'ఆడపిల్లలు కలవాడు కాబట్టి - ఆడపిల్లల తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసు. ఈనాడు మన్నిబ్బంది పెట్టలేదంటే - ఆ పుణ్యం ఆయన్ను తప్పక కాస్తుంది--" అంది పార్వతమ్మ.
విరజ అంది --" ఒకసారి మాత్రం నేను చాలా భయపడ్డాను. మంచినీళ్ళు వడ్డిస్తుంటే గ్లాసు బాగోలేదన్నారని మన చుట్టాలబ్బాయి కోపం వచ్చి గ్లాసు గిరవాటేశాడు. అయినా అవతాలయన కిక్కురు మనలేదు. మరొకళ్ళయితే చాలా పెద్ద మాలపిల్లి కావలసిందే ----"
"ఏం చేస్తాం - మనకు సంబందించినంతవరకూ వినయంగానే ఉన్నాం- అందర్నీ అలాగే ఉండమంటే వినరు కదా....." అన్నాడు మోహనరావు.
"ఏదేమైనా - అప్పుడు నేను సర్ది చెప్పానులే . వాడి తరపున క్షమార్పణం కూడా అడిగాను ---' అన్నాడు రాజారావు.
'ఆ అవసరం నాకూ పట్టింది ...." అన్నాడు మోహనరావు. "ఇందాక భోజనాల్లో పొరపాటున ప్రొద్దుట మిగిలిన కూర వడ్డించేశారు. ఒకాయన తాడి ప్రమాణాన లేచాడు. నిజానికి జరిగింది పొరపాటున అయిన - అప్పటికే ఆ కూరను నోటబెట్టిన ఒకాయన రుచిని కూడా మెచ్చుకున్నాడు. ఏదేమైనా ఆ పరిస్థితుల్లో మరేమార్గం లేదు- క్షమార్పణ అడిగేశాను...."
వెంకట్రామయ్య ఆప్యాయంగా పిల్లల వంక చూశాడు ---'అంతా మిమ్మల్ని పొగిడేవాళ్ళే ----వంట బ్రాహ్మలు , పురోహితులు-- అందరూ మిమ్మల్ని మెచ్చుకునే వారే! అడిగిన వస్తువు క్షణాల మీద సప్లయి చేసే వాళ్ళను చూడ్డం ఇదే ప్రధమం అంటున్నారందరూ ఏకగ్రీవంగా. మన బంధు వర్గమంతా సరేసరి ---ఆశ్చర్యంలో ఎవరికీ నోట మాట రాలేదు....అందరికీ మనమెవరమో, ఎక్కడున్నామో తెలిసింది. మీరు నిజంగా అసాధ్యులురా....." అన్నాడు.
తండ్రి పొగడ్తలు కొడుకు లిద్దరికీ కళ్ళ నీళ్ళు తెప్పించాయి.
"నేనూ విన్నాను - వీళ్ళకి దిష్టి తగుల్తుందని బెంగగా కూడా ఉంది----" అంది పార్వతమ్మ.
"కానీ మేము మీ మనసుని చాలాసార్లు కష్టపెట్టాం------" అన్నాడు రాజారావు.
"వెర్రి నాయనలారా -----అదే సంసార జీవితమంటే ....." అన్నాడు వెంకట్రామయ్య.
తెల్లవారితే శనివారం .....
* * * *
తెల్లవారింది.
పెళ్ళివారు ముందుగా రాజమండ్రి వెడతారు. అక్కణ్ణించి రెండుగంటల ప్రాంతాల ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ వెళ్ళి పోతారు.
ఇప్పుడు వెళ్ళిపోయే పెళ్ళి వారిలో లక్ష్మీ కూడా ఉంది.
వాళ్ళక్కడ ప్రయాణ సన్నాహాల్లో ఉంటే లక్ష్మీ ఏడుస్తోంది. కంటికీ మింటికీ ధారగా ఏడుస్తోంది. అయితే అక్కడ లక్ష్మీని ఊరుకోబెట్టే వాళ్ళెవ్వరూ లేరు. విరజ, ఏడుస్తోంది. వసుంధర ఏడుస్తోంది. లక్ష్మీ తల్లి పార్వతమ్మ ఏడుస్తోంది. తండ్రి వెంకట్రామయ్య ఏడుస్తున్నాడు. ఆ వాతావరణాన్ని చూడలేక రాజారావు మరో గదిలోకి వెళ్ళిపోయాడు. అయితే అతనికిక్కడ వేరే పని ఏమీ లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడతను.
