Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 41

                                 


                      

    పువ్వుల గుత్తులన్ జిదుమబోకుము! ఏ జవరాలి మోవి చి
    ర్నవ్వుల గుత్తులో యవి పురాభవమందున; పిల్చుచుండె దౌ
    దవ్వుల నున్నవారి తమదాపునకున్ జిగురాకువ్రేళ్ళతో;
    దువ్వుము! బుజ్జగింపుము! వధూమణి! ఈ మధురార్ద్రమూర్తులన్.

    మాసము లెల్ల మాకు మధుమాసములై, సెలయేరు లెల్ల ద్రా
    క్షాసవమై, ప్రసూన కళికల్ మధుపాత్రములై, తటిల్లతా
    హాసము హార్దికానుభవమై, బ్రతుకే ఒక పానశాలయై
    భాసిలుచుండె వెచ్చని ప్రపంచము పచ్చని పూలతోటయై!

                 

    కరమున పానపాత్ర; బిగికౌగిట చారుచకోరనేత్ర; అం
    బరమున చంద్రరేఖ; ఇటుప్రక్కన పూలతోట; అ
    ద్దరి సెలయేరు; ముందర సుధామధుకావ్యము; కందళించు సుం
    దర సుషమా సుఖంకర దినంబులు మాకు క్షణంబులై చనున్!!

    కందని స్వర్గసుందరివి కన్నుల ముందు వెలుంగుచుండ నా
    కందని స్వర్గలోకమునకై బ్రతుకంతయు నేడ్వనేల? ఆ
    నంద రసాధిదేవతవు నా యెదపై మెదలన్, వృథాశ్రమం
    బందనేల నందనమునందలి ఊర్వశికై ఘృతాచికై.

    చచ్చినవా డొకండయిన స్వర్గరహస్య మిదంచు వచ్చి వా
    క్రుచ్చినవాడు లేడు మనకున్; తెరలో పరలోకమేమొ ఈ
    వచ్చినవారిలోన కనివచ్చినవాడును లేడు; చేతి కం
    దిచ్చిన స్వర్గమున్ విడుతునే కనిపింపని దేనికోసమో!

    ముద్దులు మూటగట్టు నగుమోముల బంగరుబొమ్మ లెందరో
    నిద్దుర బోయి రీ కటికనేల కొటారులలోన; వారి వౌ
    నిద్దపు నీలిముంగురులు నెచ్చెలి! పచ్చని శాద్వలాలలో
    యొద్దిక దిద్దుచున్ కదలుచున్నవి చల్లని పిల్లగాలికిన్.
    
    త్రాడుల నూడదీయగనె తల్లుల పాలకు దౌడు దీయు లే
    దూడలభంగి చెంగుమని దూకు నవే సెలయేళ్ళు; గట్లపై
    గూడిన లేళ్ళు తోయములు గ్రోలక నిల్చి, తదంబుశీకర
    క్రీడల గాంచుచున్నయవి కించిదుదంచిత కంధరమ్ములై.

    సిగ్గులు చిందిపోవు నునుజెక్కులపై చిరునవ్వు ముత్తెపున్
    మ్రుగ్గులు పెట్ట క్రొంజివురుమోవి రవంత కదల్చి నీవు నన్
    బిగ్గ కవుంగిలించి మురిపించుచు మైమరపించు వేళలన్
    గగ్గురుపాటు పుట్టినదిగా! వనవాటికి మాటిమాటికిన్.

    తరుణీ! అంతట నిండియుండు జగదంతర్యామి; ఆ స్వామి యీ
    గిరులందున్, దరులందు, నీ చివురు చెక్కిళ్ళందు, నీ నీలిముం
    గురులం, దీ మధుపాత్రమం దెపుడు నాకున్ దోచు; ఆ తండ్రిదే
    పరమానుగ్రహమంచు ద్రాక్షరసమున్ భావించి సేవించెదన్.

    నే నొకవేళ, ముందు మరణించితినేని - నిరంతరాంతర
    ధ్యాన నిమగ్నభుగ్నమతివై విలపింపకు; నీదు మానసో
    ద్యానము నందు మందమలయానిల వీచులలో చలించుచున్
    నేనొక పూలమొక్కనయి నిల్చెద! గుండెలు క్రుమ్మరించెదన్.

                      

    నీ వొకవేళ, ముందు మరణింతువయేని - మధుప్రపూర్ణమౌ
    దేవుని తోటలో పడుచుతీవలు దిద్దిన పూలబాటలో
    కోవెల ప్రక్కగా వకుళ కుంజము చాటున వేచియుండు; మిం
    దీవరపత్రనేత్ర! అరుదెంతును నేనును రేపుమాపులో.

 Previous Page Next Page