Previous Page
గోరింటాకు పేజి 64


    చక్రపాణి కనులు ఆనందంతో చమర్చాయి. పరిస్థితులకు లొంగిపోకుండా నిలిచిన జీవి. ఆత్మవంచన లేదు, కల్తీలేదు, భ్రాంతి లేదు. ఒక వర్గానికి ఉదాహరణ ముకుందం. ఈ ఇల్లు, ఈ భార్య, ఈ పిల్లలు... ఏదో బోధిస్తున్నారు. జీవితసత్యాన్ని ఆలాపన చేస్తున్నాడు. నిష్కపటమైన తెల్లని వెలుగు వారి జీవితం. చివరకు తను కోరుకుంది ఓ సామాన్యునిలో వుంది. విచిత్ర మనస్తత్వాలకు లొంగనిది, లభించనిది అతనికి.... ఓ సామాన్యునికి లభించింది.

 

    నిట్టూర్చాడు చక్రపాణి. అతనికి అర్థమైంది.

 

    రాజారావు లేఖతో ఓ మాలిన్యపు తెర తొలగిపోయింది. మాలతితోటి సమావేశంతో మరో తెర, ఇహ ఈ పాత స్నేహితుడి కలయికతో చివరి తెర తొలగిపోయాయి. అతను సంతృప్తుడయ్యాడు.  

 

    చివరకు సెలవు తీసుకుని వీధిలోకి వచ్చాడు, ముకుందం దగ్గర కుటుంబంతో సహా తమ ఇంటికి వస్తామని మాట తీసుకుని. బాగా చీకటి పడింది. చలిగాలి మెల్లగా వీచసాగింది. బజారంతా దీపాలతో, మనుషులతో కోలాహలంగా వుంది. ఎందుకో మరి... చక్రపాణి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

 

    అతను ఇంటికి పోయేసరికి భార్య మేడమీద కిటికీదగ్గర నిలబడి వీధిలోకి చూస్తుంది. తల త్రిప్పి "అబ్బ! ఎక్కడకు పోయారు ఇంతసేపు?" అంది.

 

    గదిలో దీపం ప్రకాశంగా వెలుగుతుంది. చక్రపాణి ఆమె దగ్గరకువస్తూ "ఓ పాట స్నేహితుడు కనిపించాడు" అన్నాడు.  

 

    ఆమె అతనికి ఎదురుగా నిలబడి ముఖం ఎత్తి "మరో స్నేహితుడు కనిపించబోతున్నాడు" అంది.

 

    "ఎవరు?" అన్నాడు చక్రపాణి ఆత్రుతగా.

 

    "మీ రాజా! ఇదిగో టెలిగ్రాం" అంటూ ఆమె డ్రాయర్ దగ్గరకు వెళ్లి సొరుగులో వున్న కాయితం తీసి యిచ్చింది. చదువుకుని ఒక్కనిముషం నోరు మెదల్చలేకపోయాడు.

 

    "భోజనాలకు లేవండి... తరువాత తీరిగ్గా ఆలోచిద్దురుగానీ విచిత్రాలను గురించి" అన్నదామె బయటకు వెడుతూ.

 

    "నువ్వు మాత్రం విచిత్రంకాదా?" అన్నాడు చక్రపాణి తగ్గుస్వరంతో.

 

    ఆమె గుమ్మందగ్గర ఆగి తల త్రిప్పి "కానీ మధు పాణీ కావడమే..."

 

    "ఇప్పుడా? నాలుగేళ్లప్పటిమాట!"

 

    "అదే కానీ మీలో నాకు నమ్మకంలేదు బాబూ!"

 

    "ఆ అల్లరి వేషాలే!" అంటూ అతను చప్పున వచ్చి ఆమె పారిపోబోతుంటే చెయ్యిపట్టుకుని ఆపాడు.

 

    "నా చెయ్యి వదలండి... గోరింటాకు పెట్టుకున్నాను."

 

    "ఏదీ చూడనియ్యి..... అబ్బా! ఎంత బాగా పండిందో?"

 

    "భయం వేయట్లేదా అబ్బాయిగారికి?"

 

    "అవన్నీ నువ్వు నాదానవైనప్పుడే పోయాయి."

 

    ఆమె లజ్జితురాలై తలవంచుకుంది. అతడామె చుబుకాన్ని పట్టుకుని పైకెత్తుతూ "అమ్మాయిగారూ!" అన్నాడు.

 

    "ఊఁ" అందామె ముగ్ధగా చూస్తూ.

 

    "నేను అర్ధం చేసుకున్నాను."

 

    "ఎవర్ని?"

 

    "నన్ను!"

 

    "ఇన్నాళ్ల'కా?' అన్నదామె ముసిముసిగా నవ్వి.

 

    "చివరి అణువువరకూ."

 

    "వదలండి.."

