ బ్రైన్ గేమ్- జస్టులైక్- చెస్-
రోడ్డుమీద ఏ సినిమా వాల్ పోస్టర్నయినా చూడు... మొట్టమొదట కనిపించేది నేడే చూడండి... అని, ఆ వర్డ్ ని ఎవరు కాయిన్ చేసారంటావ్! ఎంత పవర్ఫుల్ ప్రైజ్ అది... ఎన్ని దశాబ్దాలుగా దానిని సినిమా ఎడ్వర్టే జ్ మెంట్లలో వుపయోగిస్తున్నారు... ఇప్పటికీ అంతకంటే గొప్ప కాయినేజ్ వచ్చిందా?
యాడ్ కి లైఫ్ కాప్షన్.... అందుకే యాడ్ మీడియాలో కాపీ రైటర్ కి చాలా వాల్యూ వుంటుంది. నువ్వు మొన్న రాసావ్- యూ నీడ్ నాట్ బీ రిచ్... టు లుక్ రిచ్... అందుకే ఆ కాప్షన్ చూడగానే... కాప్షన్ ద్వారా కోట్ల వ్యాపారం చెయ్యచ్చనిపించింది...
1980లో అనుకుంటా.... ఒక యాడ్ చేసాను.
ఒక పెద్ద విమానం గాల్లో ఎగురుతోంది- బాక్ డ్రాప్ లో నీలాకాశం. అంతే!
కానీ దాని కాప్షన్ చూడు.
THE WINGS of MAN.
ఆ పీరియడ్ ఆ కాప్షన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసా? అదొక కాప్షన్ లా వుందా? లేదు. మానవ ప్రపంచ పురోగతిని నేపధ్యంగా తీసుకుని ఆ కాపీ రైటర్ కాయిన్ చేసాడది.
ఇంకో కాప్షన్ చూడు.
GOD CREATED WOMAN- BUT THE DEVIL CREATED MARILYN MANRO.
మార్లిన్ మన్రో, ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ సౌందర్యరాశి.
మొన్నటికి మొన్న, ఆవిడ వేసుకున్న చెప్పుల్ని వేలం వేసారు. ఎంతకో తెలుసా? ఒక మిలియన్ డాలర్ల కి.
అప్పట్లో సినిమా మాగజైన్ లలో ఆవిడ గురించి వర్ణిస్తూ ఈ సెంటెన్స్ ని కాయిన్ చేసాడు. ఇందులో ఎంత ఎటర్నిటీ వుందో చూడు. మన తెలుగులో నటరత్న, నటసామ్రాట్, నటభూషణ, నటకిరీటి ఇలాంటివన్నీ వాటి ఇన్ ఫ్లుయన్స్ వల్ల వచ్చినవే కానీ-
మనవాళ్ళకు ఈస్తటిక్ సెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి బిరుదులే ఇస్తున్నారు. చాతనైతే ఇంతకంటే మంచివే ఇవ్వవచ్చు.
HIS MASTERS VOICE- H.M.V. గ్రామ్ ఫోన్ రికార్డులో గ్రామఫోన్ ని ఒక కుక్క ఆసక్తిగా వింటుంటుంది. దానికి మనవాళ్ళు హిందీ సింగర్ సైగల్ తో ముడిపెట్టి ఏవో కధలు చెప్తుంటారు. యాక్చువల్ గా అదంతా ట్రాష్-
ఆ గ్రామ్ ఫోన్- కుక్క లోగోని ఈ శతాబ్దంలో ప్రపంచంలో అత్యుత్తమ ట్రేడ్ మార్క్స్ క్రింద గుర్తించారు - దాని వెనకున్న కథేమిటో తెల్సా-
1899లో ఫ్రాన్సిస్ బారోడ్ అనే ఒక పెయింటర్ తనకు కావల్సిన ఒక వస్తువును కొనడానికి ఒక గ్రామ్ ఫోన్ కంపెనీకెళ్ళాడు. ఆ వస్తువును తీసుకొన్నాక దానికి బదులుగా ఫ్రాన్సిస్ ఒక పెయింటింగ్ వేసి ఆ కంపెనీకిచ్చాడు. ఆ పెయింటింగ్ లో నున్న చమత్కారానికి ముగ్ధులైపోయిన ఆ కంపెనీ యాజమాన్యం, దానిని తమ కంపెనీ ట్రేడ్ మార్క్ గా చేసుకున్నారు.
మొట్టమొదటిసారిగా 1901లో విక్టర్ టాకింగ్ మెసీన్ కంపెనీ గ్రామ్ ఫోన్ కుక్కని తమ ఎంబ్లమ్ గా చేసుకుంది. దానికి అప్పుడు వాళ్ళు పెట్టిన కాప్షన్ ఏమిటో తెలుసా?
LOUD ENOUGH FOR DANCING - తర్వాత ఆ మోనోగ్రామ్ రైట్స్ ని చాలా దేశాల్లో చాలా కంపెనీలు కొనుక్కున్నాయి.
మనం వ్యక్తం చేసిన భావానికి, మన కస్టమర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోవాలి- అప్పుడే అతను మనచేతిలోకి వచ్చేసినట్టు లెక్క.
YOU PRESS THE BUTTON- WE DO THE REST-
1890లో అంటే, దాదాపు వందేళ్ళ క్రితం అమెరికాలో కోడక్ కెమేరా కంపెనీ ఇచ్చిన యాడ్ కాప్షన్ ఇది- ఎంత ఈస్తటిక్ సెన్స్ వుందో చూడు-
మనకు బాగా తెల్సిన లక్స్ సోప్ చూడు- నా చర్య సౌందర్యానికి అసలైన రహస్యం... అంటూ మన సిన్మా తారల యాడ్స్ చూస్తుంటాం మనం... 1927లో లక్స్ సబ్బు మొదట అమెరికాలో పుట్టింది.
అప్పట్లో దాని యాడ్ ఎలా వచ్చిందో తెలుసా?
nine out of ten screen stars use lux toilet soap for their priceless smooth skins.
లక్స్ ప్రారంభంలో ఇరవై ఏళ్ళపాటు ప్రఖ్యాత హాలీవుడ్ తారలు ఫేరే, మేరీ ఆస్టర్, లౌజీ బ్రూక్స్, మిర్నా లోయ్, బేబే డానియల్స్, క్లారా బౌ, జాన్ క్రా ఫోర్డ్ లతో యాడ్ కాంపైన్ నడిచింది. మన ఇండియాలో కూడా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ భారతీయ భాషల్లో పేరుపొందిన ప్రతీ హీరోయిన్ ని తమ యాడ్ కు లక్స్ కంపెనీ వుపయోగించుకుంది.
ఇటీవల దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన యాడ్ ఏమిటో తెలుసా? పూజాబేడీ నటించిన కామసూత్ర- అది అశ్లీలంగా వుందని పార్లమెంటులో కూడా దుమారం చెలరేగింది. కానీ ఈ యాడ్ కు ఇన్ స్పిరేషన్ ఏమిటో తెలుసా... 1973లో వచ్చిన స్మిర్నోఫ్ అన్ ఓడ్కా యాడ్. పైభాగంలో ఆచ్ఛాదన లేని ఓ అమ్మాయి వీపు మాత్రమే మనకు కన్పిస్తుంటుంది. అబ్బాయి గుండెల మీద చెయ్యి వేసి నించుంటుంది. అది అప్పటిలో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసా?