అతను ఓ అడుగు వెనక్కివేసి "క్షమించాలి! ఇందాక అబద్ధం చెప్పాను.. నేను పెళ్లి చేసుకున్నాను" అన్నాడు.
ఆమె కళ్లు ఓ చిత్రమైన భావంతో మెరిశాయి. హాయిగా నిట్టూర్చింది.
"మరి నేను వెళ్లొస్తాను" అన్నాడు చక్రపాణి.
ఆమె కొంచెం ముందుకు వచ్చి "ఓ కోరికవుంది అడిగేదా?" అంది ముద్దుగా.
"తప్పకుండా!"
"మిమ్మల్ని అన్నయ్యా అని పిలవాలని వుంది."
చక్రపాణి రోడ్డుమీద ఎవరన్నా చూస్తారన్న ఆలోచనయినా లేకుండా ఆమె చేతిని పుచ్చుకుని నొక్కి "ఆ పిలుపుకోసమే ఇంతకాలం వేచివున్నా!" అన్నాడు.
మాలతి జాలిగా ప్రేమగా "అన్నయ్యా... మరి?" అంది. కళ్లు ఆర్ధ్రమైనాయి.
"కన్నీటిబిందువా నీ కంట్లో? చెప్పు?"
"మీ... మీ శ్రీమతిని...?"
చక్రపాణి గట్టిగా నవ్వి "ఎప్పుడో ఓసారి మీ ఇంటికి వస్తాం ఇద్దరం కలిసి. చూస్తూవుండు... మరి సెలవు. నమస్కారం!" అన్నాడు.
"ఛీ! చెల్లికి నమస్కారం పెడతారా ఎవరైనా?" అని మందలిస్తూ మాలతి చేతులు జోడించింది.
అతను మెల్లగా నవ్వి, మేనల్లుడి చెయ్యి పట్టుకుని ఇంటికి దారితీశాడు.
20
ఆ తర్వాత పదిహేను రోజులు గడిచాకనుకుంటాను, చక్రపాణి పూర్ణానందం పేటలోని ఓ చిన్న పెంకుటింటిముందు నిలిచి "ముకుందం! ముకుందం!" అని గట్టిగా పిలిచాడు ఓ సాయంత్రం.
తలుపుతీసుకుని ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఇతన్ని చూసీచూడగానే ఒక గెంతు గెంతి, అమాంతం కావలించుకుని "నువ్వా పాణీ? ఎన్నాళ్లకు చూశాను?" అన్నాడు ఉక్కిరిబిక్కిరవుతూ.
"ముకుందం! అబ్బ! ఎంత బాగుంది ఇప్పుడు నాకు!"
అతను పాణిని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకుపోయాడు. ముందు గదిలో చాప పరచివుంది. దానిమీద కూర్చోబెట్టి "బీదవాణ్ణి... అంతకంటే..."
"నాకంటే నువ్వే భాగ్యశాలివి. ఆ మాటకేంగానీ చివరకు నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. ఈ మధ్య నువ్వు ఎక్కడినుంచో ఇక్కడకు ట్రాన్స్ ఫరై వచ్చావని తెలిసింది. వచ్చి నన్ను కలిశావు కాదేం?" అనడిగాడు పాణి.
ముకుందం "ఎంతా, పదిరోజులైంది వచ్చి! మొదటి అయిదారు రోజులూ ఇల్లు చూసుకోవడంలోనే సరిపోయింది. రేపో మాపో వచ్చి కలుద్దామనుకుంటున్నాను. పని ఒత్తిడికూడా ఎక్కువ. ఈ వేళ ఇంట్లో వుండటం ఆశ్చర్యమేననుకో!" అన్నాడు.
ముకుందంలో అప్పటికీ ఇప్పటికీ మార్పు వచ్చింది. ముఖంలో ఇదివరకటి స్దబ్ధత పోయి చురుకుతనం, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మనిషి, ఇల్లు, పరిసరాలు అన్నీ పేదరికాన్నే చాటుతున్నాయి. అయినా ప్రశాంతతా, తృప్తీ గోచరిస్తున్నాయి.
