పాణి కష్టంమీద వణికే గొంతుతో "మీరు ఇక్కడికి మీ పాపాయిని చేర్పిద్దామని వచ్చారా?" అన్నాడు.
మాలతి మధురంగా నవ్వి "ఉహుఁ నేను ఇక్కడ టీచర్ గా చేస్తున్నాను" అంది.
చక్రపాణి శరీరం గగుర్పొడచసాగింది. ఇన్నాళ్లయాక ఇప్పుడు కూడా ఆమెతో నిర్భయంగా మాట్లాడటం చేతకావడంలేదు.
"మీరో? మీ అబ్బాయిని చేర్పించేందుకు వచ్చారా?" అన్నది మాలతి నవ్వుతూ.
"వీడు నా మేనల్లుడు!"
ఆమె నాలుక కొరుక్కుని సిగ్గుపడుతూ "మరి మీకు.....?"
"పెళ్ళా?" అని చక్రపాణి బిగ్గరగా నవ్వి "కాలేదు" అన్నాడు.
"ఏం?" అని అడిగింది మాలతి కుతూహలంగా.
"ఏం చేసేది చెప్పండి? చాలాకాలం క్రితం ఓ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుదామని వెళ్లాను. కానీ నా నోరు చెప్పినట్లు వినలేదు. ఆమె కోపగించి వెళ్లిపోయి ఎవర్నో పెళ్లి చేసుకుంది. అప్పటినుండీ అలాంటి అమ్మాయి ఎవరన్నా కనబడుతుందా? ఈసారన్నా చెప్పగలుగుతానా అని ఎదురుచూస్తున్నాను....."
మాలతి లజ్జితురాలై ఓ ప్రక్కకు ఒదిగి నిలబడింది. అటునుండి పోతున్న ఓ టీచర్ వాళ్లిద్దరివంకా ఓసారి ఓరగా చూసి వెళ్లిపోయింది.
"అదీగాక నాకెవరూ ప్రేమభిక్ష పెడతారన్న నమ్మకంకూడా లేదు."
"మిమ్మల్నెవరు ప్రేమించరు?" అన్నది మాలతి తల ఎత్తి మెల్లగా.
ఈసారి సిగ్గుపడే వంతు చక్రపాణిది. మాటమార్చుదామని "మీవారేం చేస్తున్నారు?" అనడిగాడు.
"ఈ ఊళ్ళోనే ఓ బుల్లి ఆఫీసరుగారు."
"పిల్లలు...?"
ఆమె తలవంచుకుని బొటనవ్రేలితో నేలరాస్తూ "ఇద్దరు. పెద్ద పాపాయి ఇక్కడే చదువుతోంది" అని తల ఎత్తి "అదిగో చూడండి... ఆ గదిలో కూర్చుని పుస్తకంమీద ఏదో రాసిపారేస్తోందే అదే!" అంది చేత్తో చూపిస్తూ.
"అచ్చం మీ పోలికే కానీ రంగు మాత్రం.... మీ శ్రీవారు చాలా తెలుపనుకుంటా?"
ఆమె సిగ్గుతో మందహాసం చేసి ఊరుకుంది.
చక్రపాణి ఆమెకేసి చూస్తూ స్ధబ్దుడైనాడు. అప్పటికీ ఇప్పటికీ వయసులో తేడా ఏమీ కనబడటంలేదు. మరింత శోభాయమానంగా వుంది. ఆహ్లాదకరంగా వుంది ఈ దృశ్యం. కానీ తనేమిటి ఇలా మాట్లాడుతున్నాననుకున్నాడు. నాలిక కరుచుకున్నాడు.
"క్లాసు టైమయింది. హెడ్ మిస్ట్రెస్ గారు లేరు. ఇప్పుడే వస్తారు గదిలో కూర్చోండి" అంటూ ఆమె అక్కడినుండి వెళ్లిపోయింది.
అతను మేనల్లుడితో గదిలోకిపోయి కూర్చున్నాడు. పిల్లవాడు మామయ్యను కదుపుతూ ఏవో ప్రశ్నలు వేయసాగాడు. వాటన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతూ చక్రపాణి అవతలిగదివైపు అవలోకిస్తున్నాడు శ్రద్ధగా.