 

    అతనామె చెయ్యి వదిలి "పద, చాలా ఆకలిగా వుంది" అన్నాడు.

 

    ఆమె డిన్నర్ టేబుల్ మీద కంచాలుపెడుతూ ఏదో ఆలోచిస్తుంది. లోపలి గదిలో అత్తగారి, మామగారి మాటలు లీలగా వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ఓ కన్నీటిబిందువు ఆమె కుడికంటినుండి జారిపడింది "ఛా!" అని నవ్వుకుని కంచం మార్చడానికి లోపలకు పోయింది.    

 

    ముగింపుకు వచ్చింది కాబట్టి సంఘటనలన్నీ ఒక్కసారిగా విరుచుకుపడినట్లు రాసేస్తున్నాడు అని మీరు అంటారు. సంఘటనలలా విరుచుకుపడబట్టే ముగింపుకు వచ్చింది. లేకపోతే రాజారావు అప్పుడే వైర్ ఇవ్వాలా? కొన్నాళ్లాగ కూడదూ? కానీ అలా జరిగింది. రాయక మాననా?   

 

    మరునాడు తెల్లవారుఝామునే నిద్రలేచి, డ్రెస్ చేసుకుని, భార్యను తీసుకుని కారులో స్టేషన్ కు వెళ్లాడు చక్రపాణి.

 

    ట్రెయిన్ ఓ పావుగంట లేటుగా వచ్చింది.

 

    చక్రపాణి గుండె వేగంగా కొట్టుకుంది. వచ్చేస్తున్నాడు రాజారావు.

 

    అవును... వచ్చేశాడు రాజారావు. నిరుడు ఎమ్.ఏ.,ఎల్.ఎల్.బి. పాసయి రాజారావు ప్రస్తుతం బర్మాషెల్ లో అయిదొందలు సంపాదిస్తున్న రాజారావు.

 

    అమాంతం క్రిందకు దూకి స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. "అబ్బ! ఎన్నాళ్ళయిందిరా పాణీ! ఎన్నాళ్ళయిందిరా?" అన్నాడు.

 

    "రాజారావ్!" అన్నాడు పాణి తన్మయంగా.

 

    రాజారావు ఒంటరిగా రాలేదు... ఓ అపూర్వ సుందరమైన వస్తువును వెంటబెట్టుకువచ్చాడు. ఆ వస్తువు రాజారావు ప్రక్కన నిలుచుంటే అమిరినట్లుగా వుంటుంది. ఇంగ్లీషు, బెంగాలీ ధారాళంగా మాట్లాడుతుంది. తెలుగు కొంచెంగా ముద్దుముద్దుగా మాట్లాడుతుంది.

 

    "జీవితంలో నేనుగా వెతుక్కున్న వ్యక్తి, కష్టపడి సాధించిన రత్నం, నాలుగేళ్లలో నేను సాధించిన ఘనకార్యం!" అన్నాడు ఆమెను పరిచయం చేస్తూ రాజారావు.

 

    చక్రపాణీ, అతని భార్యా ఆ బంగారు బొమ్మవైపు మైమరచి తదేకంగా తిలకించారు.    

 

    ఆ బెంగాలీ యువతి అందంగా, అమాయకంగా నమస్కారం పెట్టింది.

 

    ఇహ నా కథ విను... "ఇదిగో రాలుగాయి, గడుగ్గాయి, అల్లరిపిల్ల. ప్రేమించినప్పుడు బంగారుపాపా అనికూడా పిలుస్తుంటానులే! నిజనామం ప్రభావతీదేవి."    

 

    ప్రభావతి కోపంగా మోచేత్తో అతన్ని పొడిచి - చేతులు జోడించి నమస్కారం చేసింది.

 

    అంతా స్టేషన్ దాటి బయటకు వచ్చారు.

 

    రాజారావు కారు ఎక్కబోతుండగా దూరంగాపోతున్న ఓ జంటను చూసి "ఆ యువకుడు గిరి కదూ?" అన్నాడు.

 

    చక్రపాణి చూసి "అవును. అతని ప్రేమగాథ తెలుసుకదా? ఆమధ్య అనేక అఘాతాలు ఏర్పడ్డాయి. ఎమ్.ఏ. పాసై గీతనే పెళ్లిచేసుకున్నాడు. ఇక్కడ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు" అన్నాడు.   

 

    అంతా కారెక్కారు.

 

    ప్రపంచం నిరాశావాదానికి స్వస్తి చెప్పినట్లుంది. రోడ్లు బాగుచేయిస్తుండటం వలన పాత దారి మూసి కొత్తగా ఓ దోవ ఏర్పరిచారు. కారు కొత్త బాటవెంట హాయిగా పరిగెత్తసాగింది.    

 

                                        *సమాప్తం*

 Previous Page