అతను పాణిని ప్రశ్నలతో ముంచెత్తాడు. చదువు ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నావు? తల్లీ తండ్రీ బాగున్నారా? పెళ్లయిందా? పిల్లలెందరు? ఏం చేస్తున్నావు?
చక్రపాణి అన్నింటికీ సమాధానాలు చెప్పసాగాడు. గత జీవితాన్నిగురించి అతనేమైనా ఎత్తుతాడేమోనని భయంగా వుంది. ముకుందం అలాంటి చాదస్తపు పనులేం చేయలేదుగానీ ఆఖరుకు "బ్రహ్మానందం ఏం చేస్తున్నాడు?" అని అడిగాడు.
నిజానికి బ్రహ్మానందాన్ని గురించి యిక్కడ కొంత చెప్పాల్సివుంది. అతను పెళ్లిచేసుకున్నాడు. చాలాకాలంక్రితమే. ఆ పెళ్లాం చచ్చిపోతే మరోపెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళాం లేచిపోతే ఒకామెను ఉంచుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతనిలో మార్పేమీ లేదు. దిగులూ, పశ్చాత్తాపం అతని మనసును స్పృశించలేకపోయాయి. బిజినెస్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ అనుకోకుండా చక్రపాణికి తటస్థపడుతూ వుండేవాడు. నవ్వుతూ, ఉత్సాహంగా కనబడేవాడు. అతను జీవితాంతం అలా వున్నా ఆశ్చర్యంలేదు.
పాణి అదంతా చెప్పకుండా "కులాసాగానే వున్నాడు. బిజినెస్ చేస్తున్నాడు" అన్నాడు.
ఇంతలో లోపలినుండి ఇద్దరు బయటకు వచ్చారు. "నాన్నా" అంటూ. ఇద్దరూ మగపిల్లలే! ఒళ్లో ఒకడూ, వీపుమీద ఒకడూ పడి తొక్కసాగారు. "మా అబ్బాయిలు" అన్నాడు ముకుందం గర్వంగా.
చక్రపాణి వదనంమీద ఆనందపూరితమైన రేఖ ఒకటి పొడసూపింది. అతని పెదవులమధ్యనుండి చిరునవ్వు వెలువడింది.
"మా ఆవిడను చూస్తావా?" అన్నాడు ముకుందం. అంటూనే లోపలకు పోయాడు. ఓ స్త్రీ కంఠం "నాకు భయం బాబూ!" అనటం అస్పష్టంగా బయటకు వినవచ్చింది. ఓ నిముషం గడిచాక వినయ విధేయతలు ముఖంలో ఉట్టిపడుతున్న ఓ స్త్రీ మూర్తిని తీసుకుని అతను గదిలోకి వచ్చాడు.
చక్రపాణి లేచి నిల్చున్నాడు.
ఆమె తడబడుతున్న చేతులతో నమస్కారం పెట్టింది.
చక్రపాణి ప్రతినమస్కారం చేసి "ముకుందం ఒట్టి బద్దకస్తుడు. మీ కుటుంబమంతా వచ్చి మా గృహం పావనం చెయ్యాలి" అన్నాడు.
ఆమె సిగ్గుపడి నవ్వుతూ తలవంచుకుంది.
"మీరు సరేనంటేకానీ నాకు నమ్మకంలేదండీ! ముకుందం మాటల్లో నాకు విశ్వాసం లేదు. నాలుగేళ్లక్రితం మాయమైనవాడు ఇవాల్టివరకూ పత్తా లేడు. సోదరుడి ప్రార్థన మన్నించాలి..."
ఆమె పులకితురాలై "అలాగేనండీ!" అన్నది మృదుకంఠంతో.
ముకుందం ఆమెతో "త్వరగా కాఫీ పంపించు" అన్నాడు.
"వద్దు బ్రదర్! చీకటికూడా పడుతోందిప్పుడే!"
కానీ ఓ పదినిముషాల్లో కాఫీ రానేవచ్చింది. స్నేహితులిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. ముకుందం తన ఉద్యోగం విషయం, సంసారం, జీవితం - ఇవన్నీ చెప్పుకొచ్చాడు. "ఎన్నో కష్టాలు పడినమీదట దొరికిందీ ఉద్యోగం. బ్రతకడానికి సరిపోతుంది. తృప్తి పడుతున్నాను."