మాలతి నిలబడి పిల్లలకు ఏదో పాట నేర్పిస్తోంది. ఆమె పాడిన పాటను బాలబాలికలంతా ముక్తకంఠంతో తిరిగి పాడుతున్నారు. 'అలా కాదు.. ఇలా' అని చెబుతూ మళ్లీ పాడి చూపిస్తోంది. మొదట పాణికి ఆమె చూడలేదు. ఎందుకో ఓసారి తల ఎత్తి చూసి సిగ్గుపడి, నవ్వుకుని చూపులు ప్రక్కకు మరల్చుకుని పాడసాగింది.
ఓ పావుగంటయినాక టీచరు ఎవరో వస్తే, చక్రపాణి ఆమెను "ఎప్పుడొస్తారు హెడ్ మిస్ట్రెస్ గారు ?" అని అడిగాడు.
"ఎందుచేతో యింకా రాలేదండీ. ఒకవేళ ఇప్పుడు రారేమో! పోనీ మధ్యాహ్నం..."
"ఫర్వాలేదు... ఆవిడ వచ్చేంతవరకూ కూర్చుంటానులెండి!"
అతని మనసంతా సంపుల్లమానంగా వుంది. మధ్య మధ్య మాలతి అతన్ని ఓరగా చూస్తుంది అక్కడినుండి. ఇలా మరో అరగంట గడిచింది.
తర్వాత హెడ్ మిస్ట్రెస్ వచ్చింది. ఆమెతో మాట్లాడి, అన్నీ అడిగి తెలుసుకుని, ఎంట్రెన్స్ పరీక్ష ఉందంటే పిల్లవాడిని మరునాడు తిరిగి పంపిస్తానని చెప్పి బయటకు వచ్చాడు.
మాలతి గేటుదగ్గరకు వచ్చింది వెనుకనుండి.
"వెళుతున్నాను" అన్నాడు చక్రపాణి.
"క్షమించండి" అంది మాలతి.
"భలేవారే! ఎందుకు?"
"ఎందుకో సరిగ్గా తెలియదు. ఏమీ సరిగా వ్యక్తం చేయలేను కూడా.." ఆమె గొంతు వణికింది.
చక్రపాణి రెండడుగులు వేసి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఓచేత్తో గేటు పట్టుకుని "ప్రపంచంలో అందరికన్నా మిమ్మల్ని చూస్తే గౌరవంనాకు" అన్నాడు.
ఆమె మౌనంగా ఊరుకుంది.
"మీ ఇంటికి వచ్చి మీ శ్రీవారితో స్నేహం చేసుకోవాలన్న కోరిక వుంది కానీ ఇప్పుడు కాదు... మీరు చాలా కులాసాగా జీవిస్తున్నారు అవునా?"
ఆమె తల ఊపింది.
"మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటానో లేదో అని తెగ భయపడ్డాను. ఇవాళ ఓ మహత్తరమైన రోజుగా స్మరించుకుంటాను. మీకు తెలియని కారణాలు చాలా వున్నాయి. చెప్పడం కష్టం" అన్నాడు.
మాలతి విస్మయంగా చూస్తోంది.
"ఒకప్పుడు మీతో మాట్లాడటానికి భయపడిపోయాను"
"ఇందాకకూడా మొదట మిమ్మల్ని పలకరించినప్పుడు నాకంఠం రవ్వంత గద్గదమైంది. కానీ ఇప్పుడు అవన్నీ నశించాయి. చాలా నిశ్చలంగా.. ఉజ్వలంగా వుంది నా మనసు..."
మాలతి క్రింది పెదవిని పంటితో నొక్కుతూ విశాల విస్ఫారిత నేత్రాలతో చూస్తోంది.
"కొంత... ఎంతలేండి రవంత... అయినా మసకమసగ్గా మాలిన్యం వుండేది నాలో. ఈ క్షణంనుండి అదికూడా నశించింది. ఇప్పుడు నా ఉద్దేశం ఏం చెప్పను? ఇవన్నీ మీకు చెప్పకూడదులెండి. కానీ మనిషిని కదూ? జీవితం మీద మీ ప్రభావం చాలా వుందిలెండి. మీకు నా కృతజ్ఞతాభివందనాలు అర్పించకుండా వుండలేను."