లక్ష్మీ అయిదుగురు చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. శ్రీకాంత్ ఏడుస్తున్నాడు. వెంకట్రామణ ఏడుస్తున్నాడు. నీలవేణి ఏడుస్తోంది. ఇంకా కొందరు బంధువులు ఏడుస్తున్నారు.
నిన్నటి దాకా ఉత్సాహం ఉరకలు వేసిన ఆ ఇంట్లో హటాత్తుగా శోకదేవత తాండవిస్తోంది.
అయితే మోహనరావు ఏడ్వడం లేదు. నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు- "ఒకటి కాదు - రెండు కాదు.....పదిహేను వేలకు పైగా ఖర్చు పెట్టి పెళ్ళి చేశాం - ఏడవడానీకా ......' అన్నాడతను.
అతనింకా మాట్లాడేవాడే. కానీ తనకూ ఏడుపు వస్తోందని గ్రహించేడతను. అందుకే మరి మాట్లాకుండా ఏడుపు దిగమింగుతున్నాడతను .
ఇంట్లో మనిషేమిటి -- ఆ ఇంట్లో ప్రత్యణువూ విలపిస్తోంది. రెండేళ్ళ వయస్సునించీ కూడా లక్ష్మీ ఆ ఇల్లు వదలకుండా మసిలింది. ఆ ఇల్లు దొడ్లో చెట్లు. పుట్టలు ......అన్నీ ఆమెకు పరిచయం.
బాబూరావు రాజారావు భుజం మీద చేయి వేసి -----" ఏమిటిది బావగారూ -----" అన్నాడు --"మీ చెల్లాయిప్పుడేక్కడికి వెడుతోందనుకుంటున్నారు - మనింటికే...."
రాజారావు తమాయించుకుని కళ్ళు తుడుచుకున్నాడు.
మోక్షార్దియై - ప్రజలనూ, సాంఘిక జీవనాన్ని వదిలిపెట్టి వెళ్ళి పోయిన కణ్వామహామునికే శకుంతలను అత్తింటికి పంపడానికి మనసు పీకింది. కళ్ళ నీళ్ళోచ్చాయి. సంసార బంధాలకతీతులు కాని సామాన్య మానవులెంత?
పెళ్ళి వారితో పాటు లక్ష్మీని కూడా తీసుకుని బయల్దేరింది బస్సు. వెళ్ళేముందు వెంకట్రామయ్యతో అన్నాడు భీమరాజు ----" ఇంత కాలం లక్ష్మీ మీ అమ్మాయి, ఇక మీదట మా అమ్మాయి. మీరేమీ బెంగ పెట్టుకోకండి...."
* * * *
లక్ష్మీ వెళ్ళిపోయేక నెమ్మదిగా మళ్ళీ ఒక్కొక్కరే తేరుకున్నారు.
"ఇన్ని రోజుల ఈ ప్రయత్నాలూ ఇన్ని ఏళ్ళ ఈ కోరికా, ఇంత హడావుడి - ఒక మనిషి నింట్లోంచి పంపెయడానికా - ఇందుకా మనం శ్రమపడింది ?" అన్నాడు రాజారావు బాధగా.
"నా కన్నయ్యాలు లేరు. కానీ తండ్రి ఉన్నాడు. తమ్ముళ్ళున్నారు. నా పెళ్లైనప్పుడు వాళ్ళూ అలాగే అనుకున్నారు....' అంది వసుంధర.
"పుట్టింటికి దగ్గరలో ఉండి కూడా - అత్తింట్లో పెళ్ళి హడావుడి కారణంగా - ఇంతవరకూ మా వాళ్ళను చూడ్డానికి వెళ్ళలేదు ...." అంది విరజ.
"జీవితమే అంత--" అనుకున్నాడు రాజారావు. కానీ నిజాని కిందులో తను బాధపదవలసినది లేదు.
చదువు పేరు చెప్పి - పదో ఏటి నుంచే తండ్రికి దూరంగా ఉంటున్నాడు తను. తర్వాత దూర ప్రాంతాల ఉద్యోగం. ఇప్పుడు లక్ష్మీ విషయమూ అంతే. ఆమె తనకు లానే అప్పుడప్పుడీ ఊరు వస్తుంటుంది. ఏమిటో పెళ్లై వెళ్ళిపోతోందంటే అలా బాధ వస్తుంటుంది. అప్పగింతల రోజున తన అత్తమామలు కూడా రోదించారు. కానీ ఇప్పుడలవాటు పడిపోయారు.