Previous Page
పెళ్ళి చేసి చూడు పేజి 30


    మిగిలిన బాధ్యతలన్నీ గుర్తుచేసుకున్నారు. విరజ, మోహనరావు . వంట బ్రాహ్మణులు మధ్యాహ్నం మటుక్కు వంట చేసి వెళ్ళిపోయారు. ఇంక యింట్లో మిగిలిన జనమాట్టే లేరు. చాలామంది వెళ్ళిపోయారు.
    విరజ, మోహనరావు - రెండు గంటలకు మగపెళ్ళి వారితో పాటు ట్రయిన్ అందుకోవాల్సుంది.
    అరువు తెచ్చిన పాత్ర సామాగ్రి అంతా చేరవేసి లిస్టు ప్రకారం వేర్వేరుగా ఏర్పాటు చేసి - అప్పటికప్పుడు ఎవరివి వారికి పంపించి వేశారు.
    కూలీలకు, పనిమనుషులకు - ఇవ్వవలసిన డబ్బు లిచ్చేశారు. విడిదిల్లు కడిగించి అప్పజేప్పేశారు. మంగలి, చాకలి, కుమ్మరి వగైరాలకు పెళ్ళి బహుమతులిచ్చారు. ఎంతో కష్టపడి చేసిన ఏర్పాట్లు ముగింపు మాత్రం అతి శీఘ్రంగా జరిగిపోయింది.
    హడావుడిగా భోజనాలు చేసి అంతా కలిసి రాజమండ్రి బయల్దేరారు. వసుంధర- బాబులకు తోడుగా ఉండడానికెవ్వరూ అంగీకరించలేదు. లక్ష్మీకి వీడ్కోలు చెప్పడానికందరూ కుతూహలపడుతున్నారు. తనకూ లక్ష్మీ నింకోసారి చూడాలనున్న కారణంగా తనూ బయల్దేరింది వసుంధర.
    
                                   *    *    *    *

    రెండు గంటల ప్రాంతంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ చాలా హడావుడిగా ఉంది.
    పార్వతమ్మ, విరజ', వసుంధర - లక్ష్మీ కేవేమో చెబుతున్నారు. లక్ష్మీ చెమర్చిన కళ్ళతో ఊకొడుతోంది. బాబురావు లక్ష్మీ వైపే చూస్తున్నాడు. అతని దృష్టిలో ఇప్పుడు లక్ష్మీ మాత్రమే ఉంది.
    ట్రయిన్ వచ్చింది. భీమరాజు గారు , రాము కండక్టర్ దగ్గరకు పరిగెత్తారు. రెండు నిముషాల్లో అందరి సీటు నంబరు వగైరాలు తెలిశాయి. ఒక్కొక్కరే ట్రయినెక్కేస్తున్నారు.
    లక్ష్మీ ట్రయిన్ లోంచి చేయి వూపుతుంటే రాజారావుకు మళ్ళీ ఏడుపు వచ్చింది.
    "తిరిగి వచ్చేటప్పుడు మేము మామగారింటి కెళ్ళి ఓ రెండు రోజులుండి - అప్పుడు మనూరోస్తోం. బహుశా జూన్ ఒకటి రెండు తారీఖులకు తిరిగొస్తాం ' అన్నాడు మోహనరావు.
    ట్రయిన్ కదిలింది.
    ఒక తండ్రి గుండెల మీది కుంపటిని - భర్త రంగుల కలలను -- ఒక కొత్త సంసార జీవితాన్ని మోసుకుంటూ బరువుగా వేగంగా ట్రయిన్ కదిలింది.
    వెంకట్రామయ్య కళ్ళు తుడుచుకున్నాడు. పార్వతమ్మ వెక్కిళ్ళు అపుకుంటోంది.
    "మళ్ళీసారి నేనింటి కొచ్చినప్పుడు లక్ష్మీ ఇంటి దగ్గరుండదు " అనుకున్న రాజారావు ఎదురుగా వసుంధర కనిపించింది. 'అవును నా ఇల్లు వసుంధరతో ఉన్నప్పుడు ... నేను వేరే ఇంటికి వెళ్లడమేమిటి ?' అనుకున్నాడతను.
    
                                    *    *    *    *
    
    "మీరెంత సేపు పడుకున్నారో తెలుసా?" అంది వసుంధర.
    "తెలియదు" అన్నాడు రాజారావు. తెలుసా అన్నదామె ఊతపదం. తెలియదని అతననడం ఆదామెకు గుర్తు చేసే ఉద్దేశ్యంతోనే.
    "నిన్న రాత్రి భోజనం చేయకుండా ఏడున్నరకు నిద్ర పోయారు. ఇది మరుసటి దినం. సమయం ఉదయం తొమ్మిదీ నలబై." అంది వసుంధర. "అనగా 27 వ తేదీ రాత్రి ఏడున్నర నించి 28 తేదీ ఉదయం తొమ్మిదీ నలబై వరకూ...."
    "స్టాప్" అన్నాడు రాజారావు అప్పుడే అక్కడ అడుగు పెట్టిన బాబుని చూసి.
    "విన్నన్లేరా ------మరీ కుంభకర్ణుడివై పోయావ్ ...." అన్నాడు బాబు.
    "కుంభకర్ణుడి రహస్యం నాకు తెలిసి పోయిందిరా------బాగా డబ్బున్నవాడు కదా. సర్వ బాధ్యతలూ తీసుకుని ఘనంగా చెల్లెలి పెళ్ళి చేసి ఉంటాడు. పెళ్ళి కాగానే నిద్ర ....మళ్ళీ లేచాక మరో చెల్లెలి పెళ్ళి...."
    "కుంభకర్ణుడి కెంత మంది చెల్లెళ్ళున్నారో నాకు తెలియదు కానీ మీకు మాత్రం ఇంకా అయిదుగురున్నారు.....అంది వసుంధర.
    "ఓస్ అంతే కదా -----జీవితంలో ఇలాంటి నిద్ర పట్టడం కోసం ఎంతమంది చెల్లెళ్ళ పెళ్ళయినా చేసేస్తాను...." అన్నాడు రాజారావు.
    "అయితే మీ కధకు ఫలశ్రుతి ఇదన్న మాట --చక్కని నిద్ర కావాలనుకునే వారు చెల్లెలి పెళ్ళి చేయాలి...." అంది వసుంధర . బాబు, రాజారావు కూడా నవ్వారు.
    'అలాగే ------మరి చక్కని నిద్రకు విరుగుడు కూడా నేను చెప్పనా?" అంది వసుంధర మళ్ళీ.
    "ఊ " అన్నాడు రాజారావు కుతూహలంగా. వసుంధర ఒక చిన్న కాగితం అతనికి ఇచ్చింది. దాని మీద పెళ్ళి ఖర్చుకు సంబంధించిన అకౌంటు ఉంది. అది రాజారావు, మోహనరావు అన్న హెడ్డింగు లతో రెండు భాగాలుగా విడదీయబడింది. రాజారావు భాగంలో చిట్ట చివర ------నీలవేణికి ఆప్పు ఆరువేలు ---అని వ్రాసి వుంది.
    "చదవడమయిందా, ఇప్పుడు మీకు చెబుతున్నాను- జాగ్రత్తగా వినండి. మీకింకా అయిదుగురు చెల్లెళ్ళున్నారు..... వినడమయిందా.....పడితే ఇంక హాయిగా నిద్ర పొండి ....' అంది వసుంధర.
    రాజారావు నిద్ర ఏమయిందో తెలియదు కానీ "పెళ్ళి చేసి చూడు" అనే శీర్షికతో వ్రాయబడుతున్న ఈ రచన మాత్రం ఆ మాటలు దగ్గరే సరిగ్గా ఆగిపోయింది.

                                              ***

 Previous Page